ఆ 39 మందిని చంపేశారు | All 39 hostages kidnapped in Iraqs Mosul killed by ISIS | Sakshi
Sakshi News home page

ఆ 39 మందిని చంపేశారు

Published Wed, Mar 21 2018 1:27 AM | Last Updated on Wed, Mar 21 2018 7:29 AM

All 39 hostages kidnapped in Iraqs Mosul killed by ISIS - Sakshi

న్యూఢిల్లీ: ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది భారతీయులు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్‌ పట్టణం సమీపంలోని బదోష్‌ అనే గ్రామంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వారు అపహరణకు గురైన భారతీయులేనని నిర్ధారణకు వచ్చినట్లు మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ రాజ్యసభకు తెలిపారు. 

లోక్‌సభలోనూ సుష్మ ఈ విషయం ప్రకటించాల్సి ఉన్నా ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య సభ వాయిదా పడింది. అయితే, ఈ విషయాన్ని ముందుగా బాధిత కుటుంబ సభ్యులకు తెలపకుండా, సభలో ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని విమర్శించాయి. భారతీయుల అపహరణ విషయంలో ప్రభుత్వం ఇన్నాళ్లూ వారిని తప్పుదోవ పట్టించిందని ఆరోపించాయి. బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

2014లో మోసుల్‌ పట్టణం ఐఎస్‌ ఉగ్రవాదుల అధీనంలో ఉండగా.. మొత్తం 40 మంది భారతీయులు అపహరణకు గురవగా, వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింనని చెప్పుకుని సురక్షితంగా బయటపడ్డాడు. లాంఛనాలు పూర్తిచేసి 39 మంది భారతీయుల మృతదేహాలను స్వదేశం తీసుకురావడానికి 10 రోజులు పట్టొచ్చని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ చెప్పారు.

మట్టి దిబ్బ కింద మృతదేహాలు..
‘విస్పష్ట ఆధారాలు లభించే వరకూ ఎవరూ చనిపోయారని ప్రకటించనని ఇదివరకే చెప్పా. కచ్చితమైన నిర్ధారణ అనంతరమే ఈ ప్రకటన చేస్తున్నా. కార్మికుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించి, ఇక వారి నిరీక్షణకు ముగింపు పలకబోతున్నామని భారమైన హృదయంతో చెబుతున్నా’ అని సుష్మ భావోద్వేగంతో పేర్కొన్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఎలా జరిగిందో సుష్మ వివరించారు.

‘ఐఎస్‌ చెర నుంచి మోసుల్‌ విముక్తమైన తరువాత స్థానిక అధికారుల సాయంతో గాలింపును విస్తృతం చేశాం. మోసుల్‌ దగ్గర్లోని బదోష్‌ గ్రామంలోని ఒక మట్టిదిబ్బ కింద చాలా మంది మృతదేహాలను ఉగ్రవాదులు పూడ్చిపెట్టినట్లు మాకు సమాచారం అందింది. రాడార్‌ సాంకేతికతతో అది నిజమేనని గుర్తించాం. ఆ మృతదేహాలను వెలికితీశాం. ఆ మృతదేహాలు గల్లంతైన భారతీయులవేనని ధ్రువీకరించడం చాలా కష్టమైంది. మట్టి దిబ్బ కింద ఒకరి శరీరంపై మరో శరీరాన్ని పూడ్చి ఉగ్రవాదులు క్రూరత్వం ప్రదర్శించారు.

మృతదేహాల వద్ద లభించిన ఆధారాల సాయంతో వారు భారతీయులేనని ప్రాథమికంగా నిర్ధారించాం. అనంతరం డీఎన్‌ఏ పరీక్షల కోసం బాగ్దాద్‌ తరలించాం. ఆ పరీక్షల్లో 38 మంది డీఎన్‌ఏలు సరిపోలగా, ఒక వ్యక్తివి 70% వరకు సరిపోయాయి’ అని సుష్మ వివరించారు. మృతుల్లో 27 మంది పంజాబీలు, నలుగురు హిమాచల్‌ ప్రదేశ్, ఆరుగురు బిహార్, ఇద్దరు పశ్చిమ బెంగాల్‌ వాసులున్నారు.

నేనేమీ దాయలేదు: సుష్మ
మోసుల్‌లో భారత కార్మికుల అపహరణ వ్యవహారంలో తానేమీ దాయలేదని, ఎవరికీ కల్పిత హామీలు ఇవ్వలేదని సుష్మ తెలిపారు. ఉగ్రవాదుల చెర నుంచి తెలివిగా బయటపడ్డ హర్జీత్‌ను ప్రభుత్వం వేధించిందన్న ఆరోపణలను ఖండించారు. చావు విషయాల్లో కూడా కాంగ్రెస్‌ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. డీఎన్‌ఏ సరిపోలిన మొదటి వ్యక్తి సందీప్‌ అని, చివరి, 39వ వ్యక్తి డీఎన్‌ఏ 70 శాతమే సరిపోలిందని, అతని తల్లిదండ్రులు చనిపోవడంతో ఇతర కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో ఆయన డీఎన్‌ఏను పోల్చినట్లు తెలిపారు.

ఆ ఒక్కడు తప్పించుకున్నాడిలా..
2014లో ఇరాక్‌లోని రెండో పెద్ద పట్టణమైన మోసుల్‌లో నిర్మాణరంగంలో కార్మికులుగా పనిచేస్తున్న మొత్తం 40 మంది భారతీయులు, మరికొందరు బంగ్లాదేశీయులను ఐఎస్‌ అపహరించింది. అందులో గురుదాస్‌పూర్‌కు చెందిన హర్జీత్‌ మాసిహ్‌ మాత్రం తాను బంగ్లాదేశీ ముస్లింనని చెప్పి తప్పించుకున్నాడు. మిగతా 39 మందిని ఐఎస్‌ ఉగ్రవాదులు చంపుతుండగా చూశానన్న హర్జీత్‌ మాటలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆయనవి కట్టుకథలని ప్రకటించింది.

బందీలను తొలుత ఓ వస్త్ర కర్మాగారంలో ఉంచి ఆ తరువాత బాదోశ్‌ గ్రామంలోని చెరసాలకు తరలించారు. ఓ కేటరింగ్‌ వ్యాపారి వెల్లడించిన వివరాల ప్రకారం..భోజనం చేసి తిరిగొస్తుండగా 40 మంది భారతీయులతో పాటు కొందరు బంగ్లాదేశ్‌ కార్మికులను ఐఎస్‌ ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నారు. వస్త్ర కర్మాగారంలో భారతీయులు, బంగ్లాదేశీయులను వేరుచేశారు. ఆ తరువాత బంగ్లాదేశీ కార్మికులను ప్రత్యేక వాహనంలో ఎర్బిల్‌కు తరలించారు. బంగ్లాదేశీయుడినని చెప్పుకున్న హర్జీత్‌..తన పేరు అలీ అని మార్చుకుని ఎర్బిల్‌ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు.  


ఈ నాలుగేళ్లలో....
  జూన్‌ 15, 2014: ఇరాక్‌లోని మోసుల్‌లో 40 మంది భారతీయుల కిడ్నాప్‌.. బంగ్లాదేశీ ముస్లింనని చెప్పి ఐఎస్‌ నుంచి తప్పించుకున్న హర్జీత్‌ మాసిహ్‌
మే 15, 2015: అపహరించిన 5 రోజుల అనంతరం 39 మందిని ఒక కొండపైకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారని చెప్పిన హర్జీత్‌.. ఇరాక్‌ నుంచి వచ్చాక తాను భారత్‌ దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నానని వెల్లడి.
జూన్‌ 20, 2016:  కిడ్నాపైన 39 మంది భారతీయులు సజీవంగా ఉన్నారన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌
జూలై 2017: మోసుల్‌కు ఐఎస్‌ నుంచి విముక్తి. బదోష్‌ జైల్లో 39 మంది బందీలుగా ఉన్నారన్న సమాచారంతో ఇరాక్‌కు  వెళ్లిన విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్‌.
అక్టోబర్‌ 28, 2017: కిడ్నాపైన భారతీయుల బంధువుల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్‌ సేకరించిన అధికారులు
మార్చి 20, 2018: ఆ 39 మంది భారతీయుల్ని ఉగ్రవాదులు ఊచకోత కోసి బదోష్‌ గ్రామంలో పూడ్చిపెట్టినట్లు పార్లమెంటులో ప్రకటన చేసిన సుష్మాస్వరాజ్‌.


ఎందుకు దాచారు?
చండీగఢ్‌: ఇరాక్‌లో భారతీయ కార్మికులు చనిపోయారని సుష్మా స్వరాజ్‌ రాజ్యసభలో చేసిన ప్రకటనను విన్న వెంటనే బాధిత కుటుంబాలు విషాదంలో మునిగాయి. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని తమ వద్ద ఎందుకు దాచిపెట్టారని కేంద్రాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తమవారు చనిపోయారని ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్‌లోని బాధిత కుటుంబాల సభ్యులు తెలిపారు. ‘సుష్మా స్వరాజ్‌ను 12 సార్లు కలుసుకున్నాం. జాడ తెలియకుండా పోయిన భారతీయులంతా బతికే ఉన్నారని ఆమె ధైర్యం చెప్పారు.

హర్జీత్‌ మాసిహ్‌ అబద్ధాలాడుతున్నాడని అన్నారు. ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇవ్వడం కన్నా అసలు వారి వద్ద విశ్వసనీయ సమాచారం లేదని చెబితే బాగుండేది’ అని అమృత్‌సర్‌కు చెందిన ఓ మృతుడి సోదరుడు సార్వాన్‌ వాపోయాడు. యెమెన్‌లో కేరళ నర్సులను కాపాడిన ప్రభుత్వం పంజాబ్‌కు చెందిన కార్మికులను రక్షించడంలో విఫలమైందని ఆక్రోశం వెళ్లగక్కాడు. గల్లంతైన 27 ఏళ్ల మజీందర్‌ సింగ్‌ సోదరి గుర్పీందర్‌ కౌర్‌ కూడా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. తొలుత వారంతా బతికే ఉన్నారన్న ప్రభుత్వం హఠాత్తుగా ఇలాంటి ప్రకటన చేయడమేంటని ఆవేదన చెందింది.

ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి: హర్జీత్‌
తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు తనపై పెట్టిన మానవ అక్రమ రవాణా కేసును ఉపసంహరించుకోవాలని హర్జీత్‌ డిమాండ్‌ చేశారు. ఐఎస్‌ నిర్బంధంలోని కార్మికులు ఆనాడే చనిపోయారని నాలుగేళ్లుగా చెబుతున్నానన్నారు. పోలీసులు తనపై అక్రమంగా పెట్టిన కేసు వల్ల ఆరు నెలలు జైలులో గడిపి బెయిల్‌పై బయటికి వచ్చినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement