ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి మోపిదేవి రాజీనామా
Published Tue, Aug 27 2013 3:07 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
సాక్షి, గుంటూరు : రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షకు సంఘీభావం వ్యక్తం చేయడంతో రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే ఆయన సోదరుడు హరనాథబాబు వైఎస్సార్ సీపీలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధిక పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడంలో ఆయన కృషి ఎంతో వుంది.
ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సోమవారం మోపిదేవి కుమారుడు రాజీవ్ చంచల్‌గూడ జైలులో వున్న తన తండ్రిని కలసి ఆయనిచ్చిన లేఖలోని వివరాలను నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా వెల్లడించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసన తెలియజేయడంతో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడేందుకు ఆమరణ దీక్షకు దిగిన జగన్‌కు మద్దతు తెలుపుతూ మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని తన వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.
కీలక సమయంలో జననేతకు అండగా...
మోపిదేవి వెంకటరమణ రద్దయిన కూచినపూడి నియోజకవర్గం నుంచి, రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇటీవలే మోపిదేవి సోదరుడు హరనాథబాబు వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. మోపిదేవి ప్రధాన అనుచరుడైన తెనాలికి చెందిన మాజీ జడ్పీటీసీ శాఖమూరి నారాయణ ప్రసాద్ వైఎస్సార్ సీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి వైఎస్సార్ సీపీ జయకేతనం ఎగురవేసింది.
మోపిదేవి పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరితో రేపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. తాజాగా మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వైఎస్సార్ సీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. మోపిదేవి నిర్ణయం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీలక సమయంలో జననేత జగన్‌కు అండగా ఉండేందుకు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారని శాఖమూరి నారాయణ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. వైఎస్సార్ సీపీ ఇంకా బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని మోపిదేవి సోదరుడు హరనాథబాబు వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement