
మా అమ్మను ఇండియాకు రప్పించరూ..
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్‌సెంటర్) : ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతున్న తన తల్లిని ఇండియూకు రప్పించాలని కుమార్తె బుధవారం తాడేపల్లిగూడెంలో కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు విజ్ఞప్తి చేసింది. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన ఇంటి సత్యవతి ఉపాధి కోసం 2013లో కువైట్ వెళ్లింది. అక్కడ యజమానులు జీతం కూడా ఇవ్వకుండా తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని తన తల్లి సత్యవతి ఫోన్‌లో ఆవేదన చెందినట్లు కుమార్తె జయప్రద కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉంటే ఈనెల 16న తన తండ్రి బాబూరావు వడగాల్పులకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందినట్లు చెప్పింది.
ఈ విషయం తన తల్లికి తెలియజేయగా ఆమె యజమానిని ఇండియాకు పంపమని వేడుకున్నా నికారించారని జయప్రద ఆవేదన చెందింది. తన తల్లిని ఇండియాకు రప్పించాలని మాణిక్యాలరావుకు వినతి పత్రం అందజేసింది. విదేశీ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి సత్యవతిని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఆమె వెంట ఇంటి రాజశేఖరన్, ఇందిరా దేవి, కైండ్‌నెస్ సొసైటీ సభ్యులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, పాండురంగారావు, గట్టిం ప్రవీణ్ కృష్ణ ఉన్నారు.