ప్రపంచం పరుగెడుతోంది.... | All the Players Prepared For The World Athletics Championship | Sakshi
Sakshi News home page

ప్రపంచం పరుగెడుతోంది....

Published Fri, Sep 27 2019 2:46 AM | Last Updated on Fri, Sep 27 2019 5:33 AM

All the Players Prepared For The World Athletics Championship - Sakshi

సెకనులో వందో వంతు పతక విజేతను తేలుస్తుంది... సెంటీ మీటర్‌ తేడాతో స్వర్ణం కాస్తా రజతంగా మారిపోతుంది... నలుగురిలో ఒకరి అడుగు తడబడినా అది అందరి బాధగా మారుతుంది... ఉత్కంఠ,ఉద్వేగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే భారీ క్రీడా సంబరం అభిమానులను అలరించేందుకు మళ్లీ వచి్చంది. ఎడారి దేశం ఖతర్‌లో స్వేదం చిందించేందుకు విశ్వవ్యాప్తంగా అథ్లెట్లు ట్రాక్‌పై సిద్ధంగా ఉన్నారు. ఒలింపిక్స్‌ తర్వాత ఆ స్థాయి ఆకర్షణ ఉన్న ఈవెంట్‌ అయిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు నేటితో తెర లేవనుంది.

దోహా (ఖతర్‌):  ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సన్నద్ధమయ్యారు. ఖలీఫా అంతర్జాతీయ స్టేడియంలో నేటి నుంచి అక్టోబరు 6 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. 200 దేశాలకు చెందిన దాదాపు 2000కు పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. అథ్లెట్ల కోణంలో చూస్తే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ బలాన్ని చాటేందుకు, తద్వారా సన్నద్ధతకు ఈ చాంపియన్‌షిప్‌ అవకాశం కలి్పస్తుండగా... 2020లో ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతర్‌ నిర్వహణా సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల రిలేలకు తోడు తొలిసారి మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌ నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో పురుషులు, మహిళలు కలిసి పరుగెడతారు.  

బోల్ట్‌ లేకుండా...
మొత్తం 14 పతకాలు...ఇందులో ఏకంగా 11 స్వర్ణాలు. 2007 నుంచి 2017 వరకు ఆరు ప్రపంచ చాంపియన్‌షిప్‌లను శాసించిన దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ శకం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి పోటీలు ఇవి. దాంతో అందరి దృష్టీ కొత్తగా వచ్చే 100 మీ., 200 మీ. చాంపియన్‌లపై నిలిచింది. అమెరికా స్టార్‌ నోహ్‌ లైల్స్‌ ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. యూఎస్‌కే చెందిన క్రిస్టియన్‌ కోల్‌మన్‌ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురవుతోంది. మహిళల స్ప్రింట్‌లో 32 ఏళ్ల వెటరన్‌ అథ్లెట్‌ షెలీ ఆన్‌ ఫ్రేజర్‌ మళ్లీ పతకం కోసం పోరాడనుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కార్‌స్టన్‌ వార్‌హోల్మ్‌ (నార్వే) పతకం నెగ్గే అవకాశాలు ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన వార్‌హోల్మ్‌ ఈసారి 46.78 సెకన్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ విన్‌స్టన్‌ బెంజమిన్‌ కుమారుడు రాయ్‌ బెంజమిన్‌ కూడా ఈ విభాగంలో గట్టి పోటీదారుడు. దినా అషర్‌ స్మిత్‌ (బ్రిటన్‌ – 100 మీ.), యులిమర్‌ రోజస్‌ (వెనిజులా – ట్రిపుల్‌ జంప్‌), సిఫాన్‌ హసన్‌ (నెదర్లాండ్స్‌ – లాంగ్‌ డిస్టెన్స్‌)లు బరిలో ఉన్న ఇతర స్టార్‌ అథ్లెట్లు.

మన బలమెంత?
ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత జట్టు ఇప్పటి వరకు ఒకే ఒక్క పతకం సాధించింది. 2003 పారిస్‌ ఈవెంట్‌లో లాంగ్‌జంపర్‌ అంజూ బాబీ జార్జ్‌ కాంస్యంతో మెరిసింది. అంతే... ఆ తర్వాత పోటీలకు వెళ్లటం, రిక్తహస్తాలతో తిరిగి రావడం రొటీన్‌గా మారిపోయింది. గత రెండేళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే ఎంతో కొంత ఆశలు రేపిన ఇద్దరు అథ్లెట్లు గాయాలతో ఈ పోటీలకు దూరం కావడంతో ఆమాత్రం అవకాశం కూడా లేకుండా పోయింది. జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, స్ప్రింటర్‌ హిమ దాస్‌ ఈచాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదు. 2017లో జరిగిన గత పోటీల్లో ఒకే ఒక్కడు దవీందర్‌ సింగ్‌ (జావెలిన్‌) మాత్రమే ఫైనల్‌కు చేరగలిగాడు. మిగతావారంతా క్వాలిఫయింగ్‌/ హీట్స్‌తోనే సరిపెట్టారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్‌ 4్ఠ400 రిలేలో మనవాళ్లు ఫైనల్‌ చేరగలరని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య ఆశిస్తోంది. వ్యక్తిగత ఈవెంట్‌లో లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌పై అంచనాలు ఉన్నాయి. ఫైనల్‌ చేరేందుకు కనీస ప్రదర్శన 8.15 మీటర్లు కాగా... శ్రీశంకర్‌ తన కెరీర్‌లో ఒకేసారి 8.15 మీటర్లకంటే ఎక్కువ దూరం దూకాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement