Infectious disease
-
హైదరాబాద్: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్ సైరస్ పూనావాలా పేరిట నెలకొల్పనుంది. ఈ మేరకు సీరమ్ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటించింది. ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో సమాచారం, వనరులు, సాయం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రజారోగ్యంపై చైతన్యం, అంటువ్యాధుల వ్యాప్తిపై స్పందించేలా దీన్ని తీర్చిదిద్దనుంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా స్థాపించిన ఐదు సంస్థలలో ఇదొకటి. గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సీవోఈ ఏర్పాటుపై చర్చించారు. ఆదివారం వర్చువల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి సీవోఈ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ రాజధానిగా పరిగణించబడే హైదరాబాద్ నగరానికి అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీవోఈని నెలకొల్పుతుండటాన్ని ఆయన స్వాగతించారు. ఐఐపీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల నివారణ, మహమ్మారి ముప్పులను అంచనా వేయడానికి, నివారించడానికి, తగ్గించడానికి సీవోఈ సహాయపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం. నాగప్పన్ పాల్గొన్నారు. -
కోవిడ్, మంకీపాక్స్‌కు తేడా ఏంటి? ఏది ఎక్కువ డేంజర్?
కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో పెనుముప్పు ఎదురవుతోంది. ఈ వ్యాధి ఇప్పటికే 70దేశాలకు పైగా వ్యాపించింది. 16 వేలకుపైగా కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా దీన్ని హెల్త్ ఎమెర్జెన్సీగా ప్రకటించింది. భారత్‌లోనూ ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో కోవిడ్, మంకీపాక్స్ రెండు వైరస్‌లకు ఉన్న తేడా ఏంటి? వ్యాధి తీవ్రత విషయంలో ఏది మనిషి ప్రాణాలపై అధిక ప్రభావం చూపిస్తుంది అనే చర్చ మొదలైంది. రెండూ భిన్నం.. కోవిడ్ 19, మంకీపాక్స్ వైరస్లు పూర్తిగా భిన్నం. సార్స్ కోవ్-2 వల్ల కరోనా వస్తుంది. మంకీపాక్స్.. పాక్స్విరిడే కుటుంబంలోని ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది. ఇందులో వేరియోలా వైరస్ (మశూచి కారకం), వ్యాక్సినియా వైరస్ (మశూచి వ్యాక్సిన్‌లో ఉపయోగించేది), కౌపాక్స్ వైరస్లు ఉన్నాయి. సార్స్ కోవ్-2 వైరస్ మనుషుల శ్వాసకోశ వ్యవస్థ ద్వారా లోనికి ప్రవేశించి ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడి చేస్తుంది. మంకీపాక్స్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ రెండింటి మధ్య తేడాను మెరీలాండ్ యూనివర్సిటీ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్ సింపుల్‌గా తేల్చారు. కోవిడ్ పాము కాటుతో సమానం అయితే.. మంకీపాక్స్ నల్లుల లాంటివని పేర్కొన్నారు. లక్షణాలు ఇలా.. కోవిడ్, మంకీపాక్స్ లక్షణాలు చూడటానికి కాస్త ఒకేలా కన్పించినప్పటికీ రెండింటి మధ్య తీవ్రత విషయంలో చాలా తేడా ఉంటుంది. కరోనా రోగుల్లో జ్వరం, చలి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది, అలసట, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, గొంతులో నొప్పి వంటి లక్షణాలుంటాయి. మంకీపాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. వ్యాప్తి ఇలా.. కరోనా ఒకరి నుంచి ఒకరికి సులభంగా, వేగంగా వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా, ఒకరు తాకిన వస్తువులను ఇతరులు ముట్టుకోవడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ మాత్రం ప్రధానంగా స్కిన్ టు స్కిన్ (చర్మం చర్మం కలుసుకోవడం) ద్వారా ప్రబలుతుంది. వ్యాధి సోకిన వారు ఉపయోగించిన వస్త్రాలు, దుస్తులను ఇతరులు వాడినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ లైంగికంగా సంక్రమిస్తోందని ఇప్పటికే తేలగా.. వ్యాధి విస్తరణకు ఇంకా ఇతర కారణలేమైనా ఉన్నాయా? అని కనుగొనేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. చికిత్స ఏంటి? కోవిడ్ మహమ్మారి బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో పరిశోధనల అనంతరం కరోనా వైరస్ నివారణకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో మరణాలు రేటు తగ్గింది. అయితే మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. అయితే కరోనా వ్యాక్సిన్లలా మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేయడం లేదు. డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..! -
ఉత్తర కొరియాలో అంతుచిక్కని రోగం.. కిమ్ కీలక నిర్ణయం
ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియాలో అంతుచిక్కని అంటువ్యాధి పంజా విసురుతోంది. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులూ భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో గత కొన్నిరోజులుగా కొత్త అంటువ్యాధి జనాలను అతలాకుతలం చేస్తోంది. ఆ అంటువ్యాధి ఏంటి? ఇది ఎంత తీవ్రమైందని? లక్షణాలేంటి? అనే విషయాలపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఓడరేవు నగరమైన హేజు నుంచి మొదలైన ఈ అంతుచిక్కని అంటువ్యాధితో.. ప్రజలు సతమతం అవుతున్నారు. దీని విజృంభణ ఎలా మొదలైందన్న విషయాన్ని పరిశోధకులు నిర్ధారించలేకపోయారని తెలుస్తోంది. అయితే.. ఇది పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి ఎలా సోకింది? బారిన ఎంత మంది పడ్డారు? మరణాలు సంభవించాయా? అనే విషయాల్ని మాత్రం ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించలేదు. భార్య రి సోల్ జూతో కిమ్ మరోవైపు అధ్యక్షుడి కుటుంబం కోటాలో భద్రపరిచిన మందులన్నింటినీ కొత్త అంటువ్యాధి నేపథ్యంలో స్వచ్ఛందంగా జనాలకు ఇచ్చేయమని అధికారులను ఆదేశించారు కిమ్ జోంగ్ ఉన్. గత నెలలో కరోనా విజృంభణ సమయంలోనూ ఆయన ఇదే విధంగా చేశారు. ఇక ఉత్తర కొరియాలో బుధవారం ఒక్కరోజే జ్వరం లక్షణాలతో బాధ పడుతున్న కేసులు 26,010 వచ్చాయి. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 40,56,000కి చేరింది. మరోవైపు ఆ దేశంలో కొత్తగా మరో అంటువ్యాధి ఆందోళనను కలిగిస్తోంది. -
ఒమిక్రాన్‌కు ఉప వేరియెంట్!.. బీఏ.2గా నామకరణం
లండన్/జెనీవా: ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్ పుట్టుకొచ్చినట్లు డెన్మార్క్‌లోని స్టాటెన్స్ సీరం ఇనిస్టిట్యూట్(ఎస్ఎస్ఐ)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది అసలైన ఒమిక్రాన్ రకం వైరస్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. సబ్ వేరియంట్‌ను బీఏ.2గా పరిగణిస్తున్నారు. ఒమిక్రాన్‌కు బీఏ.1గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. బీఏ.2, బీఏ.1లలో ఏది అధికంగా వ్యాప్తి చెందుతోందన్న అంశాన్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. బీఏ.2 వ్యాప్తి వేగం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మెడ్ఆర్ఎక్స్ఐవీ అనే వెబ్సైట్లో ఈ అధ్యయన ఫలితాలను పోస్టు చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం బీఏ.2 సబ్ వేరియంట్‌కు సహజంగానే సంక్రమించిందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని పేర్కొంటున్నారు. అంటే ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకోగలదని చెప్పొచ్చు. బీఏ.2 వ్యాప్తి రేటు 39 శాతం, బీఏ.1 వ్యాప్తి రేటు 29 శాతంగా ఉందని తమ అధ్యయనంలో గుర్తించినట్లు ఎస్ఎస్ఐ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకొంటే వైరస్ నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారితో పోలిస్తే తీసుకున్నవారిలో బీఏ.1, బీఏ.2 వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కాబట్టి టీకా తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయని చెప్పారు. ఎస్ఎస్ఐ అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హగన్, స్టాటిస్టిక్స్ డెన్మార్క్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు. వైద్య వ్యర్థాలతో మానవాళికి పెనుముప్పు కోవిడ్–19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచమంతా పెద్ద యుద్ధమే చేస్తోంది. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు, ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు నిత్యావసరాలుగా మారిపోయాయి. నిత్యం లక్షలాది మాస్కులు, గ్లౌజ్‌లు అమ్ముడుపోతున్నాయి. అంతిమంగా ఇవన్నీ చెత్త కిందకే చేరుతున్నాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఉపయోగిస్తున్న సిరంజీల గురించి చెప్పాల్సిన పనిలేదు. వ్యాక్సినేషన్ కోసం ఒకసారి వాడి పారేసే సిరంజీలే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వైద్య వ్యర్థాల (హెల్త్‌కేర్ వేస్ట్) గుట్టలుగా పేరుకుపోతున్నారని, వీటితో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. లెక్కలేనంతగా పోగుపడుతున్న వైద్య వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి సైతం ప్రమాదమేనని మంగళవారం వెల్లడించింది. ఈ పరిస్థితిలో త్వరగా మార్పు రాకపోతే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు ప్రజలు సైతం నడుం కట్టాలని పిలుపునిచ్చింది. మాస్కులు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు, సిరంజీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా శాస్త్రీయంగా నిర్మూలించాలని సూచించింది. వ్యర్థాల నిర్మూలన విధానాలను మెరుగుపర్చడంపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరింది. ప్రజలు అవసరానికి మించి మాస్కులు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ మార్గరెట్ మాంట్గోమెరీ చెప్పారు. దీనికి స్వస్తి పలకాలని అన్నారు. కరోనా రక్షణ పరికరాల తయారీ విషయంలో పర్యావరణ హిత, పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ అన్నె వూల్రిడ్జ్ తెలిపారు. -
అంటువ్యాధి వస్తే.. గుర్రపు బండొచ్చేది!
సాక్షి సెంట్రల్ డెస్క్: కరోనా మహమ్మారి దాడి మొదలై ఏడాదిన్నర దాటింది. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో పాజిటివ్ రిపోర్టు రాగానే.. అంబులెన్సుల్లో పేషెంట్లను ఐసోలేషన్ సెంటర్లకు తరలించడం.. వారి ఇళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో శానిటైజేషన్ వంటివి చేశారు. ఆఫీసులు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ ముందు డిసిన్ఫెక్షన్ టన్నెళ్లు పెట్టారు. మొదట్లో మనకు ఇదంతా కొత్తగా, వింతగా అనిపించినా.. ఇంగ్లండ్‌లోని లండన్ నగరంలో సుమారు 150 ఏళ్లకు ముందే ఇలాంటివి మొదలయ్యాయి. ఎవరి కైనా, ఏదైనా అంటువ్యాధి సోకిందంటే చాలు.. అంతా హడావుడే. ఇందుకోసం ఓ భారీ ఐసోలేషన్–డిసిన్ఫెక్షన్ కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. ఆవిరి యంత్రాల్లో.. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అంటు వ్యాధులకు సంబంధించి 1866 నుంచే లండన్‌లో డిసిన్ఫెక్షన్ చర్యలు చేపట్టేవారు. దీనికి సంబంధించి 1891లో ఏకంగా ఓ చట్టమే చేసేశారు. స్మాల్‌పాక్స్, డిఫ్తీరియా, టీబీ, స్కార్లెట్ ఫీవర్, తట్టు వంటి అంటువ్యాధులు వచ్చినా.. తీవ్రమైన దగ్గు వంటి సమస్యలు ఉన్నా.. సదరు రోగుల ఇంటికి ప్రభుత్వ గుర్రపు బగ్గీ వచ్చేది. పేషెంట్లను ఆస్పత్రులకు తరలించి, వారి ఇంటిని, వాడిన వస్తువులను డిసిన్ఫెక్ట్ చేసేవారు. అయితే వ్యాధుల తీవ్రత పెరుగుతుండటంతో.. 1893లో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తీవ్ర ఒత్తిడితో కూడిన వేడి నీటిఆవిరిని వినియోగించి.. రోగుల బట్టలు, దుప్పట్లు, ఇతర వస్తువులను డిసిన్ఫెక్ట్ చేసేవారు. గంధకంతో స్నానం ఏదైనా అంటువ్యాధితో బాధపడుతున్న వారికి సంబంధించి మూడు దశల్లో డిసిన్ఫెక్షన్ ప్రక్రియ జరిగేది. ►బాధితులను గుర్రపు బండిలో హక్నీబరో సెంటర్‌కు తరలించేవారు. వారి దుస్తు లు, దుప్పట్లు, ఇతర సామగ్రిని కూడా తీసుకొచ్చేవారు. పేలు, ఫంగస్, ఇతర క్రిములు నాశనం అవుతాయన్న ఉద్దేశంతో.. రోగుల దుస్తులన్నీ తొలగించి వారికి సల్ఫర్ స్నానం చేయించేవారు. శుభ్రమైన ఇతర వస్త్రాలు ఇచ్చి.. స్టేషన్‌లోని ప్రత్యేక గదుల్లో వారిని ఉంచేవారు. ►రోగులకు సంబంధించిన దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులను ‘హైప్రెషర్ స్టీమ్ (తీవ్ర ఒత్తిడితో కూడిన నీటిఆవిరి)’యంత్రాల్లో పెట్టి.. ఫార్మాల్డిహైడ్ రసాయనం స్ప్రే చేసి డిసిన్ఫెక్ట్ చేసేవారు. డిసిన్ఫెక్షన్ చేసే వీలులేని వాటిని కొలిమిలో పడేసి కాల్చేసేవారు. ►ఇదే సమయంలో రోగి ఇల్లు, పరిసరాల్లో ఫార్మాల్డిహైడ్ రసాయనం స్ప్రే చేసి డిసిన్ఫెక్ట్ చేసేవారు. హక్నీబరో సెంటర్‌తో.. అంటువ్యాధులు విజృంభిస్తుండటంతో 1897 బ్రిటన్ ప్రభుత్వం మరో చట్టం చేసింది. ఎలుకలు, ఇతర జంతువుల ద్వారా అంటు వ్యాధులు విస్తరించిన ప్రాంతాలను డిసిన్ఫెక్ట్ చేయాలని.. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయవచ్చని ప్రకటించింది. లండన్ శివార్లలోని హక్నీ పట్టణానికి చెందిన వైద్యాధికారి జాన్కింగ్ ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని.. 1901లో హక్నీబరో డిసిన్ఫెక్షన్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. అంటువ్యాధులు సోకినవారిని, వారి బట్టలు, దుప్పట్లు, ఇతర సామగ్రిని ఈ స్టేషన్‌కు తరలించేవారు. ఐసోలేషన్ తరహాలో ఒకట్రెండు రోజులు అక్కడే ఉంచుకుని పంపేవారు. సామగ్రిని డిసిన్ఫెక్ట్ చేసి ఇచ్చేవారు. వేల మందికి ట్రీట్మెంట్.. హక్నీబరో స్టేషన్ ఏర్పాటైన తొలి ఏడాది 2,800 ఇళ్లను, 24 వేలకుపైగా రకరకాల సామగ్రిని డిసిన్ఫెక్ట్ చేశారు. ఐతే ఈ స్టేషన్లో క్వారంటైన్ కావడానికి మాత్రం జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రోగుల కోసం ఏర్పాటు చేసి న గదులను వైద్య సిబ్బందికి బసగా మార్చారు. సైనైడ్‌తో శుభ్రం చేసి.. 1934లో హక్నీబరో స్టేషన్‌ను మరో చిత్రమైన పనికి వాడారు. అంటువ్యాధులను నివారించడానికి లండన్‌లోని ఓ మురికివాడ ప్రజలను ఇతర చోటికి తరలించారు. ఈ క్రమంలో వారి ఇళ్లలోని సామగ్రి అంతటినీ ట్రక్కుల్లో నింపి.. స్టేషన్లో కొత్తగా నిర్మించి సీల్డ్ షెడ్లకు తరలించారు. షెడ్లలోకి ‘హైడ్రోజన్ సైనైడ్’వాయువును నింపి.. సామగ్రి అంతటినీ డిసిన్ఫెక్ట్ చేసి యజమానులకు అందజేశారు. ►‘హైడ్రోజన్ సైనైడ్’ విషపూరితమైనవాయువు. జర్మన్ నాజీలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను, శత్రు సైనికులను ఇలాంటి గ్యాస్ నింపిన షెడ్లలోకి పంపి చంపేయడం గమనార్హం. ►హక్నీబరో స్టేషన్‌ను తర్వాత విదేశాల నుంచి వచ్చిన వస్త్రాలను డిసిన్ఫెక్ట్ చేయడానికి వాడారు. ►చివరిగా 1984లో స్కూలు పిల్లల తలలో పేలను డిసిన్ఫెక్ట్ చేయడానికి ఈ స్టేషన్‌ను వినియోగించారు. తర్వాత మూసేశారు. శిథిలావస్థకు చేరిన ఆ స్టేషన్ ఇప్పటికీ నిలిచే ఉంది. -
అందుకు మోదీ సాయం కోరిన ఉద్ధవ్
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు. అలాగే ముంబై సమీపంలో శాశ్వత అంటువ్యాధుల చికిత్స ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం సాయం కావాలని కూడా కోరారు. నోయిడా, ముంబై, కోల్‌కతాలోని మూడు కేంద్రాల్లో అత్యాధునిక కరోనా టెస్టింగ్ సదుపాయాలు కల్పించారు. వీటిని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రేతోపాటు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. ముంబై సమీపంలో శాశ్వత అంటువ్యాధి చికిత్స ఆస్పత్రిని నిర్మించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇక్కడే పెషేంట్లకు చికిత్సతోపాటు.. పరిశోధన కూడా సాగేలా సదుపాయాలు ఉండాలన్నారు. దీని నిర్మాణం కోసం కేంద్రం మద్దతు, సాయం కావాలని కోరారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ దాటిన కూడా కేంద్రం నుంచి ఇప్పుడు అందుతున్న విధంగానే పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌ల సరఫరా కొనసాగించాలని కోరారు. కాగా, ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాలు కరోనాపై పోరాడేందుకు అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, ఇతర ముఖ్యమైన పరికరాలను కేంద్రం సెప్టెంబర్ వరకు అందజేయనుంది. -
అంటువ్యాధిగా గుర్తింపు
సాక్షి, అమరావతి: కోవిడ్‌ను అంటువ్యాధిగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్ అనుమానితుల నిర్బంధ చికిత్సకు వైద్య, ఆరోగ్య శాఖకు ఏడాది పాటు విశేషాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న దాని ప్రకారం.. - కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. - రాష్ట్ర స్థాయిలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డీఎంఈ, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్లు కమిటీలో ఉంటారు. - జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఎం అండ్ హెచ్‌వో, బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఉంటారు. - కోవిడ్ ప్రభావిత ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారిని నిర్బంధంగా ఆస్పత్రుల్లోని ఐసోలేటెడ్ వార్డుల్లో చేర్పించవచ్చు. అందులో 14 రోజుల పాటు చికిత్స అందించి కోవిడ్ నెగెటివ్ అని తేలేంత వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. అవసరమైతే మరిన్ని రోజులు ఆస్పత్రుల్లో ఉంచే అధికారాన్ని కూడా అధికారులకు కట్టబెట్టారు. - ఏదైనా ఒక గ్రామం, పట్టణం, కాలనీ పరిధిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని అధికార యంత్రాంగం గుర్తిస్తే అందుకు అనుగుణంగా అత్యవసర చర్యలు తీసుకునేందుకు అధికారం కల్పించారు. ఆ ప్రకారం గ్రామం/పట్టణం/కాలనీలోకి రాకపోకలను అవసరమైనన్ని రోజులు నిలిపివేస్తారు. - కోవిడ్ ప్రభావిత ప్రాంతంలో స్కూళ్లు, సినిమా హాళ్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు తదితరాలను మూసివేస్తారు. వాహనాల రాకపోకలను అనుమతించరు. - ఆ ప్రాంతంలో ఏదైనా ప్రభుత్వ భవనాన్ని ఆస్పత్రిగా మార్పు చేసి ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తారు. - అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచుతారు. - వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించిన అన్ని రకాల సేవలను చేపడతారు. - జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. - ఎవరైనా వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. - ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అత్యవసర చర్యలను ఎవరూ న్యాయపరంగా సవాల్ చేయడానికి వీల్లేదు. నెల్లూరులో కోలుకుంటున్న బాధితుడు నెల్లూరు (అర్బన్): ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చి కోవిడ్ బారినపడిన విద్యార్థి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నెల 9న నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో చేరిన విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరెవరికీ కోవిడ్ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరిలో విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 119 మందిని గుర్తించారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ప్రతిరోజూ వైద్యులు ఆరా తీస్తున్నారు. అలాగే వారందరినీ ఎవరితో కలవకుండా ఇంటి వద్దనే 14 రోజులు పాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ 14 రోజుల్లో ఏమైనా అనుమానిత లక్షణాలు బయటపడితే కోవిడ్ వార్డుకు తరలించేలా చర్యలు చేపట్టారు. సందేహాల కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. నగరమంతా బ్యానర్లు, వాల్ పోస్టర్లు కట్టి అవగాహన కల్పిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని అన్ని స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు, స్కూళ్లను మూసివేశారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌ను శుభ్రం చేస్తున్న దృశ్యం ‘అనంత’లో నిర్ధారణ కేంద్రం అనంతపురం హాస్పిటల్: కోవిడ్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్న 51 కేంద్రాల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఉంది. రాష్ట్రంలో అనంతపురంతోపాటు విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్, తిరుపతిలోని స్విమ్స్‌లో మాత్రమే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌లు ఉన్నాయి. అనంతపురం వైద్య కళాశాలలో ఉన్న రియల్‌టైం పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) పరికరం ద్వారా ఒకేసారి 80 మందికి పరీక్షలు నిర్వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీని ద్వారా మూడు గంటల్లోనే నివేదిక వస్తుంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో కావాల్సిన శిక్షణ పొందడానికి వైద్య కళాశాలకు చెందిన ముగ్గురిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 16 నుంచి తిరుపతిలో శిక్షణ పొందనున్నారు. తిరుమలలో పటిష్ట చర్యలు తిరుపతి సెంట్రల్: తిరుమలలో కోవిడ్ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టితో కలిసి ఆయన తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ వద్ద శుక్రవారం ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. కోవిడ్‌పై అవగాహన కల్పించే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింఘాల్ మాట్లాడుతూ.. అలిపిరితోపాటు పాదాల మండపం, శ్రీవారి మెట్టు నడకదారి ప్రాంతాల్లో మూడు కోవిడ్ నివారణ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా మార్గాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు «థర్మల్ స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ లక్షణాలను గుర్తిస్తే వారిని రుయా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు పంపుతామన్నారు. మే 31 వరకు శ్రీవారి దర్శనానికి ముందస్తుగా ఆన్లైన్లో పొందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల తేదీలను మార్చుకునే వెసులుబాటును కల్పించామన్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తున్న వైద్యుడు కృష్ణా జిల్లాలో అనుమానిత కేసు! సాక్షి, అమరావతి బ్యూరో/కడప అర్బన్: కృష్ణా జిల్లాలో కోవిడ్ అనుమానిత కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. జర్మనీలో చదువుకుంటున్న ఓ విద్యార్థి రెండు రోజుల కిందట ఢిల్లీ మీదుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడికి దగ్గు, జలుబు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి రక్త నమూనాలను పరీక్షల కోసం పంపనున్నట్లు తెలిపారు. అయితే.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ విద్యార్థి మేనత్త డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె గొల్లపూడిలోని వారి ఇంట్లో ఒక గదిని ఐసోలేషన్ రూమ్‌గా మార్చి చికిత్స అందిస్తానని చెప్పడంతో డాక్టర్లు విద్యార్థిని పంపించి వేసినట్లు తెలిసింది. కడపలో మరొకటి! కడపలో దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వృద్ధురాలిని రిమ్స్‌కు తీసుకొచ్చి ‘కరోనా ఐసోలేటెడ్ వార్డు’లో చేర్పించారు. కడపకు చెందిన వృద్ధురాలు ఈ నెల 4న మక్కా నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిందని వైద్యులు తెలిపారు. నాటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతోందని చెప్పారు. కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్షలు చేశామని నివేదిక రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందన్నారు. -
ఆనంద సాగరంలో ఆమినా..!
అంత పసితనంలోనే అంతటి న్యాయదృష్టిని చూపుతున్న చిన్నారి ముహమ్మద్ పెద్దవాడయ్యాక ఇంకెంతటి న్యాయశీలతను ప్రదర్శిస్తాడోనని హలీమా దంపతులు ఎంతో మురిపెంగా చెప్పుకునేవారు. హలీమా కాస్త భయంగా, ఆశ్చర్యంగా వారివైపు చూసింది. కాని ఏమీ సమాధానం చెప్పలేదు.ఆమెనుండి సమాధానం రాకపోయినా, ఆ చిన్నారి ఎవరో వారు పసిగట్టి, తమలో తాము గుసగుసలాడుకున్నారు. ‘మన గ్రంథాల్లో ప్రస్తావించబడిన ఆదరణకర్త నిస్సందేహంగా ఇతనే. ఏదో ఒకటి చేసి మనం ఈ పిల్లాడిని తీసుకువెళితే బావుంటుంది’ అనుకుంటున్నారు వాళ్లు.వాళ్ల గుసగుసలు చూసి హలీమా మనసు కీడు శంకించింది. ‘వీళ్ల వాలకం చూస్తే పిల్లాడిని ఎత్తుకెళ్లినా ఎత్తుకెళ్తారు’ అనుకుంటూ, ఊపిరి బిగబట్టి చిన్నగా అక్కడి నుండి జారుకుంది. ‘ఇక లాభంలేదు. ఎలాగూ రెండేళ్లు గడిచాయి. బాబు పాలుతాగడం కూడా మానాడు. వెంటనే బిడ్డను తల్లికి అప్పగించాలి’ అనుకొంది. కాని, రెండేళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారిని ఇంత తొందరగా వదులుకోవడానికి మనసు అంగీకరించంలేదు. కాని తప్పదు. బిడ్డ క్షేమంగా ఉండాలంటే గుండెను రాయి చేసుకోవాల్సిందే. అనుకొని మరునాడే మక్కాకు బయలుదేరింది హలీమా, చిన్నారి ముహమ్మద్‌ను వెంటబెట్టుకొని. సుదీర్ఘ ఎడబాటు తరువాత తన ఆశల పంటను చూసుకున్న ఆమినా ఆనందం అవధులు దాటింది. మమతానురాగాలతో కళ్లు నిండుకుండలయ్యాయి. కలలన్నీ ఒక్కసారిగా కళ్లముందు కదలాడసాగాయి. అటు తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ విషయం ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సంతోష సాగరంలో తేలియాడుతున్నారాయన. ‘ఈ రోజు కొడుకు అబ్దుల్లాహ్ ఉంటే, బిడ్డను చూసుకొని ఎంతగా మురిసిపోయేవాడో! కాని, విధిరాతను ఎవరు మార్చగలరు?’ అని మనసుకు సర్దిచెప్పుకున్నారు. అయితే చిన్నారి ముహమ్మద్ మక్కా వచ్చిన కొన్నాళ్లకే పట్నంలో ఏదో అంటువ్యాధి ప్రబలింది. చూస్తూ చూస్తూనే జనం మృత్యువాత పడుతున్నారు. మృత్యుదూత ఎప్పుడు ఎవరింటి తలుపు తడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పట్నం వెలుపల కొత్త కొత్త సమాధులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి చూసి ఆమినా నిలువెల్లా వణికిపొయ్యారు. తన బిడ్డ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం క్షేమకరం కాదని భావించి, వెంటనే ఆయా హలీమాను పిలిపించి, మళ్లీ ఆమె వెంట పంపించి వేశారు. చిన్నారి ముహమ్మద్‌కు హలీమా తమ ఇంట్లోని మేకపాలు అలవాటు చేసింది. విచిత్రం ఏమిటంటే, చిన్నారి ముహమ్మద్ ఒక్క స్తన్యాన్ని మాత్రమే నోట్లో పెట్టుకొని పాలు తాగేవాడు కాని, రెండో దాని జోలికి పోయేవాడు కాదు. అంటే ఆ పాలు తన సోదరి షీమా కోసం ఉంచేవాడన్నమాట. అంత పసితనంలోనే అంతటి న్యాయదృష్టిని చూపుతున్న చిన్నారి ముహమ్మద్ పెద్దవాడయ్యాక ఇంకెంతటి న్యాయశీలతను ప్రదర్శిస్తాడోనని హలీమా దంపతులు ఎంతో మురిపెంగా చెప్పుకునేవారు. ‘ఆమినా ముద్దుల బిడ్డ పెద్దయ్యాక ఈ ప్రపంచాన్ని నీతి, న్యాయం, ధర్మం, సమానతలతో కచ్చితంగా నింపేస్తాడు. అందుకే ఆయమ్మ ఆమినా కూడా, ‘ఈ పసిబిడ్డ ముందుముందు మహోజ్వల చరిత్ర సృష్టిస్తాడని ధీమాగా చెప్పింది. ఆ మాతృమూర్తి కలలన్నీ ఒక్కొక్కటి నిజమవుతున్నాయి’ అన్నది హలీమా భర్తతో. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
క్షయ నిర్మూలిద్దాం
జిల్లావ్యాప్తంగా 8 టీబీ కేంద్రాలు ఆదిలాబాద్, కాగజ్‌నగర్, జైనూర్, మందమర్రి, జన్నారం, బోథ్, చెన్నూరు, నర్సాపూర్(జి)లలో ఉన్నాయి. ఈ యూనిట్లలో రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందిస్తారు. వీటిల్లో 39 తెమడ పరీక్ష విభాగాలు ఉన్నాయి. తెమడ పరీక్ష కేంద్రాల్లో రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. ఒకవేళ ఈ కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలతో పూర్తిస్థాయిలో రిపోర్ట్ రాకపోతే జిల్లా కేంద్రంలోని క్షయ నివారణ కేంద్రానికి కేసులు పంపిస్తారు. అక్కడ వారికి తగిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. టీబీ అనగా..? క్షయ(టీబీ) ఒక అంటు వ్యాధి. ఇది స్త్రీ పురుషులకు ఏ వయసులోనైనా సోకవచ్చు. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీనినే శ్వాసకోశ క్షయ అంటారు. లక్షణాలు రెండు వారాలకు మించి ఎడతెరపి లేని దగ్గు. సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి తగ్గటం, ఛాతీ నొప్పి, బరువు తగ్గటం, తెమడలో రక్తం పడడం వంటివి జరిగితే అది టీబీ లక్షణంగా గుర్తించవచ్చు. ఎలా సోకుతుంది..? టీబీ సూక్ష్మక్రిముల ద్వారా సంక్రమిస్తుంది. టీబీ వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడు గాని టీబీ క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లుగా వెళ్తాయి. ఈ తుంపర్లు ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వారికి టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ సోకిన వారికి టీబీ వచ్చే అవకాశం ఎక్కువ. నిర్ధారణ ఉదయం, సాయంత్రం రెండుసార్లు తెమడ పరీక్షలు చేయించాలి. ఒకవేళ రెండుసార్లు పరీక్షలు నెగెటివ్ అయితే రోగి ఎక్స్‌రే తీయించుకోవాల్సి ఉంటుంది. నయం చేయవచ్చు ప్రత్యక్ష పర్యవేక్షణ స్వల్పకాలిక చికిత్స(డాట్స్) ద్వారా క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ వ్యాధి నుం చి విముక్తి పొందవచ్చు. ఈ మందులు, చికిత్స సౌకర్యా లు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందవచ్చు. కొత్తగా గుర్తించిన రోగుల చికిత్స కాలం 6 నుంచి 7 మా సాలు ఉంటుంది. సరిగా మందులు వాడకపోతే వ్యాధి ముదిరినవారికి, ఒకసారి నయమై మళ్లీ వ్యాధి సోకిన వారికి 8 నుంచి 9 నెలలు చికిత్స పొందాల్సి ఉంటుంది. టీబీ వచ్చిన వారికి వారానికి మూడు రోజులు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో లేక, మంగళ, గురు, శనివారాల్లో మందులు తప్పనిసరిగా వాడాలి. -
వరదబాధితుల అవస్థలు ఇన్నిన్ని కాదు
భద్రాచలం, న్యూస్‌లైన్ : గోదారమ్మ శాంతించింది.... భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 42 అడుగుల నీటిమట్టం నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉప సంహరిస్తున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. అయితే వరద తొలగిన తర్వాత పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. గ్రామాలు బురద మయంగా తయారయ్యాయి. ముంపు తగ్గటంతో పునరావాసాల్లో తలదాచుకున్న బాధితులు ఇళ్లకు చేరుకుని పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరదకు ఇళ్లలోకి బురద చేరి సామాగ్రి అంతా అందులో చిక్కుకుపోయింది. వాటిని బయటకు తీయడానికి నానా అవస్థలు పడుతున్నారు. కాగా, ముంపు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో చాలాచోట్ల రహదారులపై ఉన్న నీరు కూడా తొలగిపోయింది. అయితే వాజేడు మండల కేంద్రానికి సమీపంలో ఇంకా నడుం లోతు నీరు నిల్వ ఉంది. అదే విధంగా చీకుపల్లి వద్ద పది అడుగులకు పైగానే నీరు ఉండటంతో అవతల ఉన్న 32 గ్రామాలకు ఇంకా పడవ ప్రయాణమే సాగుతోంది. భద్రాచలం నుంచి వాజేడు వరకూ మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని రామాలయం వద్ద వరద నీరు పూర్తిగా తొలగిపోయింది. దీంతో విస్తాకాంప్లెక్స్ వద్ద దుకాణాలు వారం రోజుల తరువాత బయట పడ్డాయి. అంతా నష్టమే.. గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత వాసులకు అపార నష్టం వాటిల్లింది. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయి నివేదికల కోసం సర్వేను ముమ్మరం చేశారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగిపోవటంతో పాటు చాలా చోట్ల స్తంభాలు నేలకొరగటంతో నష్టం సుమారు రూ.50 లక్షల వరకూ ఉంటుందని ఆ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. వరదలతో వాజేడు మండలం, అదేవిధంగా భద్రాచలం నుంచి కూనవరం మండలాలకు వెళ్లే ఆర్అండ్బీ రహదారులకు పలు చోట్ల గ ండ్లు పడ్డాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారిలో ఒండ్రు మట్టి చేరటంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రహదారిలో బుధవారం పలు చోట్ల వాహనదారులు బురదలో జారి కింద పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యయి. రాకపోక లకు అంతరాయం లేకుండా ఉండేందుకు ఆర్అండ్బీ శాఖాధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఏజెన్సీలో ప్రబలుతున్న వ్యాధులు : గోదావరి తగ్గుముఖం పట్టాకా అంటు వ్యాధులు విజృంభిస్తుండటంతో ఏజెన్సీ వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దుమ్ముగూడెం, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల్లో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. కూనవరం మండలంలో మంగళవారం అతిసార వ్యాధితో ఓ మహిళ మృతి చెందగా, బుధవారం జ్వరంతో కుంజా రాజు(35) మృత్యువాత పడ్డాడు. వరద ఉధృతి తగ్గినప్పటికీ గ్రామాల్లో బురద పేరుకుపోవటంతో వాటిని ఇప్పటికిప్పుడు శుభ్రం చేసే పరిస్థితి లేక ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు సైతం పారిశుధ్య చర్యలపై దృష్టి సారించకపోవటంతో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేద ని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టక పోతే విష జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.