బందీల కుటుంబాలతో విదేశాంగ శాఖ మంత్రులు (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధికోసం పరాయిదేశానికి వెళ్లి అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు తిరిగివస్తారనే ఆశలు కూలిపోయాయి. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ఆ 39 మంది భారతీయులు ప్రాణాలతోలేరని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేశారు.
ఐసిస్ చేతుల్లో హతమయ్యారు: ఇరాక్ రెండో అతిపెద్ద నగరం మోసుల్‌ను ఐసిస్ ఉగ్రవాదులు హస్తగతం చేసుకునేనాటికి(2014నాటికి) అక్కడ10 వేల మంది భారతీయులు ఉండేవారు. హెచ్చరికల నేపథ్యంలో చాలా మంది అక్కడి నుంచి వచ్చేయగా.. ఇంకొద్దిమంది ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారు. వారిలో 39 మందిని గుర్తించిన భారత అధికారులు.. విడుదలకోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. బందీలను సురక్షితంగా తీసుకొస్తామని భారత్‌లోని వారి కుటుంబీకులకు విదేశాంగశాఖ భరోసా కూడా ఇచ్చింది. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే ఐసిస్ పెద్ద ఎత్తున నరమేధాలకు పాల్పడింది. బందీలుగా చిక్కిన విదేశీయులను ఎక్కడిక్కడే చంపేసింది.
కష్టతరంగా మృతదేహాల గుర్తింపు : ఇటీవల ఐసిస్ ప్రాబల్యం తగ్గుముఖంపట్టడం, మోసుల్ సహా ఇతర నగరాలను ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్న దరిమిలా.. సామూహిక మారణకాండలకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా చనిపోయినవారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. భారత్‌లోని కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమూనాలను.. మోసుల్‌లో లభించిన మృతదేహాల నమూనాలతో పోల్చుతూ వెళ్లారు. కష్టతరంగా సాగిన ఈ ప్రక్రియ అంతా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆధ్వర్యంలో సాగిందని సుష్మా స్వరాజ్ చెప్పారు.
పార్లమెంట్ నివాళి : ఇరాక్‌లో చనిపోయిన 39 మంది భారతీయులకు పార్లమెంట్ నివాళి అర్పించింది. రాజ్యసభలో రెండు నిమిషాలు మౌనం పాటించగా, లోక్‌సభలో తీర్మానాన్ని ఆమోదించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment