ప్రవక్త జీవితం
ఇప్పుడు చిన్నారి ముహమ్మద్ (స)కు ఇరవై నాలుగేళ్ల వయసొచ్చింది. ఈ క్రమంలో ఒకరోజు అబూతాలిబ్, ‘బాబూ! ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి ఏమంత సంతృప్తికరంగా లేదు. మనం ఏవైనా సంపాదనా మార్గాలు అన్వేషించాలి’ అన్నారు. ‘చెప్పండి బాబాయీ... ఏం చేయమంటారు? దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను’. ‘ఖదీజా తన పైకం పెట్టుబడిగా పెట్టి ఇతరుల ద్వారా వ్యాపారం చేయిస్తోంది. ఒకవేళ నీకు వ్యాపారంపై ఆసక్తి ఉంటే నేనామెతో మాట్లాడతాను. ఏమంటావు?
‘బాబాయీ, మీ మాట నాకు శిరోధార్యం. మీరేది చెబితే అది చేస్తాను’ అంటూ సంసిద్ధతను వ్యక్తం చేశారు యువ ముహమ్మద్ (స).
ఖదీజా మక్కా నగరంలో ఉన్న తన వంశానికి చెందిన సంపన్నురాలు. అత్యంత గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన మహిళ. యమన్, యస్రిబ్, సిరియా, ఫళస్తీనా తదితర దూరతీర దేశాల వరకూ ఆమె వ్యాపారం విస్తరించి ఉంది. బానిసలు, పరిచారికలతో ఆమె ఇల్లు నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. మొదటి భర్త చనిపోవడంతో కొన్నాళ్ళకామె మరో వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన కూడా మరణించడంతో విషాద సాగరంలో మునిగిపోయారామె. ఈ దుఃఖం నుండి తేరుకోకముందే తండ్రి ఖువైలిద్ కూడా ఇహలోకం వీడి వెళ్లిపోయారు. ఈ వరుస సంఘటనలతో తీవ్రమైన దుఃఖ విచారాల్లో కూరుకుపోయారామె. వైవాహిక జీవితంపైనే ఆమెకు విరక్తి కలిగింది. వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంలో అధిక శాతం పేదసాదలకు, అనాధలకు, అన్నార్తుల కోసం ఖర్చు చేస్తూ జీవితం గడిపేవారు.
అబూ తాలిబ్ వెళ్లి ఆమెతో మాట్లాడారు.
‘మీరు చెప్పిన తరువాత కాదనే ప్రసక్తే లేదు. మీరు ఎవరి పేరు సిఫారసు చేసినా నేను కాదనను. పైగా మీ అబ్బాయే కాబట్టి వ్యాపార లావాదేవీల విషయంలో ఎలాంటి భయమూ లేదు. పరమ సంతోషం’ అన్నారామె. అబూతాలిబ్ ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. ‘బాబూ ముహమ్మద్! దైవం మన ఉపాధికి మార్గాలు తెరిచాడయ్యా’ అన్నారు సంతోషంగా.
మరునాడే సిరియా వెళ్ళేందుకు వ్యాపార బిడారం సిద్ధమైంది. ఖదీజా సేవకుడు మైసరా తోడు రాగా యువ ముహమ్మద్ సిరియా పయనమయ్యారు. బాబాయిలందరూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. అబూ తాలిబ్ ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అన్ని ఏర్పాట్లూ చేశారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. అబూతాలిబ్ సహా, బాబాయిలంతా వీడ్కోలు సమయంలో, ‘దేవా! ఈ ప్రయాణం సుఖప్రదం చెయ్యి. వ్యాపారంలో అనంతమైన శుభాలు, లాభాలు ప్రసాదించు. తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చు’ అని ప్రార్థించారు. మైసరాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ‘మైసరా! ముహమ్మద్‌ను జాగ్రత్తగా చూసుకో. ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూడు’ అని హితబోధ చేశారు.
బిడారం సిరియా బయలుదేరింది. దారిలో ఆయన ఎన్నో పరిచిత ప్రదేశాలను తిలకించారు. చిన్నతనంలో అమ్మతో కలిసి ఇదే మార్గాన ప్రయాణం చేసి ఉండడం వల్ల ఎన్నో విషయాలు గుర్తుకు రాసాగాయి.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)
ఖదీజా మక్కా నగరంలో ఉన్న తన వంశానికి చెందిన సంపన్నురాలు. గౌరవప్రదమైన వంశానికి చెందిన మహిళ. యమన్, యస్రిబ్, సిరియా, ఫళస్తీనా తదితర దూరతీర దేశాల వరకూ ఆమె వ్యాపారం విస్తరించి ఉంది.
యువ ముహమ్మద్ సిరియా ప్రయాణం
Published Sun, Mar 20 2016 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM
Advertisement
Advertisement