
కాళిదాసు ఏ దేశం వాడు?
గ్రంథపు చెక్క
కాళిదా సేదేశం వాడు? ఏ జాతివాడు? అంటే, అతని మాతృభాష యేమిటి? అతని వంశవృత్తాంతం యెలాంటిది? అతనేం చదివాడు? ఆ చదివింది యెవరి దగ్గర చదివాడు? అతను తన గ్రంథాలు, ఏయే తేదీల్లో ప్రారంభించి ఏయే తేదీల్లో పూర్తి చేశాడు? ఇవేమీ అక్కర్లేదు లోకానికి.
రసికుల కసలే అక్కర్లేదు. అతనేమేమి రచించాడన్నదే వారి ఆకాంక్ష. అతని రచన లెలాంటి వన్నదే వారి జిజ్ఞాస. అవి తమ కానందం కలిగిస్తున్నాయా లేదా- ఇదే వారి క్కావలసింది. పాశ్చాత్యులు మాత్రం ఆ వివరాలకున్నూ ప్రాముఖ్యం యిచ్చారు. మనవారి కాదృష్టే లేకపోయింది.
అయితే, యెవరి దృక్పథం మంచిదీ?
ఈ చర్చ యిక్కడ కాదు. పోతే, కవి రచన వొక్కొక్కచోట ఆహా అనిపిస్తుంది రసికులకు. ఒక్కొక్క చోట ఆనందముగ్ధులను చేస్తుంది, వారిని. ఒక్కొక్కచోట మార్గదర్శి అవుతుంది, వారికి. ఉత్తమ కావ్యాల వల్ల కలగవలిసిన ప్రయోజనా లివే, యెవరికయినా. కవి జీవిత వివరాలంత అగత్యాలు కావు. అంచాతే కాళిదాను సంగతి మన కక్కరలే దనడం. అతని రచనే కావాలి మనకి. కనకనే అతనూ చెప్పుకోలే దిది. అంచేతనే కవికుల గురువైనా డతను.
కనుకనే అతనే మిగిలాడు లోకంలో. శతాబ్దులు గడిచాయి, అయినా అత నున్నాడు. యుగాలు గడిచిపోతాయి, అప్పుడూ వుంటాడతను.
ఏమంటే?
అతని వాక్కు అజరామరం అయిపోయింది. అది రసమయం కావడం దాని క్కారణం. అతని శరీరం పంచభూతాల్లోనూ కలిసిపోతే, అతని చైతన్యం అతని రచనల్లో మిళితం అయిపోయింది. కనుకనే వాటికా జీవకళ. కవి అయినవాడు సాధించుకోవలసిన ప్రాప్యం యిదీ. కాళిదాసు కిది బాగా తెలుసు.
-శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’ నుంచి.