ఉదయ కాంతి రేఖ ముహమ్మద్ ప్రవక్త
గ్రంథపు చెక్క
ఒక రాత్రి ముహమ్మద్‌కి హఠాత్తుగా మెలకువ వచ్చింది.
ఒక దివ్యశక్తి ఏదో తనను కమ్ముకున్న అనుభూతి కలిగింది. అదొక మాటలకందని అనుభవం. ఒక దేవత అతనిని-
‘‘పఠించు’’ అని ఆజ్ఞాపించింది.
తానేమీ జ్యోతిష్యుడిని కాననీ తనేమీ పఠించలేనని ముహమ్మద్ ఎంత చెప్పినా వినలేదు.
అతని ఓపిక నశించే వేళకు అతని నోటి నుంచి పవిత్ర గ్రంథం తాలూకు పదాలు వెలువడసాగాయి.
అరేబియాలో మొట్టమొదటగా భగవంతుడి మాట వినబడింది. ఎట్టకేలకు వారి భాషలోనే వారికి భగవత్సాక్షాత్కారం లభించింది. అట్లా ముహమ్మద్ నోట వెలువడిన మాటలు ‘ఖుర్ ఆన్’ రూపాన్ని సంతరించుకున్నాయి.
ఖుర్ ఆన్ అంటే పఠనం అని అర్థం.
ముహమ్మద్ యొక్క ఈ దివ్యానుభవ పర్యవసానాలు అపారమైనవి. ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ ప్రవచనాలను మక్కాలో ప్రబోధించడానికి పూనుకున్న సమయంలో ఆ దేశమంతా అనైక్యత పెచ్చరిల్లి ఉంది.
అక్కడి సంచార జాతులన్నీ వేటికవి స్వతంత్రంగా ఉండి తక్కిన తెగలతో యుద్ధానికి తలపడుతుండేవి. వారందరిని ఒక తాటి మీదికి తేవడం అసాధ్యంగా ఉండేది. ప్రవక్త ఈ తెగలన్నింటినీ తన ముస్లిమ్ సమాజంలోకి తేగలిగాడు.
ప్రజల మధ్య వుండిన హింసాద్వేషాలను, అనైక్యతను రూపు మాపి వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచాడు. వారికొక కొత్త గుర్తింపునిచ్చాడు. ప్రత్యేకమైన సంస్కృతిని రూపొందించుకునేలా వారిని సిద్ధపరిచాడు.
అతని తాత్వికత వారి ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చగలిగింది.
- క్యారెన్ ఆంస్ట్రాంగ్ రచించిన
‘ముహమ్మద్ ప్రవక్త జీవితం’ నుంచి. (తెలుగు: పి.సత్యవతి)