జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా!
గ్రంథపు చెక్క
గజల్ కేవలం ఒక గీతం కాదు. ధ్వనులతో అంతర్ధ్వనులతో పొరలు పొరలుగా అల్లుకుపోయిన కమనీయ కవిత గజల్. ముషాయిరాల్లో గజల్‌కు ప్రాధాన్యం హెచ్చు. అది తీగలా శ్రోతల హృదయాల పందిళ్లను దట్టంగా అల్లుకుని పుష్పించి, పరిమళించి పరవశింపజేస్తుంది.
గజల్ అంటే ‘కలకంఠులతో సరస సల్లాపం’ అని అర్థం చెప్పవచ్చు. అరబ్బీ భాషలో దీనికి ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందమైన లేడిపిల్ల అరుపు, సున్నితమైన పూల నుండి దారం తీయడం... ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పవచ్చు. ప్రణయ సర్వస్వం-గజల్.
‘నీవున్న మేడ గదిలో నను చేరనీయ రేమో!
జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా!
యేడేడు సాగరాలు, యెన్నెన్నో పర్వతాలు
యెంతెంత దూరమైన బ్రతుకంతా నడిచిరానా!’
ఇదో గజల్. ప్రియుడు ప్రేయసి కోసం పడే తపన గజల్‌కు ప్రాణం. బాల్యదశలో మహాకవి గాలిబ్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించాను. అగాథమైన అతని కవిత అర్థం కావడానికి చాలా తపన పడాలి. ‘‘భారతదేశానికి గాలిబ్ కవిత, తాజ్‌మహలు మరువరాని అందాలు’’ అని ఒక మహానుభావుడు అన్నాడట. అది సత్యం.
-డా.దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ పుస్తకం నుంచి.