మంచిమాట
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్షాకవచంగా నిలుస్తుందని సుమతీ శతకకారుని సుధామయ ప్రబోధం.. శాంతం అనేది మానవులు అలవోకగా, అలవాటుగా అలంకరించుకోవలసిన గొప్ప ఆభరణం. క్రోధం కలిగినపుడు మనలో ప్రజ్వరిల్లే తక్షణ ఆవేశానికి లోను కాకుండా మదిని శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. శాంతాన్ని ఆశ్రయించిన అతికొద్ది నిమిషాల్లోనే మనలోని వివేకం మేలుకొంటుంది.
జంతుజాలానికీ, మనకూ ఉన్న భేదమే శాంతాన్ని కలిగించే వివేకం. జంతుకోటికి శాంతం వహించడం అంత సాధ్యం కాదు. వాటికి పక్కనే ఉన్న జంతువులతో తేడా వస్తే, ముందుగా గుర్తుకు వచ్చేది పోరాటం. తమను బాధపెట్టిన జంతువు బలాన్ని బేరీజు వేసుకుంటాయి. వాటితో పోరాటానికి సిద్ధమవుతాయి. అదే జంతువు బలం ఎక్కువైతే, అప్పటికప్పుడే పలాయనం చిత్తగిస్తాయి. వాటికి ఉన్న వివేకసంపద పరిమితి అంతే. కానీ, జంతుకోటికి భిన్నంగా జనించి, సమస్త జీవకోటిలోనూ అత్యంత తెలివైనవాడైన మానవుడు కోపంతోనూ, క్రోధంతోనూ చరించరాదు. బహుళ ప్రయోజనకరమైన శాంతాన్ని అన్నివేళలా ఆశ్రయించాలి.
రంగస్థలంమీద పాత్రధారులు నవరసాలను పోషించి, అలరిస్తారు. అవి వరుసగా– శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. ఈ రసాల్లో హృదయానికి ఎటువంటి ఉద్వేగాన్ని కలగనీయకుండా అలరించే ఏకైక రసం శాంతరసం. రంగస్థలం మీద కొందరే పాత్రధారులుంటారు. జీవన రంగస్థలం మీద మానవులంతా పాత్రధారులే. అంటే, ఒకరితో ఒకరు ఏదో ఒక పనిమీద సంభాషించుకుంటూ ఉంటారు, కార్యకలాపాలను నెరపుతూ ఉంటారు. అటువంటి కార్యాలకు జయాన్ని సిద్ధింపజేయడంలో శాంతం ప్రధానపాత్ర పోషిస్తుంది.
అనవసరంగా కేకలు పెడుతూ, హడావుడి చేసే మనిషి దగ్గరకు చేరడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రశాంత చిత్తంతో, శాంతంతో మాట్లాడే వారి దగ్గరకు అందరూ చేరతారు. తీయగా మాట్లాడే అటువంటి వ్యక్తులకు ఏ రంగంలోనైనా జయాన్ని సాధించే అవకాశమూ మిగిలినవారితో పోలిస్తే బాగా ఎక్కువే..!! శాంతికరమైన వ్యవహారశైలి సొంతమైన వీరు జీవితంలో ఎంతగానో సుఖిస్తారు, వారితో చరించేవారినీ ఆనందపరుస్తారు. అత్యుత్తమమైన శాంత గుణానికున్న ప్రత్యేకతను తేటపరుస్తూ,‘‘శాంతములేక సౌఖ్యము లేదు’’ అన్నాడు వాగ్గేయకారుడు త్యాగయ్య.
అయితే.. మనం ఆలోచించవలసిన ప్రశ్న ఒకటుంది. మనిషికి శాంతమనేది ఏ రకంగా లభిస్తుంది? కొంతమందికి అందమైన భార్య, ప్రయోజకులైన సంతానం, కావలసినంత సంపద.. ఈ విధంగా అన్నీ అమరినట్లే ఉంటాయి. కానీ, జీవితంలో మాత్రం నిరంతరం వారికి ఏదో అసంతృప్తి, అశాంతి..!! దానికి కారణం ఒక్కటే.. తాను కోరుకునే వస్తువులు, లేదా సుఖాల మీద అంతులేని వ్యామోహం నీడలా వెన్నాడడమే..!! మనిషిని సర్వకాల సర్వావస్థల్లో శాంతపరచేది తృప్తి మాత్రమే..!!
ఆనందకరమైన మానవ జీవనానికి నిత్య వసంతాన్ని నింపే ఆమని.. శాంతమనే సంజీవని..
పరిస్థితులవల్ల వచ్చిన ఉద్వేగాలకూ, ఉద్రేకాలకూ లోను కాకుండా స్వభావానికి దగ్గరగా ఉండడమే శాంతంగా వర్తించడమనే నిర్వచనం చెప్పుకోవచ్చు’’ ఇదీ ఓ ఆంగ్ల సిద్ధాంతకర్త వాక్కు. వినగానే, ఒకింత కఠినమైన సూత్రంగా ఈ వాక్యం అనిపించినా, అంతర్లీనమైన భావం మాత్రం సర్వకాల సర్వావస్థల్లో శాంతియుతంగా మానవులను ప్రవర్తించమన్నట్లుగా, శాంతంగా ఎదుటివారితో వర్తించమన్నట్లుగా భావించాలి.
ఇంద్రియాలను జయించినవాడికైనా, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా చదివినవాడికైనా శాంతగుణం అవసరమే. ధన కనక వస్తు వాహనాలెన్ని ఉన్నా, భోగభాగ్యాల్లో తేలియాడామని తలపోసినా, మనిషి ప్రశాంతచిత్తుడు కాకపోతే, అతనికి కలిగే ‘ప్రయోజనం సున్నా’. ఇది వాస్తవం. స్వప్రయోజనాల కోసమో, పదవుల కోసమో వెంపర్లాడుతూ పంచకళ్యాణిలా పరుగెత్తే ఆశలతో సతతమూ నలిగిపోయే వాళ్లకు శాంతమనేది ఒక అందని ద్రాక్ష. జీవితకాలంలో వాళ్లు ఎప్పుడూ స్థిమితంగా ఉండరు. మరొకరిని ఉండనివ్వరు. ఏదో ఒక రూపంలో అసహనం, అశాంతి వాళ్లకు చుట్టంలా చుట్టుకుని ఉంటుంది. పక్కవాళ్లకూ వీళ్ళ సాహచర్యం ఒకింత భరింపరానిదిగానే ఉంటుంది.
– వెంకట్ గరికపాటి
‘‘వ్యాఖ్యాన విశారద’’
Comments
Please login to add a commentAdd a comment