బలహీనుల ఆశాజ్యోతి
సమస్త సృష్టికీ కర్త అయిన ఏకైక దైవాన్నే ఆరాధించమని ప్రజలకు పిలుపునిచ్చిన మహనీయుడు ముహమ్మద్ ప్రవక్త. తల్లితండ్రులను గౌరవించాలనీ, వారిపట్ల విధేయతా భావం కలిగి ఉండాలనీ, వారి సేవ చేయని వారు నరకానికి పోతారనీ హెచ్చరించారాయన. బంధువులు, బాటసారులు, అనాథలు, వితంతువులు, నిస్సహాయుల పట్ల దయగా ఉండాలని బోధించారు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఒక్క ముస్లిమ్ సముదాయానికే కాక సమస్త మానవ జాతికీ సంపూర్ణ మార్గదర్శకులు. ఆయన జన్మదినమైన ‘మిలాద్ –ఉన్–నబీ’ వేళ ఆయన బోధనలపై దృష్టి సారించాలి.
సత్యమే పలకాలి. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. పలికే ప్రతిమాటకు, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని బాధ్యతా భావాన్ని ప్రవక్త నూరిపోశారు. అన్యాయానికీ, అధర్మ సంపాదనకు ఒడిగట్టవద్దన్నది ఆయన బోధ. అలాగే ధనాన్ని దుర్వినియోగం, దుబారా చేయవద్దని కూడా ఆయన హెచ్చరించారు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని, ఈ పాపానికి దూరంగా ఉండటమే కాకుండా, దానికై పురిగొలిపే ప్రసారసాధనాల్ని కూడా రూపుమాపాలని పిలుపునిచ్చారు. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపకూడదనీ, ప్రజల ధన, మాన ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిపథంలో పయనించజాలదనీ ఉపదేశించారు.
వ్యాపార లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, లెక్కపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలని ముహమ్మద్ ప్రవక్త (స) బోధించారు. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలని, తోటి మానవ సోదరుల్ని తమకన్నా తక్కువగా చూడకూడదని ఆయన ఉపదేశించారు. స్త్రీ జాతిని గౌరవించాలనీ, అనాథలను ఆదరించని వారు మహాపాపాత్ములనీ, వారిని ఆదరించి, సంరక్షిస్తే స్వర్గార్హత సాధించవచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా ఖైదీల పట్ల కరుణతో వ్యవహరించాలని, వారిని హింసించకూడదని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న అమాయకుల విడుదలకు కృషి చేయాలని ఉపదేశించారు. వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని, శుభకార్యాల్లో వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని, ఈ దురాచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. అవసరం, అవకాశం ఉన్నవారి పునర్వివాహానికి ప్రయత్నించాలని, వారిని నిర్లక్ష్యం చేసిన సమాజం అథోగతి పాలవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధులను ఆదరించాలని హితవు పలికారు. ఒక మార్గదర్శిగా ప్రవక్త (స) బోధించే ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపేవారు. ఆచరణ లేని హితబోధ జీవం లేని కళేబరం వంటిదని ఆయన చెప్పేవారు.
ఆ మహనీయుని మంచితనానికీ, మానవీయ సుగుణానికీ అద్దం పట్టే ఓ సంఘటన... ఇది ముహమ్మద్ ప్రవక్త ధర్మప్రచారం చేస్తున్న తొలినాళ్ళ మాట. ఒకసారి ఆయన మక్కా వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక చౌరస్తాలో ఓ వృద్ధురాలు తన మూటాముల్లెతో సహా నిలబడి ఉంది. వృద్ధురాలు కావడంతో మూటల బరువు మోయలేక పరుల సహాయం కోసం అర్థిస్తోంది. దారిన వెళ్ళేవాళ్ళను బతిమాలుతోంది కాస్తంత సాయం చేయమని! చాలామంది ఆ దారిన వెళుతున్నారు కానీ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోకపోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా! నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ! నీకు పుణ్యం ఉంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేకపోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే, నేను వెళ్ళిపోతాను’ అన్నదా వృద్ధురాలు.
‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త.
‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నా లాంటి ముసలిదానికి ఇంత సాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా! ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’ అని హితవు పలికింది.
‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పినదంతా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ప్రవక్త.
ఆ మహనీయుని మంచితనానికీ, వినయపూర్వకమైన ఆ వీడ్కోలుకూ ఆనందభరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ!’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ! నీ పేరేమిటి నాయనా!’ అని ప్రశ్నించింది ప్రేమగా. కాని ప్రవక్త మాట్లాడకుండా, మౌనం వహించారు.
‘బాబూ! పేరైనా చెప్పునాయనా! కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్థించింది. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను ? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ అభాగ్యుణ్ణి నేనేనమ్మా!’ అన్నారు ప్రవక్త మహనీయులు. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు అవాక్కయిపోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్‌నేనా..? నా కళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..! ఇలా ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎవరి మాటలు వినకూడదనీ, ఎవరి ముఖం కూడా చూడకూడదనీ పుట్టిపెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు.
సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్దురాలిని చేశాయి.
కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్‌వే అయితే, నీ నుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను’ అంటూ అదే క్షణాన ప్రవక్త వారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్త మహనీయుని ఆచరణవిధానం. ప్రజల పట్ల, ముఖ్యంగా నిస్సహాయులు, బడుగు, బలహీనులు, పీడిత తాడిత శ్రామిక వర్గాల పట్ల ఆ మహనీయుడు అవలంబించిన ఆచరణ శైలి. ఇందులో ఎంతో కొంతైనా మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే నేటి మన సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి.
ఇలా మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఊహ తెలిసినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు సమాజ సంక్షేమం కోసం, సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. మానవాళికి సత్యధర్మాన్ని పరిచయం చేస్తూ, వారి ఇహ పర సాఫల్యాల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ మహనీయుని జీవన విధానం మానవాళికి అంతటికీ ఆదర్శం కావాలి. ప్రజలతో ఆయన ఏవిధంగా ప్రేమానురాగాలతో,స్నేహ సౌహార్దాలతో, సానుభూతితో వ్యవహరించేవారో, అవసరార్థులకు, ఆపదలో ఉన్నవారికి, ఏ విధంగా ఆపన్నహస్తం అందించేవారో, అలాంటి వ్యవహారశైలి నేడు మనలోనూ తొణికిసలాడాలి.
ప్రవక్త తన చివరి హజ్‌యాత్ర సందర్భంగా ఇలా అన్నారు... ‘‘ప్రజలారా! ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీరు తినేదే మీ సేవకులకు పెట్టండి. కూలివాని చెమట బిందువులు ఆరక ముందే అతని వేతనం చెల్లించండి. మహిళల గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో, ధర్మం ప్రకారం వారికీ మీపై అలాంటి హక్కులే ఉన్నాయి. వడ్డీ తినకండి, దాన్ని త్యజించండి. సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఆయనకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించకండి. బాధ్యతాభావం, జవాబుదారీతనం కలిగి ఉండండి. మీ కర్మలన్నింటికీ ఒకనాడు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది...’’
ఇలా ప్రజానీకానికి అనేక హితోపదేశాలు చేశారు. అవన్నీ మనకు మార్గదర్శకం.
రేపు‘మిలాద్–ఉన్–నబీ’ ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు