Mosul Iraq
-
ఇది అమానవీయం కాదంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లో అదృశ్యమైన 39 మంది ఎలా ఉన్నారన్న సమాచారం కోసం గత నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న వారి కుటుంబ సభ్యులకు మంగళవారం నాడు వారు భరించలేని విషాద వార్తలను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇరాక్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఇరాక్‌లో 40 మంది భారతీయ కార్మికులను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారన్న వార్త వెలుగులోకి వచ్చింది. అంటే, ఇది మోదీ ప్రభుత్వానికి మొట్టమొదటి సవాల్. ఈ సవాల్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నా టెర్రరిస్టుల చేతుల నుంచి భారతీయులను విడిపించడం అంత సులువు కాకపోవచ్చు. కానీ నాలుగేళ్లుగా వారు క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పదే పదే చెబుతూ సుష్మా స్మరాజ్ భారతీయులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను ఎందుకు మభ్య పెడుతూ వచ్చారన్నదే జవాబు దొరకని ప్రశ్న. సుష్మా స్మరాజ్ ఈ నాలుగేళ్లలో ఆరుసార్లు నిర్బంధితుల క్షేమ సమాచారంపై ప్రకటనలు విడుదల చేశారు. ప్రతి ప్రకటనలో వారు ‘ప్రాణాలతో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు’ను నొక్కి చెప్పారు. వారిని కాల్చివేయడాన్ని తాను కళ్లారా చూశానంటూ టెర్రరిస్టుల చెర నుంచి తప్పించుకొని వచ్చిన హార్జీత్ మాసిహ్ వెల్లడించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడంలో అర్థం ఏముంది? తప్పించుకొచ్చిన వైనంపై హార్జీత్ చెప్పిన మాటలు నమ్మశక్యంగా అనిపించలేదని, అందుకనే ఆయన మాటలను నమ్మలేదని సుష్మా ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. అసలు ఆమె మాటలే నమ్మశక్యంగా లేవు. వారు క్షేమంగా ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లేకుండా ఆమె ఎందకు ప్రకటనలు చేసినట్లు? ఎందుకు మభ్యపెట్టినట్లు? పైగా ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల నిర్బంధంలో ఉన్నవారిని విడిపించి తీసుకరావడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను పంపిస్తున్నట్లు కథలు ప్రచారం అయ్యాయి. ఒక వర్గం మీడియా అయితే నాడు అజిత్ దోవల్‌ను భారతీయ జేమ్స్ బాండ్‌గా అభివర్ణించింది. చివరకు నిర్బంధితులు క్షేమంగా లేరని, వారిని ఎప్పుడో చంపేశారనే విషయం తెల్సిన తర్వాత కూడా ఈ విషయాన్ని సుశ్మా స్వరాజ్ వారి కుటుంబ సభ్యులకు ముందుగా తెలియజేయకుండా, పార్లమెంట్‌కు ముందుగా తెలియజేయడం అమానవీయమే! -
మసీహ్ చెప్పిందే జరిగిందా?
ఇరాక్‌లోని మోసుల్‌లో 39 మంది భారత కార్మికులను తన కళ్ల ముందే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కాల్చిచంపడం చూశానని పదే పదే చెబుతున్న హర్జీత్ మసీహ్వి కట్టుకథలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పడంతో అతని వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌లోని గుర్దాస్పూర్ జిల్లా కాలా అఫ్ఘానాకు చెందిన 25 ఏళ్ల మసీహ్ ఇస్లామిక్ స్టేట్ నుంచి ప్రాణాలతో బయటి పడ్డాక ఇరాకీ కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి మంత్రి సుష్మతో ఫోన్లో మాట్లాడారు. ‘ఐఎస్ మనుషుల నుంచి ఎలా తప్పించుకున్నావు?’ అని పంజాబీలోనే సుష్మ ప్రశ్నించగా, అతని సమాధానం సంతృప్తికరంగా లేదనీ, కట్టుకథలా ఉందని ఆమె అన్నారు. మోసూల్ సమీపంలోని బాదుష్ లో మిగిలిన 39 మందిని ఊచకోత కోశాక అక్కడి నుంచి ఎర్బిల్‌కు ఎలా తప్పించుకు వచ్చావని ప్రశ్నిస్తే మసీహ్ జవాబివ్వలేదని కూడా సుష్మ పార్లమెంటులో వెల్లడించారు. మోసుల్‌లో సమీపంలోని మోసుల్ యూనివర్సిటీ ఆవరణలోని వ్యవసాయ, అటవీ కళాశాల వెనుక ప్రభుత్వ కాంట్రాక్టు నిర్మాణ ప్రాజెక్టులో పని చేస్తున్న 40 మంది భారత కార్మికుల్లో ఒకడినని మసీహ్ చెప్పారు. ఈ నిర్మాణ పని చేపట్టిన బాగ్దాద్‌కు చెందిన తారిక్ అల్ హుదా అనే సంస్థ యూఏఈలోని తన శాఖ కార్యాలయం ద్వారా పంజాబ్ నుంచి రప్పించిన కాంట్రాక్టు కార్మికుల్లో మసీహ్ ఒకరనే విషయంలో అనుమానం లేదు. ఈ కార్మికులను తీవ్రవాదులు బందీలుగా తీసుకున్న తర్వాత 2014 జూన్ 16న 39 మందిని కాల్చిచంపారని మొదటి నుంచీ మసీహ్ చెబుతున్నాడు. తమకు భోజనం ఏర్పాట్లు చేసే కేటరర్ సాయంతో బంగ్లాదేశీగా నాటకమాడి అలీ పేరుతో మసీహ్ ఎర్బిల్ చేరుకుని కాలి గాయానికి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడి నుంచి బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నాడు. మంత్రి సుష్మతో మాట్లాడాక భారత్ వచ్చి పదే పదే తన కళ్ల ముందే 39 మందిని ఊచకోత కోశారని, ప్రభుత్వం చెబుతున్నట్టు వారెవరూ బతికి లేరని మసీహ్ మీడియాకు చెప్పడం విదేశాంగ శాఖకు ఇబ్బందిగా మారింది. కిందటేడాది మార్చిలో అరెస్ట్ తనను కలిసిన భారత కార్మికుల కుటుంబసభ్యులతో సుష్మ వారి భద్రతపై హామీ ఇస్తూ, 39 మందీ బతికే ఉన్నారని ఓ పక్క చెబుతుండగా, మరో వైపు మసీహ్ మాటలు కేంద్ర సర్కారుకు చీకాకు పెట్టాయి. దీంతో విదేశాంగశాఖ ఆదేశాలపై పంజాబ్ పోలీసులు మసీహ్‌పై కేసు నమోదు చేశారు. ఐఎస్ అపహరించుకుపోయిన మజిందర్ సింగ్ అనే యువకుడి సోదరి గుర్భిందర్ కౌర్ ఫిర్యాదుపై మసీహ్‌ను కిందటేడాది మార్చిలో అరెస్ట్ చేశారు. ‘కాలా అఫ్ఘానాకు చెందిన హర్జీత్ మసీహ్, రాందాస్ గ్రామానికి చెందిన రాజ్బీర్ సింగ్ ట్రావెల్ ఏజెంట్లు. మా తమ్ముడు మజిందర్ దుబాయ్ వెళ్లడానికి ఫతేగఢ్ చురియాలోని వారి ఆఫీసులో ఈ ఇద్దరికీ రెండు లక్షల రూపాయలు చెల్లించాడు,’ అని గుర్భిందర్ విదేశాంగ మంత్రిత్వశాఖకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అపహరణకు గురైన మొత్తం 39 మంది ఆచూకీ మసీహ్‌కు తెలుసని కూడా ఆమె ఆరోపించారు. మసీహ్‌ను అరెస్టు చేసినప్పుడు అతని దగ్గరి బంధువైన రాజ్బీర్ పరారీలో ఉన్నాడు. ఆరు నెలలు గురుగ్రామ్. నోయిడా జైళ్లలో గడిపిన మసీహ్ బెయిలుపై విడుదలయ్యాడు. నేనెప్పుడూ అబద్ధమాడలేదు సర్కారు మాటల్లో నిజం లేదు: మసీహ్ ‘నేనెప్పుడూ అబద్ధమాడలేదు. ప్రభుత్వమే అబద్ధాలాడుతోంది,’ అని ఓ టీవీ న్యూస్ చానల్లో మసీహ్ చెప్పాడు. ‘2014 మే వరకూ అంతా బాగానే ఉంది. ఫ్యాక్టరీలో మేం ఎప్పటిలా పనిచేసుకుంటున్నాం. మోసుల్ శివారు ప్రాంతాల్లో ఐఎస్ తీవ్రవాదుల కాల్పులు మొదలయ్యాయి. నెల తర్వాత వారు మా ఫ్యాక్టరీలో ప్రవేశించి మమ్మల్ని అపహరించుకుపోయారు. కొన్నాళ్లకు మరో ప్రాంతానికి తీసుకుపోయి మమ్మల్ని మోకాళ్లపై కూర్చోవాలని ఆదేశించి మాపై కాల్పులు ప్రారంభించారు. నా కాలికి గాయమైంది. మరుసటి రోజు నేను లేచి చూస్తే, నా తోటి కార్మికులందరూ శవాలై పడి ఉన్నారు. నేను కొన్ని రోజులపాటు నడుస్తూ ఓ బంగ్లాదేశీ సహాయ శిబిరానికి చేరుకున్నా. అక్కడి నుంచి నన్ను ఆస్పత్రికి తరలించారు. వారం తర్వాత నేను ఇండియాకు తిరిగి వచ్చా,’ అని కిందటేడాది ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మసీహ్ చెప్పాడు. ‘ప్రభుత్వం ఎందుకు వాస్తవాన్ని అంగీకరించి 39 మంది మరణించిన విషయం చెప్పడం లేదో నాకు తెలియడం లేదు. వారు బతికే ఉంటే ఈ మూడేళ్లలో సర్కారు ఏంచేసినట్టు? నేను అబద్దం చెప్పడం వల్ల నాకు ఒరిగేదేముంది?’ అని మసీహ్ ప్రశ్నించాడు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
శిథిలాలే మిగిలాయి...!
మోసుల్ తిరిగి ఇరాక్ వశమైంది. ఐసిస్‌ను తరిమేశారు... కచ్చితంగా ఇది విజయమే. కానీ ఇప్పుడు ఏముందక్కడ? ఎటుచూసినా శిథిలాలే. యుద్ధం మిగిల్చిన గాయాలే. పూర్తిగా నేలమట్టమైన భవనాలు కొన్ని, సగం కూలినవి మరికొన్ని. కాలిబూడిదైన కార్లు... జాడలేని రోడ్లు. నీళ్లు లేవు, కరెంటు లేదు, కనీస వసతులేవీ లేవు. బడి, గుడి, ఆసుపత్రి... అన్నీ నేలమట్టమే. 12వ శతాబ్దంలో నిర్మించిన... మోసుల్కు తలమానికంగా నిలిచిన చారిత్రక ఆల్ నూరీ మసీదు కాలాన్ని తట్టుకొని ఠీవిగా నిలిచింది. మసీదు ఆవరణలోని 150 అడుగుల అల్ హబ్దా మినార్... మోసుల్ అనగానే గుర్తొచ్చే కట్టడం. ఇప్పుడుక్కడ మినార్ ఆనవాళ్లు కూడా లేవు. ఇరాక్ కరెన్సీ పైనా, పాత చిత్రాలు, వీడియోల్లో మాత్రమే మనం దీన్ని చూడగలం. జూన్ 22న ఐసిస్ దీన్ని పేల్చివేసింది. మొత్తం 44 జిల్లాల్లో పశ్చిమ మోసుల్‌లోని ఆరు జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముక్కుపుటల అదిరిపోయే దుర్వాసన. బాంబు పేలుళ్లలో ముక్కలైన మానవ కళేబరాలు... కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నాయి. శిథిలాల కింద చిక్కిచనిపోయిన వారి పార్థివదేహాలదీ అదే పరిస్థితి. జనంతో కళకళలాడిన ఇరాక్‌లోని రెండో పెద్ద నగరం మోసుల్... మూడేళ్లలో చిధ్రమైపోయింది. మూడేళ్ల కిందట ఐసిస్ చేతుల్లోకి... పద్దెనిమిది లక్షల జనాభాగల మోసుల్ ఇరాక్‌లో ఉత్తరాన ఉంటుంది. సిరియా, టర్కీ సరిహద్దులకు సమీపంలోగల ఈ పట్టణాన్ని 2014 జూన్‌లో ఉగ్రవాద సంస్థ ఐసిస్ కైవసం చేసుకుంది. మోసుల్‌లోని అల్ నూరీ మసీదు నుంచి ఐసిస్ చీఫ్ అబూబాకర్ అల్ బగ్దాదీ తనను తాను ‘ఖలీఫా’గా ప్రకటించుకున్నాడు. ఇరాక్, సిరియాలలో ఐసిస్ ఆధీనంలో ఉన్న భూభాగంలో అతిపెద్ద పట్టణం మోసుల్. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 10 వేల మంది సైనికులను మొహరించి ఇరాక్ 2016 అక్టోబరులో పోరు ముమ్మరం చేసింది. అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు వీరికి మద్దతుగా నిరంతరం గగనతల దాడులు చేశాయి. బాంబుల వర్షం కురిపించాయి. పోరు ఉధృతమవ్వడంతో ఐసిస్ ఉగ్రవాదులు టిగ్రిస్ నదిని ఆనుకొని ఉండే... జనసమ్మర్ధమైన ఓల్డ్‌సిటీని కేంద్రంగా చేసుకొని పోరాడారు. నగరానికి పశ్చిమాన ఉండే ఓల్డ్‌సిటీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. మానవ కవచాలుగా స్థానికులను వాడుకున్నారు. వారిని మానవబాంబులుగా మార్చి... ఇరాకీ బలగాలపైకి విసిరేసే వారు. శిథిలాల్లో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ... మొత్తం మీద 9 నెలల్లో ‘ఆపరేషన్ మోసుల్’ను పూర్తిచేశారు ఇరాక్ సైనికులు. నిర్వాసితులు తొమ్మిది లక్షలు... మోసుల్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన పోరులో వేలాది మంది అమాయకుల ప్రాణాలుపోయాయి. ఎటువైపు నుంచి ఏ తూటా దూసుకొస్తుందో, ఎప్పుడు పైనుంచి బాంబులు పడతాయో తెలియదు. బతికుంటే చాలునని కట్టుబట్టలతో ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇలాంటి నిర్వాసితులు తొమ్మిది లక్షల మంది ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. బంధువుల ఇళ్లలో, శరణార్థి శిబిరాల్లో వీరు తలదాచుకుంటున్నారు. వీరందరి జీవితాలు మళ్లీ గాడిలో పడాలంటే ఏళ్లు పట్టొచ్చు. ఏడాది కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకే... 6,500 కోట్ల రూపాయలకు పైగా కావాలని ఐరాస చెబుతోంది. గృహనిర్మాణం, ఇతర సాయానికి మరింత పెద్ద మొత్తమే కావాలి. ఇరాక్‌కు అందే అంతర్జాతీయ సాయంపై మోసుల్ పునర్నిర్మాణం ఆధారపడి ఉంటుంది. మోసుల్ పాలనపై కూడా అంతర్గతంగా విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. కుర్దుల ప్రాబల్యం కలిగిన ప్రాంతాన్ని కుర్థిస్తాన్గా గుర్తించి పాలనలో స్వేచ్ఛనిచ్చినట్లే... మోసుల్‌లో మెజారిటీగా ఉన్న సున్నీలకు అవకాశం ఇవ్వాలనే వాదన ఉంది. షియా, సున్నీలు, కుర్దులకు మధ్య విభేదాలు ఇరాక్ సుస్థిరతపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన కూడా నెలకొంది. అంతం అనలేం... ఉచ్చదశలో ఉన్నపుడు... 2015లో ఐసిస్ ఆధీనంలో ఇరాక్, సిరియాల్లో కలిపి లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండేది. కోటి జనాభా దీని పాలన పరిధిలో ఉండేది. బలగాలు క్షీణించడం, కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోవడం, ఆదాయాలు పడిపోవడం... ద్వారా ఐసిస్ క్రమేపీ బలహీనపడుతూ వస్తోంది. మోసుల్‌ను విముక్తం చేయడం ద్వారా ఇరాక్ ఈ పట్టణానికి సమీపంలోని చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా... ఐసిస్‌కు మరో ఎదురుదెబ్బ. తమ ఆధీనంలోకి భూభాగంలో 60 శాతాన్ని ఐసిస్ కోల్పోయింది. 25 లక్షల మంది ప్రజలు ఇంకా ఐసిస్ పాలనలో ఉన్నారు. ఇరాక్‌లో పరిమిత ప్రాంతమే ఇప్పుడు ఐసిస్ చేతిలో ఉంది. అయితే సిరియాలో ఐసిస్‌కు రాజధానిగా పరిగణించే రక్కా నగరంతో పాటు పలు పట్టణాలు ఈ ఉగ్రసంస్థ ఆధీనంలోనే ఉన్నాయి. రక్కాను సిరియా బలగాలు ఇప్పటికే దిగ్భందించాయి. దాదాపు రెండువేల మంది తీవ్రవాదులు రక్కా సిటీ సెంటర్ కేంద్రంగా సిరియా సైన్యంతో పోరాడుతున్నారు. ఒకప్పుడు నెలకు 520 కోట్ల రూపాయల దాకా ఉన్న ఐసిస్ ఆదాయం ఇప్పుడు 104 కోట్లకు పడిపోయింది. ఐసిస్‌పై పోరాటంలో ప్రపంచదేశాలు కలిసికట్టుగా పనిచేస్తే... ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రభూతం ఐసిస్ కోరలు పీకవచ్చు. భూభాగాన్ని కోల్పోతున్న ఐసిస్ ఇప్పటికే చాలాచోట్ల గెరిల్లా దాడులకు దిగుతోంది. కారు బాంబులు, మానవ బాంబులతో నరమేధం సాగిస్తూ... మరోరకంగా ఉనికిని చాటుకుంటోంది. సానుభూతిపరులను రెచ్చగొట్టి పాశ్చాత్యదేశాల్లో దాడులకు తెగబడేలా చేస్తోంది. రక్కా కూడా విముక్తమైతే ఐసిస్‌పై చావుదెబ్బ పడ్డట్లే. శిథిలాల్లో 20 రోజులు... ఆ కుర్రాడికి దాదాపు పదేళ్లు ఉంటాయి. నడుము పైభాగంగా బ్యాండేజి చుట్టి ఉంది. 20 రోజులకు శిథిల భవనంలోని బేస్మెంట్లో చిక్కుకుపోయాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. సోమవారం బయటపడ్డ ఇతను ‘చాలా నొప్పిగా ఉంది. నడవలేకపోతున్నాను’ అనడం వీడియోలో కనిపిస్తోంది. అంతకుమించి వివరాలు తెలియలేదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్