లండన్/జెనీవా: ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్ పుట్టుకొచ్చినట్లు డెన్మార్క్‌లోని స్టాటెన్స్ సీరం ఇనిస్టిట్యూట్(ఎస్‌ఎస్‌ఐ)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది అసలైన ఒమిక్రాన్ రకం వైరస్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. సబ్ వేరియంట్‌ను బీఏ.2గా పరిగణిస్తున్నారు. ఒమిక్రాన్‌కు బీఏ.1గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. బీఏ.2, బీఏ.1లలో ఏది అధికంగా వ్యాప్తి చెందుతోందన్న అంశాన్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. బీఏ.2 వ్యాప్తి వేగం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీ అనే వెబ్‌సైట్‌లో ఈ అధ్యయన ఫలితాలను పోస్టు చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం బీఏ.2 సబ్ వేరియంట్‌కు సహజంగానే సంక్రమించిందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని పేర్కొంటున్నారు. అంటే ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకోగలదని చెప్పొచ్చు.
బీఏ.2 వ్యాప్తి రేటు 39 శాతం, బీఏ.1 వ్యాప్తి రేటు 29 శాతంగా ఉందని తమ అధ్యయనంలో గుర్తించినట్లు ఎస్‌ఎస్‌ఐ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకొంటే వైరస్ నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారితో పోలిస్తే తీసుకున్నవారిలో బీఏ.1, బీఏ.2 వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కాబట్టి టీకా తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయని చెప్పారు. ఎస్‌ఎస్‌ఐ అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హగన్, స్టాటిస్టిక్స్ డెన్మార్క్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు.
వైద్య వ్యర్థాలతో మానవాళికి పెనుముప్పు
కోవిడ్–19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచమంతా పెద్ద యుద్ధమే చేస్తోంది. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు, ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు నిత్యావసరాలుగా మారిపోయాయి. నిత్యం లక్షలాది మాస్కులు, గ్లౌజ్‌లు అమ్ముడుపోతున్నాయి. అంతిమంగా ఇవన్నీ చెత్త కిందకే చేరుతున్నాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఉపయోగిస్తున్న సిరంజీల గురించి చెప్పాల్సిన పనిలేదు. వ్యాక్సినేషన్ కోసం ఒకసారి వాడి పారేసే సిరంజీలే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వైద్య వ్యర్థాల (హెల్త్‌కేర్ వేస్ట్) గుట్టలుగా పేరుకుపోతున్నారని, వీటితో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.
లెక్కలేనంతగా పోగుపడుతున్న వైద్య వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి సైతం ప్రమాదమేనని మంగళవారం వెల్లడించింది. ఈ పరిస్థితిలో త్వరగా మార్పు రాకపోతే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు ప్రజలు సైతం నడుం కట్టాలని పిలుపునిచ్చింది. మాస్కులు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు, సిరంజీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా శాస్త్రీయంగా నిర్మూలించాలని సూచించింది.
వ్యర్థాల నిర్మూలన విధానాలను మెరుగుపర్చడంపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరింది. ప్రజలు అవసరానికి మించి మాస్కులు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ మార్గరెట్ మాంట్‌గోమెరీ చెప్పారు. దీనికి స్వస్తి పలకాలని అన్నారు. కరోనా రక్షణ పరికరాల తయారీ విషయంలో పర్యావరణ హిత, పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ అన్నె వూల్‌రిడ్జ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment