Khalifa
-
ప్రపంచం పరుగెడుతోంది....
సెకనులో వందో వంతు పతక విజేతను తేలుస్తుంది... సెంటీ మీటర్ తేడాతో స్వర్ణం కాస్తా రజతంగా మారిపోతుంది... నలుగురిలో ఒకరి అడుగు తడబడినా అది అందరి బాధగా మారుతుంది... ఉత్కంఠ,ఉద్వేగాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే భారీ క్రీడా సంబరం అభిమానులను అలరించేందుకు మళ్లీ వచి్చంది. ఎడారి దేశం ఖతర్‌లో స్వేదం చిందించేందుకు విశ్వవ్యాప్తంగా అథ్లెట్లు ట్రాక్‌పై సిద్ధంగా ఉన్నారు. ఒలింపిక్స్ తర్వాత ఆ స్థాయి ఆకర్షణ ఉన్న ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు నేటితో తెర లేవనుంది. దోహా (ఖతర్): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సన్నద్ధమయ్యారు. ఖలీఫా అంతర్జాతీయ స్టేడియంలో నేటి నుంచి అక్టోబరు 6 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. 200 దేశాలకు చెందిన దాదాపు 2000కు పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. అథ్లెట్ల కోణంలో చూస్తే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ బలాన్ని చాటేందుకు, తద్వారా సన్నద్ధతకు ఈ చాంపియన్‌షిప్ అవకాశం కలి్పస్తుండగా... 2020లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతర్ నిర్వహణా సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల రిలేలకు తోడు తొలిసారి మిక్స్డ్ రిలే ఈవెంట్ నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో పురుషులు, మహిళలు కలిసి పరుగెడతారు. బోల్ట్ లేకుండా... మొత్తం 14 పతకాలు...ఇందులో ఏకంగా 11 స్వర్ణాలు. 2007 నుంచి 2017 వరకు ఆరు ప్రపంచ చాంపియన్‌షిప్‌లను శాసించిన దిగ్గజం ఉసేన్ బోల్ట్ శకం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి పోటీలు ఇవి. దాంతో అందరి దృష్టీ కొత్తగా వచ్చే 100 మీ., 200 మీ. చాంపియన్లపై నిలిచింది. అమెరికా స్టార్ నోహ్ లైల్స్ ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. యూఎస్‌కే చెందిన క్రిస్టియన్ కోల్మన్ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురవుతోంది. మహిళల స్ప్రింట్‌లో 32 ఏళ్ల వెటరన్ అథ్లెట్ షెలీ ఆన్ ఫ్రేజర్ మళ్లీ పతకం కోసం పోరాడనుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కార్స్టన్ వార్హోల్మ్ (నార్వే) పతకం నెగ్గే అవకాశాలు ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ అయిన వార్హోల్మ్ ఈసారి 46.78 సెకన్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ విన్స్టన్ బెంజమిన్ కుమారుడు రాయ్ బెంజమిన్ కూడా ఈ విభాగంలో గట్టి పోటీదారుడు. దినా అషర్ స్మిత్ (బ్రిటన్ – 100 మీ.), యులిమర్ రోజస్ (వెనిజులా – ట్రిపుల్ జంప్), సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్ – లాంగ్ డిస్టెన్స్)లు బరిలో ఉన్న ఇతర స్టార్ అథ్లెట్లు. మన బలమెంత? ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత జట్టు ఇప్పటి వరకు ఒకే ఒక్క పతకం సాధించింది. 2003 పారిస్ ఈవెంట్లో లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జ్ కాంస్యంతో మెరిసింది. అంతే... ఆ తర్వాత పోటీలకు వెళ్లటం, రిక్తహస్తాలతో తిరిగి రావడం రొటీన్‌గా మారిపోయింది. గత రెండేళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే ఎంతో కొంత ఆశలు రేపిన ఇద్దరు అథ్లెట్లు గాయాలతో ఈ పోటీలకు దూరం కావడంతో ఆమాత్రం అవకాశం కూడా లేకుండా పోయింది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్ప్రింటర్ హిమ దాస్ ఈచాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదు. 2017లో జరిగిన గత పోటీల్లో ఒకే ఒక్కడు దవీందర్ సింగ్ (జావెలిన్) మాత్రమే ఫైనల్‌కు చేరగలిగాడు. మిగతావారంతా క్వాలిఫయింగ్/ హీట్స్‌తోనే సరిపెట్టారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ 4్ఠ400 రిలేలో మనవాళ్లు ఫైనల్ చేరగలరని భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఆశిస్తోంది. వ్యక్తిగత ఈవెంట్లో లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌పై అంచనాలు ఉన్నాయి. ఫైనల్ చేరేందుకు కనీస ప్రదర్శన 8.15 మీటర్లు కాగా... శ్రీశంకర్ తన కెరీర్లో ఒకేసారి 8.15 మీటర్లకంటే ఎక్కువ దూరం దూకాడు. -
నేనున్నాను కదా..!
ఒకరోజు రాత్రి గస్తీ తిరుగుతుండగా హజ్రత్ ఉమర్ (రజి)కు కొంతమంది పిల్లల రోదనలు వినిపించసాగాయి. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారనే విషయం హజ్రత్ ఉమర్ (రజి)కు బోధపడింది. వాళ్లను సముదాయిస్తూ ఆ పిల్లల తల్లి ఒక గిన్నెలో నీళ్లు పోసి పొయ్యిమీద ఏదో వండుతున్నట్లు నటిస్తున్న దృశ్యాలు హజ్రత్ ఉమర్ (రజి) గమనించారు. ఆ సమయంలో తన సేవకుడు అస్లామ్ ఆయన వెంట ఉన్నారు. ఉన్నపళంగా ధనాగారానికి చేరుకున్నారు. పిండి, నెయ్యి, ఖర్జూరాలు తదితర నిత్యావసరాలను ఒక బస్తాలో నింపుకుని ఈ బస్తాను తన నడుముపై పెట్టాలని సేవకుడిని కోరారు. దానికి సేవకుడు అస్లమ్ ‘‘ఖలీఫా ఇంత కష్టం తమరికెందుకు? నేనున్నాను కదా’’ అని అన్నాడు. ‘‘ప్రళయం రోజు ఒకరి బరువును మరొకరు మోయరు కదా అస్లామ్’’ అంటూనే ఆ మూటను మోసుకుంటూ వెళ్లి ఆ గృహిణికి అందించారు ఖలీఫా. స్వయంగా తన స్వహస్తాలతో పొయ్యి రాజేసి వంటను సిద్ధం చేసి పిల్లలకు తినిపించారు. కడుపునిండా తిన్న పిల్లలు ఆడుతూ పాడుతూ కేరింతలు వేయసాగారు. ఆ పిల్లలు ఆటపాటలను చూసి హజ్రత్ ఉమర్ సంతోషించారు. దీనికి కృతజ్ఞతగా ఆ గృహిణి ‘‘ఖలీఫా పదవికి నీవే అన్ని రకాలా అర్హుడివిగా కనపడుతున్నావు. అల్లాహ్ నా దీవెన యథార్థం చేయుగాక’’ అంటూ దీవెనలు అందించింది. ఉమర్ ఆ మహిళ మాటలు విని మనస్సులోనే నవ్వుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. – ఎస్.ఎం. బాషా -
ఖలీఫా ఇంట పండగ
ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గొప్ప ధర్మనిష్టాపరులు. తన ధనాగారంలో ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించేవారు. అది రమజాన్ నెల. ఈద్ జరుపుకోవడానికి ప్రజలంతా ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటున్నారు. ఖలీఫా గారి ఇంటిలో మాత్రం అలాంటి సందడేమి కనిపించడం లేదు! స్నేహితులంతా కొత్తకొత్త బట్టలు కొనుక్కుంటుంటే ఖలీఫా పిల్లలకూ కొత్తబట్టలపై మోజు పుట్టింది. తండ్రి కొత్త బట్టలు తెస్తారన్న ఆతృతతో రోజూ ఎదురు చూడసాగారు. కానీ వాళ్లకు నిరాశే మిగిలేది. చిన్నారుల ఆవేదనను అర్థం చేసుకున్న ఆ తల్లి... ఇంటికి వచ్చిన భర్తతో ‘ఏమండీ... ఊళ్లో వాళ్లంతా తమ పిల్లలకు పండుగకోసం కొత్త్త దుస్తులు కొంటున్నారు. మనకు లేకపోయినా పర్వాలేదు. కనీసం పిల్లలకైనా చెరో జత బట్టలు తీసుకురండి’ అని భర్తను ప్రాధేయపడింది. ‘వాళ్లకు కొత్త బట్టలు ఇప్పించాలని నాకు మాత్రం లేదా చెప్పు. కాని ఏం చేయమంటావు, నాకొచ్చే జీతంతో ఇల్లు గడవడమే గగనం. ఇక పిల్లలకు కొత్త బట్టలు కొనే స్థోమత ఎక్కడిది’ అని దీనంగా చెప్పుకొచ్చారు ఖలీఫా. ‘మన్నించండి.. పసిపిల్లల ఆవేదన చూడలేక అడిగానే కానీ నాకు మాత్రం తెలియదా?’ అని భర్తను ఓదార్చింది. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ‘నేను ఖలీఫానే. నా అధీనంలో ఎనలేని ధనరాశి ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ నేను కేవలం దానికి కాపలాదారుడ్ని మాత్రమే. ఆ ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలి. అందులో ఆవగింజంతైనా అవకతవక జరిగితే రేపు ప్రళయదినాన పరలోకంలో ఆ విశ్వప్రభువు ముందు పట్టుబడిపోవలసి వస్తుంది. కనుక ఉన్నదాంట్లోనే పండుగ జరుపుకుందాం’ అని చెప్పారు ఖలీఫా. రమజాన్ ఉపవాసాలు ఆశించేది ఇలాంటి దైవభీతినే. – తహూరా సిద్దీఖా -
ఖలీఫా గారూ.. శుభవార్త
అది ఖలీఫా హజరత్ ఉమర్ ఫారూఖ్ (రజి) పాలనాకాలం. ప్రజల యోగ క్షేమాలు తెలుసుకోవడానికి గాను ఆయన మారువేషంలో స్వయంగా గస్తీ తిరిగేవారు. ఒకరోజు అలా మదీనా పట్టణంలోని వీధులలో తిరుగుతున్నారు. ఒక ఇంటి నుండి మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించి ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి ముందర కూర్చున్న వ్యక్తిని చూసి సలాం చేసి ‘ఎవరు నీవు?’ అని అడిగారు. ఆ వ్యక్తి ‘అయ్యా! నేనొక ఎడారి నివాసిని, మన ఖలీఫా వారి వద్దకు వెళ్లి వారి దయాదక్షిణ్యాలతో సహాయం పొందాలని వచ్చాను’ అని చెప్పాడు. ‘మరి ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తోందే! అది ఎవరు?’ అని ప్రశ్నించారు. ‘నా భార్య నిండు గర్భవతి. పురుటినొప్పులతో బాధపడుతోంది’ అని బదులు పలికాడా వ్యక్తి. ‘ఆమె వద్ద ఎవరైనా ఉన్నారా?’ అని అడుగగా ఎవ్వరూ లేరని ఆ వ్యక్తి విచారంగా చెప్పాడు. వెంటనే ఖలీఫాగారు ఇంటికెళ్లి తన భార్య హజరత్ ఉమ్మె కుల్సుం (రజి)తో ‘ఒక నిరుపేద స్త్రీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆమె వద్ద ఎవ్వరూ లేరు. కొన్ని వస్త్రాలు, నూనె, కాన్పు సమయంలో అవసరమయ్యే సామాగ్రి తీసుకుని నాతో రండి’ అని చెప్పారు. ఆమె ఒక మట్టి పాత్ర, కొంత పిండి, నెయ్యి, బెల్లం తదితర సామగ్రి తీసుకుని ఖలీఫా గారి వెంబడి వెళ్లారు. ఆ ఇంటికి చేరిన తర్వాత భార్యను లోపలికి పంపి ఖలీఫా గారు బయట కూర్చున్న వ్యక్తి వద్దకు వచ్చి కూచోని పొయ్యి వెలిగించి, కుండను పొయ్యిమీద ఉంచి కుండలో నీళ్లు పోసి పిండి, బెల్లం, నెయ్యి ఖర్జూరాలు వేసి రుచికరమైన పదార్థాన్ని తయారు చేశారు. అంతలోనే ఖలీఫా భార్య లోపలి నుండి ‘ఓ ఖలీఫాగారూ, మీ స్నేహితునికి పుత్రుడు జన్మించిన శుభవార్త తెల్పండి’ అన్నారు.‘ఖలీఫా గారు’ అన్న సంబోధన విన్న ఆ పల్లెటూరి వ్యక్తి నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు. అతన్ని చూసిన ఖలీఫా ఆ కుండను ఆ వ్యక్తి ముందుంచి ‘నువ్వు ఏమీ ఆలోచించ వద్దు, రాత్రంతా మేల్కొని ఉన్నారు కదా, నీవు, నీ భార్య కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుని, తెల్లవారగానే నా వద్దకు రండి. మీకు అవసరమైన సామగ్రి ఇచ్చి, ధనసహాయం చేస్తాను’ అని చెప్పి, తన భార్యను తీసుకొని తమ నివాసానికి వెళ్లిపోయారు. – అబ్దుల్ జబ్బార్ -
ఖలీఫా చూడకపోయినా..!
‘‘ఫలానా తల్లీ కూతుళ్లను వెంటబెట్టుకునిరండి’’ అని రాజభటులకు పురమాయించారు.ఖలీఫా గారు తమను ఎందుకు పిలిపించారో తెలియక ఆ తల్లీకూతుళ్లు భయంతో వణికిపోయారు. ఖలీఫా ఉమర్ (రజి) చక్రవర్తిగా పరిపాలన చేస్తున్న కాలం అది. ఆయన తెల్లవారుఝామున లేచి ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు గస్తీ తిరిగేవారు. ఆ రోజు గస్తీ తిరుగుతుండగా ఒక యువతి, ఒక పెద్ద వయసు మహిళ సంభాషణ ఖలీఫా చెవుల్లో పడ్డాయి. ‘‘అమ్మా ఈ రోజు మేకలు పాలు చాలా తక్కువగా ఇచ్చాయి’’ అంది కూతురు. అందుకు ఆ తల్లి నవ్వేసి, ‘‘దానికి ఇంతలా ఆలోచించాలా, పాలల్లో కాసిన్ని నీళ్లు కలుపు’’ అని తన బిడ్డకు పురమాయించింది. ‘‘అమ్మా అపచారం, మన ఖలీఫా గారు పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం నిషేధించారు కదా’’ గుర్తుచేసింది కూతురు. ‘‘పిచ్చిదానా, ఖలీఫా ఏమైనా ఇక్కడకు వచ్చి చూస్తున్నారా ఏమిటీ’’ అని తల్లి నచ్చజెప్పపోయింది. ‘‘ఖలీఫా చూడకపోయినా, ఖలీఫా ఆరాధించే ప్రభువు చూస్తున్నాడు కదమ్మా’’ అంది కూతురు. ఈ మాటలు ఖలీఫాకు ఎంతగానో నచ్చాయి. మారు మాట్లాడకుండా తన రాజదర్బారుకు చేరుకున్నారు. ‘‘ఫలానా తల్లీ కూతుళ్లను వెంటబెట్టుకుని రండి’’ అని రాజభటులకు పురమాయించారు. ఖలీఫా గారు తమను ఎందుకు పిలిపించారో తెలియక ఆ తల్లీకూతుళ్లు భయంతో వణికిపోయారు. అయితే, అందుకు విరుద్ధంగా ఖలీఫా వారికి సాదర స్వాగతం పలికారు.‘‘దైవం పట్ల అచంచల నమ్మకమున్న దైవభీతి పరురాలైన మీ అమ్మాయి పెళ్లి మా అబ్బాయితో జరిపించాలనుకుంటున్నాను. మీకు అందుకు సమ్మతమేనా?’’ అంటూ ఆ మహిళను సూటిగా అడిగారు. ఆమె ఆనందంగా అంగీకరించింది. వెంటనే తన కుమారుడికి ఆ పాలమ్మాయితో పెళ్లి జరిపించారు ఖలీఫా. మేకపాలను అమ్ముకుని సాధారణ జీవనం గడిపే ఒక పేదింటి అమ్మాయి ప్రదర్శించిన దైవభీతి ఆమెను చక్రవర్తి ఇంటి కోడలిని చేసింది. జవాబుదారీతనం, దేవుడు చూస్తున్నాడనే తలంపే పాలకులనైనా, ప్రజలనైనా సత్యంపై, ధర్మంపై నిలకడగా ఉంచుతుందన్నది ఈ కథలోని నీతి. – ముహమ్మద్ ముజాహిద్ -
శిథిలాలే మిగిలాయి...!
మోసుల్ తిరిగి ఇరాక్ వశమైంది. ఐసిస్‌ను తరిమేశారు... కచ్చితంగా ఇది విజయమే. కానీ ఇప్పుడు ఏముందక్కడ? ఎటుచూసినా శిథిలాలే. యుద్ధం మిగిల్చిన గాయాలే. పూర్తిగా నేలమట్టమైన భవనాలు కొన్ని, సగం కూలినవి మరికొన్ని. కాలిబూడిదైన కార్లు... జాడలేని రోడ్లు. నీళ్లు లేవు, కరెంటు లేదు, కనీస వసతులేవీ లేవు. బడి, గుడి, ఆసుపత్రి... అన్నీ నేలమట్టమే. 12వ శతాబ్దంలో నిర్మించిన... మోసుల్కు తలమానికంగా నిలిచిన చారిత్రక ఆల్ నూరీ మసీదు కాలాన్ని తట్టుకొని ఠీవిగా నిలిచింది. మసీదు ఆవరణలోని 150 అడుగుల అల్ హబ్దా మినార్... మోసుల్ అనగానే గుర్తొచ్చే కట్టడం. ఇప్పుడుక్కడ మినార్ ఆనవాళ్లు కూడా లేవు. ఇరాక్ కరెన్సీ పైనా, పాత చిత్రాలు, వీడియోల్లో మాత్రమే మనం దీన్ని చూడగలం. జూన్ 22న ఐసిస్ దీన్ని పేల్చివేసింది. మొత్తం 44 జిల్లాల్లో పశ్చిమ మోసుల్‌లోని ఆరు జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముక్కుపుటల అదిరిపోయే దుర్వాసన. బాంబు పేలుళ్లలో ముక్కలైన మానవ కళేబరాలు... కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నాయి. శిథిలాల కింద చిక్కిచనిపోయిన వారి పార్థివదేహాలదీ అదే పరిస్థితి. జనంతో కళకళలాడిన ఇరాక్‌లోని రెండో పెద్ద నగరం మోసుల్... మూడేళ్లలో చిధ్రమైపోయింది. మూడేళ్ల కిందట ఐసిస్ చేతుల్లోకి... పద్దెనిమిది లక్షల జనాభాగల మోసుల్ ఇరాక్‌లో ఉత్తరాన ఉంటుంది. సిరియా, టర్కీ సరిహద్దులకు సమీపంలోగల ఈ పట్టణాన్ని 2014 జూన్‌లో ఉగ్రవాద సంస్థ ఐసిస్ కైవసం చేసుకుంది. మోసుల్‌లోని అల్ నూరీ మసీదు నుంచి ఐసిస్ చీఫ్ అబూబాకర్ అల్ బగ్దాదీ తనను తాను ‘ఖలీఫా’గా ప్రకటించుకున్నాడు. ఇరాక్, సిరియాలలో ఐసిస్ ఆధీనంలో ఉన్న భూభాగంలో అతిపెద్ద పట్టణం మోసుల్. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 10 వేల మంది సైనికులను మొహరించి ఇరాక్ 2016 అక్టోబరులో పోరు ముమ్మరం చేసింది. అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు వీరికి మద్దతుగా నిరంతరం గగనతల దాడులు చేశాయి. బాంబుల వర్షం కురిపించాయి. పోరు ఉధృతమవ్వడంతో ఐసిస్ ఉగ్రవాదులు టిగ్రిస్ నదిని ఆనుకొని ఉండే... జనసమ్మర్ధమైన ఓల్డ్‌సిటీని కేంద్రంగా చేసుకొని పోరాడారు. నగరానికి పశ్చిమాన ఉండే ఓల్డ్‌సిటీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. మానవ కవచాలుగా స్థానికులను వాడుకున్నారు. వారిని మానవబాంబులుగా మార్చి... ఇరాకీ బలగాలపైకి విసిరేసే వారు. శిథిలాల్లో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ... మొత్తం మీద 9 నెలల్లో ‘ఆపరేషన్ మోసుల్’ను పూర్తిచేశారు ఇరాక్ సైనికులు. నిర్వాసితులు తొమ్మిది లక్షలు... మోసుల్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన పోరులో వేలాది మంది అమాయకుల ప్రాణాలుపోయాయి. ఎటువైపు నుంచి ఏ తూటా దూసుకొస్తుందో, ఎప్పుడు పైనుంచి బాంబులు పడతాయో తెలియదు. బతికుంటే చాలునని కట్టుబట్టలతో ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇలాంటి నిర్వాసితులు తొమ్మిది లక్షల మంది ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. బంధువుల ఇళ్లలో, శరణార్థి శిబిరాల్లో వీరు తలదాచుకుంటున్నారు. వీరందరి జీవితాలు మళ్లీ గాడిలో పడాలంటే ఏళ్లు పట్టొచ్చు. ఏడాది కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకే... 6,500 కోట్ల రూపాయలకు పైగా కావాలని ఐరాస చెబుతోంది. గృహనిర్మాణం, ఇతర సాయానికి మరింత పెద్ద మొత్తమే కావాలి. ఇరాక్‌కు అందే అంతర్జాతీయ సాయంపై మోసుల్ పునర్నిర్మాణం ఆధారపడి ఉంటుంది. మోసుల్ పాలనపై కూడా అంతర్గతంగా విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. కుర్దుల ప్రాబల్యం కలిగిన ప్రాంతాన్ని కుర్థిస్తాన్గా గుర్తించి పాలనలో స్వేచ్ఛనిచ్చినట్లే... మోసుల్‌లో మెజారిటీగా ఉన్న సున్నీలకు అవకాశం ఇవ్వాలనే వాదన ఉంది. షియా, సున్నీలు, కుర్దులకు మధ్య విభేదాలు ఇరాక్ సుస్థిరతపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన కూడా నెలకొంది. అంతం అనలేం... ఉచ్చదశలో ఉన్నపుడు... 2015లో ఐసిస్ ఆధీనంలో ఇరాక్, సిరియాల్లో కలిపి లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండేది. కోటి జనాభా దీని పాలన పరిధిలో ఉండేది. బలగాలు క్షీణించడం, కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోవడం, ఆదాయాలు పడిపోవడం... ద్వారా ఐసిస్ క్రమేపీ బలహీనపడుతూ వస్తోంది. మోసుల్‌ను విముక్తం చేయడం ద్వారా ఇరాక్ ఈ పట్టణానికి సమీపంలోని చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా... ఐసిస్‌కు మరో ఎదురుదెబ్బ. తమ ఆధీనంలోకి భూభాగంలో 60 శాతాన్ని ఐసిస్ కోల్పోయింది. 25 లక్షల మంది ప్రజలు ఇంకా ఐసిస్ పాలనలో ఉన్నారు. ఇరాక్‌లో పరిమిత ప్రాంతమే ఇప్పుడు ఐసిస్ చేతిలో ఉంది. అయితే సిరియాలో ఐసిస్‌కు రాజధానిగా పరిగణించే రక్కా నగరంతో పాటు పలు పట్టణాలు ఈ ఉగ్రసంస్థ ఆధీనంలోనే ఉన్నాయి. రక్కాను సిరియా బలగాలు ఇప్పటికే దిగ్భందించాయి. దాదాపు రెండువేల మంది తీవ్రవాదులు రక్కా సిటీ సెంటర్ కేంద్రంగా సిరియా సైన్యంతో పోరాడుతున్నారు. ఒకప్పుడు నెలకు 520 కోట్ల రూపాయల దాకా ఉన్న ఐసిస్ ఆదాయం ఇప్పుడు 104 కోట్లకు పడిపోయింది. ఐసిస్‌పై పోరాటంలో ప్రపంచదేశాలు కలిసికట్టుగా పనిచేస్తే... ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రభూతం ఐసిస్ కోరలు పీకవచ్చు. భూభాగాన్ని కోల్పోతున్న ఐసిస్ ఇప్పటికే చాలాచోట్ల గెరిల్లా దాడులకు దిగుతోంది. కారు బాంబులు, మానవ బాంబులతో నరమేధం సాగిస్తూ... మరోరకంగా ఉనికిని చాటుకుంటోంది. సానుభూతిపరులను రెచ్చగొట్టి పాశ్చాత్యదేశాల్లో దాడులకు తెగబడేలా చేస్తోంది. రక్కా కూడా విముక్తమైతే ఐసిస్‌పై చావుదెబ్బ పడ్డట్లే. శిథిలాల్లో 20 రోజులు... ఆ కుర్రాడికి దాదాపు పదేళ్లు ఉంటాయి. నడుము పైభాగంగా బ్యాండేజి చుట్టి ఉంది. 20 రోజులకు శిథిల భవనంలోని బేస్మెంట్లో చిక్కుకుపోయాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. సోమవారం బయటపడ్డ ఇతను ‘చాలా నొప్పిగా ఉంది. నడవలేకపోతున్నాను’ అనడం వీడియోలో కనిపిస్తోంది. అంతకుమించి వివరాలు తెలియలేదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
త్యాగాల స్మరణ
ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ప్రజలు ముహమ్మద్ ప్రవక్త మనమడైన ఇమామ్ హుసైన్ త్యాగాలను స్మరించుకుంటూ ఆయన అమరత్వం పట్ల సంతాపం వ్యక్తపరుస్తూ ఉండే సందర్భమే మొహర్రమ్. హుసైన్ ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం నిండు ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారో ఆ లక్ష్యాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ముహమ్మద్ ప్రవక్త నిర్యాణం తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో పాలనా బాధ్యతలు చేపట్టిన తొలి నలుగురు ఖలీఫాలు- అబూబక్,్ర ఉమర్, ఉస్మాన్, అలీ గార్ల పరిపాలనాకాలం ప్రపంచ మానవ ఇతిహాసంలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృజించింది. కాని తరువాతి కాలంలో పరిస్థితులు మారాయి. అధికారం కోసం పోరు ప్రారంభమైంది. ప్రజలు ముహమ్మద్ మనమడు, హుసైన్ సోదరుడు అయిన హజ్రత్ హసన్‌ని ఖలీఫాగా ఎన్నుకున్నారు. కాని సిరియా ప్రాంత గవర్నరుగా ఉన్న అమీర్ ముఆవియా అధికారం కోసం పోటీ పడగా యుద్ధవాతావరణం నెలకొని హసన్ ఖలీఫా పదవి నుండి తప్పుకున్నారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ప్రజలు అమీర్ ముఆవియాకు అధికారం కట్టబెట్టారు. ఆ తరువాత అమీర్ ముఆవియా తన కొడుకు యజీద్‌ను రాజకీయ వారసుణ్ణి చేయడానికి భయప్రలోభాల ద్వారా ప్రజల్ని దారికి తెచ్చుకున్నాడు. ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులు, న్యాయప్రేమికులు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అందుకే కూఫా ప్రజలు హసన్ తమ్ముడైన ఇమామ్ హుసైన్‌కు మద్దతు ప్రకటిస్తూ ఆహ్వానించారు. దీంతో ఇమామ్ హుసైన్ కూఫాకు పయనమయ్యారు. అదే గనక జరిగితే యజీద్ పీఠానికి ప్రమాదం తప్పదు. అందుకని యజీద్ ఇమామ్ హుసైన్ కూఫా చేరకుండా మార్గాలన్నీ సైనికులతో మూసివేశాడు. దాంతో ఇమామ్ బృందం ‘కర్బలా’ చేరుకుని ఆగిపోయింది. అక్కడ తనను అడ్డుకున్న సేనాధిపతితో ఇమామ్ హుసైన్ మూడు విషయాలను ప్రతిపాదించాడు. 1. నన్ను యజీద్ దగ్గరకు వెళ్ళనివ్వండి. నేరుగా ఆయనతో మాట్లాడతాను. 2. నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. 3. లేదా నన్ను ఏదైనా సరిహద్దు ప్రాంతంలో వదిలేయండి. కాని యజీద్ సైన్యం ఏ ప్రతిపాదననూ అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర సంగ్రామం మొదైలంది. చూస్తూ చూస్తూనే ‘కర్బలా’ మైదానం రుధిర ధారలతో ఎరుపెక్కింది. ఇమాం శిబిరంలోని సుమారు 72 మంది ఒక్కొక్కరుగా నేలకొరిగారు. చివరికి మిగిలింది ఇమామె హుసైన్ ఒక్కరే. అది హి.శ. 61. ‘మొహర్రం’ నెల, పదవ తేదీ. ఇమామ్ హుసైన్ ఒక్కరే ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మ పరిరక్షణ కోసం వీరోచితంగా పోరాడుతూ అమరగతులయ్యారు. ఇమామ్ హుసైన్ నేలకొరగగానే సేనాని ఇబ్నెజియాద్ ఆదేశంతో అతడి సైనికులు ఆ అమరవీరుని శిరస్సును ఖండించారు. పార్థివ దేహం నుండి శిరస్సునూ, చేతులను ఖండించి బాణాలు, బరిశలకు తగిలించి కూఫా వీధుల్లో ఊరేగించారు. పలావులు వండుకొని, పానకాలు చేసుకొని తిన్నారు, తాగారు. ఇదీ సంక్షిప్తంగా ఆనాడు జరిగిన ఘోరదుర్ఘటన. కాని న్యాయప్రేమికులు, ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో అది హుసైన్ చేసిన త్యాగానికి న్యాయపోరాటానికి తార్కాణం. దుష్టరాజకీయ శక్తుల ఆటకట్టించి, సమాజంలోని అన్నివర్గాలూ సముదాయాల ప్రజలకు సమాన న్యాయం అందించగలిగే ధీరోదాత్తులు నేటి అవసరం. దీనికోసం న్యాయప్రేమికుడైన ఇమామ్ హుసైన్ ప్రజాస్వామ్య స్పూర్తిని, ఆయనగారి పోరాట పటిమను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఆశయ సాధనకోసం ఇమామ్ అమరుడయ్యారో దానికోసం అలుపెరుగని ప్రయత్నం చేయడమే ఇమామ్ హుసైన్‌కు నిజమైన నివాళి. - యండి.ఉస్మాన్ ఖాన్ -
బుర్జ్ ఖలీఫా కన్నా ఎత్తైన టవర్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా కన్నా పొడవైన నిర్మాణం చేపట్టేందుకు దుబాయ్ పావులు కదుపుతోంది. దీంతో ప్రపంచంలోనే ఎత్తయిన భవనం నిర్మించి...తన రికార్డును తానే అధిగమించేందుకు సన్నద్ధం అవుతోంది. 'ది టవర్' పేరుతో దుబాయ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎమార్ ప్రాపర్టీస్ ఈ భవనాన్ని నిర్మించనుంది. 2020 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఎత్తు ఎంత ఉంటుందన్న విషయం మాత్రం నిర్మాణం పూర్తయ్యే సమయానికి ప్రకటిస్తామని వెల్లడించింది. స్పానిష్-స్విస్ శిల్పి శాంటియాగో కాలట్రవ వల్స్ రూపకల్పనలో దుబాయ్‌లో నిర్మాణం రూపొందనున్నట్లు ఎమార్ వెల్లడించింది. ఈ ప్రత్యేక నిర్మాణంలో రెస్టారెంట్లు, విలాసవంతమైన హోటళ్ళు నిర్వహించేందుకు 18 నుంచి 20 అంతస్తులు మిశ్రమ వినియోగానికి పనికొచ్చేట్టుగా నిర్మించేందుకు పరిశీలనలో ఉన్నట్లు ఎమార్ సంస్థ ఛైర్మన్ అలబ్బర్ తెలిపారు. దుబాయ్ లోని జెడ్డాలో నిర్మించ తలపెట్టిన ఈ అత్యాధునిక నిర్మాణం... ఇకముందు నగరానికే కాక ప్రపంచంలోనే ఓ సొగసైన స్మారక చిహ్నంగా ఉంటుందని ఆయన వివరించారు. ఓ సన్నని స్తంభంలా ఆకట్టుకునేట్లు కనిపించే టవర్... భూమిలోనూ బలమైన పునాదులు కలిగి ఉంటుందన్నారు. ఆకాశమే హద్దుగా డజన్లకొద్దీ నిర్మాణాలను చేపట్టడంలో ఎంతో గుర్తింపును సాధించిన దుబాయ్ నగరం... భవిష్యత్ లోనూ ఈ అత్యంత పొడవైన నిర్మాణంతో ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. ప్రస్తుత ప్రాజెక్టుకు సుమారు 664 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని, బుర్జ్ ఖలీఫా కన్నా పొడవుగా ఉంటుందంటూ అలబ్బర్ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కాగా ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎతైన నిర్మాణంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు ఉండగా.. దాన్ని నిర్మించేందుకు సుమారు 997 కోట్ల రూపాయలు ఖర్చయింది.