ఇరాక్‌లోని మోసుల్లో 39 మంది భారత కార్మికులను తన కళ్ల ముందే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కాల్చిచంపడం చూశానని పదే పదే చెబుతున్న హర్జీత్ మసీహ్‌వి కట్టుకథలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పడంతో అతని వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌లోని గుర్దాస్పూర్ జిల్లా కాలా అఫ్ఘానాకు చెందిన 25 ఏళ్ల మసీహ్ ఇస్లామిక్ స్టేట్ నుంచి ప్రాణాలతో బయటి పడ్డాక ఇరాకీ కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి మంత్రి సుష్మతో ఫోన్లో మాట్లాడారు. ‘ఐఎస్ మనుషుల నుంచి ఎలా తప్పించుకున్నావు?’ అని పంజాబీలోనే సుష్మ ప్రశ్నించగా, అతని సమాధానం సంతృప్తికరంగా లేదనీ, కట్టుకథలా ఉందని ఆమె అన్నారు. మోసూల్ సమీపంలోని బాదుష్ లో మిగిలిన 39 మందిని ఊచకోత కోశాక అక్కడి నుంచి ఎర్బిల్‌కు ఎలా తప్పించుకు వచ్చావని ప్రశ్నిస్తే మసీహ్ జవాబివ్వలేదని కూడా సుష్మ పార్లమెంటులో వెల్లడించారు.
మోసుల్లో సమీపంలోని మోసుల్ యూనివర్సిటీ ఆవరణలోని వ్యవసాయ, అటవీ కళాశాల వెనుక ప్రభుత్వ కాంట్రాక్టు నిర్మాణ ప్రాజెక్టులో పని చేస్తున్న 40 మంది భారత కార్మికుల్లో ఒకడినని మసీహ్ చెప్పారు. ఈ నిర్మాణ పని చేపట్టిన బాగ్దాద్కు చెందిన తారిక్ అల్ హుదా అనే సంస్థ యూఏఈలోని తన శాఖ కార్యాలయం ద్వారా పంజాబ్ నుంచి రప్పించిన కాంట్రాక్టు కార్మికుల్లో మసీహ్ ఒకరనే విషయంలో అనుమానం లేదు.
ఈ కార్మికులను తీవ్రవాదులు బందీలుగా తీసుకున్న తర్వాత 2014 జూన్ 16న 39 మందిని కాల్చిచంపారని మొదటి నుంచీ మసీహ్ చెబుతున్నాడు. తమకు భోజనం ఏర్పాట్లు చేసే కేటరర్ సాయంతో బంగ్లాదేశీగా నాటకమాడి అలీ పేరుతో మసీహ్ ఎర్బిల్ చేరుకుని కాలి గాయానికి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడి నుంచి బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నాడు. మంత్రి సుష్మతో మాట్లాడాక భారత్ వచ్చి పదే పదే తన కళ్ల ముందే 39 మందిని ఊచకోత కోశారని, ప్రభుత్వం చెబుతున్నట్టు వారెవరూ బతికి లేరని మసీహ్ మీడియాకు చెప్పడం విదేశాంగ శాఖకు ఇబ్బందిగా మారింది.
కిందటేడాది మార్చిలో అరెస్ట్
తనను కలిసిన భారత కార్మికుల కుటుంబసభ్యులతో సుష్మ వారి భద్రతపై హామీ ఇస్తూ, 39 మందీ బతికే ఉన్నారని ఓ పక్క చెబుతుండగా, మరో వైపు మసీహ్ మాటలు కేంద్ర సర్కారుకు చీకాకు పెట్టాయి. దీంతో విదేశాంగశాఖ ఆదేశాలపై పంజాబ్ పోలీసులు మసీహ్‌పై కేసు నమోదు చేశారు. ఐఎస్ అపహరించుకుపోయిన మజిందర్ సింగ్ అనే యువకుడి సోదరి గుర్భిందర్ కౌర్ ఫిర్యాదుపై మసీహ్‌ను కిందటేడాది మార్చిలో అరెస్ట్ చేశారు.
‘కాలా అఫ్ఘానాకు చెందిన హర్జీత్ మసీహ్, రాందాస్ గ్రామానికి చెందిన రాజ్బీర్ సింగ్ ట్రావెల్ ఏజెంట్లు. మా తమ్ముడు మజిందర్ దుబాయ్ వెళ్లడానికి ఫతేగఢ్ చురియాలోని వారి ఆఫీసులో ఈ ఇద్దరికీ రెండు లక్షల రూపాయలు చెల్లించాడు,’ అని గుర్భిందర్ విదేశాంగ మంత్రిత్వశాఖకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అపహరణకు గురైన మొత్తం 39 మంది ఆచూకీ మసీహ్‌కు తెలుసని కూడా ఆమె ఆరోపించారు. మసీహ్‌ను అరెస్టు చేసినప్పుడు అతని దగ్గరి బంధువైన రాజ్బీర్ పరారీలో ఉన్నాడు. ఆరు నెలలు గురుగ్రామ్. నోయిడా జైళ్లలో గడిపిన మసీహ్ బెయిలుపై విడుదలయ్యాడు.
నేనెప్పుడూ అబద్ధమాడలేదు
సర్కారు మాటల్లో నిజం లేదు: మసీహ్
‘నేనెప్పుడూ అబద్ధమాడలేదు. ప్రభుత్వమే అబద్ధాలాడుతోంది,’ అని ఓ టీవీ న్యూస్ చానల్‌లో మసీహ్ చెప్పాడు. ‘2014 మే వరకూ అంతా బాగానే ఉంది. ఫ్యాక్టరీలో మేం ఎప్పటిలా పనిచేసుకుంటున్నాం. మోసుల్ శివారు ప్రాంతాల్లో ఐఎస్ తీవ్రవాదుల కాల్పులు మొదలయ్యాయి. నెల తర్వాత వారు మా ఫ్యాక్టరీలో ప్రవేశించి మమ్మల్ని అపహరించుకుపోయారు. కొన్నాళ్లకు మరో ప్రాంతానికి తీసుకుపోయి మమ్మల్ని మోకాళ్లపై కూర్చోవాలని ఆదేశించి మాపై కాల్పులు ప్రారంభించారు. నా కాలికి గాయమైంది.
మరుసటి రోజు నేను లేచి చూస్తే, నా తోటి కార్మికులందరూ శవాలై పడి ఉన్నారు. నేను కొన్ని రోజులపాటు నడుస్తూ ఓ బంగ్లాదేశీ సహాయ శిబిరానికి చేరుకున్నా. అక్కడి నుంచి నన్ను ఆస్పత్రికి తరలించారు. వారం తర్వాత నేను ఇండియాకు తిరిగి వచ్చా,’ అని కిందటేడాది ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మసీహ్ చెప్పాడు. ‘ప్రభుత్వం ఎందుకు వాస్తవాన్ని అంగీకరించి 39 మంది మరణించిన విషయం చెప్పడం లేదో నాకు తెలియడం లేదు. వారు బతికే ఉంటే ఈ మూడేళ్లలో సర్కారు ఏంచేసినట్టు? నేను అబద్దం చెప్పడం వల్ల నాకు ఒరిగేదేముంది?’ అని మసీహ్ ప్రశ్నించాడు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment