సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.
బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు.
గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment