Granthapu wood
-
ఇసుకలో ఆడేటి కుసుమ సిరిబాల!
గ్రంథపు చెక్క పాట లేనిది బతుకు లేదు. బతుకు దారి పొడుగునా అక్కడ ఒక చెట్టులాగా, ఇక్కడ ఒక ఏరులాగా పాట తగుల్తూనే ఉంటుంది. బతుకులో పాట కోసం మనం ఎదురుచూడం. అనుకోకుండా వచ్చే అతిథి వంటిది పాట. ఊత, ఊపు, ఊరట, ఉల్లాసం, ఉత్సాహం... ఎన్నో అవుతుంది మానవుని బతుకులో ఈ పాట. తల్లులు పాడేవి మహాచల్లగా, తీయగా ఉంటాయి. మొట్ట మొదటి పాట - విద్దెం విద్దెం వరహాల విద్దెం / విద్దెం చేస్తే గిద్దెడు నెయ్యి తప్పక చేస్తే తవ్వెడు నెయ్యి / మళ్లీ చేస్తే మానెడు నెయ్యి ఈ పాటలో బిడ్డ వట్టి చంటిపాప. పాకే పాపకు నిలబడ్డం నేర్పుతుంది తల్లి. బోసి నోరు విప్పి కిలకిల నవ్వుతూ చిగురు మేనుతో బిడ్డ ఈ పాటలో సాక్షాత్కరిస్తుంది. చల్ల చేసే బిడ్డ ఇసుకలోకి నడిచి వెళ్లి అక్కడ ఆడుకుంటుంది. ఇసకలో ఆడేటి కుసుమ సిరిబాల ఆ బాల పేరేమి ఆనవాలేమి / ఆనవాలు అంబరస పేరు బాలయ్య అని పాపను గర్వంగా తల్లి హెచ్చరిస్తుంది. పాప మరి కాస్త పెరుగుతాడు. పక్క పక్కనే ఆడే పాప ముంగిటిదాకా నడుస్తాడు. - కృష్ణశాస్త్రి ‘అమూల్యాభిప్రాయాలు’ పుస్తకం నుంచి. -
జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా!
గ్రంథపు చెక్క గజల్ కేవలం ఒక గీతం కాదు. ధ్వనులతో అంతర్ధ్వనులతో పొరలు పొరలుగా అల్లుకుపోయిన కమనీయ కవిత గజల్. ముషాయిరాల్లో గజల్‌కు ప్రాధాన్యం హెచ్చు. అది తీగలా శ్రోతల హృదయాల పందిళ్లను దట్టంగా అల్లుకుని పుష్పించి, పరిమళించి పరవశింపజేస్తుంది. గజల్ అంటే ‘కలకంఠులతో సరస సల్లాపం’ అని అర్థం చెప్పవచ్చు. అరబ్బీ భాషలో దీనికి ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందమైన లేడిపిల్ల అరుపు, సున్నితమైన పూల నుండి దారం తీయడం... ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పవచ్చు. ప్రణయ సర్వస్వం-గజల్. ‘నీవున్న మేడ గదిలో నను చేరనీయ రేమో! జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా! యేడేడు సాగరాలు, యెన్నెన్నో పర్వతాలు యెంతెంత దూరమైన బ్రతుకంతా నడిచిరానా!’ ఇదో గజల్. ప్రియుడు ప్రేయసి కోసం పడే తపన గజల్‌కు ప్రాణం. బాల్యదశలో మహాకవి గాలిబ్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించాను. అగాథమైన అతని కవిత అర్థం కావడానికి చాలా తపన పడాలి. ‘‘భారతదేశానికి గాలిబ్ కవిత, తాజ్మహలు మరువరాని అందాలు’’ అని ఒక మహానుభావుడు అన్నాడట. అది సత్యం. -డా.దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ పుస్తకం నుంచి. -
సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం!
గ్రంథపు చెక్క మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే విధానాలు రూపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మానవజీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది కూడా. ఆవిరియంత్రం, రైల్వే, విద్యుచ్ఛక్తి, కాంతి, టెలిగ్రాఫ్, రేడియో, ఆటోమొబైల్, విమానాలు, డైనమోలు మొదలైన పరిశోధనలు సైన్స్ఫలితాలే. ఈ పరిశోధనల ప్రయోజనం... అది మానవుని దుర్భర శారీరక కష్టాల నుండి దూరం చేస్తుంది. మనిషి జీవనానికి శారీరక కష్టం ఒకనాడు అనివార్యంగా ఉండేది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం లేదా అనువర్తిత శాస్త్ర విజ్ఞానం (అప్లయ్డ్ సైన్స్) అనేక సమస్యలను సృష్టిస్తుంది. మానవుని ఉనికి ఈ సమస్యల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పురోభివృద్ధి దూరాన్ని తగ్గించింది. నూతన విధ్వంసక సాధనాలను అది సృష్టించింది. ఇది మానవజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. అసలు మానవ ఉనికే ఇందువల్ల ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొత్తం భూగ్రహానికి న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు గల ఒకే శక్తి ఉండడం అవసరం. సాంకేతిక పురోగతిని మన ఉనికిని చాటుకునేందుకు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఆధునిక నిరంకుశత్వం, దాని విధ్వంసకశక్తికి నిదర్శనంగా మారింది. ఇక్కడ కూడా ఆయా పరిస్థితులను బట్టి అంతర్జాతీయ పరిష్కారం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు కావల్సిన మానసిక ప్రాతిపదికను ఇప్పటికీ ఏర్పాటు చెయ్యలేదు. ఆదిమ మానవుడు ప్రకృతి చట్టాలను పాక్షికంగా అర్థం చేసుకోవడం దెయ్యాలు, ఆత్మల పట్ల కూడా నమ్మకాన్ని సృష్టించింది. మానవ మేధస్సు ఆధారంగా అభివృద్ధి చెందుతూ సైన్స్ మానవుని అభద్రతాభావాన్ని అధిగమించింది.. - ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సామాజిక రాజకీయ రచనలు’ పుస్తకం నుంచి. -
చెక్కు చెదరని బుద్ధవాక్యం
గ్రంథపు చెక్క బుద్ధప్రతిమలానే సాంచీస్థూపం కూడా ఏదో అనాది, శాశ్వత సందేశాన్ని వింటున్నట్లుగా, ఆ సందేశాన్ని ధ్యానిస్తున్నట్లుగా అక్కడొక అపూర్వమైన నిశ్శబ్దం, ప్రశాంతి నెలకొని ఉన్నాయి. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండ మీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధస్థూపాలన్నిటిలో కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యంలాగా ఈ నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికీ సంబంధం లేదు. బుద్ధుడు తన జీవిత కాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో వివరంగా నమోదు చేసినప్పటికీ సాంచి గురించి కనీసం ఒక్కవాక్యం కూడా ప్రస్తావించలేదు. బుద్ధపాద స్పర్శకు నోచుకోనప్పటికీ, బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధసంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచీ చరిత్రలో నిలబడింది. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్లేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్లేటప్పుడో ఈ అడవిలో ఈ కొండను చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండ మీద రాస్తే నలుగురు చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ ‘దృష్టి’ ఉంది. అందుకే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండ మీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు కూడా అతడు ఈ స్థూపనిర్మాణం చేపట్టాడు. - వాడ్రేవు చినవీరభద్రుడు ‘నేను తిరిగిన దారులు’ పుస్తకం నుంచి. -
సైన్స్... మనిషిని దేశదిమ్మరిని చేసింది!
గ్రంథపు చెక్క మానవుడు ఇంతకుముందు లాగా ఒకచోట జీవయాత్ర సాగించే అవకాశం లేకుండా చేసింది సైన్స్. మనిషిని దేశదిమ్మరిని చేసింది. ఈనాటి మనిషి ఉదయం ఒక ఊళ్లోనూ, రాత్రి ఇంకొక ఊళ్లోనూ ఉండవలసి వస్తుంది. కొంతమంది దేశాలనే మారుస్తున్నారు. చెట్టు ఒకచోటనే పాతుకొని ఉండి బ్రతుకుతుంది. అక్కడి నుంచి కదలిస్తే, మరోచోట పాతితే తప్ప బ్రతకదు. మరోచోట పాతివేసినా బ్రతకని చెట్లున్నాయి. జంతువు కదులుతూ బ్రతకగలుతుంది. ఒక పరిధిలో, ఒక పరిస్థితిలో మాత్రమే మనగలుగుతుంది. మానవుడూ అంతే. అయితే నూతన పరిస్థితులకు జంతువుల కంటే త్వరగా ఎడ్జెస్ట్ అవుతాడు. ఈనాటికీ పల్లెటూరి నుంచి వచ్చిన రైతు, పట్టణ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి కావడం మనకు నిత్యమూ కనిపించే దృశ్యమే. వచ్చిన దగ్గరి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనే యావ తప్ప అతనికి ఇంకొకటి ఉండదు. అయినా జంతువు వలెకాక, ఎక్కడబడితే అక్కడ తనకు కావలసిన పరిస్థితులను తనకు తానై సృష్టించుకోగలుగుతున్నాడు. నూతన పరిస్థితులలో మనగలుగుతున్నాడు. అంటే క్రమక్రమేణా అతను పరిస్థితుల ప్రభావాన్ని అధిగమించి బ్రతకగలుగుతున్నాడన్నమాట. మానవుని మీద పరిస్థితుల ప్రభావం నశిస్తూ వున్నదన్నమాట. ఇక మానవునికి వేళ్ళు ఒకచోట ఉండవలసిన అవసరం లేదు. ఈ నూతన జీవితంలో అతనికి అనేక ప్రమాదాలు అపాయాలు ఎదురవుతుంటాయి. అందులో సందేహం లేదు. అయితే ఎప్పటికప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడే కదా మానవుడు క్రొత్త క్రొత్త విషయాలను కనిపెట్టింది. మానవులో ఉన్న సృజనశక్తి విజృంభించేది. మానవుడు దేవుడయ్యేది. ఇందుకు మానసిక జీవితం ప్రగాఢం కావాలి. - ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’కు గోపిచంద్ రాసిన ముందుమాట నుంచి. -
సంతోషమే జీవితప్రయోజనం!
గ్రంథపు చెక్క మానవులందు జ్ఞానము అంకురించినది మొదలు ‘‘నేను ఎవ్వడను? ఎచ్చట నుండి వచ్చితిని? ఎచ్చటికి పోవుచున్నాను? మరణమే నా స్థితికి అంత్యమా లేక మరనంతర జీవితము కలదా? మానవకోటి యందు ఇట్టి వివిధత్వమునకు కారణములేమి? సృష్టికర్త ఉన్నాడా? ఉండిన యే ఉద్దేశముతో ఇట్టి విచిత్రమైన సృష్టిని గావించు చున్నాడు. ఒకడు సుఖింపనేల, మరి యొకడు దుఃఖింపనేల? ఇట్టి ప్రశ్నలు, విచారములు, సంశయములు పొటమరించు చుండెను. నాటి నుండి నేటి వరకు ఇట్టి ప్రశ్నలడుగబడుచున్నవి. ఒక్కొక్క దేశమున ఒక్కొక్కకాలమున ఒక్కొక్క మతము ఇటువంటి సమస్యల చిక్కు విడదీయ ప్రయత్నించినది. తన పుట్టు పూర్వోత్తరములు తెలిసికొను ఇచ్చ ప్రతి మానవునకును సహజముగ నుండును. ఇట్టి విషయములనే ఖయ్యాము తన రుబాయతులలో చర్చించియున్నాడు. పాశ్చాత్యవిమర్శకులు కొందరు ఖయ్యామును ఎపిక్యుర్ అని పేర్కొనిరి. వాడుకలో ఎపిక్యుర్ అనగా పరచింతన లేని భోగలాలసుడు. ఎపిక్యురస్ సిద్ధాంతములు ఒకటి రెండు విషయములలో తప్ప ఖయ్యాము నమ్మకముల కంటే భిన్నముగా ఉండును. ‘‘శరీరం భౌతికం. ఆత్మ భౌతికమైన సూక్ష్మశరీరం. ఆత్మ దేహమున వ్యాపించి యుండును. దేహముతోడ ఆత్మయు నశించును. మరణాంతర జీవితం లేదు. సంతోషమే జీవిత ప్రయోజనము. విధి యనునది లేదు. మానవుని అదృష్టము తన చేతిలో యున్నది’’ అని ఎపిక్యురస్ చెప్పెను. ఎపిక్యురసు, ఖయ్యాముల భావములు చాలావరకు పరస్పర విరుద్ధములు. ఎపిక్యురసు నిరీశ్వరవాది, ఖయ్యాము ఈశ్వరవాది. అతడు విధి లేదని చెప్పును. ఇతడు మన సుఖదుఃఖములు విధినిర్ణీతములని సిద్ధాంతీకరించును. - దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ నుంచి. (సెప్టెంబర్ 11 దువ్వూరి వర్థంతి) -
బతుకు రెండు విధాలు...
గ్రంథపు చెక్క బతుకు రెండు విధాలు. సంగడి బతుకు. అంగడి బతుకు. సంగడి అంటే స్నేహం, మైత్రి. అంగడి అంటే బజారు, వ్యాపారం జరిగే చోటు. బజారుల సంఘర్షణలు, వైరుద్ధ్యాలు, అంతా వ్యాపారం. ‘సంగడి’ బతుకులో అంతా స్నేహం. అందుకని సంగడి బతుకు కావాలె, అంగడి బతుకు కాదు. సంతసముగా జీవింపగా సతతము యత్నింతు గాని ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింపబోను (‘నా గొడవ’) ‘ది ప్రాఫెట్’ మొదటి అధ్యాయం, చివరి అధ్యాయం మధ్య ఇరవై ఎనిమిది ప్రశ్నలున్నయి. అన్నీ జీవితానికి సంబంధించినవే. పిల్లల గురించి, ఇండ్ల గురించి, పెండ్లి గురించి, పని గురించి. భక్త తుకారాం తన భజనలో అంటడు - ‘‘ఏ జీవినీ తప్పుపట్టకు. ప్రతి ఒక్కడూ ఏదో పని చేస్తున్నడు. పని దేవునితో సమానం’’ అని. గిబ్రాన్, ‘‘ప్రేమతో పనిచేయి, ఏహ్యతతో కాదు’’ అంటడు. ఏ పని చేసినా నీకు ప్రాణప్రదమైన వ్యక్తి కోసం చేస్తున్నట్లు చెయ్యమంటడు. ‘నేరం-శిక్ష’ గురించి మాట్లాడినప్పుడు- ‘‘చెట్టు అంతటికీ ఎరుక లేకుండా ఒక్క ఆకు కూడా పండు బారనట్లే, మీ అందరి రహస్య సమ్మతి లేకుండా ఏ ఒక్కడూ తప్పు చేయలేడు’’ అంటడు. స్నేహం గురించి చెప్పినప్పుడు నీ అవసరాల సమాధానమే నీ స్నేహితుడంటాడు. చట్టం తప్పుతుంది, మతం తప్పుతుంది, ప్రభుత్వం తప్పుతుంది, న్యాయం తప్పుతుంది కానీ బతుకు తప్పదు. బతక్క తప్పదు. బతుక్కు సంబంధించిన పుస్తకం కనుకనే ‘ది ప్రాఫెట్’ ఇప్పటికీ కొత్తగా ఉంటుంది. - కాళోజీ నారాయణరావు (‘జీవన గీతం’ పుస్తకానికి రాసిన ముందు మాట నుంచి) -
ఉదయ కాంతి రేఖ ముహమ్మద్ ప్రవక్త
గ్రంథపు చెక్క ఒక రాత్రి ముహమ్మద్కి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఒక దివ్యశక్తి ఏదో తనను కమ్ముకున్న అనుభూతి కలిగింది. అదొక మాటలకందని అనుభవం. ఒక దేవత అతనిని- ‘‘పఠించు’’ అని ఆజ్ఞాపించింది. తానేమీ జ్యోతిష్యుడిని కాననీ తనేమీ పఠించలేనని ముహమ్మద్ ఎంత చెప్పినా వినలేదు. అతని ఓపిక నశించే వేళకు అతని నోటి నుంచి పవిత్ర గ్రంథం తాలూకు పదాలు వెలువడసాగాయి. అరేబియాలో మొట్టమొదటగా భగవంతుడి మాట వినబడింది. ఎట్టకేలకు వారి భాషలోనే వారికి భగవత్సాక్షాత్కారం లభించింది. అట్లా ముహమ్మద్ నోట వెలువడిన మాటలు ‘ఖుర్ ఆన్’ రూపాన్ని సంతరించుకున్నాయి. ఖుర్ ఆన్ అంటే పఠనం అని అర్థం. ముహమ్మద్ యొక్క ఈ దివ్యానుభవ పర్యవసానాలు అపారమైనవి. ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ ప్రవచనాలను మక్కాలో ప్రబోధించడానికి పూనుకున్న సమయంలో ఆ దేశమంతా అనైక్యత పెచ్చరిల్లి ఉంది. అక్కడి సంచార జాతులన్నీ వేటికవి స్వతంత్రంగా ఉండి తక్కిన తెగలతో యుద్ధానికి తలపడుతుండేవి. వారందరిని ఒక తాటి మీదికి తేవడం అసాధ్యంగా ఉండేది. ప్రవక్త ఈ తెగలన్నింటినీ తన ముస్లిమ్ సమాజంలోకి తేగలిగాడు. ప్రజల మధ్య వుండిన హింసాద్వేషాలను, అనైక్యతను రూపు మాపి వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచాడు. వారికొక కొత్త గుర్తింపునిచ్చాడు. ప్రత్యేకమైన సంస్కృతిని రూపొందించుకునేలా వారిని సిద్ధపరిచాడు. అతని తాత్వికత వారి ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చగలిగింది. - క్యారెన్ ఆంస్ట్రాంగ్ రచించిన ‘ముహమ్మద్ ప్రవక్త జీవితం’ నుంచి. (తెలుగు: పి.సత్యవతి) -
అతనొక పాదరసం!
గ్రంథపు చెక్క చిన్నతనంలో... ఆజాద్‌కు మందుకూరి కాల్చే బొమ్మ తుపాకులాట మహా ఇష్టం. ఆ ఆట ఆడుకోవడానికి పటాసు కావాలి. కానీ డబ్బులు ఉండేవి కావు. ఒకరోజు తోట తమ సొంతమే అనుకొని కొన్ని పళ్లను అమ్మి బెల్లమూ, పటాసు కొనుక్కున్నాడు. తండ్రి దృష్టిలో అది క్షమించరాని అపరాధం అయింది. విపరీతంగా కొట్టాడు. స్వాభిమాని అయిన ఆజాద్ ఇక ఇంట్లో ఉండలేక పోయాడు. తల్లి అతి కష్టం మీద కూడబెట్టిన పదకొండు రూపాయలూ కొడుక్కి ఇచ్చింది. తండ్రికి చెప్పకుండా, విద్యలకు కేంద్రమైన కాశీకి వెళ్లిపోయాడు ఆజాద్. అక్కడ అతనొక సత్రంలో ఉండి లఘు కౌముది, అమరకోశం చదువుకున్నాడు. శాసనోల్లంఘన ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నరోజులవి. ఆ ఉద్యమం ఆజాద్‌ని బాగా ఆకర్షించింది. అప్పుడు ఆజాద్‌కు పదమూడు లేదా పద్నాలుగు ఏళ్ళుంటాయి. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు ఆజాద్. అరెస్ట్ చేసి మెజిస్ట్రేటు ముందు నిలబెట్టారు. ‘‘వేలెడు లేవు. పెద్ద ఉద్యమాన్ని నడపడానికి వచ్చావా? ఫో అవతలకి!’’ అన్నాడు మెజిస్ట్రేటు. ఆజాద్ కూడా మెజిస్ట్రేటును ఉద్దేశించి తిరస్కార భావంతో మాట్లాడాడు. మెజిస్ట్రేటు, ఆజాద్‌కు 12 పేము బెత్తపు దెబ్బల శిక్షను విధించాడు. ప్రతి దెబ్బకూ ‘వందేమాతరం’, ‘మహాత్మాగాంధీకీ జై’ అంటూ నినాదాలు ఇచ్చాడు ఆజాద్. పేము బెత్తపు దెబ్బల శిక్షను అనుభవించి విడుదలయ్యాక, ఆజాద్ మరికొంచెం ఉత్సాహంతో ఉద్యమంలోకి దూకాడు. చిన్నతనంలో ఆజాద్ చురుగ్గా ఉండేవాడు. అతని చురుకుదనాన్ని చూసి మిత్రులు క్విక్ సిల్వర్ (పాదరసం) అని పేరు పెట్టారు! - యశ్పాల్ ‘సింహావలోకన’ నుంచి (అనువాదం: ఆలూరి భుజంగరావు) (రేపు స్వాతంత్య్రసమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి) -
కాళిదాసు ఏ దేశం వాడు?
గ్రంథపు చెక్క కాళిదా సేదేశం వాడు? ఏ జాతివాడు? అంటే, అతని మాతృభాష యేమిటి? అతని వంశవృత్తాంతం యెలాంటిది? అతనేం చదివాడు? ఆ చదివింది యెవరి దగ్గర చదివాడు? అతను తన గ్రంథాలు, ఏయే తేదీల్లో ప్రారంభించి ఏయే తేదీల్లో పూర్తి చేశాడు? ఇవేమీ అక్కర్లేదు లోకానికి. రసికుల కసలే అక్కర్లేదు. అతనేమేమి రచించాడన్నదే వారి ఆకాంక్ష. అతని రచన లెలాంటి వన్నదే వారి జిజ్ఞాస. అవి తమ కానందం కలిగిస్తున్నాయా లేదా- ఇదే వారి క్కావలసింది. పాశ్చాత్యులు మాత్రం ఆ వివరాలకున్నూ ప్రాముఖ్యం యిచ్చారు. మనవారి కాదృష్టే లేకపోయింది. అయితే, యెవరి దృక్పథం మంచిదీ? ఈ చర్చ యిక్కడ కాదు. పోతే, కవి రచన వొక్కొక్కచోట ఆహా అనిపిస్తుంది రసికులకు. ఒక్కొక్క చోట ఆనందముగ్ధులను చేస్తుంది, వారిని. ఒక్కొక్కచోట మార్గదర్శి అవుతుంది, వారికి. ఉత్తమ కావ్యాల వల్ల కలగవలిసిన ప్రయోజనా లివే, యెవరికయినా. కవి జీవిత వివరాలంత అగత్యాలు కావు. అంచాతే కాళిదాను సంగతి మన కక్కరలే దనడం. అతని రచనే కావాలి మనకి. కనకనే అతనూ చెప్పుకోలే దిది. అంచేతనే కవికుల గురువైనా డతను. కనుకనే అతనే మిగిలాడు లోకంలో. శతాబ్దులు గడిచాయి, అయినా అత నున్నాడు. యుగాలు గడిచిపోతాయి, అప్పుడూ వుంటాడతను. ఏమంటే? అతని వాక్కు అజరామరం అయిపోయింది. అది రసమయం కావడం దాని క్కారణం. అతని శరీరం పంచభూతాల్లోనూ కలిసిపోతే, అతని చైతన్యం అతని రచనల్లో మిళితం అయిపోయింది. కనుకనే వాటికా జీవకళ. కవి అయినవాడు సాధించుకోవలసిన ప్రాప్యం యిదీ. కాళిదాసు కిది బాగా తెలుసు. -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’ నుంచి. -
కావ్యం అంటే రామాయణమే!
గ్రంథపు చెక్క పుట్టపర్తి నారాయణాచార్యులుగారు సంస్కృత సాహిత్యం గురించి ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు. సంస్కృత సాహిత్యమనగానే మన మనస్సులో మెదిలే వ్యక్తులిద్దరు. వాల్మీకి, వ్యాసుడు. వాల్మీకి రామాయణమహాకావ్యం రచించాడు. వ్యాసుడు మహాభారత మహేతిహాసం రచించాడు. మన ప్రాచీనులు విషయాన్ని బేరీజు వెయ్యడంలో మహాప్రవీణులు. పరమ రసజ్ఞులు. వ్యాసుడు చేసిన పని ఎవరికీ ఊహకు కూడా అందనిది. మనవాళ్ళు వ్యాసుణ్ణి ఎంతగానో పొగిడారు. కడకు ‘వ్యాసో నారాయణో హరిః’ అని దీర్ఘదండప్రణామం చేశారు. ఎన్ని బిరుదులిచ్చినా ‘కవి’ అనడానికి మాత్రం జంకారు. వారి దృష్టిలో కవి అంటే వాల్మీకే. కావ్యం అంటే రామాయణమే. ఎంత చక్కటి ఆలోచన! రామాయణాన్ని పరమపవిత్రమైన భక్తివేదంగా పఠించి, పారాయణ చేసి పరవశించి తరించినవారు కొందరు. దానిని మహోత్కృష్టమైన కావ్యంగా అధ్యయనం చేసి పులకించిపోయినవారు కొందరు. ఒక గొప్ప కథగా మాత్రమే చదివి, ఏ మాత్రం ఉత్కంఠ (సస్పెన్సు) లేకపోయినా వదలకుండా చదివించిన కథన కౌశలానికి ముగ్ధులైపోయినవారు కొందరు. ఎవరెలా చదివినా రామాయణం యీ జాతి హృదయస్పందన. మానవజీవితానికి చుక్కాని. అభ్యుదయపథంలో సాగాలనుకునేవారికి దిక్సూచి. - ఉప్పులూరి కామేశ్వరరావు (‘వాల్మీకి రామాయణము’ తెలుగు అనువాదం నుంచి)