ప్రవక్త జీవితం
ఒకసారి కాబాగృహ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు, తోటి పిల్లలంతా ఇటుకలు మోస్తుంటే, తను కూడా అందులో పాల్గొన్నారు. భుజాలు నొప్పెడుతున్నాయని పిల్లలంతా ఒంటిపైని వస్త్రం తీసి భుజంపై పెట్టుకొని మోస్తున్నారు. కాని చిన్నారి ముహమ్మద్ మాత్రం ఒంటిపైని వస్త్రాలు తీయలేదు. అబ్బాయి భుజాలెక్కడ కందిపోతాయోనని బాబాయి అబూతాలిబ్ బలవంతాన ప్రయత్నం చేస్తే, వెంటనే ఆయన స్పృహతప్పి పడిపొయ్యారు.
మరో సందర్భంలో, స్నేహితుల ప్రోద్బలం, ఒత్తిడి మేరకు గ్రామంలో జరిగే ఓ వినోద కార్యక్రమానికి బయదేరారు. కాని మార్గమధ్యంలోనే ఓ ఇంట్లోంచి వీనుల విందైన మధుర గానమేదో వినిపించేసరికి అక్కడే ఆగిపోయారు. వింటూవింటూ అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు కూడా ఇలాగే జరిగింది. అంటే, అనవసర, ఉబుసుపోని కార్యకలాపాల్లో పాల్గొనకుండా దైవికంగానే ఏర్పాటు జరిగిపోయిందన్నమాట.
చిన్నారి ముహమ్మద్ (స) బాల్యం, యవ్వనం ఎలాంటి మనోవికారాలకు తావులేకుండా నిష్కళంకంగా, నిర్మలంగా, పవిత్రంగా గడిచింది. ఆయన్ను వ్యతిరేకించేవారు సైతం ఆయన నైతికవర్తనాన్ని, శీలసంపదను ప్రశంసించకుండా ఉండలేకపోయేవారు.
ఈ సంధి ఒప్పందంలో ముహమ్మద్ (స) కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఇలాంటి శాంతి ఒప్పందాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన తరచూ చెప్పేవారు.
ఆయనలో ఉన్న నీతి, నిజాయితీ, న్యాయప్రియత్వం, రుజువర్తనం, సత్యసంధత, సౌజన్యత, సౌహార్థ్రతల కారణంగా జాతి ఆయనను ‘అమీన్’ అన్న బిరుదుతో గౌరవించింది.
ఖురైష్, హవాజన్ తెగల మధ్య జరిగిన ఒక యుద్ధంలో ఆయన బాబాయిలతో కలసి పాల్గొన్నారు. ‘ఫుజ్జార్ ’ పేరుతో ప్రసిద్ధి చెందిన చారిత్రక సమరం అది. అంతటి భయానక సమరంలో బాబాయిల వెంట పాల్గొన్నారనే గాని, ఏ ఒక్కరిపైనా చేయెత్తిన దాఖలాలు లేవు.
ఎన్నో కుటుంబాలను బలిగొన్న ఈ యుద్ధం పట్ల కొంతమంది సహృదయులు, శాంతికాముకులు ఎంతో కలత చెందారు. చిన్నారి ముహమ్మద్ పెదనాన్న సారధ్యంలో కొందరు ప్రముఖులు సంధికోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఫలితంగా రెండు తెగల మధ్య సంధి కుదిరింది. ‘హిల్ ఫుల్ ఫుజూల్’గా ఇది చరిత్రకెక్కింది.అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు. పగ, ప్రతీకారాలతో, అశాంతి అరాచకాలతో సతమతమవుతున్న ప్రజలకు శాంతి, సంతృప్తి, జ్ఞానకాంతిని పంచాలని ఆయన బలంగా కాంక్షించేవారు. నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమైన ఈ సమాజాన్ని ఎలాగైనా దారికి తేవాలని తపన పడేవారు. ఈ ఆలోచనలతోనే అలాకాలం గడుస్తూ పోతోంది.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు)