శిథిలాలే మిగిలాయి...!
మోసుల్ తిరిగి ఇరాక్ వశమైంది. ఐసిస్‌ను తరిమేశారు... కచ్చితంగా ఇది విజయమే. కానీ ఇప్పుడు ఏముందక్కడ? ఎటుచూసినా శిథిలాలే. యుద్ధం మిగిల్చిన గాయాలే. పూర్తిగా నేలమట్టమైన భవనాలు కొన్ని, సగం కూలినవి మరికొన్ని. కాలిబూడిదైన కార్లు... జాడలేని రోడ్లు. నీళ్లు లేవు, కరెంటు లేదు, కనీస వసతులేవీ లేవు. బడి, గుడి, ఆసుపత్రి... అన్నీ నేలమట్టమే. 12వ శతాబ్దంలో నిర్మించిన... మోసుల్‌కు తలమానికంగా నిలిచిన చారిత్రక ఆల్ నూరీ మసీదు కాలాన్ని తట్టుకొని ఠీవిగా నిలిచింది.
మసీదు ఆవరణలోని 150 అడుగుల అల్ హబ్దా మినార్... మోసుల్ అనగానే గుర్తొచ్చే కట్టడం. ఇప్పుడుక్కడ మినార్ ఆనవాళ్లు కూడా లేవు. ఇరాక్ కరెన్సీ పైనా, పాత చిత్రాలు, వీడియోల్లో మాత్రమే మనం దీన్ని చూడగలం. జూన్ 22న ఐసిస్ దీన్ని పేల్చివేసింది. మొత్తం 44 జిల్లాల్లో పశ్చిమ మోసుల్‌లోని ఆరు జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముక్కుపుటల అదిరిపోయే దుర్వాసన. బాంబు పేలుళ్లలో ముక్కలైన మానవ కళేబరాలు... కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నాయి. శిథిలాల కింద చిక్కిచనిపోయిన వారి పార్థివదేహాలదీ అదే పరిస్థితి. జనంతో కళకళలాడిన ఇరాక్‌లోని రెండో పెద్ద నగరం మోసుల్... మూడేళ్లలో చిధ్రమైపోయింది.
మూడేళ్ల కిందట ఐసిస్ చేతుల్లోకి...
పద్దెనిమిది లక్షల జనాభాగల మోసుల్ ఇరాక్‌లో ఉత్తరాన ఉంటుంది. సిరియా, టర్కీ సరిహద్దులకు సమీపంలోగల ఈ పట్టణాన్ని 2014 జూన్‌లో ఉగ్రవాద సంస్థ ఐసిస్ కైవసం చేసుకుంది. మోసుల్‌లోని అల్ నూరీ మసీదు నుంచి ఐసిస్ చీఫ్ అబూబాకర్ అల్ బగ్దాదీ తనను తాను ‘ఖలీఫా’గా ప్రకటించుకున్నాడు. ఇరాక్, సిరియాలలో ఐసిస్ ఆధీనంలో ఉన్న భూభాగంలో అతిపెద్ద పట్టణం మోసుల్. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 10 వేల మంది సైనికులను మొహరించి ఇరాక్ 2016 అక్టోబరులో పోరు ముమ్మరం చేసింది. అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు వీరికి మద్దతుగా నిరంతరం గగనతల దాడులు చేశాయి. బాంబుల వర్షం కురిపించాయి. పోరు ఉధృతమవ్వడంతో ఐసిస్ ఉగ్రవాదులు టిగ్రిస్ నదిని ఆనుకొని ఉండే... జనసమ్మర్ధమైన ఓల్డ్‌సిటీని కేంద్రంగా చేసుకొని పోరాడారు. నగరానికి పశ్చిమాన ఉండే ఓల్డ్‌సిటీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. మానవ కవచాలుగా స్థానికులను వాడుకున్నారు. వారిని మానవబాంబులుగా మార్చి... ఇరాకీ బలగాలపైకి విసిరేసే వారు. శిథిలాల్లో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ... మొత్తం మీద 9 నెలల్లో ‘ఆపరేషన్ మోసుల్’ను పూర్తిచేశారు ఇరాక్ సైనికులు.
నిర్వాసితులు తొమ్మిది లక్షలు...
మోసుల్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన పోరులో వేలాది మంది అమాయకుల ప్రాణాలుపోయాయి. ఎటువైపు నుంచి ఏ తూటా దూసుకొస్తుందో, ఎప్పుడు పైనుంచి బాంబులు పడతాయో తెలియదు. బతికుంటే చాలునని కట్టుబట్టలతో ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇలాంటి నిర్వాసితులు తొమ్మిది లక్షల మంది ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. బంధువుల ఇళ్లలో, శరణార్థి శిబిరాల్లో వీరు తలదాచుకుంటున్నారు. వీరందరి జీవితాలు మళ్లీ గాడిలో పడాలంటే ఏళ్లు పట్టొచ్చు. ఏడాది కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకే... 6,500 కోట్ల రూపాయలకు పైగా కావాలని ఐరాస చెబుతోంది. గృహనిర్మాణం, ఇతర సాయానికి మరింత పెద్ద మొత్తమే కావాలి. ఇరాక్‌కు అందే అంతర్జాతీయ సాయంపై మోసుల్ పునర్నిర్మాణం ఆధారపడి ఉంటుంది. మోసుల్ పాలనపై కూడా అంతర్గతంగా విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. కుర్దుల ప్రాబల్యం కలిగిన ప్రాంతాన్ని కుర్థిస్తాన్‌గా గుర్తించి పాలనలో స్వేచ్ఛనిచ్చినట్లే... మోసుల్‌లో మెజారిటీగా ఉన్న సున్నీలకు అవకాశం ఇవ్వాలనే వాదన ఉంది. షియా, సున్నీలు, కుర్దులకు మధ్య విభేదాలు ఇరాక్ సుస్థిరతపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన కూడా నెలకొంది.
అంతం అనలేం...
ఉచ్చదశలో ఉన్నపుడు... 2015లో ఐసిస్ ఆధీనంలో ఇరాక్, సిరియాల్లో కలిపి లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండేది. కోటి జనాభా దీని పాలన పరిధిలో ఉండేది. బలగాలు క్షీణించడం, కొత్తగా రిక్రూట్‌మెంట్లు లేకపోవడం, ఆదాయాలు పడిపోవడం... ద్వారా ఐసిస్ క్రమేపీ బలహీనపడుతూ వస్తోంది. మోసుల్‌ను విముక్తం చేయడం ద్వారా ఇరాక్ ఈ పట్టణానికి సమీపంలోని చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా... ఐసిస్‌కు మరో ఎదురుదెబ్బ. తమ ఆధీనంలోకి భూభాగంలో 60 శాతాన్ని ఐసిస్ కోల్పోయింది. 25 లక్షల మంది ప్రజలు ఇంకా ఐసిస్ పాలనలో ఉన్నారు. ఇరాక్‌లో పరిమిత ప్రాంతమే ఇప్పుడు ఐసిస్ చేతిలో ఉంది. అయితే సిరియాలో ఐసిస్‌కు రాజధానిగా పరిగణించే రక్కా నగరంతో పాటు పలు పట్టణాలు ఈ ఉగ్రసంస్థ ఆధీనంలోనే ఉన్నాయి. రక్కాను సిరియా బలగాలు ఇప్పటికే దిగ్భందించాయి. దాదాపు రెండువేల మంది తీవ్రవాదులు రక్కా సిటీ సెంటర్ కేంద్రంగా సిరియా సైన్యంతో పోరాడుతున్నారు. ఒకప్పుడు నెలకు 520 కోట్ల రూపాయల దాకా ఉన్న ఐసిస్ ఆదాయం ఇప్పుడు 104 కోట్లకు పడిపోయింది. ఐసిస్‌పై పోరాటంలో ప్రపంచదేశాలు కలిసికట్టుగా పనిచేస్తే... ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రభూతం ఐసిస్ కోరలు పీకవచ్చు. భూభాగాన్ని కోల్పోతున్న ఐసిస్ ఇప్పటికే చాలాచోట్ల గెరిల్లా దాడులకు దిగుతోంది. కారు బాంబులు, మానవ బాంబులతో నరమేధం సాగిస్తూ... మరోరకంగా ఉనికిని చాటుకుంటోంది. సానుభూతిపరులను రెచ్చగొట్టి పాశ్చాత్యదేశాల్లో దాడులకు తెగబడేలా చేస్తోంది. రక్కా కూడా విముక్తమైతే ఐసిస్‌పై చావుదెబ్బ పడ్డట్లే.
శిథిలాల్లో 20 రోజులు...
ఆ కుర్రాడికి దాదాపు పదేళ్లు ఉంటాయి. నడుము పైభాగంగా బ్యాండేజి చుట్టి ఉంది. 20 రోజులకు శిథిల భవనంలోని బేస్‌మెంట్‌లో చిక్కుకుపోయాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. సోమవారం బయటపడ్డ ఇతను ‘చాలా నొప్పిగా ఉంది. నడవలేకపోతున్నాను’ అనడం వీడియోలో కనిపిస్తోంది. అంతకుమించి వివరాలు తెలియలేదు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్