త్యాగాల స్మరణ | muharram special story | Sakshi
Sakshi News home page

త్యాగాల స్మరణ

Published Mon, Oct 10 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

త్యాగాల స్మరణ

త్యాగాల స్మరణ

ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ప్రజలు ముహమ్మద్ ప్రవక్త మనమడైన ఇమామ్ హుసైన్ త్యాగాలను స్మరించుకుంటూ ఆయన అమరత్వం పట్ల సంతాపం వ్యక్తపరుస్తూ ఉండే సందర్భమే మొహర్రమ్. హుసైన్ ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం నిండు ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారో ఆ లక్ష్యాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

ముహమ్మద్ ప్రవక్త నిర్యాణం తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో పాలనా బాధ్యతలు చేపట్టిన తొలి నలుగురు ఖలీఫాలు- అబూబక్,్ర ఉమర్, ఉస్మాన్, అలీ గార్ల పరిపాలనాకాలం ప్రపంచ మానవ ఇతిహాసంలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృజించింది. కాని తరువాతి కాలంలో పరిస్థితులు మారాయి. అధికారం కోసం పోరు ప్రారంభమైంది.  ప్రజలు ముహమ్మద్ మనమడు, హుసైన్ సోదరుడు అయిన హజ్రత్ హసన్‌ని ఖలీఫాగా ఎన్నుకున్నారు.

కాని సిరియా ప్రాంత గవర్నరుగా ఉన్న అమీర్ ముఆవియా అధికారం కోసం పోటీ పడగా యుద్ధవాతావరణం నెలకొని హసన్ ఖలీఫా పదవి నుండి తప్పుకున్నారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ప్రజలు అమీర్ ముఆవియాకు అధికారం కట్టబెట్టారు. ఆ తరువాత అమీర్ ముఆవియా  తన కొడుకు యజీద్‌ను రాజకీయ

 వారసుణ్ణి చేయడానికి భయప్రలోభాల ద్వారా ప్రజల్ని దారికి తెచ్చుకున్నాడు. ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులు, న్యాయప్రేమికులు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అందుకే కూఫా ప్రజలు హసన్ తమ్ముడైన ఇమామ్ హుసైన్‌కు మద్దతు ప్రకటిస్తూ ఆహ్వానించారు. దీంతో ఇమామ్ హుసైన్  కూఫాకు పయనమయ్యారు. అదే గనక జరిగితే యజీద్ పీఠానికి ప్రమాదం తప్పదు. అందుకని యజీద్  ఇమామ్ హుసైన్ కూఫా చేరకుండా మార్గాలన్నీ సైనికులతో మూసివేశాడు. దాంతో ఇమామ్ బృందం ‘కర్బలా’ చేరుకుని ఆగిపోయింది. అక్కడ తనను అడ్డుకున్న సేనాధిపతితో ఇమామ్ హుసైన్ మూడు విషయాలను ప్రతిపాదించాడు. 1. నన్ను యజీద్ దగ్గరకు వెళ్ళనివ్వండి. నేరుగా ఆయనతో మాట్లాడతాను. 2. నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. 3. లేదా నన్ను ఏదైనా సరిహద్దు ప్రాంతంలో వదిలేయండి. కాని యజీద్ సైన్యం ఏ ప్రతిపాదననూ అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర సంగ్రామం మొదైలంది. చూస్తూ చూస్తూనే ‘కర్బలా’ మైదానం రుధిర ధారలతో ఎరుపెక్కింది. ఇమాం శిబిరంలోని సుమారు 72 మంది ఒక్కొక్కరుగా నేలకొరిగారు. చివరికి మిగిలింది ఇమామె హుసైన్ ఒక్కరే.

 అది హి.శ. 61. ‘మొహర్రం’ నెల, పదవ తేదీ. ఇమామ్ హుసైన్ ఒక్కరే ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మ పరిరక్షణ కోసం వీరోచితంగా పోరాడుతూ అమరగతులయ్యారు. ఇమామ్ హుసైన్ నేలకొరగగానే సేనాని ఇబ్నెజియాద్ ఆదేశంతో అతడి సైనికులు ఆ అమరవీరుని

 శిరస్సును ఖండించారు. పార్థివ దేహం నుండి శిరస్సునూ, చేతులను ఖండించి బాణాలు, బరిశలకు తగిలించి కూఫా వీధుల్లో ఊరేగించారు. పలావులు వండుకొని, పానకాలు చేసుకొని తిన్నారు, తాగారు. ఇదీ సంక్షిప్తంగా ఆనాడు జరిగిన ఘోరదుర్ఘటన.

 కాని న్యాయప్రేమికులు, ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో అది హుసైన్ చేసిన త్యాగానికి న్యాయపోరాటానికి తార్కాణం. దుష్టరాజకీయ శక్తుల ఆటకట్టించి, సమాజంలోని అన్నివర్గాలూ సముదాయాల ప్రజలకు సమాన న్యాయం అందించగలిగే ధీరోదాత్తులు నేటి అవసరం. దీనికోసం న్యాయప్రేమికుడైన ఇమామ్ హుసైన్ ప్రజాస్వామ్య స్పూర్తిని, ఆయనగారి పోరాట పటిమను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఆశయ సాధనకోసం ఇమామ్ అమరుడయ్యారో దానికోసం అలుపెరుగని ప్రయత్నం చేయడమే ఇమామ్ హుసైన్‌కు నిజమైన నివాళి.  - యండి.ఉస్మాన్ ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement