ఆనంద సాగరంలో ఆమినా..! | Amina in the sea of joy ..! | Sakshi
Sakshi News home page

ఆనంద సాగరంలో ఆమినా..!

Published Sat, Jan 16 2016 10:34 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

Amina in the sea of joy ..!

అంత పసితనంలోనే అంతటి న్యాయదృష్టిని చూపుతున్న చిన్నారి ముహమ్మద్ పెద్దవాడయ్యాక ఇంకెంతటి న్యాయశీలతను ప్రదర్శిస్తాడోనని హలీమా దంపతులు ఎంతో మురిపెంగా చెప్పుకునేవారు.
 
హలీమా కాస్త భయంగా, ఆశ్చర్యంగా వారివైపు చూసింది. కాని ఏమీ సమాధానం చెప్పలేదు.ఆమెనుండి సమాధానం రాకపోయినా, ఆ చిన్నారి ఎవరో వారు పసిగట్టి, తమలో తాము గుసగుసలాడుకున్నారు. ‘మన గ్రంథాల్లో ప్రస్తావించబడిన ఆదరణకర్త నిస్సందేహంగా ఇతనే. ఏదో ఒకటి చేసి మనం ఈ పిల్లాడిని తీసుకువెళితే బావుంటుంది’ అనుకుంటున్నారు వాళ్లు.వాళ్ల గుసగుసలు చూసి హలీమా మనసు కీడు శంకించింది. ‘వీళ్ల వాలకం చూస్తే పిల్లాడిని ఎత్తుకెళ్లినా ఎత్తుకెళ్తారు’ అనుకుంటూ, ఊపిరి బిగబట్టి చిన్నగా అక్కడి నుండి జారుకుంది.

‘ఇక లాభంలేదు. ఎలాగూ రెండేళ్లు గడిచాయి. బాబు పాలుతాగడం కూడా మానాడు. వెంటనే బిడ్డను తల్లికి అప్పగించాలి’ అనుకొంది.
 కాని, రెండేళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారిని ఇంత తొందరగా వదులుకోవడానికి మనసు అంగీకరించంలేదు. కాని తప్పదు. బిడ్డ క్షేమంగా ఉండాలంటే గుండెను రాయి చేసుకోవాల్సిందే. అనుకొని మరునాడే మక్కాకు బయలుదేరింది హలీమా, చిన్నారి ముహమ్మద్‌ను వెంటబెట్టుకొని. సుదీర్ఘ ఎడబాటు తరువాత తన ఆశల పంటను చూసుకున్న ఆమినా ఆనందం అవధులు దాటింది. మమతానురాగాలతో కళ్లు నిండుకుండలయ్యాయి. కలలన్నీ ఒక్కసారిగా కళ్లముందు కదలాడసాగాయి. అటు తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ విషయం ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సంతోష సాగరంలో తేలియాడుతున్నారాయన. ‘ఈ రోజు కొడుకు అబ్దుల్లాహ్ ఉంటే, బిడ్డను చూసుకొని ఎంతగా మురిసిపోయేవాడో! కాని, విధిరాతను ఎవరు మార్చగలరు?’ అని మనసుకు సర్దిచెప్పుకున్నారు.
 
అయితే చిన్నారి ముహమ్మద్ మక్కా వచ్చిన కొన్నాళ్లకే పట్నంలో ఏదో అంటువ్యాధి ప్రబలింది. చూస్తూ చూస్తూనే జనం మృత్యువాత పడుతున్నారు. మృత్యుదూత ఎప్పుడు ఎవరింటి తలుపు తడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పట్నం వెలుపల కొత్త కొత్త సమాధులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి చూసి ఆమినా నిలువెల్లా వణికిపొయ్యారు. తన బిడ్డ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం క్షేమకరం కాదని భావించి, వెంటనే ఆయా హలీమాను పిలిపించి, మళ్లీ ఆమె వెంట పంపించి వేశారు. చిన్నారి ముహమ్మద్‌కు హలీమా తమ ఇంట్లోని మేకపాలు అలవాటు చేసింది. విచిత్రం ఏమిటంటే, చిన్నారి ముహమ్మద్ ఒక్క స్తన్యాన్ని మాత్రమే నోట్లో పెట్టుకొని పాలు తాగేవాడు కాని, రెండో దాని జోలికి పోయేవాడు కాదు. అంటే ఆ పాలు తన సోదరి షీమా కోసం ఉంచేవాడన్నమాట. అంత పసితనంలోనే అంతటి న్యాయదృష్టిని చూపుతున్న చిన్నారి ముహమ్మద్ పెద్దవాడయ్యాక ఇంకెంతటి న్యాయశీలతను ప్రదర్శిస్తాడోనని హలీమా దంపతులు ఎంతో మురిపెంగా చెప్పుకునేవారు. ‘ఆమినా ముద్దుల బిడ్డ పెద్దయ్యాక ఈ ప్రపంచాన్ని నీతి, న్యాయం, ధర్మం, సమానతలతో కచ్చితంగా నింపేస్తాడు. అందుకే ఆయమ్మ ఆమినా కూడా, ‘ఈ పసిబిడ్డ ముందుముందు మహోజ్వల చరిత్ర సృష్టిస్తాడని ధీమాగా చెప్పింది. ఆ మాతృమూర్తి కలలన్నీ ఒక్కొక్కటి నిజమవుతున్నాయి’ అన్నది హలీమా భర్తతో.
 - యం.డి. ఉస్మాన్‌ఖాన్
 (వచ్చేవారం మరికొన్ని విశేషాలు)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement