ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గొప్ప ధర్మనిష్టాపరులు. తన ధనాగారంలో ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించేవారు. అది రమజాన్ నెల. ఈద్ జరుపుకోవడానికి ప్రజలంతా ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటున్నారు. ఖలీఫా గారి ఇంటిలో మాత్రం అలాంటి సందడేమి కనిపించడం లేదు! స్నేహితులంతా కొత్తకొత్త బట్టలు కొనుక్కుంటుంటే ఖలీఫా పిల్లలకూ కొత్తబట్టలపై మోజు పుట్టింది. తండ్రి కొత్త బట్టలు తెస్తారన్న ఆతృతతో రోజూ ఎదురు చూడసాగారు. కానీ వాళ్లకు నిరాశే మిగిలేది. చిన్నారుల ఆవేదనను అర్థం చేసుకున్న ఆ తల్లి... ఇంటికి వచ్చిన భర్తతో ‘ఏమండీ... ఊళ్లో వాళ్లంతా తమ పిల్లలకు పండుగకోసం కొత్త్త దుస్తులు కొంటున్నారు. మనకు లేకపోయినా పర్వాలేదు. కనీసం పిల్లలకైనా చెరో జత బట్టలు తీసుకురండి’ అని భర్తను ప్రాధేయపడింది. ‘వాళ్లకు కొత్త బట్టలు ఇప్పించాలని నాకు మాత్రం లేదా చెప్పు. కాని ఏం చేయమంటావు, నాకొచ్చే జీతంతో ఇల్లు గడవడమే గగనం.
ఇక పిల్లలకు కొత్త బట్టలు కొనే స్థోమత ఎక్కడిది’ అని దీనంగా చెప్పుకొచ్చారు ఖలీఫా. ‘మన్నించండి.. పసిపిల్లల ఆవేదన చూడలేక అడిగానే కానీ నాకు మాత్రం తెలియదా?’ అని భర్తను ఓదార్చింది. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ‘నేను ఖలీఫానే. నా అధీనంలో ఎనలేని ధనరాశి ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ నేను కేవలం దానికి కాపలాదారుడ్ని మాత్రమే. ఆ ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలి. అందులో ఆవగింజంతైనా అవకతవక జరిగితే రేపు ప్రళయదినాన పరలోకంలో ఆ విశ్వప్రభువు ముందు పట్టుబడిపోవలసి వస్తుంది. కనుక ఉన్నదాంట్లోనే పండుగ జరుపుకుందాం’ అని చెప్పారు ఖలీఫా. రమజాన్ ఉపవాసాలు ఆశించేది ఇలాంటి దైవభీతినే.
– తహూరా సిద్దీఖా
ఖలీఫా ఇంట పండగ
Published Thu, Jun 7 2018 12:16 AM | Last Updated on Thu, Jun 7 2018 12:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment