ఎమ్మెల్యే సత్యవతికి సమైక్య సెగ! | MLA SATYAVATHI united to the flame! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సత్యవతికి సమైక్య సెగ!

Published Fri, Sep 6 2013 5:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

MLA SATYAVATHI united to the flame!

ఆమదాలవలస, న్యూస్‌లైన్ : అధికార పార్టీకిచెందిన ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతికి గురువారం సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్పీకర్ ఫార్మేట్‌లో రాజీ నామా సమర్పించి ప్రజల్లోకి రావాలని ఉపాధ్యాయులు, ప్రజలు డిమాండ్ చేయడంతో ఆమె కంగుతిన్నారు. 
 
 ఉపాధ్యాయులు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేయడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలివి. ఆమదాలవలస మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద సమైక్యాంధ్ర ఉద్యమ ఉపాధ్యాయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సంఘాలకతీతంగా మండల ఉపాధ్యాయులు  గురువారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. 
 
 వీరికి సంఘీభావం తెలిపేందుకు స్థానిక ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తమపార్టీ కార్యకర్తలతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కూన మంగమ్మ ఎమ్మెల్యేనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా చేయకుండా.. దొంగ రాజీనామాలు చేసి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ఇక్కడ విమర్శలు వద్దని సందర్భం వచ్చినప్పుడు తామే పదవులను త్యజించి ప్రజల్లోకి వస్తామని... మీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఘాటుగా అనడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న సమైక్యవాదులు ఎమ్మెల్యే డౌన్‌డౌన్, సోనియాగాంధీ డౌన్‌డౌన్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గట్టిగా నినాదాలు చేశారు.
 
 ఉపాధ్యాయులు కూడా స్పందిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యేని డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన సత్యవతి మీరు కూడా రాజీనామా చేసి పోరాటం చేయాలని అనడంతో గురువర్యులు అవాక్కయ్యారు. ప్రజాప్రతినిధి నోటివెంట ఉపాధ్యాయులను రాజీనామా చేయమనడంపై ఆ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. శాసనాలు చేసే మీరే రాజీనామాలు చేయకపోతే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్న వేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే అనుచరులు, సమైక్యాంధ్రవాదులు వాదులాడుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపుచేశారు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని గ్రహించిన ఎమ్మెల్యే సత్యవతి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తుండగా సమైక్యవాదులు నినాదాలు చేస్తూ ఆమె వెనకాలే రైల్వేస్టేషన్ బ్రిడ్జి వరకూ వెళ్లడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయడానికి శ్రమించవలసి వచ్చింది. ఓవర్ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉద్యమకారులతో ఎమ్మెల్యే సత్యవతి మాట్లాడారు. మీకు నా రాజీనామా కావాలా? లేక సమైక్యాంధ్ర కావాలో తేల్చుకోవాలని అనడంతో.. మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే అప్పుడు ప్రజలే తేలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఎమ్మెల్యే తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం
 ఎమ్మెల్యే సత్యవతి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న తమను రాజీనామాలను చేయమనడం తగదని ఉపాధ్యాయ ప్రతినిధులు బి.శ్రీధర్, బి.చంద్రశేఖర్‌లు వ్యాఖ్యానించారు. విభజనతో రాష్ట్రప్రజలు రోడ్డున పడితే పదవుల కోసం ప్రజాప్రతినిధులు పాకులాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశించారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి తమత రాజీనామాలు కోరడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement