podu
-
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి వివరించారు. -
విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 330 ఎకరాల భూమిని చూపినా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరారు. శనివారం శాసనమండలిలో ‘గిరిజన సంక్షేమం–పోడు భూములకు పట్టాల పంపిణీ’పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. పోడు భూముల వివాదాల్లో తలెత్తిన కేసులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎత్తివేసేందుకు అటవీశాఖ, డీజీపీలతో కూడిన కమిటీ కసరత్తు ప్రారంభించిందని చెప్పారు. 2023–24 లో 15 వేల మంది గిరిజన రైతుల ప్రయోజనాల కోసం ‘గిరివికాసం’కింద రూ.150 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని, 500 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ల హయాంలోనే పోడుభూములకు పట్టాలు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. -
పోడు ఫైటు
-
మర్రిగూడెంలో పోడు రైతు ఆత్మహత్య
ఐదెకరాల పంట నాశనం చేశారని మనస్తాపం? చండ్రుగొండ : మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన మడకం వెంకటేశ్వర్లు (30) అనే పోడు రైతు మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర్లు తనకున్న ఐదెకరాల పోడుభూమిలో పత్తి సేద్యం చేస్తున్నాడు. దీని కోసం రూ.లక్ష వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ పంటను నాశనం చేయడంతో మనస్తాపం చెంది ఇంటి వెనుక భాగంలో కండువతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు ముత్యాలు, కన్నమ్మ రోదనలు కలిచివేశాయి. వెంకటేశ్వర్లు ఉరివేసుకున్న తీరు అనుమానాస్పందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుంటూరు నుంచి వచ్చి.. : ఏఎస్సై హుస్సేన్ మడకం వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లాలో ఉంటూ పనిచేసుకుంటున్నాడు. అతని మృతిపై మాకు ఇంకా ఫిర్యాదు అందలేదు. వెంకటేశ్వర్లు సోదరుడు శ్రీను ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. కర్మకాండల కోసం గుంటూరు నుంచి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మా విచారణలో తెలుస్తోంది. -
‘పోడు’పై పోరాటం
ఖమ్మం సిటీ: ఆదివాసీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు కుట్ర సాగిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. జిల్లాలోని అదివాసీల అణచివేతకు వ్యతిరేకంగా, పోడు రైతులకు అటవీ హక్కు పత్రాలు.. బ్యాంక్ రుణాలు ఇవ్వాలన్న డిమాండ్లతో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, అనంతరం ధర్నాచౌక్‌లో ధర్నా జరిగాయి. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా బృందాకారత్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల నుంచి గిరిజన బిడ్డలను వెళ్లగొట్టే లక్ష్యంతో వారిపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. ‘‘అటవీకరణ, అడవుల పరిరక్షణ పేరుతో మోడీ; హరితహారం పేరుతో కేసీఆర్.. గిరిజనులను అడవుల నుంచి దూరంగా తరిమేసేందుకు కుట్రలు సాగిస్తున్నారు’’ అని మండిపడ్డారు. ప్రధాని మోడీకి మిత్రునిగా, అడవి బిడ్డలకు శత్రువుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘జాతి ద్రోహులు, ఘరానా దొంగలు, పెద్ద పెద్ద నేరగాళ్లపై పెట్టాల్సిన తీవ్రమైన కేసులను.. తెలంగాణలో అమాయక గిరిజనులపై పెడుతున్నారు, జైలుకు పంపుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపనకుగాను కార్పొరేట్ కంపెనీలకు పాలకులు అనుమతిస్తున్నారు, అడవిపై హక్కులు కల్పిస్తున్నారు. కానీ, ఆ ప్రాంతంలోని గిరిజనులు పొట్ట పోసుకునేందుకు అక్కడి అటవీ భూమిని సాగు చేసుకోవడాన్ని మాత్రం సహించడం లేదు’’ అని విమర్శించారు. అటవీ హక్కుల కోసం గిరిజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు, బ్యాంకు రుణాలు ఇచ్చేంత వరకు సీపీఎం పోరాడుతోందన్నారు. పోడు భూములను దున్నాయంటూ మూగ జీవాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించడం ద్వారా సరికొత్త జాతీయ రికార్డును తెలంగాణ సీఎం సృష్టించారని బృందాకారత్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులకు సీపీఎం వ్యతిరేకం కాదు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి సీపీఎం వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలి. పరిశ్రమలు స్థాపించాలి. దానికి భూములు తీసుకోవాలి. తీసుకున్న భూములకుగాను తగిన నష్ట పరిహారం ఇవ్వాలి. మల్లన్న సాగర్, సింగరేణి ఓసీ నిర్వాసితులందరికీ 2013 చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి’’ అని అన్నారు. రాష్ట్రంలోని చట్టాలను తన చుట్టాలుగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘ఓట్లు, సీట్లు ఎన్ని వచ్చాయన్నది ముఖ్యం కాదు. మీకు ఎన్నొచ్చినా ఉపయోగం లేదు. టీఆర్ఎస్లో చాలా వర్గాలు– కాంగ్రెస్ టీఆర్ఎస్, టీడీపీ టీఆర్ఎస్, ఎర్ర టీఆర్ఎస్, అసలు టీఆర్ఎస్ ఉన్నాయి. భవిష్యత్తులో వీరంతా తన్నుకోవటం ఖాయం’’ అన్నారు. ప్రజావ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలన్నారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పోడు’పై పోరుకు సిద్ధం
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అశ్వారావుపేట : పోడు భూముల కోసం తమ పార్టీ ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీ హక్కుల చట్టం 2005ను పకడ్బందీగా అమలు చేయకుండా.. ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిందన్నారు. రాష్ట్రంలో గిరిజనులు 11లక్షల ఎకరాలు పోడు చేసుకోగా.. వాటì లో కేవలం 4.5లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారన్నారు. తాము మొక్కలు పెంచడానికి వ్యతిరేకం కాదని.. హరితహారం పేరుతో రాజకీయ నాయకులకు లబ్ధి, నర్సరీల వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఖజానాను ఖర్చు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ దశలో ఓపెన్ కాస్టులను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం ఓసీలను ప్రోత్సహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నీట మునుగుతున్న 7 మండలాల ప్రజలు త్యాగమూర్తులని.. వారి త్యాగాలను పాలకులు వృథా చేస్తున్నారన్నారు. భద్రాచలం ఐటీసీ ఫ్యాక్టరీ గ్రామ పంచాయతీకి కోట్లాది రూపాయల పన్ను బకాయి ఉన్నా.. కలెక్టర్ సైతం వారినేమీ చేయలేకపోవడం బాధాకరమన్నారు. మల్లన్న సాగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను వేల కోట్లు వెచ్చించి రీడిజైన్ చేయడం అనవసర కార్యక్రమమన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి.. కేవలం వారికి లబ్ధి చేకూర్చేందుకే ఈ రీడిజైన్ కార్యక్రమం అని అన్నారు. అనంతరం అశ్వారావుపేటలో ప్రదర్శన నిర్వహించి.. తహసీల్ ఎదుట ధర్నా చేపట్టారు. రెడ్డిగూడెం వద్ద బండారుగుంపు రిజర్వాయర్ కోసం సేకరించిన భూమిని అనుభవిస్తున్న గిరిజనేతరుడి నుంచి భూమిని గిరిజనులకు పంచాలని డిమాండ్ చేస్తూ తహసీల్ ఎదుట ధర్నా నిర్వహించి.. తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెచ్చెల రంగయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, వెంకటేశ్వరరావు, కంగాల కల్లయ్య, కొత్తపల్లి సీతారాములు, వాసం బుచ్చిరాజు, సిరికొండ రామారావు పాల్గొన్నారు.