సీఎం కార్యాలయానికి సత్యవతి
కరీంనగర్ సిటీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ఈడీగా సత్యవతి పోస్టింగ్ పొందారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా, ఇన్‌చార్జీ డెప్యూటీ సీఈవోగా ఉన్న సత్యవతి బుధవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ఓఎస్‌డీగా సత్యవతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సత్యవతికి సీఎం కార్యాలయంలో పోస్టింగ్ రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి వెళ్లిన స్మితా సబర్వాల్ ఇప్పటికే సీఎం పేషీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తుండగా తాజాగా బీసీ కార్పొరేషన్ ఈడీ సత్యవతీ సీఎం కార్యాలయంలో చోటు సంపాదించారు. ఎంఐపీ పీడీ సంగీతలక్ష్మికి బీసీ కార్పొరేషన్ ఈడీగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో బాధ్యతలను కూడా సీఈవోకు అప్పగించారు.
ఉత్తమ సేవలతోనే ఉద్యోగంలో రాణిస్తారు
- జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
ఉత్తమ సేవలతో ఉద్యోగంలో రాణిస్తారని, అధికారుల మన్ననలు పొందుతారని జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేటులోని డ్వామా సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో ముఖ్యమంత్రి కార్యాలయూనికి వెళ్తున్న సందర్భంగా జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సత్యవతి ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన అధికారి అని అన్నారు. అనంతరం ఆమెకు జాయింట్ కలెక్టర్ మెమోంటో అందజేసి చేసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హౌసింగ్ పీడీ నర్సింహరావు, విద్యాధికారి కె.లింగయ్య, మీరాప్రసాద్, పీడీ డ్వామా గణేశ్, ఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి సత్యవాణి, పీడీ సంగీతలక్ష్మి, ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్ శోభ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.