మదీనాకు పయనం...
• ప్రవక్త జీవితం
ముహమ్మద్ ప్రవక్తను వెతుక్కుంటూ వెంబడించిన శతృవులు సరిగ్గా గుహ దగ్గరికొచ్చి ఆగిపొయ్యారు. అక్కడినుండి ఎటువెళ్ళిందీ వారికి అంతుచిక్కలేదు. గుహలో దూరారేమో చూడండి అన్నాడో వ్యక్తి వెనుక నుండి అరుస్తూ.. కాని గుహ ముఖద్వారానికి ఓ పెద్ద సాలెగూడు అల్లుకొని ఉంది. అక్కడే రెండుపక్షులు గూళ్ళు కట్టుకొని, గుడ్లుపెట్టి పొదుగుతున్నాయి. అంతేకాదు దారికి అడ్డంగా ఓ పెద్దవృక్షం కూడా ఉంది. సంవత్సరాల తరబడి నర మానవుడెవరూ ఇటు తొంగి చూసిన ఆనవాళ్ళు కూడా లేని ఈ గుహలో మానవ జాడ ఉంటుందని అనుకోవడం పిచ్చితనంకాక మరేమీకాదు. అనుకొని ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టారు ఖురైషీ దుండగులు.
ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త, హ.అబూబకర్ లు మూడురోజుల వరకు సౌర్ గుహలో నే తలదాచుకున్నారు. ఈ మూడురోజుల పాటూ హ.అబూబకర్ తనయుడు హ. అబ్దుల్లాహ్, కూతురు హ. అస్మా తండ్రికి, ప్రవక్తవారికి అన్నపానీయాలు సమకూర్చేవారు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారంకాదు. పులులతో చెలగాటం. ఏదోపని మీద ఎటో వెళుతున్నట్లు బయలు దేరి గుహకు దారితీసేవారు. వీరి సేవకుడు ఆమిర్ అడుగుజాడలు కనిపించకుండా మేకలు తోలుకొనివెనకాలే బయలు దేరేవాడు. వీరు అందించిన సమాచారం ఆధారంగా ప్రవక్తమహనీయులు, అబూబకర్ లు మదీనా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు.
అస్మా, అబ్దుల్లాలు చివరిరోజు అన్నపానీయాలతో పాటు, రెండుమేలుజాతి ఒంటెల్ని, ఇబ్నెఅర్ఖత్ అనే ఓ ముస్లిమేతరవ్యక్తిని తీసుకొని వచ్చారు. ఇతనుఅబూబకర్‌కు చాలా నమ్మకస్తుడు. జనసంచారం లేని నిర్జనమార్గాలగుండా మదీనా తీసుకువెళ్ళడానికి అతనికి కొంతపైకం ఇచ్చిమార్గదర్శిగా నియమించుకున్నారు. హ.అబూబకర్ గారి కూతురు అస్మా ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు సిధ్ధంచేశారు. చివర్లో నీళ్ళతిత్తి కట్టడానికి సమయానికక్కడ ఏమీ లేకపోవడంతో కంగారు పడ్డారు. కాని వెంటనే మెరుపులాంటి ఆలోచన తట్టగానే క్షణంకూడా ఆలస్యం చెయ్యకుండా తన నడుముకు కట్టుకున్న ఓణీని రెండుముక్కలుగా చింపి మంచినీళ్ళతిత్తి కట్టేశారు. అలాంటి సమయంలో ఆమె సమయస్ఫూర్తికి అచ్చెరువొందిన ప్రవక్తమహనీయులు మందహాసం చేస్తూ, ‘జాతున్నితాఖైన్’ అని సంబోధించారు. అప్పటి నుండి ఆమె ’జాతున్నితాఖైన్ ’ (రెండు ఓణీల మహిళ) గా ప్రసిధ్ధిగాంచారు. ఇబ్నెఅర్ఖత్ మార్గదర్శకత్వంలో ప్రవక్తమహనీయులు, హ.అబూబక్ర్ , ఆయన సేవకుడు ఆమిర్‌లు మదీనాకు పయనమయ్యారు. ప్రవక్తకోసం వెతికి వెతికి వేసారిన Ôè త్రువులు ఇక తమవల్లకాదని, ముహమ్మద్ పట్టిచ్చినవారికి వందఒంటెలు బహుమతిని ప్రకటించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
(మిగతాది వచ్చేవారం)