
సాక్షి, అమరావతి: కోవిడ్‌ను అంటువ్యాధిగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్ అనుమానితుల నిర్బంధ చికిత్సకు వైద్య, ఆరోగ్య శాఖకు ఏడాది పాటు విశేషాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న దాని ప్రకారం..
- కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
- రాష్ట్ర స్థాయిలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డీఎంఈ, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్లు కమిటీలో ఉంటారు.
- జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఎం అండ్ హెచ్‌వో, బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఉంటారు.
- కోవిడ్ ప్రభావిత ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారిని నిర్బంధంగా ఆస్పత్రుల్లోని ఐసోలేటెడ్ వార్డుల్లో చేర్పించవచ్చు. అందులో 14 రోజుల పాటు చికిత్స అందించి కోవిడ్ నెగెటివ్ అని తేలేంత వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. అవసరమైతే మరిన్ని రోజులు ఆస్పత్రుల్లో ఉంచే అధికారాన్ని కూడా అధికారులకు కట్టబెట్టారు.
- ఏదైనా ఒక గ్రామం, పట్టణం, కాలనీ పరిధిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని అధికార యంత్రాంగం గుర్తిస్తే అందుకు అనుగుణంగా అత్యవసర చర్యలు తీసుకునేందుకు అధికారం కల్పించారు. ఆ ప్రకారం గ్రామం/పట్టణం/కాలనీలోకి రాకపోకలను అవసరమైనన్ని రోజులు నిలిపివేస్తారు.
- కోవిడ్ ప్రభావిత ప్రాంతంలో స్కూళ్లు, సినిమా హాళ్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు తదితరాలను మూసివేస్తారు. వాహనాల రాకపోకలను అనుమతించరు.
- ఆ ప్రాంతంలో ఏదైనా ప్రభుత్వ భవనాన్ని ఆస్పత్రిగా మార్పు చేసి ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తారు.
- అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచుతారు.
- వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించిన అన్ని రకాల సేవలను చేపడతారు.
- జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
- ఎవరైనా వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
- ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అత్యవసర చర్యలను ఎవరూ న్యాయపరంగా సవాల్ చేయడానికి వీల్లేదు.
నెల్లూరులో కోలుకుంటున్న బాధితుడు
నెల్లూరు (అర్బన్): ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చి కోవిడ్ బారినపడిన విద్యార్థి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నెల 9న నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో చేరిన విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరెవరికీ కోవిడ్ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరిలో విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 119 మందిని గుర్తించారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ప్రతిరోజూ వైద్యులు ఆరా తీస్తున్నారు. అలాగే వారందరినీ ఎవరితో కలవకుండా ఇంటి వద్దనే 14 రోజులు పాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ 14 రోజుల్లో ఏమైనా అనుమానిత లక్షణాలు బయటపడితే కోవిడ్ వార్డుకు తరలించేలా చర్యలు చేపట్టారు. సందేహాల కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. నగరమంతా బ్యానర్లు, వాల్ పోస్టర్లు కట్టి అవగాహన కల్పిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని అన్ని స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు, స్కూళ్లను మూసివేశారు.
నెల్లూరు రైల్వేస్టేషన్‌ను శుభ్రం చేస్తున్న దృశ్యం
‘అనంత’లో నిర్ధారణ కేంద్రం
అనంతపురం హాస్పిటల్: కోవిడ్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్న 51 కేంద్రాల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఉంది. రాష్ట్రంలో అనంతపురంతోపాటు విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్, తిరుపతిలోని స్విమ్స్‌లో మాత్రమే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌లు ఉన్నాయి. అనంతపురం వైద్య కళాశాలలో ఉన్న రియల్‌టైం పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీపీసీఆర్) పరికరం ద్వారా ఒకేసారి 80 మందికి పరీక్షలు నిర్వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీని ద్వారా మూడు గంటల్లోనే నివేదిక వస్తుంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో కావాల్సిన శిక్షణ పొందడానికి వైద్య కళాశాలకు చెందిన ముగ్గురిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 16 నుంచి తిరుపతిలో శిక్షణ పొందనున్నారు.
తిరుమలలో పటిష్ట చర్యలు
తిరుపతి సెంట్రల్: తిరుమలలో కోవిడ్ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టితో కలిసి ఆయన తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ వద్ద శుక్రవారం ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. కోవిడ్‌పై అవగాహన కల్పించే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింఘాల్ మాట్లాడుతూ.. అలిపిరితోపాటు పాదాల మండపం, శ్రీవారి మెట్టు నడకదారి ప్రాంతాల్లో మూడు కోవిడ్ నివారణ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా మార్గాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు «థర్మల్ స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ లక్షణాలను గుర్తిస్తే వారిని రుయా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు పంపుతామన్నారు. మే 31 వరకు శ్రీవారి దర్శనానికి ముందస్తుగా ఆన్‌లైన్‌లో పొందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల తేదీలను మార్చుకునే వెసులుబాటును కల్పించామన్నారు.
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తున్న వైద్యుడు
కృష్ణా జిల్లాలో అనుమానిత కేసు!
సాక్షి, అమరావతి బ్యూరో/కడప అర్బన్: కృష్ణా జిల్లాలో కోవిడ్ అనుమానిత కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. జర్మనీలో చదువుకుంటున్న ఓ విద్యార్థి రెండు రోజుల కిందట ఢిల్లీ మీదుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడికి దగ్గు, జలుబు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి రక్త నమూనాలను పరీక్షల కోసం పంపనున్నట్లు తెలిపారు. అయితే.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ విద్యార్థి మేనత్త డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె గొల్లపూడిలోని వారి ఇంట్లో ఒక గదిని ఐసోలేషన్ రూమ్‌గా మార్చి చికిత్స అందిస్తానని చెప్పడంతో డాక్టర్లు విద్యార్థిని పంపించి వేసినట్లు తెలిసింది.
కడపలో మరొకటి!
కడపలో దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వృద్ధురాలిని రిమ్స్‌కు తీసుకొచ్చి ‘కరోనా ఐసోలేటెడ్ వార్డు’లో చేర్పించారు. కడపకు చెందిన వృద్ధురాలు ఈ నెల 4న మక్కా నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిందని వైద్యులు తెలిపారు. నాటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతోందని చెప్పారు. కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్షలు చేశామని నివేదిక రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment