ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త (స) నమాజుకోసం ఇంటినుండి బయలుదేరి మస్జిదుకు వెళ్ళారు. అప్పుడక్కడ మసీదులో కొంతమంది పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు ఏమరుపాటులో పyì ఉన్నారనడానికి అదొక సూచన. ప్రవక్తమహనీయులు అది గమనించారు. వారిని సంస్కరించాలన్న సత్ సంకల్పంతో ఇలా సెలవిచ్చారు:’మీరు గనక మనోవాంఛలను తుంచివేసే మరణాన్ని తరచుగా గుర్తుచేసుకుంటూ ఉన్నట్లయితే, అది మిమ్మల్ని ఇంతలా ఏమరుపాటులో పడి ఉండనిచ్చేది కాదు. కాబట్టి మీరు ఎక్కువగా మృత్యువును గుర్తుచేసుకుంటూ ఉండండి. ఎందుకంటే, మనందరి చివరి మజిలీ అయినటువంటి సమాధి ప్రతిరోజూ, ‘నేను ఒంటరి గృహాన్ని. మట్టి, పురుగుల పుట్టను’ అని ఎలుగెత్తి నినదిస్తూ ఉంటుంది. సమాధి పలికే ఈ పలుకుల్ని, దైవం ఎవరికైతే సమాధి పలుకులు వినగలిగే చెవులను ప్రసాదిస్తాడో వారు మాత్రమే వినగలరు. అంటే, ఒకవ్యక్తి మరణించిన తరువాత అతణ్ణి సమాధి అనబడే భూభాగంలో ఉంచి, పూడ్చడం జరుగుతుంది. అప్పుడు, విశ్వాసం, కర్మల ప్రాతిపదికన ఆ భూమి(సమాధి)ప్రవర్తన మృతుని పట్ల ఎలా ఉంటుందో ప్రవక్తమహనీయులు ఇలా వివరించారు.
‘ఒక వ్యక్తి సమాధి చేయబడిన తరువాత, అతను గనక నిజమైన విశ్వాసి అయినట్లయితే, భూమి ఒక ఆప్తమిత్రునికి స్వాగతం పలికినట్లుగా ఆహ్వానిస్తూ, ‘స్వాగతం.! సుస్వాగతం.! నీరాక సంతోషం, శుభకరం.! రా.. నా ఇంటిలోకి ప్రవేశించు. నా వెన్నుపై ఎంతమంది నడిచారో వారందరిలో నువ్వే నాకు అత్యంత ప్రీతిపాత్రుడవన్నవిషయం నీకు తెలియాలి. ఈరోజు నువ్వునాదగ్గరికొచ్చావు. నాకు అప్పగించబడ్డావు. ఇప్పుడు నేను నీతో ఎలా ప్రవర్తిస్తానోచూడు.’ అంటూ భూమి (సమాధి) ఆ విశ్వాసి కనుచూపు మేర విశాలమవుతుంది. అతని/ఆమె కోసం స్వర్గద్వారం తెరవబడుతుంది.
అలాగే, ఒక పాపాత్ముడు సమాధి చేయబడినప్పుడు భూమి అతనితో ఇలా అంటుంది. ‘ఎంతమంది నాపై నడిచేవారో వారందరిలో నువ్వే నాకు అయిష్టమైనవాడివి, అత్యంత నీచుడివి. ఈరోజు నువ్వు నాకు అప్పగించబడ్డావు. నా అధీనంలో ఉన్నావు. ఇకచూడు, నీపట్ల నాప్రవర్తన ఎలా ఉంటుందో..!’ అంటూ ఆ సమాధి నలువైపులనుండీ అతణ్ణి ఒత్తిపడేస్తుంది. ఆ ఒత్తిడికి పక్కటెముకలు ఒకదానిలోకొకటి చొచ్చుకొనిపోతాయి.
అందుకే... ‘సమాధి స్వర్గవనాల్లోని ఓ ఉద్యానవనం లేదా నరకకూపాల్లోని ఓ నరకపు అగడ్త తప్ప మరేమీ కాద’ని ప్రవక్తమహనీయులు సెలవిచ్చారు.అందుకని ప్రతి ఒక్కరూ స్వర్గాన్ని సొంతం చేసుకోడానికి, నరక జ్వాలలనుండి రక్షించబడడానికి శక్తివంచనలేని ప్రయత్నం చెయ్యాలి. ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ, సమాజ సంక్షేమానికి పాటుబడాలి. అల్లాహ్ మనందరికీ ఇహలోక, పరలోక సాఫల్యాలు అనుగ్రహించాలని మనసారా కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
స్వర్గవనమా..! నరక కూపమా..!!
Published Sun, Oct 21 2018 12:27 AM | Last Updated on Sun, Oct 21 2018 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment