వ్యాపారంలో విజయవంతమైన ప్రతిఒక్కరికీ ఓ టెక్నిక్ ఉంటుంది. దాన్ని అనుసరిస్తూ మరికొంతమంది సక్సెస్ సాధిస్తుంటారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్ఫూర్తితో ప్రముఖ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ కోఫౌండర్ ఘజల్ అలాఘ్ వ్యూహాత్మక సమావేశ టెక్నిక్‌ను పంచుకున్నారు.
తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించిన హోనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ కంపెనీలో ఈ టెక్నిక్ నిర్ణయాలను గణనీయంగా ఎలా మెరుగుపరిచిందో ‘ఎక్స్’ పోస్ట్‌లో అలఘ్ వివరించారు. "మీరు నిర్వహించే ప్రతి వ్యూహాత్మక సమావేశంలో మీ కస్టమర్లు కూర్చున్నారని ఊహించుకోండి. మా ప్రతి వ్యూహాత్మక సమావేశాలలో ఒక కుర్చీని ఖాళీగా ఉంచుతాం. మా కస్టమర్లే అక్కడ కూర్చున్నారని భావిస్తాం. నేను జెఫ్ బెజోస్ నుంచి ఈ అద్భుతమైన టెక్నిక్ నేర్చుకున్నాను. ఇది హోనాసాలో నిర్ణయాలు తీసుకునే ప్రమాణాలను మెరుగుపరుస్తోంది" అని ఆమె రాసుకొచ్చారు.
"మేము ప్రతి ఆలోచనను కస్టమర్ల దృక్కోణం నుంచి పునఃపరిశీలన చేసుకుంటాం" అని అలఘ్ పేర్కొన్నారు. కస్టమర్‌లకు మేలు జరిగేలా ఉంటేనే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్ అత్యంత వినియోగదారు-స్పృహ కలిగిన కంపెనీలలో ఒకటిగా మారాలనే తమ లక్ష్యాన్ని అలఘ్ నొక్కి చెప్పారు.
2008లో ఎన్ఐఐటీలో కార్పొరేట్ ట్రైనీగా ఘజల్ అలఘ్ వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. 2016లో ఆమె హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ (మామెర్త్) ను స్థాపించారు. ఇది టాక్సిన్ లేని చర్మ సంరక్షణ, హెయిర్ కేర్, బేబీ కేర్ ఉత్పత్తులతో తక్కువ సమయంలోనే ఖ్యాతిని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ మోడల్ విజయవంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment