
వైఎస్ జగన్ అండ వెయ్యి ఏనుగుల బలానిచ్చింది..
ఈనెల 19వ తేదీన వైఎస్ జగన్ నన్ను తణుకు సబ్‌జైలులో కలిసిన సందర్భంగా తమ్ముడికి (ఆరేటి సత్యవతి కొడుకు వాసు) నీతోపాటు మిగిలిన బాధితులకు నేను అండగా ఉంటానని చేతిలో చెయ్యేసి చెప్పడం ఉద్యమానికి మరింత బలం ఇచ్చిందన్నారు. మాయమాటలు చెప్పి అందలమెక్కిన చంద్రబాబునాయుడు ఒక మహిళను అక్రమంగా హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనత మూటకట్టుకున్నాడని ఇదే అతని పతనానికి నాంది పలుకుతుందని విమర్శించారు. ఉద్యమాన్ని ఎటువంటి పరిస్థితుల్లోను ఆపేదిలేదని చంద్రబాబు పోలీసులతో నియంత పాలన చేసినా బెదిరేదిలేదన్నారు. ప్రస్తుతం 50 రోజులు జైలులో ఉన్నానని ఉద్యమంలో భాగంగా సంవత్సరం పాటు ఉంచినా గ్రామాలు కాలుష్యం బారినపడకుండా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు. ఘటన అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు చెప్పారు.
సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ సంక్షేమంతో రాష్ట్రంలోని మహిళలను ఉద్దరిస్తానని చెప్తున్న చంద్రబాబునాయుడు ఒక సాధారణ మహిళపై హత్యాయత్నం కేసుపెట్టించి 50 రోజులపాటు జైలులో ఉంచిన రోజులు ఎవ్వరూ మరచిపోరని రానున్న రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనన్నారు. మా గ్రామాలు, మా పొలాలు, మా ఆరోగ్యాన్ని, మా కుటుంబాలను రక్షించండంటూ న్యాయమైన పోరాటం చేస్తున్న వారిని జైళ్లలో పెట్టించడం దారుణమన్నారు. 60 గ్రామాల ప్రజలు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా వారిని పట్టించుకోకుండా పెట్టుబడిదారీలైన ఇద్దరు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో ఎదురులేని ఆధిక్యం వచ్చిందని మురిసిపోతున్న చంద్రబాబు ఈ జిల్లా నుంచే ఆయన పతనం ప్రారంభమై రాష్ట్రానికి పాకుతుందన్నారు.
సెప్టెంబరు 20వ తేదీన తణుకు సబ్‌జైలుకు వచ్చిన సత్యవతి సోమవారం నరసాపురం కోర్టులో హాజరై ఆర్డర్ కాపీని తణుకు సబ్‌జైలులో సమర్పించారు. విడుదలైన సత్యవతిని అఖిలపక్షాల ఆధ్వర్యంలో పూల దండలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో అఖిల పక్షం తరపున ఐలూ జిల్లా కమిటీ సభ్యులు కామన మునిస్వామి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పీవీ ప్రతాప్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీఐటీయూ స్టేట్ కౌన్సిల్ మెంబరు పీఎల్ నరసింహారావు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి పొట్ల సురేష్, నాయకులు అనుకుల రమేష్, వైసీపీ నాయకులు కౌరు వెంకటేశ్వర్లు, ఆకుల కిరణ్, కాంగ్రెస్ నాయకులు దిర్సిపో రామకృష్ణ, ఆరేటి సత్యవతి కుమార్తె కల్యాణి తదితరులు పాల్గొన్నారు.