ముహమ్మద్‌కు అభ్యర్థన | Request to Muhammad | Sakshi
Sakshi News home page

ముహమ్మద్‌కు అభ్యర్థన

Nov 5 2016 11:23 PM | Updated on Sep 4 2017 7:17 PM

ముహమ్మద్‌కు అభ్యర్థన

ముహమ్మద్‌కు అభ్యర్థన

‘అయ్యా! మేము అన్యాయం చేయలేదు. న్యాయమే చేశాం.

ప్రవక్త జీవితం

‘అయ్యా! మేము అన్యాయం చేయలేదు. న్యాయమే చేశాం. ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎన్నోసార్లు మా గోడు మీకు చెప్పుకున్నాం. కానీ ఒక్కసారీ మాపై దయ తలచలేదు. ఒక్క ప్రతిపాదనకూ సిద్ధపడలేదు’ అన్నాడు ఒక పెద్దమనిషి అనునయంగా!

‘అదేమీ కాదు. మీరసలు న్యాయంగానే మాట్లాడడం లేదు. నన్ను అగౌరవపరచడానికే నిర్ణయించుకున్నట్లు ఉన్నారు’ అన్నారు అబూ తాలిబ్ ఒకింత బాధగా!

‘లేదు లేదు. మీ పట్ల మేము న్యాయంగానే ప్రవర్తిస్తున్నాం. ముహమ్మద్ విషయంలో మేము ఎన్నోసార్లు మీకు ఫిర్యాదు కూడా చేశాం. అయినా మీరు పట్టించుకోలేదు. ఇకనైనా అతణ్ణి కాస్త మందలించి నోరు మూయించండి. ఇక నుండి ముహమ్మద్ గనక మా దేవతల్నీ, మా పూర్వీకుల్నీ పల్లెత్తు మాట అన్నా, మమ్మల్ని అజ్ఞానులని విమర్శించినా సహించేది లేదు. ఇన్నాళ్ళూ ఓపిక పట్టాం కానీ, ఇక ఊరకునేది లేదు. ఎంతదూరం వెళ్ళడానికైనా మేము సిద్ధం. ముహమ్మద్‌తో, మీతో, మీకు సహకరించే వారితో యుద్ధం చేయడానికి కూడా వెనుకాడేది లేదు’ అంటూ బెదిరింపు ధోరణిలో హెచ్చరించి వెళ్ళిపోయారు.

అబూ తాలిబ్ తల పట్టుకున్నారు. తీవ్ర ఆలోచనలో పడిపోయారు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.‘ఖురైషీయులతో శతృత్వం పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే! అలా అని ప్రాణసమానమైన ముహమ్మద్‌ను వదులుకోలేను. ఏం చేయాలి? ఏమిటీ కర్తవ్యం?

ఏమైనా సరే... అబ్బాయిని పిలిచి మాట్లాడాలి. ఎలాగైనా ఇస్లామ్ ప్రచారం ఆపమని చెప్పాలి. ఎన్నాళ్ళింకా వీళ్ళతో ఈ గొడవ. దీనివల్ల ఖురైషుల ఐక్యతకూ భంగం కలుగు తోంది’ అనుకొన్నారు అబూ తాలిబ్. తర్జనభర్జనల తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు.

వెంటనే ముహమ్మద్ (స)ను పిలిచి, జరిగిన వృత్తాంతమంతా వినిపించారు. ఇస్లామ్ ప్రచారాన్ని ఆపమని నచ్చజెప్పారు. దీనివల్ల ఖురైషులకు కలిగే ఇబ్బందుల్ని కూడా విశదీకరించారు. ఇకనైనా ధర్మ ప్రచారం ఆపకపోతే భవిష్యత్తులో సంభవించే కష్టనష్టాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఎందుకు చెబుతున్నానో వినమనీ, తన వయసును చూసైనా జాలిపడమనీ, మోయలేని భారాన్ని ఈ ముసలితనంలో తనపై వేయవద్దనీ ఒకింత ఆవేదనగా అభ్యర్థించారు.

 - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్  (మిగతాది వచ్చేవారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement