ప్రవక్త జీవితం
నిశిత దృష్టితో అన్నీ పరిశీలిస్తూ, మనసులోనే మననం చేసుకుంటూ ముందుకు సాగారు. అలా ప్రయాణం చేస్తూ బిడారం సిరియా చేరుకుంది. మళ్లీ అదే పట్టణం బుస్రాలో బసచేసింది. ప్రయాణంలో ఎంతమంది వెంట ఉన్నారో అందరికీ ఆయన అభిమానపాత్రులయ్యారు. అందరి ప్రేమను పొందగలిగారు. అందరి ఆశీర్వాదాలు ఆయనకు తోడయ్యాయి. తన మాటల ద్వారా, చేతల ద్వారా ఆయన ఒక నిజమైన స్నేహితుడిగా నిరూపించుకున్నారు. ఇక ఖదీజా సేవకుడు మైసరా విషయమైతే అసలు చెప్పాల్సిన పనేలేదు. అసలితను ముహమ్మద్ సేవకుడా అన్నంతగా వెన్నంటి నిలిచాడు. అనుక్షణం ఆయన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. ఎంతో ప్రేమగా, అపురూపంగా చూసుకునేవాడు.
యువముహమ్మద్ (స) ఎంతో తలపండిన వర్తకుడిలా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ప్రారంభించారు. నీతి, నిజాయితీ, విలువ ప్రాతిపదికపైనే ఆయన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. వ్యాపారంలో ఆయన ప్రదర్శించిన నిజాయితీ కారణంగా వినియోగదారులంతా ఆయన ప్రీతిపాత్రులయ్యారు. ఎన్నడూలేని విధంగా ఆ ఏడు ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించారు. వ్యాపార లావాదేవీల్లో పడి ఆయన తన రోజువారీ కార్యకలాపాలేవీ మరచిపోలేదు. నిశిత పరిశీలన, సమాజ అధ్యయనాన్నీ వదులుకోలేదు. వీలుచిక్కినప్పుడల్లా దైవ చింతనలో నిమగ్నమయ్యేవారు. సత్యాన్వేషణలో లీనమైపొయ్యేవారు. ఇన్ని మతధర్మాలు, విశ్వాసాల మధ్య ఏది సత్యం.. ఏది అసత్యం అని తర్కించుకునేవారు. సన్మార్గంపై ఉన్నదెవరు, అపమార్గాన ఉన్నదెవరు? అని యోచించేవారు.
ఈ క్రమంలోనే ఒక రోజు విడిదికి పక్కనే, సహచరులకు కాస్తంత దూరంగా ఓ మోడు వారిన చెట్టు కింద యువముహమ్మద్ (స) ఏకాంతంగా మౌనముద్రలో కూర్చొని ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమైపొయ్యారు. ఆశ్చర్యకరంగా క్షణాల్లోనే ఆమోడు వారిన చెట్టు కళకళలాడుతూ, పచ్చగా చిగురించింది. మౌనముద్రలో ఉన్న ముహమ్మద్‌కు చల్లని నీడను కల్పించింది. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన సమీప చర్చీ పాదరీ ‘నస్తూరా’ పరుగు పరుగున వచ్చాడు. మైసరాను సమీపించి ‘ఈ యువకుడు ఎవరు... ఏమిటి?’ అని ఆరా తీశాడు.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్