రమజాన్ పండుగ సంబరాలుప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో జరుగుతాయి.
అల్లాహు అక్బర్ .. అల్లాహుఅక్బర్.. లాయిలాహ ఇల్లల్లాహువల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లాహిల్ హంద్ ..!రమజాన్ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడామగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరినోటవిన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి.కొత్తబట్టలు, కొత్తకొత్త మేజోళ్ళు, కొత్తహంగులు, తెల్లని టోపీలు, అత్తరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్‌లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి.సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ల హడావిడితో ముస్లిముల లోగిళ్లు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్లలో ఆడవాళ్ల హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగకాదు గదా! నెలనాళ్ల పాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్ ’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్రగ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించిపోతుంటారు.
ఆనందహేల
అవును, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే రమజాన్ పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండుముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజా వ్రతం పాటిస్తారు. భక్తి శ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేసి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవ నామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయం చెందుతుంటారు. దానధర్మాలు, ఫిత్రాల చెల్లింపులో ఆనంద పరవశులవుతుంటారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాస దీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది .రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్రఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది.
సామరస్యం వెల్లివిరిసే రోజు
రమజాన్ నెల ఆరంభం నుండి ముగింపు వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈ నెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ‘ఈద్’ (పండుగ)ను శ్రామికుని వేతనం (ప్రతిఫలం) లభించే రోజు అని చెప్పడం జరిగింది. సదాచరణల సంపూర్ణ ప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకొని ఆనందతరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్. ఆ రోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్ ’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది. ప్రేమత త్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్థం.
ఈద్ నాటి సంప్రదాయం
రమజాన్ నెల పూర్తి రోజాలను నెరవేర్చడమంటే, దైవాదేశపాలనలో ఒక గురుతరమైన బాధ్యతను నెరవేర్చడం. ఇలాంటి సందర్భంలో ఒకమనిషిగా అతని హృదయం ఆనందంతో పొంగిపోవడం, ఒక విశ్వాసిగా అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోవడం సహజం. ఈ సహజ భావోద్రేకాలే ’ఈదుల్ ఫిత్ర్’ రూపంలో బహిర్గతమవుతాయి. ఈ పండుగలో విశ్వాసి తాను రోజా విధి నెరవేర్చిన సందర్భంగా తన హృదయంలోని సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. మరోవైపు అల్లాహ్ ఆదేశ పాలనలో ఒకవిధిని నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాడు. ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో జరుగుతాయి.
పండుగ సంప్రదాయం
గుసుల్ చేయడం: ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్ గాహ్ కు వెళ్లే ముందు గుసుల్ (స్నానం) చేయాలి.మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి.సుగంధ ద్రవ్యాలు వాడటం : ఉన్నంతలోనే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు వాడాలి.ఈద్ గాహ్ కు వెళుతూ బిగ్గరగా తక్బీర్ పలకడం : అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్, లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లాహిల్ హంద్ అని బిగ్గరగా పలుకుతూ ఉండాలి.కాలినడకన ఈద్ గాహ్ కు వెళ్ళడం: నమాజు కోసం ఈద్ గాహ్ కు కాలినడకన వెళ్లాలి. ఒకదారిన వెళ్లి, మరోదారిన తిరిగి రావాలి.ఖర్జూరాలు తినడం : ఈద్ గాహ్ కు వెళ్లే ముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపివస్తువు తినవచ్చు. 3,5,7 ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తిని ప్రవక్త మహనీయులు ఈద్ గాహ్ కు వెళ్లేవారు.
– మదీహా అర్జుమంద్
Comments
Please login to add a commentAdd a comment