Why North Korea Kim Jong Un Hide Farm House - Sakshi
Sakshi News home page

ప్రాణ తీపితో కిమ్‌‌! మూడు వారాలైంది.. ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకు రాడా?

Published Mon, Oct 3 2022 8:51 PM | Last Updated on Tue, Oct 4 2022 9:02 AM

why North Korea Kim Jong Un Hide Farm House - Sakshi

అగ్రరాజ్యంపై విసుర్లు, పొరుగు దేశంపై కవ్వింపు చర్యలు, గ్యాప్‌ లేకుండా క్షిపణుల పరీక్షలు, ప్రజల సంక్షేమం సంగతి పక్కనపెట్టి మరీ వాళ్లను కష్టపెట్టేలా కఠిన చట్టాలు.. ఆ చట్టాల అమలును దగ్గరుండి మరీ చూస్కునే స్వభావం.. ఉత్తరకొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు మాత్రమే సొంతం. అలాంటి కిమ్‌ 20 రోజులకు పైగా బయట కనిపించడం లేదు. 

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మీడియా కెమెరాల కంటికి చిక్కి 23 రోజులు అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇన్నేసి రోజులు ఆయన కనిపించకుండా ఉండడం ఇదే. దీంతో కిమ్‌కు ఏమై ఉంటుందన్న చర్చ తెర మీదకు వచ్చింది. అయితే..  

నిత్యం ఏదో ఒక చర్యతో, చేష్టలతో వార్తల్లో నిలిచే కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. మూడు వారాలుగా ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. కిందటివారం సైన్యం నిర్వహించిన క్షిపణి పరీక్షలోనూ, దేశంలో నెలకొన్న తీవ్ర ఆహార కొరతపై సమీక్షలోనూ కనిపించకపోవడంతో.. కిమ్‌ గైర్హాజరు వెలుగు చూసింది. అయితే కిమ్‌ ఎక్కడ? అనే చర్చ జోరుగా నడిచింది అక్కడ. ఈ క్రమంలో.. ఉత్తర కొరియాకు ఈశాన్య దిశగా ఉన్న భారీ ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి.  

ప్రాణతీపితో..

అక్టోబర్‌, నవంబర్‌ ఉత్తర కొరియాలో ఫ్లూ సీజన్‌. కరోనా విజృంభించే అవకాశాలు ఎక్కువ. దీంతో మాస్క్‌ ధరించడం మళ్లీ తప్పనిసరి చేస్తూ.. కరోనా ఆంక్షలను కూడా అమలులోకి తెచ్చారు అధికారులు. ఈ తరుణంలో రిస్క్‌ ఉంటుందనే ఉద్దేశంతోనే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బయట కనిపించడం లేదనే సమాచారం అందుతోంది. ఫామ్‌హౌజ్‌లో ప్రస్తుతం ఆయన సేదతీరుతున్నట్లు సమాచారం. అయితే.. 

అక్టోబర్‌ 10వ తేదీన అధికార పార్టీ 77వ ఆవిర్బావ వార్షికోత్సవ వేడుకలు జరగాల్సి ఉంది. కాబట్టి, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆ రోజు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇన్నేళ్లలో ఆయన వార్షికోత్సవాన్ని తప్పింది లేదు. ఒకవేళ.. ఆరోజు కూడా కిమ్‌ హాజరుకాకపోతే గనుక.. అది అనుమానించాల్సిన విషయమే!.

గత ఏడేళ్లలో కిమ్‌ బయట కనిపించకుండా ఎక్కువ రోజులు ఉంది.. కిందటి ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ రెండు నెలల్లో 35రోజుల పాటు!. అంతకంటే ముందు 2021 మే నెలలో ఆరోగ్య సంబంధిత కారణాలతో నెలపాటు అజ్ఞాతంలో గడిపారు. అయితే దక్షిణ కొరియాకు చెందిన నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్‌ (NIS) మాత్రం కిమ్‌కు ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలేవీ తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని దక్షిణ కొరియా ప్రభుత్వానికి నివేదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement