Bhopal gas tragedy
-
నాలుగు దశాబ్దాల పీడకల!
భోపాల్ నుంచి భాషబోయిన అనిల్‌కుమార్ : అది పాత భోపాల్ నగరంలోని జేపీనగర్.. అక్కడ ఓతల్లి తన పిల్లలను చంకనేసుకొని కొంగుతో ముక్కుమూసుకొని ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నట్టుగా ఉన్న అమరుల స్తూపం 1984 డిసెంబర్ 2, 3వ తేదీల్లో భోపాల్ విషవాయువు లీకేజీ ఘటనకు 40 ఏళ్లుగా మూగ సాక్ష్యంగా నిలుస్తోంది. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు వల్ల మానవాళి ఎదుర్కొన్న విపత్తుకు ఏమాత్రం తీసిపోని దుర్ఘటన భోపాల్ విషవాయువు లీకేజీ. ఇటీవల దుర్ఘటనకు 40 ఏళ్లు నిండాయి. అదే సమయంలో విషవాయువు వెలువడి వేలాదిమంది ప్రాణాలు పోయేందుకు కారణమైన యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఫ్యాక్టరీ నుంచి నాటి వ్యర్థాలను సమీపంలోని పీతమ్పూర్కు తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగానే.. ఈ దుర్ఘటనపై తిరిగి చర్చ మొదలైంది. 40 ఏళ్ల కింద విషవాయువు దుర్ఘటన మనదేశంలో వేలాదిమందిని పొట్టనబెట్టుకొని, లక్షలాదిమందిని అనారోగ్యం పాలు జేసింది. ఆనాటి కాళరాత్రి గురించి అడిగితే..అక్కడి స్థానికులు నేటికీ ఉలిక్కిపడతారు. ఆ రోజు బతికి బట్టకట్టినవారిలో చాలామంది మరణించగా.. కొందరు జీవచ్ఛవాలుగా మారారు. వారి కడుపున పుట్టిన పాపానికి మరికొందరు జీవితాంతం దివ్యాంగులుగా జన్యులోపాలతో మంచాలకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘోర దుర్ఘటనలో ఒకటిగా నిలిచిన.. నాటి ఘటన ప్రభావం ఎలా ఉందో సాక్షి.. కనుక్కునే ప్రయత్నం చేసింది. 40 ఏళ్లుగా వెంటాడుతోంది... అది డిసెంబర్ 2, 1984 అంతా వ్యవసాయ, కూలి పనులు చేసుకొని వచ్చారు. రాత్రి 7 గంటలకల్లా భోజనాలు చేసి చాలామంది నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 100 ఎకరాల్లో విస్తరించిన యూసీఐఎల్ ఫ్యాక్టరీ నుంచి హైడ్రోజన్ సైనైడ్ అనే విషవాయువు లీక్ కావడం మొదలైంది. వేగంగా గాలిలో కలవడం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. లీకేజీని ఆర్పే క్రమంలో ముందుగా ఫ్యాక్టరీ కార్మికులే బలయ్యారు. పరిశ్రమను ఆనుకొని ఉన్న జేపీనగర్ వాసులు ఘాటైన వాసనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొలుత ఏ మీ కాదనుకున్నా.. క్రమంగా ఘాటు పెరగసాగింది. ఒ క్క గంటలోనే బయటకు వచ్చి చూస్తే.. వాకిట్లో హైడ్రోజ న్ సైనైడ్ ధూళి వర్షంలా కురుస్తోంది. చాలామంది స్పృ హ తప్పడం చూసి పిల్లాజెల్లలను పట్టుకొని బయటకు వచ్చారు. రెండు అడుగుల మేర పేరుకుపోయిన ధూళిలో ఈడ్చుకుంటూ ప్రాణాల కోసం పరుగులు తీశారు. అప్పటికే దాదాపు 2 కి.మీల మేర భోపాల్‌ను విషవాయువు కమ్మేసింది. ఈక్రమంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర పరుగులు తీసినవారు బతికారు. చాలామంది ఆక్సిజన్ అందక మధ్యలోనే ప్రాణాలొదలగా.. కొందరు అప్పటికే గాఢనిద్రలో ఉండటంతో పడుకునే తుదిశ్వాస విడిచారు. ఇప్పటికీ వెన్నులో వణుకు 40 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ దుర్ఘటన తలచుకుంటే తమకు వెన్నులో వణుకుపుడుతుందని జేపీనగర్ వాసులు గుర్తుచేసుకున్నారు. ఆ రోజు పనుల మీద భోపాల్‌లో లేనివారు బతికి బట్టకట్టారు. అధికారులు తీవ్రంగా శ్రమించడం, హెలికాప్టర్లలో నీటిని లీకేజీపై కుమ్మరించడం తదితర చర్యల వల్ల.. మరునాడు ఉదయం 8 గంటల కల్లా విషవాయువు లీకేజీ ఆగడం మొదలైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మరునాడు ఫ్యాక్టరీ పరిసరాల్లోని ఏ వీధి, రోడ్డు చూసినా.. శవాలతో నిండిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. అంతా అనుకున్నట్టుగా ఆ రోజు చనిపోయింది 3787 మంది కానే కాదని, మరునాడు తాము తిరిగి ఇంటిబాట పట్టిన సమయంలో.. ట్రక్కులతో శవాలను తరలించడం తమకు ఇంకా గుర్తేనని కన్నీరు మున్నీరయ్యారు. ఇక కట్టివేసిన మూగజీవాలు, పక్షులు ఎక్కడికక్కడ మరణించాయన్నారు.ఆ రోజు బతికి బట్టకట్టినా.. నేటికీ ఆ పీడకల తమను వెంటాడుతూనే ఉందని, అక్కడి భూగర్భంలో, నేలలో, తమ శరీరాల్లో, రక్తంలో ఈ విషం ఇంకా నిండే ఉందని వాపోయారు. ఆ ప్రభావం తర్వాత తరాలపైనా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాం ఆ రోజు వ్యవసాయ పనులు ముగించుకొని రాత్రి త్వరగానే ప డుకున్నం.. ఘాటు వాసనలతో ఉ క్కిరిబిక్కిరి అయ్యాం. కళ్ల వెంట నీరు కారుతుండగా.. ఆగకుండా చేతిలో పిల్లాజెల్లలతో కలిసి దాదాపు 2 కిలోమీటర్లు పరు గులు పెట్టాం. ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం కూడా దళారులు మింగేశారు. – కన్నయ్య, జేపీనగర్రెండు అడుగుల మేర ధూళి ఆ రోజు విషవాయువు లీకవడం మొదలైనా.. ఆగిపోతుందనుకున్నాం. కానీ పెరిగింది. వాకిళ్లలో రెండడుగుల మేర ధూళి. అందులోనే పడుతూ లేస్తూ.. పరుగులు తీశాం. మరునాడు వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే. నాకు శ్వాస సమస్యలు ఇప్పటికీ వేధిస్తున్నాయి. నేటికీ ఆ రోజు రాత్రి గుర్తుకొస్తే ఉలిక్కిపడతా. – లక్ష్మణ్, జేపీనగర్ఇద్దరు కుమారులకు జన్యులోపాలే నేను, నా భర్త ఇద్దరం జేపీ కాలనీకే చెందినవారం. ఆ సమయంలో మాకు పదేళ్లు. మా పెద్దలు భుజాన మీద వేసుకొని పరుగెత్తి మమ్మల్ని కాపాడుకున్నారు. కానీ, ఆ రోజు ఆ గాలి పీల్చడం వల్ల మా ఇద్దరు కుమారులు వికాస్‌యాదవ్, అమన్యాదవ్ మానసిక, శారీరక వైకల్యంతో జన్మించారు. గత డిసెంబర్లో పెద్ద కుమారుడు వికాస్‌యాదవ్ (27) మరణించారు. చిన్న కుమారుడు అమన్ యాదవ్ ఇలా అచేతనంగా ఉంటాడు. – శారదాయాదవ్ప్రభుత్వం నుంచి దక్కింది తక్కువే ఆ ఘోరకలి నుంచి బతికామన్న సంతోషం ఏమాత్రం లేదు. మా శరీరాల్లో ఏవో మార్పులు వచ్చాయి. ఫలితంగా పిల్లలు అచేతనులయ్యారు. వారికి సేవలు చేసి, సాకినా.. ఇటీవల నా పెద్ద కుమారుడు మరణించాడు. ప్రభుత్వం వారికి ఇచ్చే పింఛన్ దేనికీ సరిపోదు. ఇప్పటికైనా మా విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. – సంజయ్ యాదవ్ -
భోపాల్‌లో విష వ్యర్థాల తొలగింపు
భోపాల్: భారత దేశ చరిత్రలో అత్యంత దారుణమైన పారిశ్రామిక ప్రమాదంగా నిలిచిన భోపాల్ గ్యాస్ లీకేజీ ఉదంతంలో 40 సంవత్సరాల తర్వాత కీలక ఘట్టం జరిగింది. విషపూరిత గ్యాస్ లీకేజీ తర్వాత ఇంకా యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో మిగిలిపోయిన అత్యంత ప్రమాదకర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. బుధవారం రాత్రి 9 గంటలపుడు ఏకంగా 337 టన్నుల బరువైన వ్యర్థాలను ప్రత్యేకమైన కంటైనర్లలో జాగ్రత్తగా ప్యాక్‌చేసి 250 కిలోమీటర్ల దూరంలోని వ్యర్థ్యాల దహన కర్మాగారానికి తరలించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ట్రక్కులన్నీ ధర్ జిల్లాలోని పీతంపూర్ పారిశ్రామిక వాడకు చేరుకున్నాయని ధర్ ఎస్పీ మనోజ్ సిన్హా చెప్పారు. వ్యర్థాలను దహనం చేసి అందులో ఏరకమైన విష పదార్థలు లేవని నిర్ధారణ చేసుకున్నాకే మిగిలిన అవశేషాలను నేలలో పాతిపెట్టనున్నారు. 1984 డిసెంబర్ రెండో తేదీ రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం నుంచి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది. అది ఎక్కడి జనాన్ని అక్కడే విగతజీవులుగా మార్చేసిన దారుణోదంతం తెల్సిందే. విష వాయువులు పీల్చి దాదాపు 5,480 మంది అక్క డిక్కడే చనిపోయారు. వేలాది మంది వికలాంగులయ్యారు. విషవాయువును పీల్చిన ఆనాటి తరం వాళ్లకు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో లక్షలాది మంది వైకల్యంతో జన్మించారు. ఇంకెందరో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. అంబులెన్సులు, పోలీసు వాహనాలు, అగ్నిమాపక దళాల ప్రత్యేక పర్యవేక్షణలో వ్యర్థాల తరలింపు ప్రక్రియ జరిగింది. ఇందుకోసం 250 కిలోమీటర్ల పొడవునా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేశారు. విషపూరిత వ్యర్థాలలో మట్టి, పురుగుమందుల అవశేషాలు, తయారీ ప్రక్రియల్లో మిగిలిపోయిన రసాయనాలతో సహా ఐదు రకాల ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయి. మందలించిన హైకోర్టురాష్ట్ర రాజధానిలోని ఈ కర్మాగారం నుంచి వ్యర్థాలను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలోనే పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీని ఖాళీ చేయకపోవడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఉదాసీనత కొత్త విషాదానికి దారి తీస్తుందని కోర్టు పేర్కొంది. వ్యర్థాలను తొలగించడానికి నాలుగు వారాల గడువు విధిస్తూ డిసెంబర్ మూడో తేదీన తీర్పునిచ్చింది. వ్యర్థాలను 2025 జనవరి ఆరో తేదీలోపు పూర్తిగా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది. అత్యంత భద్రత మధ్య..వ్యర్థాలను సురక్షితంగా తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కర్మాగారంలో 337 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలున్నాయి. ఆదివారం నుంచే వీటిని మూటలు కట్టే పనులు మొదలుపెట్టారు. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన 12 కంటైనర్లలో లోడ్ చేశారు. ప్రతి కంటైనర్‌లో సుమారు 30 టన్నుల వ్యర్థాలను నింపారు. రసాయన చర్యలను నివారించడానికి అత్యంత మందంగా ఉండే పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేశారు. వ్యర్థాల తరలింపుకోసం కర్మాగారం చుట్టూతా 200 మీటర్ల పరిధిలో ఎవరూ రాకుండా నిషేధం విధించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పీపీఈ కిట్లు ధరించి కట్టుదిట్టమైన భద్రతా ప్రమానాలను పాటిస్తూ వ్యర్థాలను కంటైనర్లలో నింపారు. బుధవారం రాత్రి 9 గంటలకు 12 కంటైనర్ ట్రక్కులు కర్మాగారం నుంచి బయలుదేరాయి. 50 మంది పోలీసులు కంటైనర్లకు రక్షణ కల్పిస్తున్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యర్థాలను తరలిస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు.పీతంపూర్లో దహన కర్మాగారం..పీతంపూర్లోని వ్యర్థాల దహన కర్మాగారం రాష్ట్రంలోని ఏకైక అత్యాధునిక కర్మాగారం. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ నిర్వహిస్తోంది. 2015లో ట్రయల్‌రన్‌లో భాగంగా గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా దహనం చేశారు. ఇది విజయవంతం కావడంతో మిగిలిన వ్యర్థాలను కాల్చేయనున్నారు. భూమికి 25 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక వేదికపై వ్యర్థాలను కాల్చనున్నారు. ఈ ప్రక్రియ కోసం కఠినమైన శాస్త్రీయ ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తారు. గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున మొత్తం 337 టన్నుల వ్యర్థాలను కాల్చడానికి సుమారు 153 రోజులు పడుతుంది. ఈ వేగాన్ని గంటకు 270 కిలోలకు పెంచితే 51 రోజుల్లో పూర్తిగా వ్యర్థాలను కాల్చేయొచ్చు.12 trucks carrying 337 tonnes of toxic waste from the Union Carbide factory in Bhopal, stored for 40 years, left at 9:05 p.m. for Pithampur near Indore. The waste is expected to arrive early on January 2nd, following a 250-km green corridor with heavy security. 📹@MehulMalpani pic.twitter.com/zU78cVRE85— The Hindu (@the_hindu) January 1, 2025స్థానికుల నుంచి వ్యతిరేకత2015లో పీతంపూర్లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేయడం వల్ల సమీప గ్రామాల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమయ్యాయని స్థానికులు ఆందోళన తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యర్థాల తరలింపునకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వ్యర్థాలను పీతంపూర్కు బదులు విదేశాలకు పంపాలని డిమాండ్ చేస్తూ 10కి పైగా సంస్థలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. తగిన ట్రయల్స్ లేకుండా వ్యర్థాల తొలగింపు ప్రక్రియను ప్రశ్నిస్తూ ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ పూర్వ విద్యార్థుల సంఘం వైద్యులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే వ్యర్థాలను కాల్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు భోపాల్ ఘటన సహాయక, పునరావాస విభాగ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. అన్నీ సవ్యంగా జరిగితే, మూడు నెలల్లో వ్యర్థాలను కాల్చివేస్తామని చెప్పారు. ఏదైనా ఆటంకం జరిగితే తొమ్మిది నెలల వరకు పట్టవచ్చ న్నారు. కాల్చిన తర్వాత, వ్యర్థాల బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం మిగిలి ఉందా లేదా అని పరిశీలిస్తామని పేర్కొన్నారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించాక బూడిదను భూగర్భజలంతో కలవని రీతిలో భూమిలో పాతిపెడతామన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం -
మూడునెలలుగా ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్.. ఏదో తెలుసా?
ఏ సినిమా అయినా ఓటీటీలోకి రాగానే కొద్దోగొప్పో గుర్తింపు వస్తుంది. సినిమా బాలేదంటే రెండు, మూడు రోజుల్లోనే దాన్నెవరూ పట్టించుకోరు. అదే బాగుందంటే మాత్రం వెంటనే టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది. అయితే కొత్త సినిమా రాగానే కాస్త వెనకబడిపోతుంది. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వెబ్ సిరీస్ మాత్రం రోజులు, వారాలుగా కాదు ఏకంగా మూడు నెలల నుంచి టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఏదో మన దేశంలో మాత్రమే అనుకునేరు.. కానే కాదు.. ఏకంగా 36 దేశాల్లో వంద రోజులుగా టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది.. అంతలా క్లిక్ అయిన వెబ్ సిరీస్ మనదే.. ఇంతకీ అదె అనుకుంటున్నారా? ద రైల్వే మ్యాన్. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తయిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఆర్ మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ్ రావలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ గతేడాది నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు విపరీత ఆదరణ దక్కడంతో సిరీస్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సిరీస్‌కు ఈ రేంజ్లో క్రేజ్ రావడం నిజంగా గ్రేట్ అంటున్నారు వెబ్ వీక్షకులు. చదవండి: చివరి రోజు షూటింగ్.. అమ్మ ఇక లేదంటూ ఫోన్ కాల్.. నిర్మాతకు చెప్తే.. -
మూల్యం కారకులదేనన్న ఊసెక్కడ?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రవర్తించిన తీరు... నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధితుల పట్ల పట్టింపులేనితనాలకు అద్దం పడుతోంది. నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఏకైక ప్రతినిధిగా నిలబడటమే కాకుండా... ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తేవడం ద్వారా యూనియన్ కార్బైడ్ సంస్థతో రాజీపడిపోవడం కూడా ఒక తప్పిదమే. ఈ కేసు విషయమై మార్చి 14వ తేదీన సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేస్తూ, సంక్షేమ రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహార మొత్తంలోని హెచ్చుతగ్గులను సరి చేయాలని చెప్పింది. అయితే ఇది కాలుష్య కారకులే పరిహారం చెల్లించాలన్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధమైనది. 1984 నాటి భోపాల్ దుర్ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిష న్ను ఈ నెల 14న సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో దశాబ్దాల న్యాయ పోరాటానికి తెరపడినట్లు అయ్యింది. ఆధునిక యుగంలో పర్యావరణానికి సంబంధించి ఓ కార్పొరేట్ సంస్థ తీవ్ర నేరానికి పాల్పడిన తొలి ఘటన ఇదే కావచ్చు. 1984 డిసెంబరు 2వ తేదీ రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కీటకనాశిని కర్మాగారం నుంచి మిథైల్ ఐసోసైనైడ్ అనే విషపూరిత రసాయనం విడుదలైంది. కొన్నివేల మంది ఊపిరాడక చనిపోయారు. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషపూరిత రసాయన ప్రభావం కొన్ని తరాల పాటు కనిపించింది. ప్రమాదం తాలూకూ విష వ్యర్థాలను బహిరంగంగా పడేసిన కారణంగా అక్కడి నేల కూడా కలుషితమైంది. పౌరులకు జరిగిన ఈ నష్టానికి, నేరపూరిత నిర్లక్ష్యానికి కంపెనీ, దాంట్లోని అధికారులదే బాధ్యతని న్యాయ స్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. జిల్లా కోర్టులో మొదలైన న్యాయ పోరాటం దశాబ్దాల కాలంలో సుప్రీంకోర్టును చేరింది. దేశ అత్యున్నత న్యాయ స్థానంలోనైనా తమకు న్యాయం దక్కుతుందని బాధితులు ఆశించారు. అయితే క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం వారికి అశనిపాతంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రవర్తించిన తీరు... నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధితుల పట్ల పట్టింపులేనితనాలకు అద్దం పడుతోంది. నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఏకైక ప్రతి నిధిగా నిలబడటమే కాకుండా... ఒక కొత్త చట్టాన్ని (భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ –ప్రాసెసింగ్ ఆఫ్ క్లెయిమ్స్– యాక్ట్ 1985) అమల్లోకి తేవడం ద్వారా యూనియన్ కార్బైడ్ సంస్థతో రాజీపడిపోయింది. ఇది ఓ మహా తప్పిదం. నష్టపరిహారం కోరుతూ ప్రభుత్వం 1988లో కేసు దాఖలు చేసింది. కొంత పరిహారం ప్రకటించారు కూడా. అయితే దీన్ని అందరూ ఊహించినట్టుగానే యూనియన్ కార్బైడ్ ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. భారత్‌లో కేసులు ఉన్నాయనీ, తాము న్యాయ స్థానాన్ని ఎదుర్కొంటున్నా మనీ యూనియన్ కార్బైడ్ అమెరికాలో లిటిగేషన్ల ముప్పును తప్పించుకుంది. యూనియన్ కార్బైడ్ జరిపిన లాబీయింగ్... సుప్రీంకోర్టు సున్నిత ప్రోత్సాహం... వెరసి కేంద్ర ప్రభుత్వం మరో ఘోర తప్పిదం చేయడానికి కారణం అయ్యాయి. యూనియన్ కార్బైడ్ కేవలం రూ.715 కోట్లు చెల్లిస్తే అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులు మూసివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పాత పరిహారమే అంతిమం! అయితే బాధితులు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టి ఈ నిర్ణ యాన్ని సమీక్షించాలని కోరడం వల్ల కంపెనీ చెల్లి స్తానన్న పరిహారం చాలా తక్కువనీ, నేరం బాధ్యత కూడా తగినంతగా కంపెనీపై మోపలేదనీ స్పష్ట మైంది. కంపెనీ అధికారులపై 2010లో భోపాల్ జిల్లా కోర్టులో క్రిమినల్ కేసులు దాఖ లయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రోజు వారీ కార్యకలాపాలు పర్యవేక్షించే అధి కారులకు శిక్ష కూడా పడింది. దీని పర్యవసానంగా గ్యాస్ దుర్ఘటనపై ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. ఇది కాస్తా తీవ్ర ఆందోళనకూ దారితీసింది. ఈ ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం నష్ట పరిహారం మొత్తాన్ని పెంచేందుకు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుప్రీంకోర్టులో గత తీర్పు సమీక్ష కోరుతూ కేసు దాఖలు చేయగా... అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టేసింది. పదమూడేళ్లపాటు సాగిన ఈ కేసు తాజా పరిణామం ఇది. సుప్రీంకోర్టు తాజా తీర్పులో– కంపెనీ, ప్రభుత్వాల మధ్య 1989లో కుదిరిన రాజీ ఒప్పందం ప్రకారం చెల్లించిన నష్టపరిహారమే ఫైనల్ అని తేల్చేసింది. అద నపు నష్టపరిహారం కోరేందుకు తగిన న్యాయ సూత్రం ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది. రాజీ ఒప్పందం వెనుక లాలూచీ? కేంద్రం, యూనియన్ కార్బైడ్‌ల మధ్య కుదిరిన రాజీ ఒప్పందం వెనుక ఎన్నో లాలూచీ వ్యవహారాలు నడిచాయని బాధితుల తరఫున క్యూరేటివ్ పిటిషన్ విచారణలో భాగమైన సంస్థలు ఆరోపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద భారత్‌లో, అమెరికాలో సేకరించిన సమాచారం, పత్రాల ఆధారంగా వారు ఈ ఆరోపణలు చేశారు. ఈ పత్రాలను కోర్టుకు అందజేశారు. యూనియన్ కార్బైడ్ అధికారులు ప్రభుత్వాన్ని ఎలా తప్పుదోవ పట్టించింది ఈ పత్రాల ద్వారా వివరించారు. దుర్ఘటనలో బతికి బయటపడ్డ వారు ఎదుర్కొన్న గాయాలు స్వల్పమని కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పిందన్నది వీరి ఆరోపణ. అయితే కోర్టు ఈ సాక్ష్యాలను తోసిపుచ్చింది. 1989 నాటి కోర్టు తీర్పును సమర్థించింది. అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం తన క్యూరేటివ్ పిటిషన్ లో మోసం జరిగిందని ఏమీ చెప్పలేదని తెలిపింది. దురదృష్టవశాత్తూ కోర్టు ఈ క్యూరేటివ్ పిటిషన్ ను కేవలం కేంద్రం, యూనియన్ కార్బైడ్ కంపెనీల మధ్య వివాదంలా మాత్రమే చూసింది. బాధితుల పక్షాన నిలిచిన సంస్థలను థర్డ్ పార్టీ (మూడోపక్షం)గా అభివర్ణించింది. కేంద్రం భుజాలపై స్వారీ చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా యూనియన్ కార్బైడ్ దేశంలో అసలు విచారణకే గురి కాలేదు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాద బాధితులకు తగిన పరిహారం లభించకపోవడం శోచనీయం. దుర్ఘటన ప్రభావాలపై కొత్త కొత్త వివరాలు వెలుగులోకి వచ్చినా కోర్టు 1989 నాటి తీర్పే అంతిమం అని తేల్చేసింది. అప్పట్లో నిర్ణయించిన పరిహారం సాధారణ అంచనా అని మాత్రం కోర్టు ఒప్పుకొంది. మరణాలకు రూ. 3 వేలు, ‘దుస్సహమైన తీవ్ర గాయాలకు’ రూ. 30 వేలుగా అప్పుడు నిర్ణయించారు. కంపెనీకి తగిన పరిహారం చెల్లించాలి 2010లో దాఖలైన క్యూరేటివ్ పిటిషన్ అటు కేంద్రానికీ, ఇటు సుప్రీంకోర్టుకూ 1989 నాటి తప్పులను దిద్దుకునేందుకు ఒక అవకాశం కల్పించింది. కాలుష్యానికి కారణమైన వారే నష్ట పరిహారాన్ని, పరిస్థితిని చక్కదిద్దేందుకు అయిన ఖర్చులను భరించాలని అప్పటి నుంచి ఇప్పటివరకూ నడిచిన కాలంలో ఎన్నో తీర్పులు వచ్చాయి. 1985 నాటి ఓలియుమ్ గ్యాస్ లీక్ కేసులో కోర్టు వ్యాఖ్యానిస్తూ... ‘‘కంపెనీ ఎంత పెద్దది, సమృద్ధమైనది అయితే అది చేసిన నష్టానికి చెల్లించాల్సిన పరిహారం కూడా అంతే ఎక్కువ మొత్తంలో ఉండాలి. ప్రమాదకరమైన, ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న పరి శ్రమలు, కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుంది’’ అని స్పష్టం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. మార్చి 14వ తేదీ సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేస్తూ. సంక్షేమ రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహార మొత్తంలోని హెచ్చుతగ్గులను సరి చేయాలని చెప్పింది. అయితే ఇది కాలుష్య కారకులే పరిహారం చెల్లించాలన్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధమైనది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పాలకుల పాపాల భైరవి భోపాల్
-
భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్లనాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసులోని బాధితులకు పరిహారం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ నుంచి అదనపు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. గ్యాస్ లీక్ బాధితులకు అదనపు పరిహారంగా రూ. 7,844 కోట్లు ఇప్పటించాలని అమెరికాకు చెందిన యూనియన్ కార్భైడ్ కార్పొరేషన్ కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కేంద్రం 2010లో క్యూరేటివ్ పిటిషిన్ దాఖలు చేసింది. 1989లో సెటిల్మెంట్ సమయంలో ప్రజల జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాలను సరిగా అంచనా వేయలేమని చెబుతూ.. ఈ కేసును రీ ఓపెన్ చేయాలని కేంద్రం కోరింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, అభయ్ ఓకా, విక్రమ్‌నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. కేవలం మోసం కారణంగా మాత్రమే సెటిల్‌మెట్‌ను పక్కన పెట్టవచ్చని.. అయితే ఈ అశంపై కేంద్రం వాదించలేదని పేర్కొంది. అంతేగాక రెండు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి ఎలాంటి హేతుబద్ధత అందించనందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సంతృప్తి చెందలేదు కోర్టు పేర్కొంది. యునియన్ కార్బైడ్ సంస్థపై అదనపు భారాన్ని విధించడం సరికాదని, ఆ కేసును రీఓపెన్ చేయడం వల్ల మరిన్ని సమస్యల్ని సృష్టించడమే అవుతుందని ధర్మాసనం తెలిపింది. భోపాల్ గ్యాస్ బాధితులకు ఇప్పటికే ఆరుసార్లు నష్టపరిహారాన్ని ఇచ్చారని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న రూ. 50 కోట్ల మొత్తాన్ని పెండింగ్‌లో ఉన్న పరిహారం క్లెయిమ్‌లను క్లియర్ చేయడానికి ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం వేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై జనవరి 12వ తేదీన సుప్రీం తన తీర్పును రిజర్వ్ చేయగా.. నేడు తిరస్కరించింది. కాగా డిసెంబర్ 2,1984న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 3,000 మందికి పైగా మరణించారు. లక్ష మందికి పైగా ప్రభావితమయ్యారు. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు. యూనియన్ కార్బైడ్‌ను సొంతం చేసుకున్న ప్రస్తుతం డౌ కెమికల్స్ 1989లో సెటిల్మెంట్ కింద రూ. 715 కోట్ల హరిహారం చెల్లించింది. అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ ఆండర్సన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరు కాలేదు. 1992లో భోపాల్ కోర్టు అతను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. 2014లో ఆయన మరణానికి ముందు రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. అయితే జూన్ 7, 2010న భోపాల్ కోర్టు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెట్‌కు చెందిన ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. చదవండి: 'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి' -
మూడు దశాబ్దాలుగా పీడిస్తున్న పీడకల
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న గ్యాస్ దుర్ఘటన ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. నాటి ప్రమాదంలో చిక్కుకున్న బాధితుల వెతలు ఈ నాటికీ తగ్గలేదు. గడచిన 30 ఏళ్లలో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఎన్నో మారినప్పటకీ బాధితులకు కనీన న్యాయం దక్కలేదు. గ్యాస్ బాధితుల పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. సరైన తాగునీటి వసతి కూడా లేక అల్లాడిపోతున్నారు. 1984, డిసెంబరు 2, 3 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసీఐఎల్) పురుగుమందుల ప్లాంట్‌లో గ్యాస్‌లీకేజీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన సంభవించిన నేటికి 36 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో భోపాల్ బాధితులు ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2006లో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఈ విషాదంలో 3,787 మంది మృతి చెందగా, మరో 5.58 లక్షల మందిపై ప్రభావం చూపింది. అయితే బాధితుల కోసం పోరాడుతున్న సంస్థలు ఈ విషాదంలో కనీసం 25 వేల మంది మరణించారని పేర్కొన్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2019 ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1984 భోపాల్ గ్యాస్ విషాదం 20వ శతాబ్దంలో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా పేర్కొంది. యూనియన్ కార్బైడ్ (పురుగుమందుల) కర్మాగారం నుంచి విడుదలైన 30 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ వాయువు 6,00,000 మంది కార్మికులను, సమీప నివాసులను ప్రభావితం చేసిందని నివేదిక పేర్కొంది. ఈ విషాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు తగిన పరిహారం, సరైన పునరావాసం కల్పించి, ప్రాణాలతో బయటపడినవారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని, ఆ ప్రాంతంలో పడిన విష రసాయనాలను తొలగించాలని అనేక సంస్థలు దశాబ్దాలుగా బాధితుల తరుపున పోరాడుతున్నాయి. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులకు 2010 జూన్ మొదటి వారంలో భోపాల్ కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ .1.7 లక్షల జరిమానా విధించింది. నిందితులకు బెయిల్ కూడా లభించింది. దీంతో ఈ తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేసినట్లు ఉందని ప్రాణాలతో బయటపడిన వారు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వారెన్ అండర్సన్. భోపాల్ గ్యాస్ విషాదాన్ని చూడటానికి వచ్చి సురక్షితంగా దేశం విడిచి వెళ్లాడు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి మార్గం సుగమం చేసిందనేది ప్రధాన ఆరోపణ. వారెన్ అండర్సన్ భారత కోర్టులలో ఎటువంటి విచారణను ఎదుర్కోకుండానే 2014 సెప్టెంబర్‌లో అమెరికాలోని ఫ్లోరిడాలో మరణించారు. (చదవండి: ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో 26 పులులు మృతి) బాధితులకు అందని పరిహారం : రచనా ధింగ్రా “రాష్ట్రంలో, కేంద్రంలో అప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బతికున్నవారి కోసం ఏం చేయలేదు. బాధితులకు పరిహారం అందించడం, పునరావాసం కల్పించడం, ప్రాణాలతో బయటపడినవారికి వైద్య చికిత్స అందిచడం, దోషులకు శిక్ష పడేట్లు చేయడం, విషపూరిత రసాయనాలను తరలించడం వంటి వాటిని ప్రభుత్వాలు విస్మరిస్తూనే ఉన్నాయి. మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసి)వల్ల కలిగే గాయాలు శాశ్వతమైనవని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ 90% మంది బాధితులకు పరిహారంగా కేవలం 500 యుఎస్ డాలర్లు మాత్రమే చెల్లించారు. ఈ గ్యాస్ ప్రభావంతో హైపర్గ్లైకేమియా (డయాబెటిస్), యురేమియా (మూత్రపిండ వ్యాధులు), పల్మనరీ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల వ్యాధులు & అసిడోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) వాయువు సాంద్రత 21 పీపీఎం (మిలియన్‌కు భాగాలు) మించి ఉంటే దాన్ని పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ప్రాణం పోతుంది. దశాబ్దాలుగా ప్రాణాలతో బయటపడిన వారి మరణాలకు, వికలాంగులుగా మారడానికి కారణం ఇదే.’’ అని భోపాల్ సమాచార, చర్యల వ్యవస్థాపక సభ్యురాలు రచనా ధింగ్రా అన్నారు. దశాబ్దాలుగా దక్కని న్యాయం బాధితులలో ఒకరైన బ్యాంకర్ జగదీష్ దుబే మాట్లాడుతూ.. “భోపాల్ గ్యాస్ విషాదాన్ని ప్రతిఏటా గుర్తుచేసుకోవడం బాధితులకు, ప్రభుత్వానికి ఒక ఆచారంగా మారింది. మా సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు వదిలేస్తున్నారు. మళ్లీ వచ్చే ఏడాది వారోత్సవాలు జరుపుతున్నారు. దీని వల్ల ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. భోపాల్ గ్యాస్ పీడిట్ సంఘర్ష్ సహోగ్ సమితి అనే మరో హక్కుల సంస్థ కన్వీనర్ సాధనా కర్నిక్ మాట్లాడుతూ.. ‘‘ ప్లాంట్ నుంచి బయటికి వచ్చిన విష వాయువు నగర ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంది. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (బిఎమ్హెచ్ఆర్సి) నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ అక్కడ సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నం జరగడం లేదు.’’ అని కార్నిక్ అన్నారు. ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది! భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ.. పరిహారానికి సంబంధించిన విషయం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ విషాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కోవిడ్ -19 మరణాల రేటు 6.5 రెట్లు ఎక్కువ ఆరోగ్య శాఖ అధికారిక రికార్డు ప్రకారం, భోపాల్ జిల్లాలోని గ్యాస్ ప్రభావిత ప్రాంతంలో కోవిడ్ -19 మరణాల రేటు 6.5 రెట్లు ఎక్కువ ”అని భోపాల్ గ్యాస్ పీడిట్ మహిలా పురుష్ సంఘర్ష్ మోర్చా అధ్యక్షుడునవాబ్ ఖాన్ అన్నారు. -
మూడో తరాన్నీ వీడని 35 ఏళ్ల విషాదం..
భోపాల్: ఆలియా వయసు 12 ఏళ్లు. వీల్‌చైర్‌లోనే ఆ అమ్మాయి జీవితం గడిచిపోతోంది. పుట్టుకతోనే శారీరక, మానసిక వైకల్యం ఆ పాపను మంచానికే పరిమితం చేసింది. అందరిలా నడవలేదు. ఏ పనికీ చేతుల్ని ఉపయోగించలేదు. సైని వయసు మూడేళ్లు ఆమె పరిస్థితి కూడా ఇంతే. సైని తల్లి పింకి వయసు 22 సంవత్సరాలు. ఆమె కూడా శారీరక, మానసిక దుర్బలురాలే. వీరి దుస్థితికి కారణం.. 35 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్ విషవాయు దుర్ఘటన. ఆనాటి ప్రమాదంలో విడుదలయిన విషవాయువును పీల్చిన వారి సంతానం కావడమే వీరు చేసిన పాపం. మూడు దశాబ్దాల కిందట జరిగిన ఈ ప్రమాదం ఫలితాలు మూడు తరాల ప్రజలు అనుభవిస్తున్నారు. ఆనాటి దుర్ఘటన బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు. వారి పిల్లల పిల్లలపైనా ఆ విషం ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ నెలకు పాతిక, ముప్పయి మంది ఆ కారణంగానే చనిపోతున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితులు న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. భోపాల్ దుర్ఘటన జరిగి నేటికి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మధ్యప్రదేశ్‌తో సహా, దేశ వాప్యప్తంగా పలు ప్రాంతాల్లో నివాళి అర్పిస్తున్నారు. మృతుల లెక్కలు తేలని విషాదం.. 1984, డిసెంబర్ 2వ తేదీ అర్థరాత్రి దాటాక భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో విషవాయువు లీకయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు. మిథైల్ ఐసోసైనేడ్ (మిక్) అనే ఆ విష వాయువు పట్టణమంతా కమ్ముకుంది. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 56 వార్డులు ఉంటే- 36 వార్డుల్లో విషవాయువు యొక్క ప్రభావం చూపింది. 8 వేల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది ఆస్పత్రుల్లో చనిపోయారు. 5లక్షల మందికిపైగా విషవాయు ప్రభావానికి గురయ్యారు (అప్పటి భోపాల్ జనాభా 8.5 లక్షలు). అయితే మృతుల సంఖ్యపై అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787 మంది, అందులో 2,259 మంది తక్షణమరణానికి గురైనట్టుగా నిర్ధారించింది. 2006 సంవత్సరంలో ఒక ప్రభుత్వ అఫిడవిట్లో గ్యాస్ లీకేజీ వలన 558,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది. ఇందులో 38,478 తాత్కాలిక ప్రభావానికి మరియు 3,900 శాశ్వత ప్రభావానికి గురైనారు. అంతేగాక, ప్రమాదం జరిగిన రెండువారాలలో 8,000 మంది మరణించారని, మరియు గ్యాస్-సంబంధిత వ్యాధుల కారణంగా మరో 8,000 పైగా వ్యక్తులు మరణించారని అంచనా. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ దుర్ఘటన గురించి తెలియగానే జర్మనీకి చెందిన వైద్య నిపుణుడు హుటాహుటిన ప్రమాద స్థలికి వచ్చారు. బాధితులను పరీక్షించారు. మిక్ గ్యాస్‌కు విరుగుడుగా సోడియం థియోసల్ఫేట్ ఇంజక్షన్లు ఇవ్వాలని సూచించారు. అయితే, కొన్ని రోజులకే దీన్ని వాడటం ఆపేశారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు వైద్యం అందించడంలో పొరపాట్లు జరిగాయని, దాని వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ‘భోపాల్ గ్యాస్ ట్రాజెడీ,ఆఫ్టర్ 3 ఇయర్స్’పేరుతో వచ్చిన పుస్తకంలో వెల్లడైంది. కార్బైడ్ కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ఈ మందు ఆపేశారని, దాంతో బాధితులకు సరైన చికిత్స అందకుండా పోయిందని ఆ పుస్తకంలో వివరించారు. -
భోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత
1984 భోపాల్ గ్యాస్ బాధితుల తరపున సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న ఉద్యమ నేత అబ్దుల్ జబ్బర్ ఇకలేరు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో 20 వేల మంది బాధితుల న్యాయం కోసం పోరాడిన ఆయన అనారోగ్యంతో మరణించారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకి తరలించాలని ప్రయత్నించారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూయడం విషాదం. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్ గ్యాస్ ప్రమాదంలో అబ్దుల్ జబ్బర్ తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో జబ్బర్ కూడా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధడ్డారు. అంతేకాకుండా ప్రమాదం కారణంగా 50 శాతం దృష్టిని కోల్పోయినప్పటికీ జబ్బర్ న్యాయం కోసం తన పోరాటం ఎప్పుడూ ఆపలేదు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల తరపున పోరాడేందుకు 1987లో, ‘భోపాల్ గ్యాస్ పీడిత్ మహీళా ఉద్యోగ్ సంఘటన్’ను ప్రారంభించారు. కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి అనేకమంది దీని కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కొద్దిసేపటికే.. అమెరికా పౌరుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ తప్పించుకున్నాడు. ఈ కేసులో విచారణకు హాజరుకాలేదు. అతను 2013లో అమెరికాలో మరణించాడు. -
మూడు తరాలను పీడిస్తున్న పీడకల
మహి సైని... వయసు మూడేళ్లు.. పుట్టుకతోనే శారీరక, మానసిక వైకల్యం ఆ పాపను మంచానికే పరిమితం చేసింది. అందరిలా నడవలేదు. ఏ పనికీ చేతుల్ని ఉపయోగించలేదు. సైని తల్లి పింకి వయసు 22 సంవత్సరాలు. ఆమె కూడా శారీరక, మానసిక దుర్బలురాలే. ఆలియా... వయసు 12 ఏళ్లు. ఆమె పరిస్థితి కూడా ఇంతే. వీల్‌చైర్‌లోనే ఆ అమ్మాయి జీవితం గడిచిపోతోంది. వీరి దుస్థితికి కారణం... 34 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్ విషవాయు దుర్ఘటన. ఆనాటి ప్రమాదంలో విడుదలయిన విషవాయువును పీల్చిన వారి సంతానం కావడమే వీరు చేసిన పాపం.మూడు దశాబ్దాల కిందట జరిగిన ఈ ప్రమాదం ఫలితాలు మూడు తరాల ప్రజలు అనుభవిస్తున్నారు. ఆనాటి దుర్ఘటన బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు.వారి పిల్లల పిల్లలపైనా ఆ విషం ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ నెలకు పాతిక, ముప్పయి మంది ఆ కారణంగానే చనిపోతున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితులు న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. భోపాల్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడం కోసం భోపాల్‌లోని లోయర్ లేక్ వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ పిల్లలంతా పాల్గొన్నారు. ‘భోపాల్ దుర్ఘటన మూడు తరాలుగా వెంటాడుతోంది. ప్రమాద ప్రాంతంలో ఉంటున్న వారు, వారి పిల్లలు పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కొందరు శారీరకంగా ఇబ్బందులు పడుతోంటే మరి కొందరు మానసిక రోగులుగా మారారు.’అంటూ ఆవేదన వెలిబుచ్చారు రషీదా బీ, చంపాదేవి.భోపాల్ దుర్ఘటన బాధితుల పిల్లల కోసం వారు చింగరి ట్రస్ట్ పేరుతో పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ దుర్ఘటన ప్రభావంతో శారీరక, మానసిక వైకల్యాలతో పుట్టిన 12 ఏళ్ల లోపు పిల్లలకు ఇక్కడ ఆశ్రయం కల్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ 961 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ ఏదోరకంగా భోపాల్ దుర్ఘటనతో సంబంధం ఉందని చంపాదేవి చెప్పారు. విషవాయు ప్రభావంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల భూగర్భజలాలు విషపూరితమయ్యాయి. మునిసిపల్ నల్లాలు లేకపోవడంతో ఆక్కడి ప్రజలు ఇప్పటికీ ఆ నీటినే తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులకు సరైన చికిత్స అందడం లేదు. బాధితులకు తప్పుడు వైద్యం భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు వైద్యం అందించడంలో పొరపాట్లు జరిగాయని, దాని వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని‘భోపాల్ గ్యాస్ ట్రాజెడీ,ఆఫ్టర్ 3 ఇయర్స్’పేరుతో వచ్చిన పుస్తకంలో వెల్లడించింది. 1984,డిసెంబర్ 2వ తేదీ అర్థరాత్రి దాటాక భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో విషవాయువు లీకయింది. మిథైల్ ఐసోసైనేడ్ (మిక్) అనే ఆ విషవాయువు పట్టణమంతా కమ్ముకుంది.8 వేల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వందల మంది ఆస్పత్రుల్లో చనిపోయారు.5లక్షల మందికిపైగా విషవాయు ప్రభావానికి గురయ్యారు (అప్పటి భోపాల్ జనాభా 8.5 లక్షలు). ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ దుర్ఘటన గురించి తెలియగానే జర్మనీకి చెందిన వైద్య నిపుణుడు హుటాహుటిన ప్రమాద స్థలికి వచ్చారు. బాధితులను పరీక్షించారు. మిక్ గ్యాస్‌కు విరుగుడుగా సోడియం థియోసల్ఫేట్ ఇంజక్షన్లు ఇవ్వాలని సూచించారు.అయితే,కొన్ని రోజులకే దీన్ని వాడటం ఆపేశారు.కార్బైడ్ కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ఈ మందు ఆపేశారని, దాంతో బాధితులకు సరైన చికిత్స అందకుండా పోయిందని ఆ పుస్తకంలో వివరించారు. -
వదలని భయం.. జరగని న్యాయం!
భోపాల్: 1984 డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్ వాసులకు కాళరాత్రి. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో యూనికార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన భయంకర విషవాయువు వేల మందిని పొట్టనబెట్టుకుని, లక్షలాది మంది జీవితాల్లో చీకట్లు నింపింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు కారణంగా లక్షలాది మంది జీవచ్చవాలుగా మారారు. ఈ ఘటన జరిగి శనివారంనాటికి 33 ఏళ్లు పూర్తయినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. నేటి తరం పిల్లలపై కూడా దుష్ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఈ దుర్ఘటన బాధితులకు ఇప్పటికి కూడా సరైన వైద్య, వసతి సదుపాయాలు, ఉపాధి కల్పించకపోవడం గమనార్హం. నాడు విషవాయువు ప్రభావంతో పిల్లల అవయవాలు సక్రమంగా పనిచేయక నరకయాతన అనుభవించారు. నేటికీ అనుభవిస్తున్నారు. పుట్టే బిడ్డనూ వదలని ‘విషం’.. ఇక మహిళల సంగతి మరీ దారుణంగా ఉంది. ఈ వాయువు వల్ల కొత్తగా పెళ్లైన మహిళలకు రోజులు గడిచేకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని అత్తింటి వారు నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. విష వాయువు కారణంగా రోగాల బారినపడి ఇప్పటికీ అక్కడి వారికి వివాహాలు జరగడం లేదు. వివాహం జరిగినా సంతానం లేమి, ఒకవేళ గర్భం దాల్చినా పుట్టిన బిడ్డల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. బాధితుల్లో చాలా మంది తల్లిదండ్రులను, పిల్లలను కోల్పోయారు. 33 ఏళ్లు గడుస్తున్నా బాధితులకు సరైన న్యాయం జరగలేదు. తప్పించుకున్న కారకులు.. ప్రధాన నిందితుడు, కర్మాగారం యజమాని ఆండర్సన్ పట్టుబడినా, చాకచక్యంగా తప్పించుకున్నాడు.మరోవైపు ఆండర్సన్‌ను అప్పగించాల్సిందిగా ఆరేళ్ల కిందట భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చింది. ఒక్కో బాధితుడికి పరిహారం కింద కేవలం రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరినీ ఇప్పటివరకూ శిక్షించలేదని, తమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించాయో ఇదే నిదర్శనమని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనలో కేవలం 3000 మంది మాత్రమే మరణించారని అధికారికంగా ప్రకటించినా, ఈ సంఖ్య 25 వేల వరకు ఉంటుందని అంచనా. -
'భోపాల్' మృతుల సంఖ్యపై కొరవడ్డ కచ్చితత్వం
భోపాల్: భోపాల్ గ్యాస్ ఘోరకలి జరిగి మూడు దశాబ్దాలు గడిచినా మృతుల సంఖ్యపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు లేవని ఓ స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. విషతుల్యమైన వ్యర్థాలను ప్రమాదం జరిగిన యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో వదిలివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అనధికార లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 25 వేలు దాటింది. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 5295 మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేశామని తెలిపింది. తమకున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 25 వేలు దాటిందని, వీరందరి కుటుంబాలకు పరిహారం అందించాలని భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్షన్స్(బీజీఐఏ) కార్యకర్త రచనా ధింగ్రా డిమాండ్ చేశారు. బాధిత 15342 కుటుంబాలకు పరిహారం కింద రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని కేంద్రాన్ని 2012లో మధ్యప్రదేశ్ మంత్రులు డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
'భోపాల్' దుర్ఘటన ప్రధాన నిందితుడు మృతి
-
'భోపాల్' దుర్ఘటన ప్రధాన నిందితుడు మృతి
న్యూయార్క్: యూనియన్ కార్బైడ్ మాజీ చీఫ్, 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులోప్రధాని నిందితుడు వారెన్ ఆండర్సన్(92) మృతి చెందారు. ఫ్లోరిడాలోని వెరో బీచ్ లో ఓ ఆస్పత్రిలో సెప్టెంబర్ 29న ఆయన మరణించారు. వారెన్ ఆండర్సన్ మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించనప్పటికీ, ప్రభుత్వ రికార్డుల ద్వారా ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. 1984లో భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి గ్యాస్ లీకయి 3 వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది రుగ్మతల బారిన పడ్డారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత భోపాల్ వచ్చిన వారెన్ ఆండర్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన అమెరికా పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం భారత్ వెదుకుతూనే ఉంది.