ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియాలో అంతుచిక్కని అంటువ్యాధి పంజా విసురుతోంది. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులూ భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో గత కొన్నిరోజులుగా కొత్త అంటువ్యాధి జనాలను అతలాకుతలం చేస్తోంది. ఆ అంటువ్యాధి ఏంటి? ఇది ఎంత తీవ్రమైందని? లక్షణాలేంటి? అనే విషయాలపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఓడరేవు నగరమైన హేజు నుంచి మొదలైన ఈ అంతుచిక్కని అంటువ్యాధితో.. ప్రజలు సతమతం అవుతున్నారు. దీని విజృంభణ ఎలా మొదలైందన్న విషయాన్ని పరిశోధకులు నిర్ధారించలేకపోయారని తెలుస్తోంది. అయితే.. ఇది పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి ఎలా సోకింది? బారిన ఎంత మంది పడ్డారు? మరణాలు సంభవించాయా? అనే విషయాల్ని మాత్రం ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించలేదు.
భార్య రి సోల్ జూతో కిమ్
మరోవైపు అధ్యక్షుడి కుటుంబం కోటాలో భద్రపరిచిన మందులన్నింటినీ కొత్త అంటువ్యాధి నేపథ్యంలో స్వచ్ఛందంగా జనాలకు ఇచ్చేయమని అధికారులను ఆదేశించారు కిమ్ జోంగ్ ఉన్. గత నెలలో కరోనా విజృంభణ సమయంలోనూ ఆయన ఇదే విధంగా చేశారు. ఇక ఉత్తర కొరియాలో బుధవారం ఒక్కరోజే జ్వరం లక్షణాలతో బాధ పడుతున్న కేసులు 26,010 వచ్చాయి. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 40,56,000కి చేరింది. మరోవైపు ఆ దేశంలో కొత్తగా మరో అంటువ్యాధి ఆందోళనను కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment