భోపాల్: ఆలియా వయసు 12 ఏళ్లు. వీల్‌చైర్‌లోనే ఆ అమ్మాయి జీవితం గడిచిపోతోంది. పుట్టుకతోనే శారీరక, మానసిక వైకల్యం ఆ పాపను మంచానికే పరిమితం చేసింది. అందరిలా నడవలేదు. ఏ పనికీ చేతుల్ని ఉపయోగించలేదు. సైని వయసు మూడేళ్లు ఆమె పరిస్థితి కూడా ఇంతే. సైని తల్లి పింకి వయసు 22 సంవత్సరాలు. ఆమె కూడా శారీరక, మానసిక దుర్బలురాలే. వీరి దుస్థితికి కారణం.. 35 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్ విషవాయు దుర్ఘటన. ఆనాటి ప్రమాదంలో విడుదలయిన విషవాయువును పీల్చిన వారి సంతానం కావడమే వీరు చేసిన పాపం. మూడు దశాబ్దాల కిందట జరిగిన ఈ ప్రమాదం ఫలితాలు మూడు తరాల ప్రజలు అనుభవిస్తున్నారు. ఆనాటి దుర్ఘటన బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు. వారి పిల్లల పిల్లలపైనా ఆ విషం ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ నెలకు పాతిక, ముప్పయి మంది ఆ కారణంగానే చనిపోతున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితులు న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. భోపాల్ దుర్ఘటన జరిగి నేటికి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మధ్యప్రదేశ్‌తో సహా, దేశ వాప్యప్తంగా పలు ప్రాంతాల్లో నివాళి అర్పిస్తున్నారు.
మృతుల లెక్కలు తేలని విషాదం..
1984, డిసెంబర్ 2వ తేదీ అర్థరాత్రి దాటాక భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో విషవాయువు లీకయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు. మిథైల్ ఐసోసైనేడ్ (మిక్) అనే ఆ విష వాయువు పట్టణమంతా కమ్ముకుంది. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 56 వార్డులు ఉంటే- 36 వార్డుల్లో విషవాయువు యొక్క ప్రభావం చూపింది. 8 వేల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది ఆస్పత్రుల్లో చనిపోయారు. 5లక్షల మందికిపైగా విషవాయు ప్రభావానికి గురయ్యారు (అప్పటి భోపాల్ జనాభా 8.5 లక్షలు). అయితే మృతుల సంఖ్యపై అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787 మంది, అందులో 2,259 మంది తక్షణమరణానికి గురైనట్టుగా నిర్ధారించింది. 2006 సంవత్సరంలో ఒక ప్రభుత్వ అఫిడవిట్లో గ్యాస్ లీకేజీ వలన 558,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది. ఇందులో 38,478 తాత్కాలిక ప్రభావానికి మరియు 3,900 శాశ్వత ప్రభావానికి గురైనారు. అంతేగాక, ప్రమాదం జరిగిన రెండువారాలలో 8,000 మంది మరణించారని, మరియు గ్యాస్-సంబంధిత వ్యాధుల కారణంగా మరో 8,000 పైగా వ్యక్తులు మరణించారని అంచనా.
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ దుర్ఘటన గురించి తెలియగానే జర్మనీకి చెందిన వైద్య నిపుణుడు హుటాహుటిన ప్రమాద స్థలికి వచ్చారు. బాధితులను పరీక్షించారు. మిక్ గ్యాస్‌కు విరుగుడుగా సోడియం థియోసల్ఫేట్ ఇంజక్షన్లు ఇవ్వాలని సూచించారు. అయితే, కొన్ని రోజులకే దీన్ని వాడటం ఆపేశారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు వైద్యం అందించడంలో పొరపాట్లు జరిగాయని, దాని వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ‘భోపాల్ గ్యాస్ ట్రాజెడీ,ఆఫ్టర్ 3 ఇయర్స్’పేరుతో వచ్చిన పుస్తకంలో వెల్లడైంది. కార్బైడ్ కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ఈ మందు ఆపేశారని, దాంతో బాధితులకు సరైన చికిత్స అందకుండా పోయిందని ఆ పుస్తకంలో వివరించారు.
మూడో తరాన్నీ వీడని 35 ఏళ్ల విషాదం..
Published Tue, Dec 3 2019 11:14 AM | Last Updated on Tue, Dec 3 2019 3:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment