ఇప్పటికీ ముచ్చెమటలు పట్టిస్తున్న భోపాల్ దుర్ఘటన
40 ఏళ్లనాటి కాళరాత్రి గుర్తు చేసుకుని జేపీనగర్ వాసుల కన్నీళ్లు
ఊరిని అలుముకున్న సైనైడ్ విష మేఘం, వాకిళ్లలో రెండు అడుగుల మేర ధూళి
పిల్లాజెల్లను పట్టుకొని తలోదిక్కు ఉరుకులు
ఆ రాత్రి పరుగు ఆపితే.. పోయిన ప్రాణాలు
గుట్టలకొద్దీ శవాలు.. ట్రక్కుల్లో తరలింపు
హెలికాప్టర్లతో నీళ్లు చిమ్మడంతో అదుపులోకి లీకేజీ..
నేటికి జన్యు లోపాలతో శిశువుల జననం
భోపాల్ నుంచి భాషబోయిన అనిల్‌కుమార్ : అది పాత భోపాల్ నగరంలోని జేపీనగర్.. అక్కడ ఓతల్లి తన పిల్లలను చంకనేసుకొని కొంగుతో ముక్కుమూసుకొని ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నట్టుగా ఉన్న అమరుల స్తూపం 1984 డిసెంబర్ 2, 3వ తేదీల్లో భోపాల్ విషవాయువు లీకేజీ ఘటనకు 40 ఏళ్లుగా మూగ సాక్ష్యంగా నిలుస్తోంది. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు వల్ల మానవాళి ఎదుర్కొన్న విపత్తుకు ఏమాత్రం తీసిపోని దుర్ఘటన భోపాల్ విషవాయువు లీకేజీ. ఇటీవల దుర్ఘటనకు 40 ఏళ్లు నిండాయి.
అదే సమయంలో విషవాయువు వెలువడి వేలాదిమంది ప్రాణాలు పోయేందుకు కారణమైన యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఫ్యాక్టరీ నుంచి నాటి వ్యర్థాలను సమీపంలోని పీతమ్‌పూర్‌కు తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగానే.. ఈ దుర్ఘటనపై తిరిగి చర్చ మొదలైంది. 40 ఏళ్ల కింద విషవాయువు దుర్ఘటన మనదేశంలో వేలాదిమందిని పొట్టనబెట్టుకొని, లక్షలాదిమందిని అనారోగ్యం పాలు జేసింది.
ఆనాటి కాళరాత్రి గురించి అడిగితే..అక్కడి స్థానికులు నేటికీ ఉలిక్కిపడతారు. ఆ రోజు బతికి బట్టకట్టినవారిలో చాలామంది మరణించగా.. కొందరు జీవచ్ఛవాలుగా మారారు. వారి కడుపున పుట్టిన పాపానికి మరికొందరు జీవితాంతం దివ్యాంగులుగా జన్యులోపాలతో మంచాలకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘోర దుర్ఘటనలో ఒకటిగా నిలిచిన.. నాటి ఘటన ప్రభావం ఎలా ఉందో సాక్షి.. కనుక్కునే ప్రయత్నం చేసింది.
40 ఏళ్లుగా వెంటాడుతోంది...
అది డిసెంబర్ 2, 1984 అంతా వ్యవసాయ, కూలి పనులు చేసుకొని వచ్చారు. రాత్రి 7 గంటలకల్లా భోజనాలు చేసి చాలామంది నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 100 ఎకరాల్లో విస్తరించిన యూసీఐఎల్ ఫ్యాక్టరీ నుంచి హైడ్రోజన్ సైనైడ్ అనే విషవాయువు లీక్ కావడం మొదలైంది. వేగంగా గాలిలో కలవడం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి.
లీకేజీని ఆర్పే క్రమంలో ముందుగా ఫ్యాక్టరీ కార్మికులే బలయ్యారు. పరిశ్రమను ఆనుకొని ఉన్న జేపీనగర్ వాసులు ఘాటైన వాసనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొలుత ఏ మీ కాదనుకున్నా.. క్రమంగా ఘాటు పెరగసాగింది. ఒ క్క గంటలోనే బయటకు వచ్చి చూస్తే.. వాకిట్లో హైడ్రోజ న్ సైనైడ్ ధూళి వర్షంలా కురుస్తోంది. చాలామంది స్పృ హ తప్పడం చూసి పిల్లాజెల్లలను పట్టుకొని బయటకు వచ్చారు.
రెండు అడుగుల మేర పేరుకుపోయిన ధూళిలో ఈడ్చుకుంటూ ప్రాణాల కోసం పరుగులు తీశారు. అప్పటికే దాదాపు 2 కి.మీల మేర భోపాల్‌ను విషవాయువు కమ్మేసింది. ఈక్రమంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర పరుగులు తీసినవారు బతికారు. చాలామంది ఆక్సిజన్ అందక మధ్యలోనే ప్రాణాలొదలగా.. కొందరు అప్పటికే గాఢనిద్రలో ఉండటంతో పడుకునే తుదిశ్వాస విడిచారు.
ఇప్పటికీ వెన్నులో వణుకు
40 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ దుర్ఘటన తలచుకుంటే తమకు వెన్నులో వణుకుపుడుతుందని జేపీనగర్ వాసులు గుర్తుచేసుకున్నారు. ఆ రోజు పనుల మీద భోపాల్‌లో లేనివారు బతికి బట్టకట్టారు. అధికారులు తీవ్రంగా శ్రమించడం, హెలికాప్టర్లలో నీటిని లీకేజీపై కుమ్మరించడం తదితర చర్యల వల్ల.. మరునాడు ఉదయం 8 గంటల కల్లా విషవాయువు లీకేజీ ఆగడం మొదలైందని స్థానికులు తెలిపారు.
ఈ ఘటన మరునాడు ఫ్యాక్టరీ పరిసరాల్లోని ఏ వీధి, రోడ్డు చూసినా.. శవాలతో నిండిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. అంతా అనుకున్నట్టుగా ఆ రోజు చనిపోయింది 3787 మంది కానే కాదని, మరునాడు తాము తిరిగి ఇంటిబాట పట్టిన సమయంలో.. ట్రక్కులతో శవాలను తరలించడం తమకు ఇంకా గుర్తేనని కన్నీరు మున్నీరయ్యారు. ఇక కట్టివేసిన మూగజీవాలు, పక్షులు ఎక్కడికక్కడ మరణించాయన్నారు.
ఆ రోజు బతికి బట్టకట్టినా.. నేటికీ ఆ పీడకల తమను వెంటాడుతూనే ఉందని, అక్కడి భూగర్భంలో, నేలలో, తమ శరీరాల్లో, రక్తంలో ఈ విషం ఇంకా నిండే ఉందని వాపోయారు. ఆ ప్రభావం తర్వాత తరాలపైనా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాం
ఆ రోజు వ్యవసాయ పనులు ముగించుకొని రాత్రి త్వరగానే ప డుకున్నం.. ఘాటు వాసనలతో ఉ క్కిరిబిక్కిరి అయ్యాం. కళ్ల వెంట నీరు కారుతుండగా.. ఆగకుండా చేతిలో పిల్లాజెల్లలతో కలిసి దాదాపు 2 కిలోమీటర్లు పరు గులు పెట్టాం. ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం కూడా దళారులు మింగేశారు. – కన్నయ్య, జేపీనగర్
రెండు అడుగుల మేర ధూళి
ఆ రోజు విషవాయువు లీకవడం మొదలైనా.. ఆగిపోతుందనుకున్నాం. కానీ పెరిగింది. వాకిళ్లలో రెండడుగుల మేర ధూళి. అందులోనే పడుతూ లేస్తూ.. పరుగులు తీశాం. మరునాడు వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే. నాకు శ్వాస సమస్యలు ఇప్పటికీ వేధిస్తున్నాయి. నేటికీ ఆ రోజు రాత్రి గుర్తుకొస్తే ఉలిక్కిపడతా. – లక్ష్మణ్, జేపీనగర్
ఇద్దరు కుమారులకు జన్యులోపాలే
నేను, నా భర్త ఇద్దరం జేపీ కాలనీకే చెందినవారం. ఆ సమయంలో మాకు పదేళ్లు. మా పెద్దలు భుజాన మీద వేసుకొని పరుగెత్తి మమ్మల్ని కాపాడుకున్నారు. కానీ, ఆ రోజు ఆ గాలి పీల్చడం వల్ల మా ఇద్దరు కుమారులు వికాస్‌యాదవ్, అమన్‌యాదవ్ మానసిక, శారీరక వైకల్యంతో జన్మించారు. గత డిసెంబర్‌లో పెద్ద కుమారుడు వికాస్‌యాదవ్ (27) మరణించారు. చిన్న కుమారుడు అమన్ యాదవ్ ఇలా అచేతనంగా ఉంటాడు. – శారదాయాదవ్
ప్రభుత్వం నుంచి దక్కింది తక్కువే
ఆ ఘోరకలి నుంచి బతికామన్న సంతోషం ఏమాత్రం లేదు. మా శరీరాల్లో ఏవో మార్పులు వచ్చాయి. ఫలితంగా పిల్లలు అచేతనులయ్యారు. వారికి సేవలు చేసి, సాకినా.. ఇటీవల నా పెద్ద కుమారుడు మరణించాడు. ప్రభుత్వం వారికి ఇచ్చే పింఛన్ దేనికీ సరిపోదు. ఇప్పటికైనా మా విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. – సంజయ్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment