అది ఖలీఫా హజరత్ ఉమర్ ఫారూఖ్ (రజి) పాలనాకాలం. ప్రజల యోగ క్షేమాలు తెలుసుకోవడానికి గాను ఆయన మారువేషంలో స్వయంగా గస్తీ తిరిగేవారు. ఒకరోజు అలా మదీనా పట్టణంలోని వీధులలో తిరుగుతున్నారు. ఒక ఇంటి నుండి మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించి ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి ముందర కూర్చున్న వ్యక్తిని చూసి సలాం చేసి ‘ఎవరు నీవు?’ అని అడిగారు. ఆ వ్యక్తి ‘అయ్యా! నేనొక ఎడారి నివాసిని, మన ఖలీఫా వారి వద్దకు వెళ్లి వారి దయాదక్షిణ్యాలతో సహాయం పొందాలని వచ్చాను’ అని చెప్పాడు. ‘మరి ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తోందే! అది ఎవరు?’ అని ప్రశ్నించారు. ‘నా భార్య నిండు గర్భవతి. పురుటినొప్పులతో బాధపడుతోంది’ అని బదులు పలికాడా వ్యక్తి. ‘ఆమె వద్ద ఎవరైనా ఉన్నారా?’ అని అడుగగా ఎవ్వరూ లేరని ఆ వ్యక్తి విచారంగా చెప్పాడు.
వెంటనే ఖలీఫాగారు ఇంటికెళ్లి తన భార్య హజరత్ ఉమ్మె కుల్సుం (రజి)తో ‘ఒక నిరుపేద స్త్రీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆమె వద్ద ఎవ్వరూ లేరు. కొన్ని వస్త్రాలు, నూనె, కాన్పు సమయంలో అవసరమయ్యే సామాగ్రి తీసుకుని నాతో రండి’ అని చెప్పారు. ఆమె ఒక మట్టి పాత్ర, కొంత పిండి, నెయ్యి, బెల్లం తదితర సామగ్రి తీసుకుని ఖలీఫా గారి వెంబడి వెళ్లారు. ఆ ఇంటికి చేరిన తర్వాత భార్యను లోపలికి పంపి ఖలీఫా గారు బయట కూర్చున్న వ్యక్తి వద్దకు వచ్చి కూచోని పొయ్యి వెలిగించి, కుండను పొయ్యిమీద ఉంచి కుండలో నీళ్లు పోసి పిండి, బెల్లం, నెయ్యి ఖర్జూరాలు వేసి రుచికరమైన పదార్థాన్ని తయారు చేశారు. అంతలోనే ఖలీఫా భార్య లోపలి నుండి ‘ఓ ఖలీఫాగారూ, మీ స్నేహితునికి పుత్రుడు జన్మించిన శుభవార్త తెల్పండి’ అన్నారు.‘ఖలీఫా గారు’ అన్న సంబోధన విన్న ఆ పల్లెటూరి వ్యక్తి నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు. అతన్ని చూసిన ఖలీఫా ఆ కుండను ఆ వ్యక్తి ముందుంచి ‘నువ్వు ఏమీ ఆలోచించ వద్దు, రాత్రంతా మేల్కొని ఉన్నారు కదా, నీవు, నీ భార్య కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుని, తెల్లవారగానే నా వద్దకు రండి. మీకు అవసరమైన సామగ్రి ఇచ్చి, ధనసహాయం చేస్తాను’ అని చెప్పి, తన భార్యను తీసుకొని తమ నివాసానికి వెళ్లిపోయారు.
– అబ్దుల్ జబ్బార్
ఖలీఫా గారూ.. శుభవార్త
Published Tue, Jun 5 2018 12:18 AM | Last Updated on Tue, Jun 5 2018 12:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment