వన్‌.. టు.. త్రీ.. గో! | At any stage the woman does not have the choice | Sakshi
Sakshi News home page

వన్‌.. టు.. త్రీ.. గో!

Published Tue, Mar 13 2018 12:03 AM | Last Updated on Tue, Mar 13 2018 3:15 AM

At any stage the woman does not have the choice - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లైఫ్‌ ఈజ్‌ ఎ ఛాయిస్‌! స్వేచ్ఛ ఉంటుంది.  నిగూఢంగా..  సంకోచాల మధ్య దాగి ఉంటుంది. సంకోచాలు పొరల్లాంటివి.ఆత్మగౌరవాన్ని, జీవితాన్ని, ధైర్యాన్ని కప్పేస్తాయి! జీవిత బంధం అందమైనదే... నిర్బంధం కానంత వరకు.  నిర్బంధం అనిపించనంత వరకు.  నిజానికి.. బంధం ఎవరితోనో కాదు.. ముందు మనకు మనతో ఉండాలి.  మనల్ని మనం నిర్బంధించుకోకూడదు. అనుమానం, అవమానం, అన్యాయాల నుంచి.. వన్‌.. టు.. త్రీ.. గో!

బాల్యంలో, యవ్వనంలో, వైవాహిక జీవితంలో, వృద్ధాప్యంలో.. ఏ దశలోనూ స్త్రీకి ఛాయిస్‌ ఉండదు. అమ్మానాన్న చెప్పినట్లో, సమాజం నిర్దేశించినట్లో, భర్త ఆదేశించినట్లో, బిడ్డలు ఆశించినట్లో ఆమె జీవితం ఆమె ప్రమేయం లేకుండా సాగిపోతుంది. ఇష్టాలు, అభిప్రాయాలు, ఆశయాలు, నిర్ణయాలు ఇవేవీ స్త్రీ జీవితంలో ఉండవు. అసలు తను జీవిస్తున్నది తన కోసమే  కాదన్నంతగా ఆమె తన చుట్టూ ఉన్న బంధాల నిర్బంధనాలలో.. ముళ్లకంపపై చీరలా పరుచుకుంటుంది.  ఎక్కడో కొందరు స్త్రీమూర్తులు మాత్రమే ఆ ముళ్లను విడిపించుకుని బయటికి వచ్చే ధైర్యం చేస్తారు. ‘హర్‌ఛాయిస్‌’ పేరుతో బీబీసీ భారతీయ భాషల విభాగం తాజాగా రూపొందించిన పన్నెండు నిజజీవిత కథలు.. అలా ముళ్లను విడిపించుకున్న మహిళలవే! వాటిలోని మూడు  కథలివి.


మై బిగ్‌ సీక్రెట్‌
పశువులా మీద పడటానికి వచ్చిన ప్రతిసారీ నా భర్తకు నేను ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసేదాన్ని. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట.. ఏదో ఒక అబద్ధం. ‘అయితే నాకేంటి?’ అని మీద పడేవాడు! అలా నా 20వ యేటకే నలుగురు పిల్లల్ని కన్నాను. పనేమీ చేసేవాడు కాదు.  తాగొచ్చేవాడు. కొట్టేవాడు. మీద పడేవాడు. అదే పని. అమ్మకు చెబితే, ‘ప్రతి ఇంట్లోనూ ఉండే ముదనష్టమే’ అని బాధపడింది. భర్తను మాత్రం వదిలెయ్యొద్దంది.  నేను ఒకరింట్లో పనిచేసేదాన్ని. నా గురించి ఆమెకు తెలుసు. ‘మళ్లీ గర్భం వస్తుందేమోనమ్మా..’ అని తరచూ నేను ఆమె దగ్గర అంటుండేదాన్ని.‘‘నేను చెప్పినట్లు చేస్తావా?’’ అన్నారు ఓరోజు ఆవిడ.. నా బాధను, భయాన్ని చూసి. చేస్తానన్నాను.  ఏం చెయ్యాలో చెప్పారు ఆవిడ.  ‘‘నా భర్తకు తెలిస్తే చంపేస్తాడేమోనమ్మా’’ అన్నాను. ‘‘నువ్వు చెబితేనే కదా తెలిసేది’’ అన్నారు.  ఆవిడ చెప్పిన దాని గురించి చాలారోజులు ఆలోచించాను. నా భర్తకు తెలిస్తే ఏమౌతుంది? ఇంకా తాగుతాడు. ఇంకా కొడతాడు. అప్పటికి అయిపోతుంది. మళ్లీ మళ్లీ పిల్లల్ని కంటూ ఉండే నరకం తప్పుతుంది కదా అనుకున్నాను. ఒక నిర్ణయానికి వచ్చాను.  పదేళ్లయింది ఇప్పటికి. నా భర్తకు తెలీదు, నా పిల్లలకూ తెలీదు.. నేను ఆపరేషన్‌ చేయించుకున్నానని. ఆ రహస్యం నాలోనే ఉండిపోయింది. నా భర్త ఇప్పటికీ తాగొస్తాడు. ఇప్పటికీ మీద పడతాడు. కానీ నాకొక ధీమా. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదని. నాకొక గర్వం. నా దేహం నా చెప్పుచేతల్లోనే ఉందని.  ఓ పెద్ద రహస్యాన్ని నేను కడుపులో మోస్తున్నాను. ఆ రహస్యానికి నేనెప్పటికీ జన్మనివ్వను.

బార్న్‌ అగైన్‌
అది మా ఫస్ట్‌నైట్‌. నా వయసు 35 ఏళ్లు. నేను కన్యను. అయితే ఆ ఫస్ట్‌నైట్‌ తర్వాత కూడా కన్యగానే ఉండబోతున్నానని నాకు తెలియదు. గదిలోకి వెళ్లాను. నా భర్త నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడని, నాపై ముద్దులు కురిపిస్తాడని ఎదురుచూస్తున్నాను. అటు తిరిగి పడుకున్నాడు! నిద్రపోయాడు! అయితే అది వచ్చిన నిద్ర కాదని, తెప్పించుకుంటున్న నిద్ర అని కొన్నాళ్ల తర్వాత నాకు తెలిసింది. ఫస్ట్‌నైట్‌ తెల్లారే అడిగాను. ఒంట్లో బాగోలేదన్నాడు. రెండో రాత్రి, మూడో రాత్రి, ఆ తర్వాతి రాత్రులన్నిట్లో అతడికి ఒంట్లో బాగోలేదు. సెక్స్‌ ఒక్కటే నా సమస్య కాదు. కనీసం అతడు నన్ను టచ్‌ చెయ్యడం లేదు! మాట్లాడ్డం లేదు. నా అనుమానం నిజమైంది. ఆ నిజాన్ని మా అత్తమామలు దాచిపెట్టి నా గొంతు కోసారు. దుఃఖం వేసింది. గది తలుపులు వేసుకుని బోరున ఏడ్చారు. మావాళ్ల దగ్గర కూడా. ‘‘ఊర్కో. ఏమీ జరగనట్లే ఉండు. నీ కర్మింతే అని సరిపెట్టుకో’’ అని సలహా ఇచ్చారు. నేను సరిపెట్టుకోలేక పోయాను. అర్థంలేని రిలేషన్‌ అది. మెడలో తాళి ఉన్నా, మదిలో మొగుడు లేని రిలేషన్‌ అది. పిచ్చి రిలేషన్‌. అతడిని వదిలేయాలని నిర్ణయించుకున్నాను. భర్తని వదిలేస్తే తప్పు ఈ సమాజంలో. కానీ అతడు భర్తకూడా కాదే! వదిలేయొచ్చు. అమ్మకీ, నాన్నకీ చెప్పాను. ‘‘భర్తకు విడాకులిస్తే, నిన్ను ఇంటి గడప కూడా తొక్కనివ్వం’’ అన్నారు అమ్మానాన్న!నాకిక ఏ గడపా అక్కర్లేదనుకున్నాను. మెట్టినింటికి, పుట్టింటికి దూరంగా వచ్చేశాను. ఫ్రెండ్స్‌ హెల్ప్‌ చేశారు. ఉమెన్స్‌ హాస్టల్‌లో చేరాను. ఉద్యోగం వెతుక్కున్నాను. విడాకులకు ఫైల్‌ చేశాను. 
నా భర్త, అత్తమామలు నన్ను దూషించారు. పరాయి పురుషులతో సంబంధాలను అంటగట్టారు. నేనేం బాధపడలేదు.ఇంపొటెంట్‌ భర్తతో ఏ సంబంధమూ లేకుండా ఒకే ఇంట్లో ఉండటం అంతకంటే పెద్ద బాధ. 
విడాకులు రావడానికి మూడేళ్లు పట్టింది. విడాకుల పత్రాలు చేతికి వచ్చినప్పుడు నేను మా అమ్మ కడుపులోంచి మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఫ్రెష్‌గా.
 
ఎవ్రీథింగ్‌ విల్‌బి ఆల్‌రైట్‌

ముస్తఫాతో నేను ప్రేమలో పడినప్పుడు ముస్తఫాది ఏ దేశమో, ముస్తఫాది ఏ మతమో, ముస్తఫాది ఏ కులమో నేను చూసుకోలేదు. ప్రేమించానంతే. నేను క్రిస్టియన్‌ని. నార్త్‌ ఈస్ట్‌లో మాది చిన్న ఊరు. ముస్తఫా ముస్లిం. ఆఫ్రికన్‌. ఇద్దరం కలిసున్నాం. అయితే కొన్నాళ్లే! మమ్మల్ని కలిపి ఉంచగల ఏ సామాజిక శక్తీ మాకోసం రాలేకపోయింది. అడ్డు మరి. కులం అడ్డు. మతం అడ్డు. దేశం అడ్డు. మా సహజీవనం తెగిపోయేనాటికి నాకు 21 ఏళ్లు. నా కడుపులో అతడి బిడ్డ. ‘తీయించుకో’ ఫ్రెండ్స్‌ సలహా ఇచ్చారు. ‘ఉంచుకుంటాను’ అన్నాను. ‘ఎందుకా దరిద్రం!’ అన్నట్లు చూశారు. అంతకన్నా బాధించే మాట.. ముస్తఫా అన్నాడు! ‘నీ లోపల ఉన్నది నా బిడ్డే అని నమ్మకం ఏంటి? అని. ఆ క్షణమే అతడితో విడిపోయి వచ్చేశాను. కూతురు జీవితం ఇలా అయిపోయిందేమిటని నా తల్లిదండ్రులు బాధపడలేదు. ఈ భూమ్మీదకి తమది కాని వారసత్వాన్ని ఎక్కడ మోసుకొస్తానోనని భయపడ్డారు. కూతురికి నల్లటి ఆఫ్రికా శిశువు పుట్టబోతున్నాడంటేనే వాళ్లకు కంపరంగా ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు నన్ను వెలివేశారు. నేను, నాకు పుట్టబోయే బిడ్డ.. ఇద్దరమే ఒకరికొకరం తోడుగా ఈ మనుషుల మధ్య నిలబడిపోయాం. చేరదీసేవారు లేరు. గ్లాసు నీళ్లతో సేదతీర్చేవారూ లేరు. నాకొక మంచి ఉద్యోగం కూడా లేదు. ఒక్క ఫ్రెండు మాత్రం మిగిలింది. ‘జాగ్రత్తే’ అంది. తన మీద తలవాల్చి ఏడ్చేశాను. నొప్పులొచ్చే వరకు ఆ ఫ్రెండే నాకు తల్లి అయింది. దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లింది. మగ బిడ్డ పుట్టాడు. వాణ్ణి చూడగానే నా మనసు తేలికయింది. ఇప్పుడు నా వయసు 29 ఏళ్లు. నా బిడ్డ వయసు ఆరేళ్లు. ఈ ఆరేళ్లు నేను లోకానికి ఎదురీదాను. బలంగా తయారయ్యాను. నా బిడ్డకు బలాన్ని ఇవ్వాలంటే ఈ మాత్రం బలం నాకు ఉండాలి కదా.  
త్రీ స్టోరీస్‌: దివ్య ఆర్య, ఐశ్వర్య రవిశంకర్, సింధువాణి త్రిపాఠీ. / ఇలస్ట్రేషన్స్‌ : గోపాల్‌ శూన్య 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement