సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్ సైరస్ పూనావాలా పేరిట నెలకొల్పనుంది. ఈ మేరకు సీరమ్ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటించింది. ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో సమాచారం, వనరులు, సాయం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
ప్రజారోగ్యంపై చైతన్యం, అంటువ్యాధుల వ్యాప్తిపై స్పందించేలా దీన్ని తీర్చిదిద్దనుంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా స్థాపించిన ఐదు సంస్థలలో ఇదొకటి. గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సీవోఈ ఏర్పాటుపై చర్చించారు.
ఆదివారం వర్చువల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి సీవోఈ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ రాజధానిగా పరిగణించబడే హైదరాబాద్ నగరానికి అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీవోఈని నెలకొల్పుతుండటాన్ని ఆయన స్వాగతించారు. ఐఐపీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల నివారణ, మహమ్మారి ముప్పులను అంచనా వేయడానికి, నివారించడానికి, తగ్గించడానికి సీవోఈ సహాయపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం. నాగప్పన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment