భోపాల్ గ్యాస్‌ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత | Bhopal Gas Tragedy Activist Abdul Jabbar Dies | Sakshi
Sakshi News home page

భోపాల్ గ్యాస్‌ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత

Published Fri, Nov 15 2019 8:32 AM | Last Updated on Fri, Nov 15 2019 8:34 AM

 Bhopal Gas Tragedy Activist Abdul Jabbar Dies - Sakshi

1984 భోపాల్ గ్యాస్ బాధితుల తరపున సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న ఉద్యమ నేత అబ్దుల్‌ జబ్బర్‌ ఇకలేరు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో 20 వేల మంది బాధితుల న్యాయం కోసం పోరాడిన  ఆయన అనారోగ్యంతో మరణించారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా  అనారోగ్యంతో బాధపడుతున‍్న ఆయన వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకి తరలించాలని ప్రయత్నించారు.  కానీ ఇంతలోనే ఆయన  కన్నుమూయడం విషాదం.

ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్ గ్యాస్ ప్రమాదంలో అబ్దుల్ జబ్బర్ తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో జబ్బర్ కూడా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధడ్డారు. అంతేకాకుండా ప్రమాదం కారణంగా 50 శాతం దృష్టిని కోల్పోయినప్పటికీ జబ్బర్ న్యాయం కోసం  తన పోరాటం ఎప్పుడూ ఆపలేదు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితుల తరపున  పోరాడేందుకు 1987లో, ‘భోపాల్ గ్యాస్ పీడిత్‌ మహీళా ఉద్యోగ్ సంఘటన్’ను ప్రారంభించారు.
 
కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984  అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి అనేకమంది దీని కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కొద్దిసేపటికే.. అమెరికా పౌరుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ తప్పించుకున్నాడు. ఈ కేసులో విచారణకు హాజరుకాలేదు. అతను 2013లో అమెరికాలో మరణించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement