Member of the Legislative
-
ఎమ్మెల్యే సత్యవతికి సమైక్య సెగ!
ఆమదాలవలస, న్యూస్‌లైన్ : అధికార పార్టీకిచెందిన ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతికి గురువారం సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్పీకర్ ఫార్మేట్లో రాజీ నామా సమర్పించి ప్రజల్లోకి రావాలని ఉపాధ్యాయులు, ప్రజలు డిమాండ్ చేయడంతో ఆమె కంగుతిన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేయడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలివి. ఆమదాలవలస మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద సమైక్యాంధ్ర ఉద్యమ ఉపాధ్యాయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సంఘాలకతీతంగా మండల ఉపాధ్యాయులు గురువారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు స్థానిక ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తమపార్టీ కార్యకర్తలతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కూన మంగమ్మ ఎమ్మెల్యేనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయకుండా.. దొంగ రాజీనామాలు చేసి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ఇక్కడ విమర్శలు వద్దని సందర్భం వచ్చినప్పుడు తామే పదవులను త్యజించి ప్రజల్లోకి వస్తామని... మీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఘాటుగా అనడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న సమైక్యవాదులు ఎమ్మెల్యే డౌన్‌డౌన్, సోనియాగాంధీ డౌన్‌డౌన్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గట్టిగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు కూడా స్పందిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యేని డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన సత్యవతి మీరు కూడా రాజీనామా చేసి పోరాటం చేయాలని అనడంతో గురువర్యులు అవాక్కయ్యారు. ప్రజాప్రతినిధి నోటివెంట ఉపాధ్యాయులను రాజీనామా చేయమనడంపై ఆ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. శాసనాలు చేసే మీరే రాజీనామాలు చేయకపోతే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్న వేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే అనుచరులు, సమైక్యాంధ్రవాదులు వాదులాడుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపుచేశారు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని గ్రహించిన ఎమ్మెల్యే సత్యవతి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తుండగా సమైక్యవాదులు నినాదాలు చేస్తూ ఆమె వెనకాలే రైల్వేస్టేషన్ బ్రిడ్జి వరకూ వెళ్లడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయడానికి శ్రమించవలసి వచ్చింది. ఓవర్ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉద్యమకారులతో ఎమ్మెల్యే సత్యవతి మాట్లాడారు. మీకు నా రాజీనామా కావాలా? లేక సమైక్యాంధ్ర కావాలో తేల్చుకోవాలని అనడంతో.. మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే అప్పుడు ప్రజలే తేలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం ఎమ్మెల్యే సత్యవతి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న తమను రాజీనామాలను చేయమనడం తగదని ఉపాధ్యాయ ప్రతినిధులు బి.శ్రీధర్, బి.చంద్రశేఖర్‌లు వ్యాఖ్యానించారు. విభజనతో రాష్ట్రప్రజలు రోడ్డున పడితే పదవుల కోసం ప్రజాప్రతినిధులు పాకులాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశించారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి తమత రాజీనామాలు కోరడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. -
కాంగ్రెస్‌లో చేరనున్న దలేర్ మెహందీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాప్ గాయకుడు దలేర్ మెహందీతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆర్జేడీ తరపున ఢిల్లీ విధానసభకు ఎన్నికైన మహ్మద్ ఆసిఫ్‌ఖాన్, బదర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీఎస్పీ ఎమ్మెల్యే రామ్‌సింగ్ నేతాజీ, మాజీ కౌన్సిలర్, ఎన్పీపీ నాయకుడు రామ్‌వీర్ సింగ్ బిదూరీతోపాటు బీజేపీ మాజీ కౌన్సిలర్ డాక్టర్ వీకే మోంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దలేర్ మెహందీతోపాటు ఈ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడాన్ని అభినందిస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం మంగళవారం అభినందన తీర్మానాన్ని ఆమోదించింది. దలేర్ మెహందీతోపాటు కాంగ్రెస్‌లో చేరిన నే తలకు విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు. దలేర్ మెహందీని తిలక్‌నగర్ లేదా హరినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించవచ్చని భావిస్తున్నారు. డాక్టర్ వీకే మోంగాను కృష్ణానగర్ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దింపే అవకాశముంది. ఓఖ్లా నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆసిఫ్ మహ్మద్‌ఖాన్‌ను అదే నియోజకవర్గం నుంచి పోటీచేయవచ్చని, రామ్‌సింగ్ నేతాజీ కూడా బదర్పూర్ నుంచి పోటీచేయవచ్చని సమాచారం. రామ్‌వీర్‌సింగ్ బిదూరీకి తుగ్లకాబాద్ టికెట్ లభించవచ్చని అంటున్నారు. -
ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి మోపిదేవి రాజీనామా
సాక్షి, గుంటూరు : రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షకు సంఘీభావం వ్యక్తం చేయడంతో రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే ఆయన సోదరుడు హరనాథబాబు వైఎస్సార్ సీపీలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధిక పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడంలో ఆయన కృషి ఎంతో వుంది. ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సోమవారం మోపిదేవి కుమారుడు రాజీవ్ చంచల్‌గూడ జైలులో వున్న తన తండ్రిని కలసి ఆయనిచ్చిన లేఖలోని వివరాలను నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా వెల్లడించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసన తెలియజేయడంతో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడేందుకు ఆమరణ దీక్షకు దిగిన జగన్‌కు మద్దతు తెలుపుతూ మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని తన వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. కీలక సమయంలో జననేతకు అండగా... మోపిదేవి వెంకటరమణ రద్దయిన కూచినపూడి నియోజకవర్గం నుంచి, రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇటీవలే మోపిదేవి సోదరుడు హరనాథబాబు వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. మోపిదేవి ప్రధాన అనుచరుడైన తెనాలికి చెందిన మాజీ జడ్పీటీసీ శాఖమూరి నారాయణ ప్రసాద్ వైఎస్సార్ సీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి వైఎస్సార్ సీపీ జయకేతనం ఎగురవేసింది. మోపిదేవి పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరితో రేపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. తాజాగా మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వైఎస్సార్ సీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. మోపిదేవి నిర్ణయం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీలక సమయంలో జననేత జగన్‌కు అండగా ఉండేందుకు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారని శాఖమూరి నారాయణ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. వైఎస్సార్ సీపీ ఇంకా బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని మోపిదేవి సోదరుడు హరనాథబాబు వ్యక్తం చేశారు.