సాక్షి, న్యూఢిల్లీ : ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన 39 మంది భారతీయులు ప్రాణాలతో లేరనే పార్లమెంట్‌లో భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే వారిని చంపటం తాను కళ్లారా చూశానంటూ హర్జిత్ మసిహ్ అనే పంజాబ్‌కు చెందిన వ్యక్తి మీడియా ఛానెళ్లకు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మసిహ్ వ్యవహారంపై విదేశాంగ శాఖ స్పందించింది.
హర్జిత్ మసిహ్ చెబుతున్న కథనాలు అబద్ధమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ‘మోసుల్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు చిక్కిన బందీల్లో అతను లేనే లేడు. కానీ, ఉగ్రవాదుల నుంచి రక్షించుకునేందుకు అలీగా తన పేరును మార్చుకుని.. కొంతమంది బంగ్లాదేశీయులతో కలిసి తప్పించుకునే యత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఎర్బిల్ వద్ద ఇరాక్ ఆర్మీకి అతను పట్టుబడ్డాడు. వారు అతన్ని భారత రాయబార కార్యాలయానికి తరలించగా.. మూడు నెలల నిర్భంధం తర్వాత తిరిగి ఇండియాకు వచ్చాడు. మీడియాతో బంధీలను చంపటం తాను చూశానని హర్జిత్ చెప్పటం వాస్తవం లేదు. ఒక పౌరుడిగా అతను చెబుతున్న మాటలను.. భాద్యతగల ప్రభుత్వంగా విచారణ చేపట్టాకే మేం ధృవీకరించాల్సి ఉంటుంది. అతన్ని అధికారులు వేధించారన్న ఆరోపణలు కూడా నిజం కాదు’ అంటూ సుష్మా పేర్కొన్నారు.
హర్జిత్ చెప్పిన కథనం... పంజాబ్‌కు చెందిన హర్జిత్ వలస కూలీగా మోసుల్‌కు వెళ్లాడు. నిర్మాణ పనుల కోసం వెళ్లిన అతన్ని, మరో 39 మంది భారతీయ కూలీలను జూన్ 11, 2014లో ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. తన కళ్ల ముందే వారందరినీ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అయితే గాయాలతో ఉన్న తాను చచ్చినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డానని.. ఎర్బిల్ ప్రాంతంలో ఇరాకీ ఆర్మీ చెక్ పాయింట్ వద్ద తనను గమనించిన అధికారులు భారతీయ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారని.. అక్కడి నుంచి తాను ఇండియాకు చేరానని అతను ప్రముఖ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ స్పందించింది.
లోక్‌సభలో ప్రకటన చెయ్యనివ్వరా?
కాగా, ఇరాక్‌లో 39 మంది భారతీయుల మరణం పట్ల విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో ఆమె ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు. ‘రాజ్యసభలో ప్రకటన చేస్తే విన్నారు. లోక్‌సభలో మాత్రం అడ్డుకుంటున్నారు. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది అంటూ ఆమె ఆక్షేపించారు. ఇక మృతదేహాల గుర్తింపు కష్టతరంగా ఉన్నప్పటికీ.. త్వరలో వాటిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment