మూల్యం కారకులదేనన్న ఊసెక్కడ? | Sakshi Guest Column On Bhopal Gas Tragedy | Sakshi
Sakshi News home page

మూల్యం కారకులదేనన్న ఊసెక్కడ?

Published Wed, Mar 29 2023 12:24 AM | Last Updated on Wed, Mar 29 2023 12:28 AM

Sakshi Guest Column On Bhopal Gas Tragedy

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రవర్తించిన తీరు... నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధితుల పట్ల పట్టింపులేనితనాలకు అద్దం పడుతోంది. నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఏకైక ప్రతినిధిగా నిలబడటమే కాకుండా... ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తేవడం ద్వారా యూనియన్  కార్బైడ్‌ సంస్థతో రాజీపడిపోవడం కూడా ఒక తప్పిదమే. ఈ కేసు విషయమై మార్చి 14వ తేదీన సుప్రీంకోర్టు క్యూరేటివ్‌ పిటిషన్ ను కొట్టివేస్తూ, సంక్షేమ రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహార మొత్తంలోని హెచ్చుతగ్గులను సరి చేయాలని చెప్పింది. అయితే ఇది కాలుష్య కారకులే పరిహారం చెల్లించాలన్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధమైనది.

1984 నాటి భోపాల్‌ దుర్ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిష న్‌ను ఈ నెల 14న సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో దశాబ్దాల న్యాయ పోరాటానికి తెరపడినట్లు అయ్యింది. ఆధునిక యుగంలో పర్యావరణానికి సంబంధించి ఓ కార్పొరేట్‌ సంస్థ తీవ్ర నేరానికి పాల్పడిన తొలి ఘటన ఇదే కావచ్చు. 1984 డిసెంబరు 2వ తేదీ రాత్రి భోపాల్‌లోని యూనియన్  కార్బైడ్‌ కీటకనాశిని కర్మాగారం నుంచి మిథైల్‌ ఐసోసైనైడ్‌ అనే విషపూరిత రసాయనం విడుదలైంది. కొన్నివేల మంది ఊపిరాడక చనిపోయారు. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషపూరిత రసాయన ప్రభావం కొన్ని తరాల పాటు కనిపించింది. ప్రమాదం తాలూకూ విష వ్యర్థాలను బహిరంగంగా పడేసిన కారణంగా అక్కడి నేల కూడా కలుషితమైంది. పౌరులకు జరిగిన ఈ నష్టానికి, నేరపూరిత నిర్లక్ష్యానికి కంపెనీ, దాంట్లోని అధికారులదే బాధ్యతని న్యాయ స్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. జిల్లా కోర్టులో మొదలైన న్యాయ పోరాటం దశాబ్దాల కాలంలో సుప్రీంకోర్టును చేరింది. దేశ అత్యున్నత న్యాయ స్థానంలోనైనా తమకు న్యాయం దక్కుతుందని బాధితులు ఆశించారు. అయితే క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం వారికి అశనిపాతంలా మారింది. 

ప్రభుత్వాల నిర్లక్ష్యం
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రవర్తించిన తీరు... నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధితుల పట్ల పట్టింపులేనితనాలకు అద్దం పడుతోంది. నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఏకైక ప్రతి నిధిగా నిలబడటమే కాకుండా... ఒక కొత్త చట్టాన్ని (భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ డిజాస్టర్‌ –ప్రాసెసింగ్‌ ఆఫ్‌ క్లెయిమ్స్‌– యాక్ట్‌ 1985) అమల్లోకి తేవడం ద్వారా యూనియన్  కార్బైడ్‌ సంస్థతో రాజీపడిపోయింది. ఇది ఓ మహా తప్పిదం. నష్టపరిహారం కోరుతూ ప్రభుత్వం 1988లో కేసు దాఖలు చేసింది. కొంత పరిహారం ప్రకటించారు కూడా. అయితే దీన్ని అందరూ ఊహించినట్టుగానే యూనియన్  కార్బైడ్‌ ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది.

భారత్‌లో కేసులు ఉన్నాయనీ, తాము న్యాయ స్థానాన్ని ఎదుర్కొంటున్నా మనీ యూనియన్  కార్బైడ్‌ అమెరికాలో లిటిగేషన్ల ముప్పును తప్పించుకుంది. యూనియన్ కార్బైడ్‌ జరిపిన లాబీయింగ్‌... సుప్రీంకోర్టు సున్నిత ప్రోత్సాహం... వెరసి కేంద్ర ప్రభుత్వం మరో ఘోర తప్పిదం చేయడానికి కారణం అయ్యాయి. యూనియన్  కార్బైడ్‌ కేవలం రూ.715 కోట్లు చెల్లిస్తే అన్ని రకాల సివిల్, క్రిమినల్‌ కేసులు మూసివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

పాత పరిహారమే అంతిమం!
అయితే బాధితులు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టి ఈ నిర్ణ యాన్ని సమీక్షించాలని కోరడం వల్ల కంపెనీ చెల్లి స్తానన్న పరిహారం చాలా తక్కువనీ, నేరం బాధ్యత కూడా తగినంతగా కంపెనీపై మోపలేదనీ స్పష్ట మైంది. కంపెనీ అధికారులపై 2010లో భోపాల్‌ జిల్లా కోర్టులో క్రిమినల్‌ కేసులు దాఖ లయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రోజు వారీ కార్యకలాపాలు పర్యవేక్షించే అధి కారులకు శిక్ష కూడా పడింది. దీని పర్యవసానంగా గ్యాస్‌ దుర్ఘటనపై ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. ఇది కాస్తా తీవ్ర ఆందోళనకూ దారితీసింది.

ఈ ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం నష్ట పరిహారం మొత్తాన్ని పెంచేందుకు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుప్రీంకోర్టులో గత తీర్పు సమీక్ష కోరుతూ కేసు దాఖలు చేయగా... అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టేసింది. పదమూడేళ్లపాటు సాగిన ఈ కేసు తాజా పరిణామం ఇది. సుప్రీంకోర్టు తాజా తీర్పులో– కంపెనీ, ప్రభుత్వాల మధ్య 1989లో కుదిరిన రాజీ ఒప్పందం ప్రకారం చెల్లించిన నష్టపరిహారమే ఫైనల్‌ అని తేల్చేసింది. అద నపు నష్టపరిహారం కోరేందుకు తగిన న్యాయ సూత్రం ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది. 

రాజీ ఒప్పందం వెనుక లాలూచీ?
కేంద్రం, యూనియన్  కార్బైడ్‌ల మధ్య కుదిరిన రాజీ ఒప్పందం వెనుక ఎన్నో లాలూచీ వ్యవహారాలు నడిచాయని బాధితుల తరఫున క్యూరేటివ్‌ పిటిషన్  విచారణలో భాగమైన సంస్థలు ఆరోపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద భారత్‌లో, అమెరికాలో సేకరించిన సమాచారం, పత్రాల ఆధారంగా వారు ఈ ఆరోపణలు చేశారు. ఈ పత్రాలను కోర్టుకు అందజేశారు. యూనియన్  కార్బైడ్‌ అధికారులు ప్రభుత్వాన్ని ఎలా తప్పుదోవ పట్టించింది ఈ పత్రాల ద్వారా వివరించారు. దుర్ఘటనలో బతికి బయటపడ్డ వారు ఎదుర్కొన్న గాయాలు స్వల్పమని కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పిందన్నది వీరి ఆరోపణ. 

అయితే కోర్టు ఈ సాక్ష్యాలను తోసిపుచ్చింది. 1989 నాటి కోర్టు తీర్పును సమర్థించింది. అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం తన క్యూరేటివ్‌ పిటిషన్ లో మోసం జరిగిందని ఏమీ చెప్పలేదని తెలిపింది. దురదృష్టవశాత్తూ కోర్టు ఈ క్యూరేటివ్‌ పిటిషన్ ను కేవలం కేంద్రం, యూనియన్  కార్బైడ్‌ కంపెనీల మధ్య వివాదంలా మాత్రమే చూసింది. బాధితుల పక్షాన నిలిచిన సంస్థలను థర్డ్‌ పార్టీ (మూడోపక్షం)గా అభివర్ణించింది. కేంద్రం భుజాలపై స్వారీ చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. 

కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా యూనియన్  కార్బైడ్‌ దేశంలో అసలు విచారణకే గురి కాలేదు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాద బాధితులకు తగిన పరిహారం లభించకపోవడం శోచనీయం. దుర్ఘటన ప్రభావాలపై కొత్త కొత్త వివరాలు వెలుగులోకి వచ్చినా కోర్టు 1989 నాటి తీర్పే అంతిమం అని తేల్చేసింది. అప్పట్లో నిర్ణయించిన పరిహారం సాధారణ అంచనా అని మాత్రం కోర్టు ఒప్పుకొంది. మరణాలకు రూ. 3 వేలు, ‘దుస్సహమైన తీవ్ర గాయాలకు’ రూ. 30 వేలుగా అప్పుడు నిర్ణయించారు.

కంపెనీకి తగిన పరిహారం చెల్లించాలి
2010లో దాఖలైన క్యూరేటివ్‌ పిటిషన్  అటు కేంద్రానికీ, ఇటు సుప్రీంకోర్టుకూ 1989 నాటి తప్పులను దిద్దుకునేందుకు ఒక అవకాశం కల్పించింది. కాలుష్యానికి కారణమైన వారే నష్ట పరిహారాన్ని, పరిస్థితిని చక్కదిద్దేందుకు అయిన ఖర్చులను భరించాలని అప్పటి నుంచి ఇప్పటివరకూ నడిచిన కాలంలో ఎన్నో తీర్పులు వచ్చాయి. 1985 నాటి ఓలియుమ్‌ గ్యాస్‌ లీక్‌ కేసులో కోర్టు వ్యాఖ్యానిస్తూ... ‘‘కంపెనీ ఎంత పెద్దది, సమృద్ధమైనది అయితే అది చేసిన నష్టానికి చెల్లించాల్సిన పరిహారం కూడా అంతే ఎక్కువ మొత్తంలో ఉండాలి. ప్రమాదకరమైన, ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న పరి శ్రమలు, కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుంది’’ అని స్పష్టం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. 

మార్చి 14వ తేదీ సుప్రీంకోర్టు క్యూరేటివ్‌ పిటిషన్ ను కొట్టివేస్తూ. సంక్షేమ రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహార మొత్తంలోని హెచ్చుతగ్గులను సరి చేయాలని చెప్పింది. అయితే ఇది కాలుష్య కారకులే పరిహారం చెల్లించాలన్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధమైనది. 

దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement