Satyavati
-
గిరిజనులపై ప్రధానిది కపట ప్రేమ మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులపై ప్రధాని మోదీ కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గిరిజన వర్సిటీని తొక్కిపెట్టింది మోదీ ప్రభుత్వమే అని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్నందునే మోదీకి గిరిజన వర్సిటీ గుర్తొచ్చిందన్నారు. ఈ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాలను ఇప్పటికే కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కేంద్రం స్పందించలేదన్నారు. -
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి వివరించారు. -
ఆయుర్వేద సంస్థలను అన్ని రాష్ట్రాలకు విస్తరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద విద్య, పరిశోధనలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలను దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాల్లోనూ నెలకొల్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద బిల్లు 2020’పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్‌ను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను విస్మరించినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఇతర భారతీయ వైద్య విధానాలను కూడా సమూలంగా సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ బిల్లు ద్వారా ఆయుర్వేద వైద్య రంగంలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు. మున్సిపాలిటీలకు రూ.423 కోట్ల బకాయిలు ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన పెర్ఫార్మెన్స్ గ్రాంట్ల బకాయిలు దాదాపు రూ.423 కోట్ల మేరకు ఉన్నట్లు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో కార్మికులు వలసపోవడం, నిర్మాణ సామాగ్రి సరఫరా చైన్ స్తంభించిపోవడం వంటి కారణాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశాయని తెలిపారు. విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా గుర్తించినందున భద్రతా సంబంధిత ఖర్చుల కోసం కేంద్రం రూ.95 కోట్లు విడుదల చేసినట్లు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. పరిశ్రమలు, గృహ వినియోగం కోసం సహజ వాయువు సరఫరా చేసేందుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) శ్రీకాకుళం–అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఆ ఏడు జిల్లాలను చేర్చండి లోక్‌సభ జీరో అవర్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు జిల్లాలను చేర్చాలని ఎంపీ వెంకట సత్యవతి కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆమె లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు. విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోవడంతో వారు తీవ్రమైన ఇక్కట్లలో ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును ప్రకటించారా? అని ఆమె అడిగారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులను పెంచే యోచన.. గనుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు గనుల చట్టంలో సవరణలు తేవాలనే ప్రతిపాదన ఉందని కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వైద్య పరికరాల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తేశామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు ఎంపీలు.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, గోరంట్ల మాధవ్, పి.బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు జవాబిచ్చారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేసిందని ప్రధాని కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ మేరకు ఎంపీలు.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, గోరంట్ల మాధవ్, వెంకట సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్నికల్లో పోççస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఎంచుకోవడం కోసం సీనియర్ సిటిజన్లకు నిర్ధారించిన వయోపరిమితిని తగ్గించారు. 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ఈ మేరకు ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖితపూర్వ సమాధానమిచ్చారు. రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరింది విజయవాడ–గుడివాడ– భీమవరం–నర్సాపూర్, గుడివాడ– మచిలీపట్నం, భీమవరం– నిడదవోలు రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్టుపై కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. ఈ మేరకు ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2జీ వ్యవస్థను రద్దు చేయం దేశంలో 2జీ మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర సహాయ మంత్రి సంజయ్ ధోత్రే తెలిపారు. ఈ మేరకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. అన్ని సమస్యలకూ ఆర్బీఐ ఒక్కటే పరిష్కార మార్గం కాదని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. దేశంలో ఐపీఎస్ అధికారుల కొరత లేదని కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పారు. ఓబీసీ క్రిమిలేయర్ పరిమితి పెంపు, దాన్ని అమలు చేసే విధివిధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్ చెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. -
దేశమంతా ఏపీ వైపు చూసేలా..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య విప్లవం తీసుకొచ్చారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన గురువారం జిల్లాకు కేటాయించిన 61 108,104 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ పేదవానికి కార్పోరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తున్నాయని తెలిపారు. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి) కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా వెయ్యికిపైగా 108, 104 వాహనాలు ప్రారంభించడం అభినందనీయమని అవంతి అన్నారు. ఇక పేదవాడి ఆరోగ్యానికి డోకా లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఈ వాహనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నాడు వైఎస్సార్ ప్రవేశపట్టిన పధకాలకి నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పునర్జీవం పోశారని కొనియాడారు. (ప్రజారోగ్య రథయాత్ర) ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదలకి ఉపయోగపడేలా వెయ్యికి పైగా అంబులెన్స్ వాహనాలు ప్రారంభించడం అభినందనీయం అన్నారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా విప్లవాత్మకమైన పధకాలతో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక వైద్యురాలిగా సీఎం వైఎస్ జగన్ పధకాలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 104 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఇంటి వద్దకే డాక్టర్లు, వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.(దేశంలోనే కొత్త రికార్డు: సీఎం జగన్) పాడేరు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. 108,104 వాహనాల ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజారోగ్యంపై ఆయన ఎంతశ్రద్ధ కనబరుస్తున్నారో అర్ధమవుతోందని తెలిపారు. గిరిజనులకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 అంబులెన్స్ వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు. గిరిజనులకి వైద్య విద్య అందించేందుకు సీఎం వైఎస్ జగన్ పాడేరులో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ వల్ల వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులు రాబోతున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో 108,104 వాహనాలు షెడ్లో ఉన్నాయని తెలిపారు. బాబు తన పాలనలో ఒక్కరోజు కూడా వాటి గురించి పట్డించుకోకుండా ఇపుడు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 2023లో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని విమర్సించారు. ఇంత పెద్ద స్ధాయిలో 108,104 వాహనాలు ప్రారంభించడంపై ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. ప్రజా సంక్షేమానికి అంకితమైన ముఖ్యమంత్రి కాబట్టే తన పాలనతో తొలి ఏడాదిలోనే దేశంలోనే నాలుగో స్ధానంలో నిలిచారని కొనియాడారు. నాడు వైఎస్సార్ వైద్య, విద్యా రంగాలకి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆయన కీర్తి దేశ విదేశాల్లో మారుమోగిందని తెలిపారు. ఆయన తనయుడిగా తండ్రిని మించిన స్ధాయిలో పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, భాగ్య లక్ష్మి, జేసీ అరుణ్ బాబు, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, వైద్య ఆరోగ్యా శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్: విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి నుంచి 2017 డిసెంబరు వరకు అనువాదం చేసిన రచనల ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా.. 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది. ‘ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను సత్యవతి తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించారు. దీనికే ఈ పురస్కారం లభించింది. ఆమె రాసిన ‘వాటిజ్ మై నేమ్’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్ హీ కమ్ హోం’ కథ ఇంటర్లో పాఠ్యాంశంగా ఉన్నాయి. ఆమె 200కు పైగా కథలు, అనేక నవలలు రచించారు. ఆమె 1940లో గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమె తొలి కథ తెలుగు స్వతంత్ర మ్యాగజైన్లో ప్రచురితమైంది. పి.సత్యవతి కథలు, ఇల్లు అలకగానే.., మంత్రనగరి వంటి కథా సంపుటాలు, ఐదు నవలలను ఆమె రచించారు. అనేక కథలను కూడా అనువదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం, పెద్దిభొట్ల స్మారక పురస్కారంతోపాటు వివిధ సంస్థలు సత్యవతికి అనేక పురస్కారాలు అందించాయి. మరోవైపు.. శప్తభూమి రచయిత బండి నారాయణస్వామి మంగళవారం ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డును అందుకోనున్నారు. -
రెప్పలతడి
సత్యవతికి అర్ధరాత్రిలోనే మెలుకువ వచ్చింది. శతాయుష్షులో సగం దాటబోతున్నా ఆమె కాలాన్ని సద్వినియోగంగా అరగదీయడం ఇప్పటికీ నేర్చుకోలేకపోయానని బాధపడుతుంది. ఒళ్ళు అరగదీసి, ఇల్లు అరగదీసి, పాత్రలరగదీసి.. ఇంకా పుస్తకాలని, చానల్స్‌ని, కీ బోర్డ్‌ని కూడా అరగదీసి చివరికి మంచాన్ని అరగదీద్దామంటే అసలు చేతనవడం లేదని తనని తాను తిట్టుకుంది. పోనీ కాసేపు రోడ్డును అరగదీద్దామనుకుంటే రోడ్డుపై తిరిగే మనుషుల ముఖాలు అరిగిపోతాయేమోనని ముఖం చాటు చేసుకుని వెళ్లిపోతుంటారని చివుక్కుమనే మనసుని రాయి చేసుకుంటుంది. మళ్ళీ అంతలోనే ఆలోచన చేస్తూ ‘అవునూ, మనసెందుకు అరిగిపోకుండా రాతి కవచంలా ఈ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంది! వెధవ మనసని వెధవ మనసు’ అని తిట్టుకుంటూ బెడ్రూమ్లో నుండి బయటకొచ్చి సోఫాలో కూలబడి యాంత్రికంగా టీవీ ఆన్ చేసింది. తనువూ, మనసు, ఆలోచనలు అన్నీ కలిసి విడదీయరాని అనుబంధం ఉన్న అర్ధనారీశ్వర తత్వానికి రూపమే భార్యాభర్తల బంధం అంటూ చెబుతున్నాడు ఓ పెద్దాయన. ఇన్ని కలవడం అసలు సాధ్యమయ్యే విషయమేనా? ఇగోలు సాటిస్ఫై చేయడం కోసం ప్రతిక్షణం నటించడమే కదా! ఏనాడూ భర్త తన మనసు తీరాన్ని ఓ అనురాగపు అలలా తాకనేలేదు. సాంగత్యమంతా హృదయ ఘోష. విరగ్గొట్టి వెళ్ళిన మనసుకి కట్టుకట్టే నాధుడు లేనే లేడన్నట్టు విరక్తిగా బతికింది అని తోచగానే ఎందుకో చప్పున దుఃఖం ముంచుకొచ్చింది. అప్పటికప్పుడు గడచిన జీవితాన్ని తరచి చూసుకుంది. ఈ ఏడుపు ఏడవలేదనేగా ఆరోజు అందరూ విచిత్రంగా చూశారు. ‘చెట్టంత మనిషి చనిపోతే ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చడం లేదు, ఏం మనిషో పాడు’ అంటూ చెవులు కొరుక్కున్నారంట కూడా. భావోద్వేగాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. అప్పుడెందుకు రాలేదో నేను మాత్రం యేం చెప్పగలను! అయినా ఇంకెక్కడ ఉంటుంది దుఃఖం? ఇన్నేళ్ళ దుఃఖం లోలోపలికి యింకిపోయి కడలి లెక్కన లోన దాగుంది. దాన్ని తోడిపోసే చేద యెవరి చేతిలోనో, చేష్టలోనో, అతని చావులోనో ఎందుకుంటుంది? కనుల పొరల మధ్య పొంగుతున్న నదులని ఆపడం ఎవరికైనా సాధ్యమా! అని గొంతెత్తి ప్రశ్నించాలనిపించింది సత్యవతికి. అసలీ భార్య.. భర్త.. అనే బంధాన్ని మోయడంలోనే ఏదో తెలియని ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి తనం ఉందేమో! అందుకే అతగాడు తన బంధంలో ఊపిరాడక ఇంకొక బంధంలో ఇరుక్కుని అనుభవించినన్నాళ్ళు జీవితాన్ని అనుభవించి కాటికి కాళ్ళు జాపుకుని కళ్ళెదురుగా వచ్చిపడి అప్పుడు కూడా సాధిస్తుంటే క్షణ క్షణానికోసారి చచ్చి మరలా పుట్టి నిత్యం ఛస్తూ బతుకుతూ ఉండటంలో ఎంత నరకయాతన అనుభవించిందో ఈ యిరుగు పొరుగమ్మలకి తెలుసా అసలు? రేపో మాపో అన్నట్లున్న మనిషి కూడా కక్ష, కార్పణ్యంతో యేదో ఒక వొంకతో సాధిస్తుంటే, పూటపూటకి రుచికరంగా వండి పెట్టడం లేదని ఒంటికాలి మీద మీదకి వస్తుంటే తనమీద తనకే జాలి కలిగేది. కనీసం అప్పుడైనా అభిమానం ముంచుకొచ్చి కఠినంగా ఉండాలన్నా సిగ్గేసేది. నీరు పల్లమెరిగినట్లు బంధాల బరువులన్నీ భరించే వారిపైనే నాట్యమాడుతుంటాయనుకుని.. అన్నీ భరిస్తూ అతని ఆఖరి శ్వాస కూడా సుతిమెత్తగా గాలిలో కలిసిపోయే వరమివ్వమని కోరుకుంది తప్ప ఆ ప్రాణిని ఇంకోవిధంగా యాతనకి గురి చేయాలని అనుకోలేదు కదా అననుకుంటుంది స్వగతంలో. అర్ధాంగిగా విలువ సంపాదించుకోవడమంటే జనం ఇచ్చే విలువ లెక్కించుకుంటూ తనకి తాను ఏ విధమైన విలువనిచ్చుకోకుండా వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని హననం చేసుకోవడమన్నమాట అని లోలోపల గొణుక్కుంటుంది. ఎవరైనా ఏమి వదిలి వెళతారు? కాసిన్ని నవ్వులనో, ఆకాంక్షలనో, దుఃఖాలనో, అవమానాలనో ఇంకా చెప్పాలంటే బిడ్డల రూపంలో అహంకారపు జాడల్ని వదిలి వెళతారు. ఇప్పుడు నాకు మిగిలింది విధవరాలు అన్న అవమానమేగా అంటుంది సన్నిహితులతో. మూన్నెళ్ళ తర్వాత ఒక సాయంత్రం మొక్కలకి నీళ్ళు పోసుకోవాలని గేటు బయటకి వెళ్ళగానే ఎదురింటి ఆమె ముఖంపై విసురుగా తలుపేసుకుంది. సత్యవతికి బయటకి వెళ్ళాలంటే అవమానపడాలనే భయమేస్తుంది. ఆ సమయంలో గతంలో పక్కింట్లో ఉండే కుమారి గారు చెప్పిన మాట గుర్తుకువచ్చింది. ఆమె చిన్న మామగారు అనారోగ్యంతో బాధపడుతూ తాను భార్య కన్నా ముందుగానే మరణిస్తానని గ్రహించి ఆమెకి ఎన్నో ముందు జాగ్రత్తలు చెప్పారంట. కొడుకు కూతురు ఎవరింటికీ వెళ్లొద్దు. నీ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని నిన్ను జీతం భత్యం లేని పనిమనిషిని చేసేస్తారు. అలాగే బొట్టు గాజులు తీయడం లాంటివి ఏమీ చేయొద్దు. యిరుగుపొరుగు ఎలా ప్రవర్తించినా ఏమీ పట్టించుకోవద్దు. మొక్కలని, కుక్కలని పెంచుకో.. ప్రేమ, ప్రశాంతత కలుగుతాయి అని. ఆయన సత్యం చెప్పారు అనిపించింది సత్యవతికి. కుమారి గారు చెప్పిన మాటలతో పాటు బుజ్జోడు మరీ జ్ఞాపకం వస్తున్నాడు. హృదయపు చెమ్మ రెప్పల మధ్యకి ఎప్పుడు పాకిందో మరి. నాలుగు నెలలు గతంలోకి వెళ్ళింది. సత్యవతి ఇంట్లో ఏకాకిగా మిగిలిపోయిన రోజులవి. పదిమంది ఉండాల్సిన ఆ పెద్ద ఇంట్లో పలకరించే వాళ్లే కరువు. ఎవరికి వాళ్లకి భర్త చనిపోయిన మనిషికి సాయంగా ఉండటానికి ఏదో అయిష్టత. దానిని కప్పి పుచ్చుకోవడానికి అనేక రకాలుగా బొంకటాలు. మాటలు కూడా కరువే, ఫ్రీజిబి డేటా పుణ్యమా అని ఒకవేళ ఎవరైనా పలకరించినా తిన్నావా, పడుకున్నావా లాంటి చచ్చు పుచ్చు ప్రశ్నలు తప్ప మాటల్లో మనసుండదు. ఎప్పుడు లైన్ కట్టవుతుందా అని ఎదురుచూడటమే. కురిసినప్పుడు విసుక్కోవడం ఎండినప్పుడు ఎదురు చూడటంలాంటిదే ఈ పలకరింపు కూడా! అనుకునేది. ఆ మధ్య బుజ్జోడితో స్నేహం ఆమెకి హాయిగా ఉండేది. పార్కింగ్ ప్లేస్‌లో పడుకోబెట్టిన భర్త శవం పక్కన ఆమె మౌనంగా కూర్చున్నప్పుడు కూడా వచ్చి ఆమె పక్కనే మౌనంగా కాసేపు నిలబడి వెళ్ళాడు. మా బంధం ఏనాటిదో! ఈ జన్మలో కొన్ని నెలల ముందేగా కలిసింది మరి. బహుశా పూర్వజన్మ వాసనలు వదలవేమో అని ఆలోచించేది. అయినా ఈ వాసనలే కదూ మనుషులని తమ దేహాల చుట్టూ తిప్పుకుంటాయి. చివరాఖరికి గుంతలో పాతిపెట్టమనో, అగ్ని కీలలకి ఆహుతిమ్మనో కూడా తరుముతూ ఉంటాయి అని భారంగా నిట్టూర్చేది కూడా! అన్నట్టు బుజ్జోడు ఎవరో చెప్పలేదు కదూ! ముందు వాడి గురించి చెప్పాలి మీకు. ఏడాది క్రితం వాడు ఆ ఇంటికి వచ్చినప్పుడు వాడికి మెడలో బెల్ట్ కూడా ఉంది. వాడిని పెంచుకుంటున్న ఎవరో తీసుకొచ్చి కావాలని బయట వదిలేసి వెళ్ళిన బాపతు. వాచ్మెన్ సుబ్బారావు వాడిని దగ్గరకి తీసి పెంచుతున్నాడు. పసి బిడ్డలనే కర్కశంగా ముళ్ళ పొదలలో విసురుతున్న ఈ రోజుల్లో కుక్కని వదిలేయడం ఏమంత పెద్ద విషయంలేమ్మా అన్నాడు కూడా! బుజ్జోడు అమాయకమైన చూపులతో ఎవరినయినా కట్టిపడేస్తాడు. విశ్వాసం కూడా అట్టే ప్రదర్శించని శరీర భాష. ఎవరిని పల్లెత్తి పలకరించిన పాపాన పోడు. గేట్ దగ్గర పడుకుని వచ్చే పోయే వాళ్ళని మౌన మునిలా చూస్తూ ఉంటాడు. అరవటం రాదు సరికదా.. కరవడం అనే సహజ లక్షణాన్ని మర్చిపోయాడు. రోజూ ఖాళీ పాల బాటిల్స్ వేసిన సంచీ గేట్‌కి తగిలించి రావడానికి వెళ్ళినప్పుడు సత్యవతి వాడిని బుజ్జోడా అని పిలుస్తూ ముద్దు జేసేది. అయినా వాడిలో చలనం ఉండేది కాదు. వాడికి పట్టడానికి పాలు యెవరు పోస్తున్నారు? అనడిగి ఎప్పుడైనా తాను కూడా కాసిని పాలు పోస్తానని చెప్పింది కానీ, ఏ రోజూ వాడి గిన్నెలో చెంచా పాలు పోసిన పాపాన పోలేదు. స్వతహాగా ఆమెకెందుకో బుజ్జాడి జాతిని చూస్తే విముఖత. మనుషులు తల్లిదండ్రులని, పిల్లలని కూడా చూడనంత ప్రేమగా అపురూపంగా చూస్తున్నందుకు మనుషులపై ఏర్పడిన విముఖత వాటిపై అసహ్యంగా రూపాంతరం చెందిందనుకుంటా. ఒకరోజు బుజ్జోడి గిన్నె నిండా విరిగిపోయిన పాలు, ఆ గిన్నె చుట్టూ ముసురుకున్న ఈగలు గమనించి బుజ్జోడు ఏడి అని అడిగింది. అదిగోనమ్మా, కారు కింద అన్నాడు సుబ్బారావు. ఒంగి చూస్తే నలతగా నేలకి అంటుకుని పడుకున్నాడు. జాలేసింది ఆమెకి. కూర్చుని వాడిని చేతిలోకి తీసుకుని ప్రేమగా తల నిమిరి ‘ఏంటమ్మా వొంట్లో బాగోలేదా, జ్వరమొచ్చిందా? సుబ్బారావు హాస్పిటల్‌కి తీసుకువెళతాడు, వెళ్ళు. ముందు కొంచెం పాలు తాగు’ అంటూ కాసేపు వాడిని చేత్తో పరామర్శించి దగ్గరలో ఉన్న డాక్టర్ అడ్రెస్ చెప్పి వాక్సిన్ కూడా వేయించమని చెప్పి వచ్చింది.ఇక అది మొదలు రోజూ పాల బాటిల్స్ సంచీ ఇవ్వడానికి, ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి సుబ్బారావు వచ్చినప్పుడల్లా అతని వెనుకే సత్యవతి ఇంటికి వచ్చేవాడు. ‘బుజ్జోడా, నువ్వూ వచ్చావా? పాలు తాగుతావా..’’ అని అడిగేది. అలా వారి పరిచయం పెరిగింది. ఆమె సాయంత్రం పూట వాకింగ్‌కి వెళుతున్నప్పుడో, కూరగాయలు కొనడానికి రోడ్డు మీదకి వచ్చినప్పుడో ఆమె వెంట బయటకి వచ్చేవాడు. వాడి జాతి వాళ్ళని చూస్తే వాడికి భయం. మనుషుల కాళ్ళ పక్కన నక్కి నక్కి ఉండటమో, లేకపోతే లోపలకి పరిగెత్తడమో చేసేవాడు. ఒకోసారి సత్యవతి పక్కనే ఉందన్న ధైర్యంతో వాడి జాతి ప్రాణులని చూసి గయ్‌గయ్‌మని అరుస్తూ ప్రతాపం చూపేవాడు. గేటు ఎదురుగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు దగ్గరకి వెళ్ళి కాలెత్తి పనికానిచ్చుకుని ఆనందాన్ని అనుభవించేవాడు. వాడు వేస్తున్న వేషాలు, ఆకతాయి చేష్టలు చూస్తూ నవ్వుకుంటూ రోజూ కాసేపు తనను తానే గేటుకి కట్టేసుకోవాల్సిందే అని మురుసుకునేది సత్యవతి.ఎప్పుడైనా ఆమె కిందకి వెళ్ళని రోజున ఆ ఫ్లోర్‌కి వచ్చి లిఫ్ట్‌కి, గేటుకి మధ్య పచార్లు చేసేవాడే తప్ప గేటు దాటి లోపలికి అడుగు కూడా వేసేవాడు కాదు. అప్పుడు సత్యవతికి చప్పున మల్లీశ్వరి చెప్పిన క్యాటరింగ్ రావుగాడు గుర్తుకొచ్చేవాడు. ఒంటరి స్త్రీలున్న ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి కదా అని ఎవరింట్లోకి బడితే వాళ్ళింట్లోకి అనుమతి లేకుండా జొరబడే కుక్క అని తిట్టి అంతలోనే నాలిక కరుచుకుని బుజ్జోడుని తక్కువ చేయకూడదనే ఇంగితం పాటించేది. బుజ్జోడు మధ్యాహ్న సమయాలలో మెట్లమీదే పడుకుని ఉండేవాడు. చెవులకు కఠోరంగా వినిపించే మనిషి శబ్దాలకన్నా, మౌనంగా వినిపించే భాషే మేలనుకుని పుస్తకమో ఫోనో పట్టుకుని మెట్లమీదకి వెళ్లి కూర్చునేది సత్యవతి. బుజ్జోడి కళ్ళలోకి ఆమె, వాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నిశ్శబ్దంగా మాట్లాడుకుంటూ వుండేవాళ్ళు.ఒకరోజు బయటకి వెళుతూ ‘బుజ్జోడా బయటకి వెళదాం వస్తావా?’ అని అడిగింది. మౌనంగా గేటుదాకా వచ్చాడు కానీ యెక్కి కాళ్ళ దగ్గర కూర్చోలేదు. బండి స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్లిందో లేదో భౌభౌమని అరుస్తూ రయ్యిన బండెనుక పరిగెత్తాడు. ఆమె కొంచెం ఆశ్చర్యంగా వాడి వైపు చూస్తూ రానన్నావు కదా, ఇప్పుడు కొత్తగా అరుస్తున్నావు ఏమిటి అనడుగుతూనే బండిని పోనిస్తుండగా బండి ముందుకు పరిగెత్తి అడ్డంగా నిలబడ్డాడు. ఆమె బండి ఆపేసి కాలు కింద వుంచి ‘రా! ఎక్కి కూర్చో’ అని చోటిచ్చింది. బండి ఎక్కకుండా కాలు పక్కన నిలబడి భౌభౌమని అరుస్తున్నాడు మళ్ళీ. ‘రానప్పుడు యెందుకనవసరంగా అరుస్తావ్? ఏముంది ఇక్కడ అంటూ పక్కకి వొంగి చూసుకుని, ఏదో ఆలోచనలో ఉండి బండి స్టాండ్ తీయకుండానే ముందుకు వెళుతున్నానని వెంబడించి హెచ్చరిక చేసినందుకు సత్యవతి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. బుజ్జోడిపై ప్రేమ ముంచుకొచ్చింది. బండి స్టాండ్ వేసి వాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులాడింది. ఆరోజు ఏం జరిగిందంటే ఇలాగే తెల్లవారుజామునే మెలకువ వచ్చిన సత్యవతికి బుజ్జోడిని వెంటనే చూడాలనిపించింది. ఇప్పుడేం చేస్తున్నాడో అనుకుంటూ మళ్ళీ అంతలోనే ఇంకేంజేస్తాడు? మెట్లమీద మునగదీసుకుని పడుకుని యేదైనా అలికిడి వినగానే కళ్ళని మాత్రమే తిప్పుతూ చూస్తూడంటం తప్ప. వాడిని చూసి పదిహేను రోజులవుతుంది. రోజూ గ్రిల్స్ బయట నిలబడి చూసి చూసి వెళ్లిపోతున్నాడంట. వాడికి, ఆమెకు ఏదో తెలియని అనుబంధం. వాడిని అప్పటికప్పుడే చూడాలనిపించింది సత్యవతికి. ఆత్రుతగా మెట్లమీదుగా క్రిందికి దిగి వస్తూ ఈరోజు ఎవరేమనుకున్నా సరే, వాకింగ్ ఫ్రెండ్స్ తనని చూసి పలకరించకుండా గబాగబా ముందుకు వెళ్ళిపోయినా సరే, బుజ్జోడితో కలిసి వాకింగ్‌కి వెళ్లి రావాలని నిశ్చయించుకుంది. ఎవరికి వారు.. స్వేచ్ఛలేదు. స్వాతంత్య్రం లేదు అని వాపోవడం ఎందుకు? కావాలని తీసుకుంటే ఏమవుతుంది? నాలుగు రోజులు చెవులు కొరుక్కుంటారు అంతేగా? అయినా సమాజానికి ఇంకేమి పని లేదా? తన పనులు మానేసి ఎంతసేపూ పక్కనోడు ఏం చేస్తున్నాడోనని భూతద్దం పెట్టి మరీ చూస్తుందా ఏమిటీ? అనుకుంటూ మెట్లు దిగుతుంటే ఆ చప్పుడుకి తలతిప్పి చూసిన బుజ్జోడు మెల్లిగా లేచి నించున్నాడు. వాడి తలమీద చెయ్యేసి ‘యేరా బుజ్జోడా! ఇన్నాళ్ళు నేను కనబడలేదని దిగులుపెట్టుకున్నావా? నేను వచ్చేసాలే, మనిమిద్దరం రోజూ వాకింగ్‌కి వెళ్లివద్దాం, సరేనా’’ అన్జెప్పి ఆమె మెట్లు దిగుతుంటే బుజ్జోడు ఆమె వెనుకే వచ్చేసాడు. మెయిన్ గేట్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చారు వారిద్దరూ. ఎక్కడో వర్షం కురుస్తున్న ఆనవాలు. ఉత్తరం వైపు నుండి వచ్చే చల్లని గాలి శరీరాన్ని తాకగానే గత ఇరవై రోజుల నుండి నాలుగు గోడల మధ్య బిగించి ఉన్న సంకెళ్ళ నుండి విముక్తి కలిగినట్లు అనిపించింది సత్యవతికి. ఆమె ముందూ, వెనుక బుజ్జోడు. పల్చటి వెన్నెల వెలుగులో అక్కడక్కడా వెలిగే దీపాల వెలుగులో నున్నటి తారు రోడ్డు మీద రెండు రౌండ్లు తిరిగారు. అప్పటికే కొంతమంది వాకింగ్ చేస్తూ కనబడ్డారు. వాళ్లకి ఎదురవకుండా పక్క వీధిలోకి వెళ్లి మెయిన్‌రోడ్ మీదగా వాళ్ళ సందులోకి వచ్చేసరికి సన్నగా చినుకులు పడసాగాయి. సత్యవతి తలపైకెత్తి చూస్తే నల్లని మబ్బులకోపు. ‘వానొచ్చేసిందిరా, అయినా సరే మనం ఇంటికి వెళ్లొద్దు. వానలో తడుస్తూ ఇంకో రౌండ్ వెళ్లివద్దాం’ అంది ఉత్సాహంగా. రోడ్డుపక్కనే ఉన్న గుంటలో నిన్న కురిసిన వర్షం నీరు చేరుకొని అది చిన్న చెరువుని తలపిస్తోంది. అందులో వీధి కుక్క ఒకటి పడుకుని ఉంది. బుజ్జోడు పక్కనే ఆమె ఉందనే ధైర్యంతో ఆ కుక్క మీద కయ్యానికి వెళ్ళాడు. ఆ కుక్క కూడా అక్కడ నుండి లేవడం ఇష్టం లేదన్నట్టుగా లేచి గయ్యిమని అరుస్తూ రోడ్డు దాటి అవతలకి వెళ్ళింది. దాన్ని వెంబడిస్తూ వెళ్ళబోతున్న బుజ్జోడి మీదకి పాల వ్యాన్ యమదూతలా దూసుకొచ్చేసింది. సత్యవతికి ఆపాదమస్తకం వణికిపోయింది. వ్యాన్ ఆగకుండానే ముందుకు వెళ్ళింది. ఆమె పరుగెత్తుకెళ్ళి బుజ్జోడి శరీరాన్ని చేతుల్లోకి తీసుకుంది. దెబ్బలేమీ తగల్లేదులే అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న మరుక్షణంలోనే బుజ్జోడు ఆమె కళ్ళలోకి చూస్తూ, పెంచే చేతికి తెలియకుండా తుంచే చేయి ఒకటి అదృశ్యంగా అనుసరిస్తూనే ఉంటుంది కదా అన్నట్లుగా తలవాల్చేశాడు. చుట్టూ జనం పోగయ్యారు. అయ్యో పాపం అంటూ జాలి కురిపించి కొద్దిగా ముందుకు సాగి రోజూలాగానే రోడ్డు్డ పక్క ఇళ్ళల్లో పూసిన పూలని కొమ్మలొంచి మరీ కోసి క్యారీ బ్యాగ్‌లో వేసుకుంటూ ముందుకు సాగిపోయారు. మరికొంతమంది స్త్రీలు వాకింగ్‌కని వస్తూ వొళ్ళో బుజ్జోడిని పెట్టుకుని కూర్చున్న ఆమె దగ్గర ఆగి సానుభూతి చూపసాగారు. అప్పటిదాకా కురుస్తున్న పాల వెన్నెలంతా కరిగి జడివాన అయిందా అన్నట్టు వర్షం మొదలైంది. భర్త చనిపోయినప్పుడు కంటెంట చుక్క కూడా కార్చని ఈమె ఇప్పుడు ఎందుకిలా ఏడుస్తోందని అమ్మలక్కలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ వర్షంలా ఆమె దుఃఖం కూడా కురుస్తూనే ఉంది. అది జరిగి రెండు నెలలైనా కేవలం బుజ్జోడి జ్ఞాపకాలతోనే మళ్ళీ అటో ఇటో ధారలై కురుస్తూనే ఉంది. రెప్పలని తడుపుతూనే ఉంది. తడి ఆరని జ్ఞాపకాలలో సత్యవతి బతుకుతూనే ఉంది. వనజ తాతినేని -
శాన్వి హంతకుడికి మరణ శిక్ష
2012లో అమెరికాలో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ దారుణ హత్య ► గత తీర్పును సమర్థించిన పెన్సిల్వేనియా హైకోర్టు న్యూయార్క్: అమెరికాలో సంచలనం సృష్టించిన పెన్సిల్వేనియా జంట హత్యల కేసులో భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అమెరికా కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2012లో పెన్సిల్వేనియాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది నెలల చిన్నారి శాన్వి వెన్నా, ఆమె నానమ్మ సత్యవతి వెన్నా(61) తమ అపార్ట్మెంట్లోనే హత్యకు గురయ్యారు. విలాసాలకు అలవాటుపడిన రఘునందన్ ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారించిన జ్యూరి 2012 అక్టోబర్‌లో అతడిని దోషిగా తేల్చింది. 2015లో రఘునందన్‌కు కింది కోర్టు మరణశిక్షను విధించింది. దీనిని శుక్రవారం పెన్సిల్వేనియా హైకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది. 2012లో ఒక అపార్ట్మెంట్లో వృద్ధురాలు హత్యకు గురైందని, పది నెలల చిన్నారి అపహరణకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలంలో ఒక నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చిన్నారి ప్రాణాలతో దక్కాలంటే 50 వేల డాలర్లు ఇవ్వాలని రాసి ఉంది. ఆ నోట్లో చిన్నారి తల్లిదండ్రుల ముద్దు పేర్లను రాయడం.. అవి వారి సన్నిహితులైన కొద్ది మందికే తెలియడంతో ఆ దిశగా పోలీసులు ఆరా తీశారు. చిన్నారి శాన్వి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తే అయిన రఘునందన్‌ను అనుమానితునిగా గుర్తించి ప్రశ్నించారు. దీంతో తానే హత్యలు చేసినట్టు అంగీకరించాడు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని, తాను కావాలని హత్యలు చేయలేదని విచారణ సందర్భంగా రఘునందన్ చెప్పాడు. -
కోతి భయంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి..
హైదరాబాద్: సైదాబాద్ కల్యాణ్‌నగర్ కాలనీకి చెందిన సత్యవతి తన ఇంట్లో వంట చేస్తుండగా ప్రధాన ద్వారం గుండా ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది. నిశ్శబ్దంగా వంటింట్లోకి చేరి పనుల్లో నిమగ్నమైన సత్యవతి చేతిని పట్టుకుని కొరికేసింది. ఊహించని ఘటనతో భయపడిన ఆమె బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే ఆస్పత్రి వెళ్లి వైద్యం చేయించుకుంది. కోతి కరిచిన విషయాన్ని చెన్నైలో ఉండే కుమారుడికి ఫోన్లో తెలిపింది. వెంటనే అతను హైదరాబాద్ నుంచి వచ్చేయమని సలహా ఇచ్చి, రైలు టికెట్ బుక్ చేశాడు. ఈ మేరకు సత్యవతి చెన్నై వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన ఈ ఘటన వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. సైదాబాద్ మండల ప్రజలను కోతుల గుంపొకటి కొద్దిరోజులుగా కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఆ సమూహంలో ఉన్న రెండు కోతులు మతిస్థిమితం కోల్పోయి కనిపించిన వారినల్లా కరిచేస్తున్నాయి. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, పేపర్ల కోసం.. వాకింగ్‌కు వెళ్లే వారితో పాటు స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా కోతుల బారిన పడి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పిచ్చెక్కిన కోతులు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తాయోనని భయం భయంగా గడుపుతున్నారు. సైదాబాద్ డివిజన్ వీకేదాగ్‌నగర్‌లో 20 మందిని, కల్యాణ్‌నగర్‌లో 30, ఎస్బీహెచ్ ఏ, బీ, సీ కాలనీలో 30 మంది కోతుల బారినపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోతి కాటుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ. వేలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. కోతులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన జూ సిబ్బంది కల్యాణ్‌నగర్, వీకేదాగ్‌నగర్, సీ కాలనీలలో పార్కులు, ఇళ్లపైన జాలీలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రెండు కోతులను పట్టుకున్నప్పటికీ మిగిలిన కోతుల జాడ మాత్రం తెలియలేదు. -
వైఎస్ జగన్ అండ వెయ్యి ఏనుగుల బలానిచ్చింది..
-
వైఎస్ జగన్ అండ వెయ్యి ఏనుగుల బలానిచ్చింది..
తణుకు అర్బన్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తుందుర్రు బాధితులకు అండగా నిలవడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని తుందుర్రు బాధితురాలు ఆరేటి సత్యవతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్‌జైలు నుంచి ఆమె సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తుందుర్రు బాధితులను పరామర్శించేందుకు స్వయంగా వైఎస్ జగన్ రావడం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అన్నారు. ఈనెల 19వ తేదీన వైఎస్ జగన్ నన్ను తణుకు సబ్‌జైలులో కలిసిన సందర్భంగా తమ్ముడికి (ఆరేటి సత్యవతి కొడుకు వాసు) నీతోపాటు మిగిలిన బాధితులకు నేను అండగా ఉంటానని చేతిలో చెయ్యేసి చెప్పడం ఉద్యమానికి మరింత బలం ఇచ్చిందన్నారు. మాయమాటలు చెప్పి అందలమెక్కిన చంద్రబాబునాయుడు ఒక మహిళను అక్రమంగా హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనత మూటకట్టుకున్నాడని ఇదే అతని పతనానికి నాంది పలుకుతుందని విమర్శించారు. ఉద్యమాన్ని ఎటువంటి పరిస్థితుల్లోను ఆపేదిలేదని చంద్రబాబు పోలీసులతో నియంత పాలన చేసినా బెదిరేదిలేదన్నారు. ప్రస్తుతం 50 రోజులు జైలులో ఉన్నానని ఉద్యమంలో భాగంగా సంవత్సరం పాటు ఉంచినా గ్రామాలు కాలుష్యం బారినపడకుండా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు. ఘటన అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు చెప్పారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ సంక్షేమంతో రాష్ట్రంలోని మహిళలను ఉద్దరిస్తానని చెప్తున్న చంద్రబాబునాయుడు ఒక సాధారణ మహిళపై హత్యాయత్నం కేసుపెట్టించి 50 రోజులపాటు జైలులో ఉంచిన రోజులు ఎవ్వరూ మరచిపోరని రానున్న రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనన్నారు. మా గ్రామాలు, మా పొలాలు, మా ఆరోగ్యాన్ని, మా కుటుంబాలను రక్షించండంటూ న్యాయమైన పోరాటం చేస్తున్న వారిని జైళ్లలో పెట్టించడం దారుణమన్నారు. 60 గ్రామాల ప్రజలు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా వారిని పట్టించుకోకుండా పెట్టుబడిదారీలైన ఇద్దరు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో ఎదురులేని ఆధిక్యం వచ్చిందని మురిసిపోతున్న చంద్రబాబు ఈ జిల్లా నుంచే ఆయన పతనం ప్రారంభమై రాష్ట్రానికి పాకుతుందన్నారు. సెప్టెంబరు 20వ తేదీన తణుకు సబ్‌జైలుకు వచ్చిన సత్యవతి సోమవారం నరసాపురం కోర్టులో హాజరై ఆర్డర్ కాపీని తణుకు సబ్‌జైలులో సమర్పించారు. విడుదలైన సత్యవతిని అఖిలపక్షాల ఆధ్వర్యంలో పూల దండలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో అఖిల పక్షం తరపున ఐలూ జిల్లా కమిటీ సభ్యులు కామన మునిస్వామి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పీవీ ప్రతాప్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీఐటీయూ స్టేట్ కౌన్సిల్ మెంబరు పీఎల్ నరసింహారావు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి పొట్ల సురేష్, నాయకులు అనుకుల రమేష్, వైసీపీ నాయకులు కౌరు వెంకటేశ్వర్లు, ఆకుల కిరణ్, కాంగ్రెస్ నాయకులు దిర్సిపో రామకృష్ణ, ఆరేటి సత్యవతి కుమార్తె కల్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ఇలాంటి కొడుకు మరెవరికీ వద్దు!
అన్న తీరుపై చెల్లెళ్ల ఫిర్యాదు మల్కాపురం: కంటే కూతురునే కనాలి అన్న ఓ సినీ కవి భావం అక్షరాలా నిజమైంది. కష్టాల్లో ఉన్న తల్లిని కడచూపు చూసేందుకు మలేసియా నుంచి కూతుళ్లు కదిలారు గానీ, పక్కనే ఉన్న కొడుకు మనసు మాత్రం చలించలేదు. పైగా తల్లి, చెల్లెళ్ల ఆస్తి కాజేసేందుకు కూడా వెనకాడలేదు. వివరాల్లోకి వెళితే.. 46వ వార్డు శ్రీహరిపురం-శ్రీనివాస్‌నగర్‌లో సత్యవతి అనే వృద్థురాలు తన సొంతింట్లో నివసిస్తోంది. ఆమెకు శ్రీదేవి, కనకమహాలక్ష్మి అనే కుమార్తెలతో పాటు శ్రీనివాసరావు అనే కుమారుడున్నాడు. కుమార్తెలిద్దరూ మలేసియాలో ఉంటున్నారు. శ్రీనివాసరావు స్థానికంగా తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. సత్యవతి నుంచి కొడుకు మొదటి నుంచి దూరంగానే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కుమార్తెలే ఆమెకు నెల నెలా డబ్బు పంపించేవాళ్లు. ఆమె బాగోగులన్నీ ఇరుగుపొరుగు వాళ్లే చూసేవాళ్లు. సత్యవతి ఇంటిని ఇటీవల తన పెద్ద కుమార్తె శ్రీదేవికి రాసిచ్చేసింది. ఇదిలా ఉంటే యథావిధిగానే గత శనివారం సత్యవతికి పొరుగింటివాళ్లు టీ తెచ్చారు. ఆ సమయంలో ఆమె కింద పడిపోయి ఉన్నట్టు గుర్తించడంతో కలవరం చెంది స్థానిక ఓ ప్రైవేట్ అస్పత్రికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని మలేసియాలో ఉంటున్న ఆమె పిల్లలకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. కూతుళ్లు పట్టించుకున్నా కొడుకు పట్టించుకోలేదు. తల్లిని ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమె ఇంటిని కూడా శ్రీనివాస్ ఆక్రమించాడని ఆమె పెద్దకుమార్తె శ్రీదేవి ఆరోపించింది. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఈనెల 26న కుమార్తెలిద్దరూ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో ఉన్నా ఆమెను పరామ ర్శించారు. కాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఈ నెల 26న రాత్రి మృతిచెందింది. ఆస్పత్రి ఖర్చు లు కూడా భరించనంటూ శ్రీనివాస్ మొండికేశాడు. ఆమె అంత్యక్రియలకు కూడా ముందుకు రాలేదు. దీంతో సత్యవతి మృతదేహం రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోదరుడి తీరుపై శ్రీదేవి, కనకమహాలక్ష్మిలు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. బుధవారం సత్యవతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటన సత్యవతి ఆస్తిపై వివాదం వల్లేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. ఆస్తిని తనకిప్పిస్తే తక్షణం ఇల్లు ఖాళీ చేస్తానని శ్రీనివాస్ చెప్పడంపై పోలీసులూ ఆశ్చర్య పోయారు. తల్లిని సైతం కాదని ఆస్తిపైనే దృష్టి సారించడంపై స్థానికులు మండిపడుతున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దేవరపల్లి: టెన్నికాయిట్ పోటీల్లో మండలంలోని పల్లంట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఈ.చరిత, ఎం. నవ్య, ఎ.సత్యవతి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో చరిత, ఎం.నవ్య ద్వితీయ, ఎ.సత్యవతి తృతీయ స్థానాలు సాధించినట్టు పీఈటీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్ విభాగంలో ఆర్.వెంకటేశ్వరరావు ప్రథమ స్థానం సాధించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయనగరంలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. దేవరపల్లి శ్రీసాయి లిటిల్ హార్ట్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని జి.హేమమాధురి అండర్–14 విభాగంలో సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యిందని పీఈటీ ఎం.మురళీ తెలిపారు. -
ఉదయ కాంతి రేఖ ముహమ్మద్ ప్రవక్త
గ్రంథపు చెక్క ఒక రాత్రి ముహమ్మద్కి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఒక దివ్యశక్తి ఏదో తనను కమ్ముకున్న అనుభూతి కలిగింది. అదొక మాటలకందని అనుభవం. ఒక దేవత అతనిని- ‘‘పఠించు’’ అని ఆజ్ఞాపించింది. తానేమీ జ్యోతిష్యుడిని కాననీ తనేమీ పఠించలేనని ముహమ్మద్ ఎంత చెప్పినా వినలేదు. అతని ఓపిక నశించే వేళకు అతని నోటి నుంచి పవిత్ర గ్రంథం తాలూకు పదాలు వెలువడసాగాయి. అరేబియాలో మొట్టమొదటగా భగవంతుడి మాట వినబడింది. ఎట్టకేలకు వారి భాషలోనే వారికి భగవత్సాక్షాత్కారం లభించింది. అట్లా ముహమ్మద్ నోట వెలువడిన మాటలు ‘ఖుర్ ఆన్’ రూపాన్ని సంతరించుకున్నాయి. ఖుర్ ఆన్ అంటే పఠనం అని అర్థం. ముహమ్మద్ యొక్క ఈ దివ్యానుభవ పర్యవసానాలు అపారమైనవి. ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ ప్రవచనాలను మక్కాలో ప్రబోధించడానికి పూనుకున్న సమయంలో ఆ దేశమంతా అనైక్యత పెచ్చరిల్లి ఉంది. అక్కడి సంచార జాతులన్నీ వేటికవి స్వతంత్రంగా ఉండి తక్కిన తెగలతో యుద్ధానికి తలపడుతుండేవి. వారందరిని ఒక తాటి మీదికి తేవడం అసాధ్యంగా ఉండేది. ప్రవక్త ఈ తెగలన్నింటినీ తన ముస్లిమ్ సమాజంలోకి తేగలిగాడు. ప్రజల మధ్య వుండిన హింసాద్వేషాలను, అనైక్యతను రూపు మాపి వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచాడు. వారికొక కొత్త గుర్తింపునిచ్చాడు. ప్రత్యేకమైన సంస్కృతిని రూపొందించుకునేలా వారిని సిద్ధపరిచాడు. అతని తాత్వికత వారి ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చగలిగింది. - క్యారెన్ ఆంస్ట్రాంగ్ రచించిన ‘ముహమ్మద్ ప్రవక్త జీవితం’ నుంచి. (తెలుగు: పి.సత్యవతి) -
సీఎం కార్యాలయానికి సత్యవతి
కరీంనగర్ సిటీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ఈడీగా సత్యవతి పోస్టింగ్ పొందారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా, ఇన్చార్జీ డెప్యూటీ సీఈవోగా ఉన్న సత్యవతి బుధవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ఓఎస్డీగా సత్యవతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సత్యవతికి సీఎం కార్యాలయంలో పోస్టింగ్ రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి వెళ్లిన స్మితా సబర్వాల్ ఇప్పటికే సీఎం పేషీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తుండగా తాజాగా బీసీ కార్పొరేషన్ ఈడీ సత్యవతీ సీఎం కార్యాలయంలో చోటు సంపాదించారు. ఎంఐపీ పీడీ సంగీతలక్ష్మికి బీసీ కార్పొరేషన్ ఈడీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో బాధ్యతలను కూడా సీఈవోకు అప్పగించారు. ఉత్తమ సేవలతోనే ఉద్యోగంలో రాణిస్తారు - జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తమ సేవలతో ఉద్యోగంలో రాణిస్తారని, అధికారుల మన్ననలు పొందుతారని జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేటులోని డ్వామా సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో ముఖ్యమంత్రి కార్యాలయూనికి వెళ్తున్న సందర్భంగా జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సత్యవతి ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన అధికారి అని అన్నారు. అనంతరం ఆమెకు జాయింట్ కలెక్టర్ మెమోంటో అందజేసి చేసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హౌసింగ్ పీడీ నర్సింహరావు, విద్యాధికారి కె.లింగయ్య, మీరాప్రసాద్, పీడీ డ్వామా గణేశ్, ఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి సత్యవాణి, పీడీ సంగీతలక్ష్మి, ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ శోభ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మా అమ్మను ఇండియాకు రప్పించరూ..
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్‌సెంటర్) : ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతున్న తన తల్లిని ఇండియూకు రప్పించాలని కుమార్తె బుధవారం తాడేపల్లిగూడెంలో కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు విజ్ఞప్తి చేసింది. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన ఇంటి సత్యవతి ఉపాధి కోసం 2013లో కువైట్ వెళ్లింది. అక్కడ యజమానులు జీతం కూడా ఇవ్వకుండా తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని తన తల్లి సత్యవతి ఫోన్లో ఆవేదన చెందినట్లు కుమార్తె జయప్రద కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉంటే ఈనెల 16న తన తండ్రి బాబూరావు వడగాల్పులకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందినట్లు చెప్పింది. ఈ విషయం తన తల్లికి తెలియజేయగా ఆమె యజమానిని ఇండియాకు పంపమని వేడుకున్నా నికారించారని జయప్రద ఆవేదన చెందింది. తన తల్లిని ఇండియాకు రప్పించాలని మాణిక్యాలరావుకు వినతి పత్రం అందజేసింది. విదేశీ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి సత్యవతిని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఆమె వెంట ఇంటి రాజశేఖరన్, ఇందిరా దేవి, కైండ్‌నెస్ సొసైటీ సభ్యులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, పాండురంగారావు, గట్టిం ప్రవీణ్ కృష్ణ ఉన్నారు. -
ఆ రకంగా..సైకిల్
టీడీపీ పరిస్థితి దయనీయం రెండేళ్ల క్రితమే సగానికి పైగా ఖాళీ తాజాగా ఎన్నికల తరుణంలో గులాబీ గూటికి... నేడు టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే సత్యవతి మారనున్న డోర్నకల్ రాజకీయం సాక్షి ప్రతినిధి, వరంగల్: టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ పుంజుకుంటుందని... తమకు ఇక ఎదురులేదని పార్టీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు మొదలై వారం కాకముందే... తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పెద్ద దెబ్బ తగిలింది. ఏకంగా ఒక ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పారు. డోర్నకల్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత సత్యవతి రాథోడ్ టీడీపీకి ఆదివారం రాజీనామా చేశారు. టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో హైదరాబాద్‌లో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోపు టీడీపీ నుంచి తమ పార్టీలోకి వలసల పరంపర ఇదేవిధంగా కొనసాగుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకెవరెవరు క్యూలో ఉన్నారనే అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. రెండేళ్ల క్రితమే... తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం, విశ్వసనీయత లేని విధానాలతో జిల్లాలోని టీడీపీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లోకి గతంలోనే వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు వారితో కలిసి ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్ఎస్లోనే చేరారు. దీంతో రెండేళ్ల క్రితమే పార్టీ దాదాపు సగానికిపైగా ఖాళీ అయింది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత నేతలు పార్టీని వీడడం పెరుగుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిల్లాలో మొదటిసారి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెలే పార్టీని వీడారు. రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో టీడీపీకి చెందిన మిగిలిన ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వేగంగా డీలా... ప్రజావ్యతిరేకతతో పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని... తెలంగాణపై చంద్రబాబు అనుసరించిన అస్పష్ట వైఖరి జిల్లాలో బాగా దెబ్బతీసింది. 2009 ఎన్నికల్లో పర్వాలేదనిపించేలా ఫలితాలు వచ్చినా... తర్వాత పరిణామాలతో క్రమంగా పార్టీ ఖాళీ అవుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్న టీడీపీ జిల్లాలో నర్సంపేట, పాలకుర్తి, ములుగు, డోర్నకల్ స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ తీవ్రతతో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు భారీగా టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీని వీడిన సందర్భంలో టీడీపీ భారీగా నష్టం జరిగింది. తాజాగా సాధారణ ఎన్నికల తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. మారిన రాజకీయం.. సత్యవతి రాథోడ్ 1985 నుంచి టీడీపీలో ఉన్నారు. 1989లో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1995లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అదే ఏడాది గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా గెలిచారు. 2001లో చింతపల్లి ఎంపీటీసీగా ఓడిపోయారు. 2006లో నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. 2009లో టీఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల తరుణంలో ఇప్పుడు టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం... లేదా... రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే డోర్నకల్ అసెంబ్లీ సీటు మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు దక్కుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ రాజకీయం మారుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ విలీనం... పొత్తు.. ఏది జరిగినా రెడ్యానాయక్ పోటీ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
వాడ వాడలా సమైక్య ఉద్యమం
-
మాట్లాడింది నేను కాదు... భగవంతుడి లీల
-
ఎమ్మెల్యే సత్యవతికి సమైక్య సెగ!
ఆమదాలవలస, న్యూస్‌లైన్ : అధికార పార్టీకిచెందిన ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతికి గురువారం సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్పీకర్ ఫార్మేట్లో రాజీ నామా సమర్పించి ప్రజల్లోకి రావాలని ఉపాధ్యాయులు, ప్రజలు డిమాండ్ చేయడంతో ఆమె కంగుతిన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేయడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలివి. ఆమదాలవలస మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద సమైక్యాంధ్ర ఉద్యమ ఉపాధ్యాయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సంఘాలకతీతంగా మండల ఉపాధ్యాయులు గురువారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు స్థానిక ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తమపార్టీ కార్యకర్తలతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కూన మంగమ్మ ఎమ్మెల్యేనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయకుండా.. దొంగ రాజీనామాలు చేసి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ఇక్కడ విమర్శలు వద్దని సందర్భం వచ్చినప్పుడు తామే పదవులను త్యజించి ప్రజల్లోకి వస్తామని... మీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఘాటుగా అనడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న సమైక్యవాదులు ఎమ్మెల్యే డౌన్‌డౌన్, సోనియాగాంధీ డౌన్‌డౌన్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గట్టిగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు కూడా స్పందిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యేని డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన సత్యవతి మీరు కూడా రాజీనామా చేసి పోరాటం చేయాలని అనడంతో గురువర్యులు అవాక్కయ్యారు. ప్రజాప్రతినిధి నోటివెంట ఉపాధ్యాయులను రాజీనామా చేయమనడంపై ఆ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. శాసనాలు చేసే మీరే రాజీనామాలు చేయకపోతే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్న వేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే అనుచరులు, సమైక్యాంధ్రవాదులు వాదులాడుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపుచేశారు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని గ్రహించిన ఎమ్మెల్యే సత్యవతి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తుండగా సమైక్యవాదులు నినాదాలు చేస్తూ ఆమె వెనకాలే రైల్వేస్టేషన్ బ్రిడ్జి వరకూ వెళ్లడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయడానికి శ్రమించవలసి వచ్చింది. ఓవర్ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉద్యమకారులతో ఎమ్మెల్యే సత్యవతి మాట్లాడారు. మీకు నా రాజీనామా కావాలా? లేక సమైక్యాంధ్ర కావాలో తేల్చుకోవాలని అనడంతో.. మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే అప్పుడు ప్రజలే తేలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం ఎమ్మెల్యే సత్యవతి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న తమను రాజీనామాలను చేయమనడం తగదని ఉపాధ్యాయ ప్రతినిధులు బి.శ్రీధర్, బి.చంద్రశేఖర్‌లు వ్యాఖ్యానించారు. విభజనతో రాష్ట్రప్రజలు రోడ్డున పడితే పదవుల కోసం ప్రజాప్రతినిధులు పాకులాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశించారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి తమత రాజీనామాలు కోరడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.