బందీల మరణరహస్యం | Editorial on 39 indians killed in Iraq | Sakshi
Sakshi News home page

బందీల మరణరహస్యం

Published Thu, Mar 22 2018 1:33 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Editorial on 39 indians killed in Iraq - Sakshi

ఇరాక్‌లోని మోసుల్‌లో నాలుగేళ్లక్రితం ఐఎస్‌ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కి ఆచూకీ లేకుండాపోయిన 39 మంది భారత పౌరులు ఆ ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ ఎట్టకేలకు పార్లమెంటులో ప్రకటించారు. వీరంతా పంజాబ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు. పుట్టిన గడ్డపై పొట్ట నిండక బతుకు తెరువు కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధపడుతున్న వలస కార్మికులు ఎన్నో కడగండ్లు పడుతున్నారు. 

అటు ఉగ్రవాద మూకల దాడులు, ఇటు అమెరికా సేనలు సాగించే ద్రోన్‌ దాడులతో ఇరాక్‌ వంటి దేశాలు వల్లకాటిగా మారాయి. అటువంటి చోటకు సైతం వెళ్లడానికి సాహసించారంటేనే ఆ కార్మికుల కుటుంబాలు ఎంత దీనస్థితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మోసుల్‌ ఉదంతంలో చిక్కుకుని ఐఎస్‌ ఉగ్రవాదుల కన్నుగప్పి తప్పించుకొచ్చిన హర్జిత్‌ మాసి అప్పట్లోనే తనతోపాటున్న 39 మందినీ వారు కాల్చి చంపారని చెప్పాడు. 

కానీ  కేంద్ర ప్రభుత్వం దాన్ని కొట్టిపారేసింది. వారంతా ఇంకా సజీవంగానే ఉన్నారని తమకు సమాచారం అందిందని, ఆ బందీల విడుదల కోసం సకలవిధాలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత సైతం బందీల కుటుంబాలవారికి సుష్మా అలాగే చెబుతూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి ఆ బందీలను ఉగ్రవాదులు కాల్చిచంపారని చెబితే ఆ కుటుంబాలు ఏమైపోవాలి? కేంద్రం కేవలం హర్జిత్‌ మాసి చెప్పిన కథనాన్ని కొట్టిపారేసి ఊరుకోలేదు. పోలీసులు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి అతన్ని సంరక్షించే ఉద్దేశంతోనే ఈ పని చేశామని చెప్పారు. స్వేచ్ఛగా వదిలిన కొన్నాళ్ల తర్వాత మళ్లీ వేరే కారణంతో అతను జైలుకు పోవాల్సివచ్చింది.

ఏం చేసినా అతను తొలుత చెప్పిన మాట మీదే ఉన్నాడు. భవన నిర్మాణ పనిలో ఉండగా వచ్చిన ఉగ్రవాదులు అందరినీ అపహరించారని, ఆ తర్వాత తమలో ఉన్న బంగ్లాదేశ్‌ పౌరు లను విడిచిపెట్టారని చెప్పాడు. ఆ మర్నాడు ఒక కొండపైకి తీసుకెళ్లి బందీలందరినీ వరసబెట్టి కాల్చేసినప్పుడు తనకు అదృష్టవశాత్తూ కాలిలో తూటా దూసుకు పోయిందని, చచ్చినట్టు నటించి వాళ్లు నిష్క్రమించాక సురక్షిత ప్రాంతానికి చేరు కుని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించానని చెప్పాడు. 

హర్జిత్‌ చెప్పిన కథనాన్ని ఆ ఉదంతంలో బయటపడ్డ బంగ్లా పౌరులు కూడా మరికొన్నాళ్లకు ధ్రువీ కరించారు. ఒక ఆంగ్ల దినపత్రిక రెండేళ్లక్రితం కుర్దుల ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ఉటంకిస్తూ భారత పౌరుల్ని ఉగ్రవాదులు హతమార్చారని వెల్లడించింది. అప్పుడు కూడా కేంద్రం ఆ కథనాన్ని ఖండించింది. చివరకు మోసుల్‌ నుంచి ఐఎస్‌ను తరిమి కొట్టిన ఏడెనిమిది నెలల తర్వాతగానీ బందీల మరణంపై ప్రకటన చేయలేదు.

నిజమే... ఒక మతిమాలిన గుంపు చెరలో ఉన్న వ్యక్తిని విడిపించడం అంత సులభమేమీ కాదు. పైగా రాజ్యం నియంత్రణలేని ప్రాంతంలో... ఎవరి హిత వచనాలూ, వేడుకోళ్లూ తలకెక్కనిచోట వేరే దేశం బలప్రయోగం చేయడం లేదా వారితో ఓపిగ్గా చర్చించడం అసాధ్యం. కానీ అలాంటిచోట సైతం బందీల చెర నుంచి విజయవంతంగా విడిపించిన చరిత్ర మన ప్రభుత్వానికుంది. ఇరాక్‌లోనే తిక్రిత్‌ ప్రాంతంలో ఇదే ఐఎస్‌ ఉగ్రవాదుల చెరలో మన దేశానికి చెందిన 46 మంది నర్సులు చిక్కుకున్నప్పుడు మన అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవ హరించారు. మధ్యవర్తులను గుర్తించి వారి ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపారు. 

ఒక దశలో ఆ సంప్రదింపులు విఫలమయ్యాయని, నర్సులందరినీ ఎక్కడికో తరలించాలని ఉగ్రవాదులు సంకల్పించారని వార్తలొచ్చాయి. అలాంటి సమయంలో కూడా అధికారులు జాగ్రత్తగా అడుగులేశారు. ఎలా చేశారో, ఏం చెప్పి ఒప్పించారో ఇప్పటికీ వెల్లడికాలేదు. కానీ ‘సంప్రదాయేతర విధానాల’ ద్వారా బందీలకు విముక్తి కలిగించామని మాత్రం చెప్పారు. ఒకప్పుడు సద్దాం హుస్సేన్‌ హయాంలో పనిచేసిన బాత్‌ పార్టీ ముఖ్యులు, సైన్యంలో కీలకపాత్ర పోషిం చినవారు ఐఎస్‌లో చురుగ్గా ఉన్నారు. ఐఎస్‌ చేజిక్కించుకున్న నగరాలకు వారు ‘మేయర్లు’గా వ్యవహరించారు. అలాంటివారి ద్వారా ఆ నర్సులను విడుదల చేయించగలిగారు. 

మరి ఆ పనే ఇక్కడెందుకు చేయలేకపోయారు? స్వయంగా ఆ ఉదంతంలో చిక్కుకుని బయటపడ్డ వ్యక్తిని నోర్మూయించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఆ తర్వాత బందీల విషయంలో ఆ వ్యక్తి చెప్పింది నిజమేనని వేరే వ్యక్తులు ధ్రువీకరించినప్పుడు సైతం అది నిజం కాదని అంత గట్టిగా ఎలా చెప్పగలిగారు? ఎందుకని ఇన్నేళ్లుగా బాధిత కుటుంబాలకు ఆశలు కల్పించారు? అయిదారు వర్గాల సమాచారం ఆధారంగా బందీలు క్షేమంగా ఉన్నారని ధ్రువీకరించుకున్నామని ఎందుకు నమ్మబలికారు? 

మోసుల్‌లో బందీలైనవారంతా నిరుపేదలు. పూటకు గతిలేని కుటుంబాల వారు. అందువల్లే తమవారి గురించి పట్టించుకోలేదని, ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోయినా, ధ్రువీకరించుకోదగ్గ సమాచారమంటూ లేకపోయినా నాలుగేళ్లుగా కట్టుకథలు వినిపించారని ఆ కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌లో తమ నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించినప్పుడే అనుమానాలొచ్చాయని కొంద రంటున్నారు. కుటుంబ పెద్దగా ఉంటున్నవారు, ఆత్మీయులు ఉన్నట్టుండి కనుమరుగయ్యారంటే ఎలాంటివారైనా వేదనపడతారు. ఆచూకీ లేకుండా మాయమైతే, ఏళ్లు గడుస్తున్నా ఏ సమాచారమూ లేకపోతే  ఆ బాధ మరింతగా పెరుగుతుంది. 

నరరూప రాక్షసుల చెరలో మగ్గుతున్నారని తెలిస్తే వారికి ఏ క్షణంలో ఏమవుతుందో, ఎలాంటి చిత్రహింసలు చవిచూస్తున్నారో అనుకుంటూ అను క్షణమూ కుమిలిపోతారు. పాలకులు దృఢంగా వ్యవహరిస్తున్నామని మాత్రమే అనుకుంటే సరిపోదు. ఇలాంటి విషయాల్లో సున్నితంగా కూడా ఆలోచించాలి. తమ నిర్వా్యపకత్వాన్నో, నిస్సహాయతనో వెనువెంటనే నిజాయితీగా వెల్లడించి ఉంటే ఇన్నేళ్ల క్షోభ వారికి తప్పేది. ఈపాటికి కాస్తయినా కోలుకునేవారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. వారికి జీవనోపాధి కల్పించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement