ఆయుర్వేద సంస్థలను అన్ని రాష్ట్రాలకు విస్తరించండి  | Vijaya Sai Reddy Comments On Ayurvedic education and companies | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద సంస్థలను అన్ని రాష్ట్రాలకు విస్తరించండి 

Published Thu, Sep 17 2020 4:48 AM | Last Updated on Thu, Sep 17 2020 7:42 AM

Vijaya Sai Reddy Comments On Ayurvedic education and companies - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద విద్య, పరిశోధనలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలను దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాల్లోనూ నెలకొల్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద బిల్లు 2020’పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్‌ను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను విస్మరించినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఇతర భారతీయ వైద్య విధానాలను కూడా సమూలంగా సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ బిల్లు ద్వారా ఆయుర్వేద వైద్య రంగంలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు.  

మున్సిపాలిటీలకు రూ.423 కోట్ల బకాయిలు 
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్ల బకాయిలు దాదాపు రూ.423 కోట్ల మేరకు ఉన్నట్లు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో కార్మికులు వలసపోవడం, నిర్మాణ సామాగ్రి సరఫరా చైన్‌ స్తంభించిపోవడం వంటి కారణాలు రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కుదేలు చేశాయని తెలిపారు. విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా గుర్తించినందున భద్రతా సంబంధిత ఖర్చుల కోసం కేంద్రం రూ.95 కోట్లు విడుదల చేసినట్లు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. పరిశ్రమలు, గృహ వినియోగం కోసం సహజ వాయువు సరఫరా చేసేందుకు గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌) శ్రీకాకుళం–అంగుల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.

ఆ ఏడు జిల్లాలను చేర్చండి
లోక్‌సభ జీరో అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ బీవీ సత్యవతి 
గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు జిల్లాలను చేర్చాలని ఎంపీ వెంకట సత్యవతి కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆమె లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు. విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోవడంతో వారు తీవ్రమైన ఇక్కట్లలో ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటును ప్రకటించారా? అని ఆమె అడిగారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందిస్తూ.. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. 
 
ప్రైవేటు పెట్టుబడులను పెంచే యోచన..
గనుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు గనుల చట్టంలో సవరణలు తేవాలనే ప్రతిపాదన ఉందని కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. వైద్య పరికరాల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తేశామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు ఎంపీలు.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, గోరంట్ల మాధవ్, పి.బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు జవాబిచ్చారు. 
 
 అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం 
అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేసిందని ప్రధాని కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ చెప్పారు. ఈ మేరకు ఎంపీలు.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, గోరంట్ల మాధవ్, వెంకట సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్నికల్లో పోççస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఎంచుకోవడం కోసం సీనియర్‌ సిటిజన్లకు నిర్ధారించిన వయోపరిమితిని తగ్గించారు. 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ఈ మేరకు ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లిఖితపూర్వ సమాధానమిచ్చారు. 

రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరింది 
విజయవాడ–గుడివాడ– భీమవరం–నర్సాపూర్, గుడివాడ– మచిలీపట్నం, భీమవరం– నిడదవోలు రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్టుపై కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ తెలిపారు. ఈ మేరకు ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.  

2జీ వ్యవస్థను రద్దు చేయం 
దేశంలో 2జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే తెలిపారు. ఈ మేరకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. అన్ని సమస్యలకూ ఆర్‌బీఐ ఒక్కటే పరిష్కార మార్గం కాదని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. దేశంలో ఐపీఎస్‌ అధికారుల కొరత లేదని కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ చెప్పారు. ఓబీసీ క్రిమిలేయర్‌ పరిమితి పెంపు, దాన్ని అమలు చేసే విధివిధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సహాయ మంత్రి క్రిషన్‌పాల్‌ గుర్జర్‌ చెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement