మంచి ప్రవర్తనతో ఉజ్వల భవిష్యత్‌ | Cricketer Kapil Dev Speech In Guntur District | Sakshi
Sakshi News home page

మంచి ప్రవర్తనతో ఉజ్వల భవిష్యత్‌

Published Thu, Oct 10 2019 10:50 AM | Last Updated on Thu, Oct 10 2019 10:50 AM

Cricketer Kapil Dev Speech In Guntur District - Sakshi

మంత్రి మోపిదేవిని సన్మానిస్తున్న కపిల్‌దేవ్‌

సాక్షి, పాతగుంటూరు: చిన్నప్పటి నుంచి మంచి ప్రవర్తనతో మెలిగితేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని భారత్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ తెలిపారు. పెద్దలు, ఉపాధ్యాయులను గౌరవించే విద్యార్థులే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పారు. గుంటూరు రింగ్‌ రోడ్‌లోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా కపిల్‌దేవ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, శాసనమండలి డెఫ్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ మాలకొండయ్య పాల్గొన్నారు. 106 మంది ప్రధానోపాధ్యాయులకు గురు పురస్కారం, 84 మందికి గురు సన్మానం, 268 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానోత్సవం చేశారు. సభకు ఫౌండేషన్‌ కన్వీనర్‌ పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించారు. కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా తండ్రి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి కుమారులు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఫౌండేషన్‌ రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు.

ఉపాధ్యాయులను గౌరవించడం గొప్ప విషయం..
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను వారిని తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయులను గౌరవించటం గొప్ప విషయం అన్నారు. మానవ దక్పథంతో సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన రావటం హర్షణీయమని కొనియాడారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రామినేని ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమన్నారు. విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసే ఉపాధ్యాయులను సన్మానించడం మంచి పరిణామమని చెప్పారు. శాసనమండలి డెఫ్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చేయూతనందిస్తున్న ఫౌండేషన్‌ సేవలు ఎనలేనివన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  ఫౌండేషన్‌ అందిస్తున్న సహకారం విద్యార్థులకు ఎంతో మంచిందన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి రామినేని ఫౌండేషన్‌ డాక్టర్‌ రామినేని అయ్యన్న చౌదరి పిల్లలు ధర్మ ప్రచారక్, సత్యవాది, వేద చార్య, బ్రహ్మానందం అమెరికాలో ఉంటూ తండ్రి ఆశయం కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులకు పురస్కారాలను అందజేసి సత్కరించారు. రామినేని ఫౌండేషన్‌ కుటుంబ సభ్యులు చైర్మన్‌ ధర్మప్రచారక్, వేద చార్య, సత్యవాది, పొన్నూరు మాజీ శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్ర కుమార్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకష్ణ, టుబాకో బోర్డ్‌ చైర్మన్‌ యడ్లపాటి రఘునాథ్‌ బాబు, రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌  రవీంద్రనాథ్‌ రెడ్డి, జిల్లా ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఆర్‌ఎస్‌ గంగాభవాని, డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement